– యం.యుగంధర్ బాబు
ఎవరిదో దిష్టి తగలకుండా
ఓ నల్ల చుక్క బుగ్గన
నల్లటి తాడు కాలికి…
అసలు..
దిష్టి పెట్టడం తెలీని
అసూయ పడడం రాని
మనుషుల్ని పెంచితే పోలా… (అంతర్జాలం నుండి)
అని ఓ కవిత. ఈ కవితలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం లో దిష్టి తగలడం గురించి. రెండవ భాగములో అసలు “అసూయ పడని” మనుషులే ఉంటే బాగుంటుంది అని. ఇది కవి గారి అత్యాశ కావచ్చు. సరే మనం ఈ రెండు భాగాల గురించి కొంచెం ఆలోచిస్తాం.
ప్రకృతి, వికృతి గురించి మీకు తెలుసు కదా. దృష్టి… ప్రకృతి, దిష్టి….. వికృతి. ఎవరి వంక అయినా అదేపనిగా చూస్తే “దిష్టి తగులుతుంది అలా చూడకు” అంటారు. ఏదైనా ఊరి ప్రయాణం చేసి వచ్చినప్పుడు అందరి కళ్ళు పడ్డాయని దిష్టి తీయించుకుంటారు. ఓ వ్యక్తి గొప్ప పని చేస్తే, అందరూ అసూయ పడితే.. దిష్టి తగిలిందన్న మాటే. బయటికి వెళ్లి వచ్చిన తర్వాత నీరసంగా ఉండడం, తలపోటు, నరాలు లాగినట్టు ఉండడం, చికాకు పడ్డం ఇవన్నీ దిష్టి ప్రభావం అని భావిస్తారు. “నర దిష్టి సోకితే నల్ల రాళ్లు కూడా పగిలిపోతాయి” అని రిథమిక్ గా ఓ సామెత కూడా ప్రచారంలో ఉంది.
సాధారణంగా చిన్నపిల్లలు అస్వస్థత గురైతే వారిని హాస్పిటల్ తీసుకెళ్లడం, లేక మెడిసిన్స్ ఇవ్వడం చేస్తారు. కానీ ఇంట్లో ఉండే అమ్మమ్మా లేక నాయనమ్మ లాంటి పెద్దవాళ్లు దిష్టి తగిలిందని భావించి దిష్టి తీస్తూ ఉంటారు. ఒకసారి ఎవరో బాలింతను చూడడానికి ఓ మెటర్నిటీ హాస్పిటల్ కి వెళ్తే, ఆ హాస్పిటల్లో గది మూలల్లో నల్లగా మసి ఉంది. (హైదరాబాద్ వెళితే ఆఫీసుల్లో మెట్ల దగ్గర మూలల్లో ఎర్రగా కిల్లి రంగు ఉన్నట్టు) ఏమిటో అని విచారిస్తే. .”పుట్టిన పిల్లలకు చీపురు పుల్లల తో దిష్టి తీసి” మూలల్లో పెట్టడం వల్ల అక్కడ పొగ చూరిపోయింది అని తెలిసింది.
ఈ దిష్టి అన్నది కేవలం మనుషులకే కాదు వస్తువులకూ… వ్యాపారానికీ… వ్యవసాయానికీ… సంసారానికి కూడా తగిలే అవకాశం ఉంది. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు “కాదేదీ దిష్టి కి అనర్హం ” అనుకోవచ్చు.
ఈ దిష్టి. చెడు దృష్టి అన్నది మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో. దాదాపు అన్ని మతాల్లోనూ వేళ్ళూనుకు పోయింది. మీరు యూట్యూబ్లో చూసినట్లయితే ” నర దోషమని, నర పీఢ అని, నర ఘోష అని, దృష్టి దోషమని, శత్రు బాధలని… “రకరకాల పేర్లతో ఊదరగొట్టేస్తూ, దాని నివారించడానికి రకరకాల పద్ధతులు చెబుతూ ఉంటారు. ఈ దిష్టిని తగ్గించే… దిష్టి తీసే పద్ధతులు రకరకాలుగా ఉన్నాయి.
ఆ మధ్య యూట్యూబ్ లో ఓ వీడియో వచ్చింది. ఓ పిల్లవాడు కూర్చోని ఉంటే ఎదురుగా పళ్లెంలో నీళ్లు పోసి మధ్యలో ఒక చిప్పలో కర్పూరం వెలిగించి ఉంటుంది. ఓ పెద్దాయన చెంబు తీసుకొని ఏదో మాటలు చెబుతూ ఆ పిల్లవాడి చుట్టూ మూడుసార్లు తిప్పి చెంబును కర్పూరం పై బోర్లించాడు. అంతే.. చెంబు శబ్దం చేస్తూ నీళ్లంతా లోపలికి లాగేసుకునింది. దాంతో దిష్టి పోయింది అని చెబుతాడాయన. మనకు తెలుసు ఇది సైన్స్ అని. కర్పూరం మండి చెంబులో ఆక్సిజన్ తగ్గిపోయింది కాబట్టి బయట ఉన్న గాలి వత్తిడికి నీరు చెంబులోకి ఎగబాకింది. ఇది పాఠశాలలో పిల్లలు చేసే ప్రయోగమే.
అసలు దిష్టి ఉందా?. మనిషి కంటి చూపుకి అంత శక్తి ఉందా?. ఇక్కడ ఓ విషయం ఆలోచిస్తాం. మనము ఏదైనా వస్తువును ఎలా చూడగలం ?. ఏదైనా కాంతి వస్తువు పైన పడి పరావర్తనం (ఇంగ్లీష్ లో “రిఫ్లెక్షన్స్”!!!) చెంది మన కంటికి చేరితే ఆ వస్తువును మనం చూడగలుగుతాం. కాంతి ఉంటేనే మనం చూడగలం. కాంతి లేనప్పుడు చీకట్లో చూడలేం కదా. అంటే మన కంట్లో నుండి ఎలాంటి వెలుగు, శక్తి బయటకు రావటం లేదు. అంటే మన కంటికి ఎలాంటి శక్తి లేనట్లే కదా. (జానపద కథల్లో ఋషులు తపోభంగం చేసిన వారిని కంటిచూపుతో కాల్చి భస్మం చేసేవాళ్ళు. అదివేరే కథ అనుకోండి, ఇప్పుడు ఆ కథల్లో మాదిరిగా ఎవరూ అలా భస్మం చేయలేరు కదా!) అలాంటప్పుడు మన చూపు పడితే చెడు ఎలా జరుగుతుంది?. మంచి కూడా జరగదనుకోండీ! ఎప్పుడూ… ఎవరి చూపులూ… ఎవరినీ… ఏమీ చేయలేదు…చేయజాలదు.
కాబట్టి కవిగారినట్టుగా “దిష్టి పెట్టడం తెలియని” మనుషులు కాకుండా. . అసూయ పడడం రాని మనుషుల్ని పెంచితే బాగానే ఉంటుందని, అది సమాజానికి అవసరం కూడా అని అనుకుంటున్నాను..