సంపాదకీయం




అనంత కాలప్రవాహంలోకి మరో సూక్ష్మ శకలం కలిసిపోయింది.
మరొకటి కొత్త ఏడాది రూపంలో తలెత్తింది.



ఆధునికమానవుడు అవనీతలంపై అవతరించిన నాటి నుండి కాలానికి ఎదురీదాలని ఎన్నెన్ని సాహసాలు చేస్తూ వచ్చాడో చెప్పలేము. ఎక్కడో తూర్పు ఆఫ్రికా నుంచి తెరలు తెరలుగా, గుంపులు గుంపులుగా మహానదీనదాలు. సాగరాలు దాటుకుంటూ భూమండలం అంతా విస్తరించిన అతని తెగువనూ, పట్టుదలనూ తలచుకుంటే మనల్ని సంభ్రమాశ్చర్యాలే కాదు, ఉత్తేజోద్వేగాలూ చుట్టుముడతాయి. ఆధునిక మానవుడి ఊహకైనా అందని విషయమిది. చాలామందికి ఒప్పుకో బుద్ధెయ్యదు గానీ వాస్తవం వాస్తవమే! అక్షరాలా ఆఫ్రికా మనందరికీ పుట్టిల్లు!

మూడు లక్షల ఏళ్ల నుంచి మన హోమోసేపియన్ల ప్రయాణం ఇలా ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో కొనసాగుతూనే వుంది. ఇప్పటికీ ఒక్క మన దేశం నుంచే 1.40 కోట్ల మంది విదేశాల్లో పని చేస్తున్నారంటే ఈ ఒరవడి ఎంత తీవ్రమైందో, సహజమైందో చెప్పనక్కరలేదు. గత పదేళ్లలో పద్దెనిమిది లక్షల మంది దేశ పౌరసత్వం వదులు కొన్నారంటే లోకం ఎటువైపు పయనిస్తోందో తెలుస్తూనే వుంది. మధ్యలో ఎన్ని అవాంతరాలో, వాటి నుంచి ఎన్ని అనుభవాలో? ఎన్ని సాహసాలో, వాటి వెంట ఎన్ని విజయాలో, విలయాలో? ఇవి గాక ఎన్ని ప్రాకృతిక విపత్తులో? సామాజిక విప్లవాలో?

దీన్నంతా “చరిత్ర” అనుకుంటే ఇందు నుంచి ఏ ఒక్కరిని విడదీసి చూడలేము. గుంపులని, తెగలని, జాతులని, కులాలని, మతాలని, సంస్కృతులని, దేశాల్ని మనల్ని మనం ఎంత విడదీసుకున్నా లోతుల్లోకి పోతే మనమంతా కలిసే ఈ చరిత్రను నిర్మించుకున్నాం. మనలో ఒకరు భీరులూ లేరు, మరొకరు మహా వీరులూ లేరు. ఒకరు పరాజితులు, ఇంకొకరు విజేతలు కూడా లేరు. విస్తరణలో, వెతుకులాటలో తప్ప వీటిలో ఆక్రమణలూ లేవు అధిపత్యాలూ లేవు. ఏది మంచో ఏది చెడ్డో విడదీయలేము. ఏది పురోగమనమో, ఏది తిరోగమనమో చెప్పలేము. ఏది అభివృద్ధో, ఏది కాదో తీర్పు నివ్వలేము. మనం స్తబ్దంగానే వున్నామో, పరిగెత్తుతున్నామో అర్థం కాదు.

మన కళ్ళముందే మహా నాగరికతలు కనుమరుగయ్యాయి. నియంతలూ, చక్రవర్తులూ అనామకులయ్యారు. తత్వవేత్తలు కాలం చెల్లిన వాళ్ళయ్యారు. వాస్తవంగా గోచరిస్తున్నది ఒక్కటే కాల ప్రవాహం! అన్నిటినీ, అందరినీ గర్భస్థం చేసుకోగల అనంత కాలప్రవాహం.

ఈ మహా ప్రయాణంలో అక్కడక్కడ మజిలీలు. అప్పుడప్పుడు మలుపులు. ఇవే మనకు మిగిలిన కొండ గుర్తులు. వాటి చుట్టూనే మనం భ్రమిస్తుంటాం. అడపాదడపా ఆవేశపడుతుంటాం. మధ్య మధ్యలో నిరాశ చెందుతుంటాం. ఉత్తేజాల నిర్వేదాల ఉయ్యాలలో ఈ చివరకు ఆ చివరకు ఊగుతుంటాం. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు” అంటూ వేదనాగీతికలు పాడుతుంటాం. అయినా మనిషికి అంతర్గతంగా ఏ ప్రాణికి లేని అవసరాలున్నాయి. జ్ఞానతృష్ణ వుంది. అన్వేషణా దాహం వుంది. వాటికి తోడుగా సాహసాలు, త్యాగాలు వున్నాయి. అన్నిటికంటే మించి అత్యద్భుతమైన ఉమ్మడితనం వుంది. ఇచ్చి పుచ్చుకోడాలున్నాయి.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవం విస్తరిస్తున్న కొద్దీ, మనిషి జోక్యానికి హద్దులు అంతరిస్తున్న కొద్దీ మానవుడిలో కాలాన్ని సవాలు చేయగలనన్న ధీమా పెరుగుతోంది. తన పయనంలో పరమాణు భాగం కూడా పూర్తికాలేదన్న స్పృహ అతనికి నిద్ర లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో అతడు గతాన్ని మరింత తెలివితో, హేతుబద్ధంగా బేరీజు వేయగలడు. సంకుచిత, చాందస దోరణులన్నిటిని క్రమంగా తిరస్కరించగలడు. శకలీకరణను తోసి రాజని సకలీకరణ వైపు నిగ్రహంతో పయనించగలడు. ప్రకృతితో తన బంధుత్వానికి కొత్త భాష్యం చెప్పుకొని ‘ఆకులో ఆకుగా, పువ్వులో పువ్వుగా’ మారగలడు. పరాయీకరణ నుంచి సర్వ తంత్ర స్వతంత్రుడిగా మేలుకోగలడు. ఒక మహోన్నత మానవ ప్రపంచం వైపు నిశ్చయంగా అడుగులు వేయగలడు. అయినా కాలం ప్రవహిస్తూనే ఉంటుంది. అన్నిటిని కడుపులో నిర్మమకారంగా దాచుకుంటూనే వుంటుంది. కొత్త తరానికి పాఠాలు చెబుతూనే వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *