చరిత్రలో సైన్సు ఎలా వికసించింది? ఈ ఫిబ్రవరి, సైన్సు నెల, నుండి మాట్లాడుకుందాం..
సైన్స్ అంటే, ఏదో ఒక సూత్రం, లేకుంటే ప్రయోగం, రుజువు అనుకుంటాం. అయితే వీటి వెనక ఒక చరిత్ర ఉందనే విషయం, పెద్దగా పట్టించుకోం. చాలా సామాజిక సందర్భాలు సైన్స్ ను ప్రభావితం చేశాయి. సైన్సు నడిచే దారుల్లో ఎన్నో తప్పులు, ఒప్పులు జరిగేవి. ఈ తప్పులు ఒప్పులు చేసేది శాస్త్రవేత్తలే. శాస్త్రవేత్త అనే పదం వాడుకలోకి వచ్చిందే19వ శతాబ్దంలో. అంతకుముందు తాత్వికులనో, విజ్ఞానులనో అనేవారు. వ్యక్తిగత జీవితాలలో, వీళ్ళందరూ ఆయా సామాజిక సందర్భాలలో, రకరకాలుగా వ్యవహరించిన, మానవమాత్రులే. సైన్స్ ను, శాస్త్రవేత్తలను ఏ ఏ సామాజిక శక్తులు ప్రభావితం చేశాయి? అనేది కూడా మనం పెద్దగా ఆలోచించం. శాస్త్రవేత్తల పరిశోధనలకు సంబంధించిన సైద్దాంతిక ఆలోచనలపై కూడా, ఆయా కాలాలలో జరిగిన సామాజిక సంఘటనలు, ఒత్తిళ్లు పనిచేశాయని చరిత్ర చెబుతుంది. ఈరోజుకు కూడా ఆధునిక విజ్ఞానశాస్త్రం వెనక ఉండి ప్రభావితం చేస్తున్న సామాజిక ఆర్థిక రాజకీయ శక్తులను చూస్తున్నాం.
వేల సంవత్సరాలుగా, సైన్స్ కి ప్రత్యేక అస్థిత్వం అంటూ లేదు. అది సంస్కృతిలో భాగంగానే ఉండేది. ఒక ప్రత్యేక ప్రతిపత్తి వచ్చింది ఒక మూడు, నాలుగు వందల సంవత్సరాల నుంచినే. ఈ కాలంలోనే, సైన్సు ఉత్పత్తిశక్తులలో భాగంగా మారింది. ఈ సైన్స్ చరిత్ర తెలియకపోవడం వల్లా, సైన్స్ కు సమాజానికి ఉండే లోతైన సంబంధం సరిగా అర్థం కాదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం స్వభావం ఏమంటే, అది తాను ఏ సమాజాన్నించి అయితే ఆవిర్భవించిందో, ఆ సమాజాన్నే సవాలు చేస్తుంది. సామాజిక మార్పులకు దోహదపడుతుంది. అయితే దీనికి అనేక శక్తులు అడ్డుపడుతాయి. ప్రజాసైన్స్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, ఇవన్నీ తెలుసుకోవాలి.
ప్రఖ్యాత ఐరిష్ శాస్త్రవేత్త, జె డి బెర్నాల్ ఈ విషయంలో ఒక గొప్ప అధ్యయనం చేశాడు. జీవితమంతా మౌలిక పరిశోధనలు చేసిన ఒక శాస్త్రవేత్త, చారిత్రక భౌతిక వాద దృక్పథంతో, సైన్సు చరిత్రను అధ్యయనం చేయడం ఒక అరుదైన సందర్భం.
(మాలిక్యులర్ బయాలజీకి ఆద్యులలో బెర్నాల్ ఒకరు. ఆయన దగ్గర పరిశోధన చేసిన వాళ్లకు చాలామందికి నోబెల్ ప్రైజ్ లు వచ్చినాయి. అయితే ఆయనకు రాలేదు. ఎందుకంటే ఆయన ఒక వామపక్ష ఉద్యమకారుడు కూడా. యుద్ధాలను వ్యతిరేకించి, శాంతి కోసం ఒక అంతర్జాతీయ ఉద్యమాన్ని, శాస్త్రవేత్తతో కలసి నిర్మించినవాడు. ఒకరకంగా ఆర్గనైజర్). ఆయన్ను ఆక్స్ ఫర్డ్ లోని రస్కిన్ కాలేజీ ‘సైన్స్ ఇన్ సోషల్ హిస్టరీ’ అనే అంశంపై ఉపన్యాసం చేయటానికి పిలిచింది. ఆయనకది ఆసక్తికరమైన విషయం. అధ్యయనం చేశాడు కూడా. కాబట్టి వెంటనే ఒప్పుకున్నాడు. ఉపన్యాసం తరువాత, ఇంకొంచెం అధ్యయనం చేసి, పుస్తకంగా తీసుకురావాలి అనుకున్నాడు. ఒక మూడు వారాలు సరిపోతాయి అనుకున్నాడు. అదెంత కష్టమైందో ఆ తర్వాత ఆయనే రాసుకున్నాడు. ఆయనకు అధ్యయనం చేయడానికే ఆరు సంవత్సరాలు పట్టింది. ఆరు సంవత్సరాల తర్వాత, ఆయన సైన్స్ ఇన్ హిస్టరీ అనే ఉద్గ్రంధాన్ని నాలుగు భాగాలుగా తీసుకొచ్చాడు. మానవ సమాజాల ఆవిర్భావం నుండి, ప్రారంభమయ్యే ఈ కథ పూర్తిగా రాయాలంటే, ఒక జీవితకాల అధ్యయనం కూడా సరిపోదని, తాను రేఖా మాత్రంగానే చెప్పానని బెర్నాల్ అంటాడు.
ప్రజాసైన్స్ ఉద్యమ కార్యకర్తలుగా ఉన్న వారందరూ, బెర్నాల్ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి. రాతియుగం నుండి, ఆ తరువాత వచ్చిన వ్యవసాయం, వ్యవసాయం ద్వారా వచ్చిన నాగరికతలు, ఇనుప యుగాలు, ఫ్యూడల్ కాలాలు, మధ్యయుగాలు… ఇదంతా మొదటి వాల్యూమ్ లో ఉంటుంది. రెండో, వాల్యూమ్ లో, ఆధునిక సైన్సు ఆవిర్భావం గురించి ఉంటుంది. మూడవ వాల్యూమ్ మన కాలాలలో విజ్ఞాన శాస్త్రం గురించినది. నాలుగో వాల్యూమ్ సామాజిక శాస్త్రాల సంబంధించి. మొత్తం అంతా వెయ్యి పేజీలు ఉంటుంది.

అయితే ఈ బెర్నాల్ పుస్తకాల మొదటి ప్రచురణ 1954 లో జరిగింది. అంటే 70 ఏళ్ళు దాటిందన్నమాట. ఇప్పుడిది ఒక క్లాసిక్. ప్రధానంగా దీని ఆధారంగానే, (కొన్ని తాజా పుస్తకాలు సహాయంతో కూడా) మనం సైన్స్ చరిత్రను చూద్దాం.
మనుషులు నగ్న దేహాలతో, లక్షలాది సంవత్సరాల ముందు తిరగాడారు. మనుషులు పరిణామం చెందుతున్న, ఇంకా ఆవిర్భవిస్తున్న కాలమది.
నరవానరం నుండి మానవుడిగా పరిణామం చెందే క్రమంలోనే, 25 లక్షల సంవత్సరాల నాటికే, శారీరకంగా మానసికంగా అవసరమైన లక్షణాలు కొన్ని సమకూరాయి. కంటి చూపు, పిడికిలి, వస్తువుల్ని పట్టుకోవడం- సంతరించుకున్నాడు. ఏ ప్రత్యేకతా లేని సాధారణమైన బతుకు అతనిది. ఇతర పెద్ద సైజు క్షీరదాలకు శరీరాలలో చాలా ప్రత్యేకతలు ఉండి, ప్రత్యేక అలవాట్లు ఉంటాయి. కానీ మనిషి శరీరం అట్లా కాదు. దానికి ప్రత్యేకమైన ఏ శక్తి లేదు. అయితే ఒక సామర్ధ్యం మనిషికి ఉండేది. అడవి బతుకులో, పరిసరాలలో ఉండే పాట్రన్స్ ను అర్థం చేసుకునే సామర్ధ్యం అది. కంటికి చేయికి మధ్య సమన్వయం కుదిరి, మెదడు సైజు పెరిగి నేర్చుకునే శక్తి జత కలయడంతో మానవ ప్రస్థానం ఒక కొత్త దశకు చేరుకున్నది. అది పాతరాతి యుగంలో రాతి పనిముట్ల ఆవిర్భావం. మొదట్లో ఒక రాయి రప్పను, ఒక చెట్టు కొమ్మను కాకతాళియంగా వాడిన మానవుడు, ఆ తరువాత వాటినే, ఉద్దేశపూర్వకంగా వాడటం నేర్చుకున్నాడు. అయితే అది వ్యక్తులకు మాత్రమే పరిమితమైనప్పుడు, ఒక సమాజం ఏర్పడదు. ఒక పనిముట్టు అందరూ వాడేట్టు అందుబాటులో ఉండాలంటే, ఆ పనిముట్టులో మెరుగుదల రావాలంటే, దాన్ని ఎవరో ఒకరు నేర్పాలి, నేర్చుకోవాలి. అంటే అదొక సాంప్రదాయంగా ప్రామాణికరణ జరగాలి. సమాజం, ఆగకుండా నడుస్తూనే ఉండాలి.
మానవ సమాజం ఏర్పడటానికి, కొనసాగటానికి ఇంకేమైనా అనివార్యతలు ఉన్నాయా? మానవ శిశువు ఇతరులపై ఆధారపడకుండా బతకలేడు… ఈ విధమైన పరాధీనత్వం, నిస్సహాయత శైశవంతో పాటు బాల్యమంతా, సంవత్సరాలు తరబడి ఉంటుంది. ఎవరో ఒకరు పోషించేవారు, రక్షించేవారు ఉంటేనే బిడ్డ పెద్దది అవుతుంది. లేకుంటే క్రూర మృగాల పాలవుతుంది. మానవజాతి కొనసాగాలంటే, బిడ్డకు రక్షణ, పోషణ ఉండాలంటే, కుటుంబం ఏర్పడాల్సిందే. ఆ విధంగా అవ్వలు తల్లులు కూతుర్లు ఒక అవిచ్ఛిన్నమైన సామాజిక జీవితానికి కారకులు అయ్యారు. గణం కొనసాగాలంటే స్త్రీ లే ఆధారం. సహజంగానే గణాల వ్యవహారాలను వారే చూసుకునేవారు. వాటిని మాతృస్వామ్య సమాజాలు అన్నారు. ప్రపంచంలో అన్ని చోట్ల మాతృస్వామిక సమాజాలు ఆవిర్భవించడం చూస్తాం.
మనిషి బతకడానికి ఇతర జంతువులకున్నట్టు కొమ్ములో, కోరలో లేవు. ఆహార సేకరణలో, వేటాడటంలో, ఒక చోటు నుంచి ఇంకో చోటకు పోవడంలో, ఆహారాన్ని తయారు చేసుకోవడంలో మనిషి భౌతిక పనిముట్లు ఆవిష్కరించడం తప్పనిసరి అవుతుంది. వీటి సమన్వయానికి భావవ్యక్తీకరణ అవసరమైంది. మామత్ లాంటి బృహత్ జంతువులను వేటాడాలంటే, గుంపు మధ్య సమన్వయం ఎంతో ముఖ్యం. సైగలు, శబ్దాలు, చివరికి భాష నేర్చుకున్నాడు. గుంపు మధ్య ఒద్దిక ఏర్పడింది. పాత తరాలలో పోగుపడిన జ్ఞానాన్ని పద్ధతులను తరువాతి తరాలకు అందించడం సులువు అయింది.

రాతి యుగం పనిముట్లు, చేతులకే కాదు, ఆలోచనలకు కూడా ఒక రకమైన ఎక్స్టెన్షన్. ఒక రాయి పెచ్చులు తీయడం, కూచిగా తయారు చేయడం ఒక విస్తృతమైన ప్రక్రియ. ఈ రకమైన పనిముట్టు తరతరాలుగా ఓకే విధంగా ఉండటం చూస్తే, ఆ నైపుణ్యం ఒక తరం నుంచి ఇంకో తరానికి బదిలీ అవుతున్నదని అర్థమవుతుంది. అది ఒక సాంకేతిక సంస్కృతిగా మారినట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఏకరూపతలో కూడా మెరుగుదలలు మార్పులు ఉన్నాయి.
రాతి పనిముట్ల తయారీ తొలి విజ్ఞానాలకు ఒక ప్రాతిపదిక. పనిముట్టు దానికదే తయారు కాదు. ముందు మనిషికి ఒక అవసరం ఏర్పడుతుంది. పరిసరాలతో చర్యా ప్రతి చర్యలు జరుగుతాయి. అప్పుడు ఒక ఐడియా మెదడులో పుడుతుంది. ఒక ప్రణాళిక, ఒక పద్ధతి ద్వారా, తప్పొప్పుల క్రమంలో, పనిముట్టును ఆదిమ మానవుడు చేసుకుంటాడు. మనిషి మెదడులో ఒక ఆలోచన మెదలి, ఆ తరువాతే పనిముట్టు చేయడం జరుగుతుంది. నర వానర అవస్థలో మనిషి చేసిన ఆదిమ ప్రయోగాలలో ఇది కీలకమైనది. ప్రకృతి జ్ఞానాల తొలి ఆనవాళ్లు అవి.
– డా. గేయానంద్
(వచ్చే నెల, “ఆదిమ సామాజిక జీవితాలు- ప్రాథమిక జ్ఞాన విజ్ఞానాలు”)
చాలా బాగా పాత రాతి యుగం గురించి, బెర్నాల్డ్ గురించి సవివరం గా వివరించారు