సి. వి. కృష్ణయ్య
చదువు మానసికమైనది, పిల్లలైనా పెద్దలైనా స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఆలోచిస్తూ ప్రశ్నించుకుంటూ తర్కిస్తూ జ్ఞానం సంపాదించుకుంటారు. పిల్లలు సంసిద్ధులుగా ఉన్నారా లేదా అని చూడకుండా ఈ గంటలో ఈ పాఠాన్ని నేర్చుకోవాలని నిర్బంధిస్తే ఏం జరుగుతుంది? ఇందుకు సంబంధించి నా అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు వివరిస్తాను.
తొలి సంఘటన
ఒకరోజు 20 ఏళ్ల యువకుడు నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు.”నేను మీ స్టూడెంట్ రవిని, గుర్తున్నానా సర్? ఆరోజు మీరు చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చివేశాయి. బీఏ చేశాను. మిమ్మల్ని కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేయాలని వచ్చాను. మీరు చేసిన మేలు జీవితంలో మర్చిపోను” అంటూ కృతజ్ఞతలు తెలియజేసాడు.
రవి మాటలతో ఆనాటి సంఘటన గుర్తుకువచ్చింది. బదిలీ మీద రవి చదివే బడికి వెళ్ళాను. రవి పదవ తరగతి. క్లాసులో మౌనంగా ఉంటాడు. ఏదైనా అడిగితే లేచి వినయంగా నిలబడతాడు. పది రోజులు గడిచాయి. అతడిలో ఎలాంటి మార్పూ లేదు. పిల్లల్ని అడిగాను. “వాడికి చదవడం రాదు, ఇంట్లో ఉంటే పనికి పంపిస్తారని బడికి వస్తున్నాడు” అని చెప్పారు. రవిలో ఏదో నాకు ప్రత్యేకత కనిపించింది.
ఒకరోజు రవిని నా గదికి తీసుకువెళ్లా. స్నేహపూర్వకంగా చూశాను. క్లాసులో ఏమీ పట్టనట్లు ఎందుకు ఉంటున్నావని అడిగాను.
“నాకు ఏమీ రాదు, అందుకే ఊరకుంటున్నాను” అన్నాడు.
“నీకేమీ రాదని ఎవరు అన్నారు?” అడిగాను.
“నాకు చదవడం రాదు. ఇంక చదువు ఎలా వస్తుంది? పది తర్వాత పొలంపనికి పోక తప్పదు. అందుకే ఇప్పుడు తప్పించుకోవడానికి బడికి వస్తున్నాను” అన్నాడు.
తెలుగు పుస్తకం తెరిచి అక్షరాలు చూపించి గుర్తించి చెప్పమన్నాను. నేను చూపించిన ప్రతి అక్షరం గుర్తించి చెప్పాడు.
“అక్షరాలన్నీ వచ్చు కదా, నీకు రానిది ఏముంది? అక్షరం పక్కన మరో అక్షరం పెడితే పదం. పదం పక్క మరో పదం ఉంటే వాక్యం. కొన్ని వాక్యాలు కలిస్తే పాఠం. ఇంతే కదా? పుస్తకం ఇచ్చి చదవడానికి ప్రయత్నించి చూడు” అన్నాను. కూడి కూడి నిదానంగా చదువుతున్నాడు.
“నువ్వు భయపడుతున్నావ్! వేగంగా చదవడానికి ప్రయత్నించు” అని చెప్పాను. మరింత వేగంగా చదివి నా వైపు ఆశ్చర్యంగా చూశాడు.
“ఈ మాత్రం చదువుతానని నాకు తెలియదు. పుస్తకంలో పేజీలు పేజీలు ఉన్న పాఠాలు చూసి భయపడే వాడిని. మీరు నాకు ప్రైవేట్ చెబుతారా?” అని అడిగాడు రవి. రవికి చదువు మీద ఆశ కలిగింది.
“నీకు ప్రైవేట్ అవసరం లేదు. తెలివిగలవాడివి. ఈ సంవత్సరం సైన్స్, సోషల్, తెలుగు బాగా చదివి పరీక్షలు రాయి. వచ్చే ఏడాది ఇంగ్లీష్, హిందీ, లెక్కలు రాయి. స్నేహితుల సహాయం తీసుకో. టీచర్ల దగ్గర ప్రైవేట్ చేరకు” అని సలహా ఇచ్చాను. టీచర్లు రవిని నిరుత్సాహపరుస్తారని నా భయం. ఆ సంవత్సరం పదవ తరగతి మూడు సబ్జెక్టులు ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ఐదేళ్లకు బీఏ ప్యాసై ఇప్పుడు కనిపించాడు.
రవి తనకు చదవడం వచ్చి కూడా ఎందుకు రాదు అనుకున్నాడు? తనకు తెలియకుండానే చదవడం ఎలా వచ్చింది? ఈ విషయాలు తెలుసుకునే ముందు మరో రెండు సంఘటనలు వివరిస్తాను.
రెండవ సంఘటన
నేను హైస్కూల్లో సీనియర్ తెలుగు పండితుడిని. పై తరగతులకు తెలుగు చెప్పేవాడిని. ఒకటి, రెండు తరగతులకు చదువు చెప్పి చూడాలని నా ఆకాంక్ష. ఎలిమెంటరీ బడికి పోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా ప్రయత్నం ఫలించి ఒక ప్రాథమికోన్నత పాఠశాలలో చదువు చెప్పే అవకాశం వచ్చింది. అది వలస కార్మికులు, పేదలు ఉండే కాలనీ. పట్టణం శివార్లలో ఉంది. బడి రిజిస్టర్లో పేర్లయితే ఉన్నాయి గాని ఉపాధ్యాయులు లేరనే కారణంతో ఏడాది నుండి ఒకటి, రెండు తరగతుల పిల్లలు బడికి రావడం లేదు. పది రోజులు కష్టపడి 27 మంది పిల్లల్ని సమకూర్చుకున్నాను. వారిలో ఎనిమిది మందికి అక్షరాలు, గుణింతాలు వచ్చు. మరో 19 మందికి ఏమీ రాదు. ఒక నెల రోజులు పట్టింది చదువులు మొదలుపెట్టడానికి.
రెండున్నరేళ్ళు గడిచాయి. పిల్లలందరూ తెలుగు చదవడం రాయడం నేర్చుకున్నారు. గణితంలో భాగహారం తప్ప మిగిలిన మూడు ప్రక్రియలు కూడిక, తీసివేత, గుణకారం క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఇక్కడ ఒక పిల్లవాడు కూడా డ్రాప్ అవుట్ కాలేదు చదువు రాని మొద్దులు లేరు ఎందుకని?
ఒక్కో పిల్లవాడిది ఒక్కో చరిత్ర. అక్షరాలతో యుద్ధం చేశారు.
గురువేంద్ర: ఏడు సంవత్సరాలు ఉంటాయి. ఏడాది బడికి వచ్చాడట! ఒక్క అక్షరం రాదు. మొదటి పాఠం ‘వల’. ఒక పదం- రెండక్షరాల పదం పలికించాను. అక్షరాలు విడివిడిగా పలికించాను. ఐదు నిమిషాల తర్వాత పాఠం చదివి అక్షరాలు విడివిడిగా గుర్తించి చెప్పమన్నాను. పాఠం చదివాడు. అక్షరాలు విడివిడిగా గుర్తించి చెప్పేటప్పుడు ‘వ’ ను ‘ల’ లాగా, ‘ల’ ను ‘వ’ లాగా చెబుతున్నాడు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, వారం రోజులు ఇదే తీరు. ఈ రోజు తప్పక చదువుతాను చూడండి అంటూ వెళ్లి ఐదు నిమిషాల్లో వచ్చాడు. ‘వ’ ను ‘ల’ అని చదివాడు. పిల్లలు ఫక్కున నవ్వారు. వాళ్ళు నవ్వింది తప్పు చదివినందుకు కాదు. వాడు వచ్చి నా ఒళ్ళో కూర్చున్నాడు. ఒకసారి తనను తాను చూసుకున్నాడు. వొళ్ళో నుంచి దిగి నాకు చదువు రాదు అంటూ భోరున ఏడ్చాడు. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఏ భూతం ఆ పిల్లవాడిలో ప్రవేశించి అలా పలికిస్తున్నది? వీడికి శ్రద్ధ ఉంది, పట్టుదల ఉంది. వీడు మొద్దా? మరో అమ్మాయి సంగతి కూడా చెప్పుకొని గురువేంద్ర దగ్గరకి మళ్ళీ వద్దాం.
మీనా: మీనాకు ఆరు సంవత్సరాలు ఉంటాయి. కొత్తగా బడిలో చేరింది. చేరిన రోజే టీచర్ కొట్టిందని బడికి పోనంటూ మొండికేసింది. నేను మీనా ఇంటికి వెళ్లి నవ్వుతూ ఆ బిడ్డను పలకరించాను. నన్ను భయం భయంగా చూసింది. “నేను కొట్టను, నువ్వు చెప్పమనేదాకా చదువు కూడా చెప్పను. నా దగ్గర కూర్చోవడం ఇష్టం లేకపోతే నువ్వు ఆడుకోవచ్చు” అని భరోసా ఇచ్చాను.
మీనా మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకే భుజానికి స్కూల్ బ్యాగ్ తగిలించుకొని నాకోసం ఎదురు చూస్తూ కూర్చున్నది. దారిలోనే నన్ను కలుసుకొని నాతో కూడా బడికి వచ్చింది. ఐదు నిమిషాలు నా క్లాసులో కూర్చుని సంచి తీసుకుని లేచి వెళ్ళిపోయింది. ఆరవ తరగతి గదిలోకి వెళ్లి కూర్చున్నది. అక్కడ మీనా అక్క ఉంది. అక్కడ కూడా స్థిరంగా కూర్చోకుండా గ్రౌండ్లో అటూఇటూ పరిగెత్తుతూ, ఒక్కతే ఆడుకుంటూ, అప్పుడప్పుడు నా క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చి తొంగి చూస్తూ ఉండేది. ఇలా కొద్ది రోజులు జరిగింది. మీనా గ్రౌండ్లో తిరగడం వల్ల మిగిలిన పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారంటూ హెడ్మాస్టరు నన్ను హెచ్చరించసాగరు. నాకూ ఇబ్బందిగానే ఉంది. పది రోజులకు మీనా తనకు తానుగా వచ్చి “నాకు చదువు చెప్పు” అని క్లాసులో కూర్చున్నది. ఒకటవ తరగతి పుస్తకాన్ని పరిచయం చేసి మొదటి పాఠం చెప్పి “ఇలా అన్ని పాఠాలు చదువుకోవాలి. నాకు ప్రతిరోజూ నువ్వు నేర్చుకున్న పాఠం చదివి వినిపించి వెళ్ళాలి. నువ్వు ఎక్కడైనా కూర్చోవచ్చు. బడికి రాకుండా ఇంట్లో కూడా చదువుకోవచ్చు. కానీ గ్రౌండ్లో తిరగకూడదు. హెడ్మాస్టర్ కోప్పడుతున్నారు. నీకు తెలుసు కదా” అని చెప్పాను. ముసిముసిగా నవ్వుకుంటూ పుస్తకం తీసుకుని అక్క దగ్గరికి వెళ్లిపోయింది.
మీనా ఎందుకు నా క్లాసులో కూర్చోలేదు? ఆ పది రోజులు గ్రౌండ్లో ఆడుకుంటూ నా క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చి తొంగి చూడడం ఎందుకు? కొట్టననీ, ఆడుకోవచ్చనీ నేను చెప్పిన మాటలు నిజమా కాదా అని నన్ను పరీక్షించడానికే మీనా అలా చేసింది. ఆమెకు ఈ ధైర్యం ఎలా వచ్చింది? చనువుగా ఉండటంతో నన్ను స్నేహితుడిగానో, సన్నిహితుడైన తండ్రిగానో భావించింది. తాను నా క్లాస్ రూంలో ఎందుకు కూర్చోలేదో రహస్యంగా చెవిలో చెప్పింది. తన రెండు చెవులు చేతులతో మూసుకుంటూ “ ఈ అరుపులు, గలభా ఏంది? నాలుగు తగిలించి వాళ్ళ నోళ్లు మూయించలేవా?” అన్నది. మీనా ఒకతే కాదు. క్లాస్ రూంలో కూర్చొనే అవసరం లేదని చెబితే ఎవరూ క్లాస్ రూంలో ఉండరు. జట్టు జట్లుగానో, ఒంటరిగానో ఎక్కడెక్కడో కూర్చుంటారు.
నేను ఇచ్చిన ఈ స్వేచ్ఛని మీనా సద్వినియోగం చేసుకున్నది. మీనా ఒక్క ఏడాదిలోనే రెండో తరగతి పుస్తకం కూడా పూర్తి చేసింది. తన అక్క దగ్గర ఉన్న సోషల్ సైన్స్ పుస్తకాలు కూడా చదువుతున్నదని మీనా అమ్మగారు నా దగ్గరకు వచ్చి చెప్పి, “ఇంతకీ మీనా ఏ తరగతి?” అని నన్ను అడిగింది. అంతగా ఆ పిల్ల చదువులో రాణించింది.
స్నేహం, స్వేచ్ఛలతో పాటు భయం లేని వాతావరణంలో చదువులు సాగాలి. పిల్లలు ఇష్టంతో చదవాలి. చదువుల్లో ప్రధానమైనది పిల్లలు పుస్తక ప్రపంచంలోకి ప్రవేశించడమే.
ఇక గురువేంద్ర దగ్గరకు మళ్ళీ వద్దాం. రెండు అక్షరాలను తారుమారుగా ఎందుకు పలికాడు? ఏడాది పాటు బడికి వచ్చి ఏమి నేర్చుకున్నాడు?
“ఎల్లప్పుడూ నేను తప్పులు చేస్తుంటాను, ఎప్పుడు పెద్ద వాళ్లే కరెక్టు” అని.
“వ” అనే అక్షరాన్ని మొదట మనసులో సరిగానే గుర్తించి, నేను ఎప్పుడూ తప్పు చేస్తాను కాబట్టి అది “ల” అయి ఉంటుందని ఊహించుకున్నాడు. మన పెద్దవాళ్ళ మాటలు పిల్లల మెదళ్ళలో చేరి వారిచేత తప్పులేలా చేయిస్తాయో చూశారా? తప్పుల భూతం ‘ “ఆల్వేస్ ఐ యాం రాంగ్” ను వాళ్ళ మెదళ్ళలోకి చొప్పించాము. దాని ఫలితమే కదా ఇది.
నేను గురువేంద్రకు వారం రోజుల పాటు చదువు జోలికి పోవద్దు. ఊరక చూస్తూ నీ ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ ఉండమని చెప్పాను. ఆ వారం రోజుల్లో తన మెదడులో తిష్ట వేసిన ఆ భూతాన్నిపారదోలి ఆత్మవిశ్వాసం అలవర్చుకున్నాడు. రెండున్నర సంవత్సరాలలో తెలుగు రెండవ వాచకం పూర్తి చేయడంతో పాటు గణితంలో తప్పులు చేయని మంచి విద్యార్థిగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు.
ఇక మొదటి సంఘటన రవి విషయం పరిశీలిద్దాం. పిల్లలు చదవలేక పోవడానికి మనం చాలా కారణాలు చెబుతాం. టీచర్ చెప్పలేదనీ, పిల్లల పేదరికమనీ, సామాజిక నేపథ్యం అనీ ఇంకా ఎన్నో చెబుతాము. నలభై అక్షరాలు గుర్తుపట్టి అక్షరం పక్కన అక్షరం పెట్టి చదవడానికి అవి అడ్డం కానే కాదని బల్ల గుద్ది చెప్పవచ్చు.
బడికి వచ్చి, చదువుకుంటున్న పిల్లల మధ్య కూర్చుని ఉన్నందుకయినా పిల్లలకు ఆమాత్రం చదవడం రావాలి. ఆటలు ఆడటం, పనులు చేయడం వగైరాలన్నీ తన తోటి పిల్లల దగ్గర వాళ్ళు నేర్చుకోవడం లేదా? అలాగే చదువు కూడా.
బడి, టీచర్ పిల్లలకు ఆహ్లాదంగా ఉంటే, చదువుల్లో ఉండే రుచి చూపిస్తే ఎన్ని ఇబ్బందులు అయినా అధిగమించి పిల్లలు చదువు నేర్చుకుంటారు.
పదేళ్లు పిల్లల మధ్య కలిసి తిరిగిన రవి వాళ్ళందరి నుంచి ఆటపాటలను నేర్చుకున్నాడు. ఇంకా అనేకం నేర్పడం, నేర్చుకోవడం పిల్లల గుంపులో జరిగే ఉంటాయి. కానీ నాకు చదువు రాదు అన్న ఆలోచన అతడిని ప్రయత్నం చేయకుండా వెనక్కులాగింది. అలాంటి పిల్లల్ని స్నేహపూర్వకంగా పలకరించి వాళ్ళ సమస్య ఏమిటో తెలుసుకోలేనంత దీనావస్థలో ఉంది మన విద్యా వ్యవస్థ.
పిల్లలు పెద్దల కళ్ళల్లోకి చూసి ఒక క్షణంలో చెప్పగలరు- ఇతడు మా పక్షమా కాదా అని. తమ పక్షం కాదనుకొంటే వాళ్ళకు ఏదీ చెప్పరు. దాపరికంతో వ్యవహరిస్తారు. దానితో వారి సమస్యలకు పరిష్కారాలు లభ్యం కావు. అలాగే పెరిగి పెద్దవారు అయిపోతారు.
చివరగా ఒక మాట. టీచర్ పిల్లలకు సహాయం చేస్తున్నాడని ఏనాడు అనుకోకూడదు. సహకరిస్తున్నారని మాత్రమే భావించాలి. తానే అన్నీ అని వాళ్ళ హృదయాల్లో తిష్ట వేసి కూర్చోకూడదు. కృతజ్ఞత చూపించాలని భావించకూడదు. పిల్లలు నేర్చుకోవడంలోని అనేక అంశాలలో టీచర్ ఒక చిన్న అంశం మాత్రమే. మూసపద్ధతికి దూరంగా పిల్లలు తమదైన పద్ధతిలో వాళ్ళని నేర్చుకోనివ్వాలి, ఎదగనివ్వాలి. టీచర్ పాత్ర ఎక్కువ అయ్యే కొద్ది పిల్లలకు ఊపిరి ఆడదు.
పిల్లల అస్తిత్వం పెద్దల అహంకారానికి బలికాకుండా జాగ్రత్త పడాలి. పిల్లలు పెద్దల మనసెరిగి మెలగడం కాదు, పెద్దలు పిల్లల మనసెరిగి మసలుకోవాలి.