యుగంధర్ బాబు

“ఎరుపు అంటే కొందరికి భయం భయం
    చిన్నపిల్లలు వారికంటే నయం నయం..”.. 

అన్నాడు ఓ కవి. కానీ మన దేశంలో చాలామందికి నలుపు అంటే కూడా భయమే. నలుపుని అశుభానికి సూచకంగా భావిస్తారు. కొందరు నలుపు రంగు దుస్తులు ధరించరు. నలుపు రంగు వస్తువులు వాడరు. అంతటితో ఆగి పోకుండా ఆ రంగుని జంతువులకు కూడా ఆపాదించారు. “పిల్లులలో  నల్ల పిల్లి వేరయా”  అని… నల్ల పిల్లి అంటే చాలా అశుభం గా భావిస్తారు.

మనం దారిలో వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురొస్తే  అశుభమని చాలా మంది నమ్ముతారు. ఎవరైనా బయలుదేరే ముందు పిల్లి ఎదురుపడితే ఆగిపోతారు. కాసేపు కూర్చుని లేచి మళ్లీ బయటికి వెళ్తారు .ఇక నల్లపిల్లి అయితే చెప్పనక్కరలేదు. అశుభం రెట్టింపు అవుతుందని అర్థం.

“పిల్లి ఎప్పుడూ యజమాని శ్రేయస్సు కోరదు. పిల్లికి విశ్వాసం ఉండదు. ఎవరు పోషిస్తారో వారికి మేలు జరగాలని పిల్లి కోరుకోదు. కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం చూడదు అనుకుంటుంది. అది మంచి వ్యక్తిత్వం కాదు. పిల్లి ఏ సందర్భంలోనూ ఎప్పుడూ మంచిది కాదు. పిల్లులు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొస్తాయి. ఇంట్లో పిల్లిని పెంచుకోవడం శ్రేయస్కరం కాదు. దారిలో ఎదురుగా పిల్లి ఎడమ నుండి కుడివైపు కదిలితే అశుభం. అదే కుడి నుండి ఎడమ వైపు తిరిగితే శుభం. పిల్లి ఏడుపు కూడా అశుభం. పనిలో ఆటంకం కలుగుతుంది. రెండు పిల్లులు పోట్లాడుకుంటుంటే ఆ ఇంట్లో కూడా పోట్లాటలు, కలహాలు ఏర్పడతాయి.”

ఇవన్నీ పిల్లుల గురించి మన సమాజంలో ఉన్న అపోహలు. ఇక నల్ల పిల్లి గురించి వీటన్నిటినీ రెట్టింపు చేసుకోవాలి. ఎందుకంటే అది నల్లగా ఉంది కదా. నల్లపిల్లి గురించి మన దేశంలోనే కాదు చాలా దేశాలలో విపరీతమైన మూఢనమ్మకాలు అల్లుకుని ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత అపఖ్యాతి పాలయ్యింది నల్లపిల్లి.

పూర్వకాలంలో ఎద్దుల బండ్లు, గుర్రపు బండ్లు మాత్రమే రవాణా సాధనాలుగా ఉన్నప్పుడు రాత్రిపూట చీకట్లో చిన్న లాంతరు దీప కాంతిలో ఈ బండ్లు ప్రయాణం చేసేవి. ఆ సమయంలో ఎదురుగా నల్ల పిల్లి వస్తే ఆ చీకటిలో దాన్ని శరీరం కనిపించకుండా కళ్ళు మాత్రమే మిలమిలా మెరుస్తూ కనిపించేది. వాటిని చూసి ఎడ్లు,  గుర్రాలు భయపడి ఆగి పోయేవి. పిల్లి పక్కకు జరిగిన తర్వాత ముందుకు సాగేవి. ఇలా నల్ల పిల్లిని చూసి బండ్లు ఆగిపోవడం… రాను రాను పగలులో కూడా పిల్లిని చూసి బండి ఆపేయడము.. అలా పిల్లి పట్ల దురభిప్రాయము ఏర్పడిపోయింది అని ఓ కథనం.

పిల్లులు ఆకలి కోసమో, తోటి పిల్లులతో  సంఘర్షణ కోసమో, సంభోగం కోసమో వింత శబ్దంతో ఏడుస్తూ ఉంటాయి. అది వాటి  వ్యవహారం. మనకు పిల్లి భాష వస్తే ఇది చక్కగా అర్థమవుతుంది. (అసలు నాకు తెలిసి జంతువుల భాష మనకు వచ్చి ఉంటే ఈ గొడవ అంత లేకపోవును). అంతేకానీ వాటి వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదము, అపాయము లేదు. మనుషులకు మనుషులు ఎదురయితే ఎలాగో పిల్లులు ఎదురైనా, నల్ల పిల్లి ఎదురైనా అంతే ….అది కూడా మనలాగే ఓ ప్రాణే కదా.

మరి తమాషా ఏమంటే పిల్లుల పై ఉన్నటువంటి సామెతలు ఎక్కడ ఉండవు. “పిల్లికి చెలగాటం …ఎలుకకు ప్రాణ సంకటం, పిల్లికి బిక్షం పెట్టని తల్లి, పని లేని వాడు పిల్లి తల గొరిగినట్లు, కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్లు, పిల్లి శాపాలకు వుట్లు తెగుతాయా?, పిల్లి వలస తిప్పినట్లు (పిల్లలను), పిల్లి లేనప్పుడే కలుగునుండి ఎలుకలు బయట గంతులేసినట్లు,.”…. ఇవన్నీ పిల్లి పై సామెతలు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ నల్ల పిల్లిపై ఉన్న మూఢనమ్మకాలను తిరస్కరించేలా పిల్లులు కోసం కూడా కొన్ని దినాలు జరుపుకుంటున్నారు తెలుసా. ఆగస్టు 17వ తేదీన ప్రపంచ “నల్ల  పిల్లుల అవగాహన దినోత్సవం” (Black cat appreciation day) జరుపుకుంటున్నారు. అదేవిధంగా అక్టోబర్ 27న జాతీయ నల్లపిల్లి  దినోత్సవం  (National Black Cat DAY ) కూడా జరుపుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే చాలామంది పిల్లులు పెంచుకుంటున్నారు. నల్ల పిల్లులను కూడా పెంచుకుంటున్నారు. పిల్లులు మనుషులతో కలిసి సహజీవనం చేస్తున్నాయి. క్రీస్తుపూర్వం 2000 ఏళ్ల నాటికే పిల్లులు మనుషులతో మచ్చికలో ఉన్నట్టుగా చరిత్ర చెబుతోంది. పిల్లుల పట్ల, నల్ల పిల్లుల పట్ల అవగాహన పెంచుకుందాం. భయాలు తొలగించుకుందాం.

One thought on “నల్ల పిల్లి చూడతరమా!

  1. మంచి ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. అభినందనలు అండి. 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *