విఠపు బాలసుబ్రహ్మణ్యం

కాలం ప్రవాహం లాంటిది. మానవ అవసరాలూ, సంబంధాలు ఆ ప్రవాహంలో నిరంతరం మారుతుంటాయి. వాటికి తగ్గ విలువలూ ఏర్పడి సమాజపు అన్ని పొరల్లోకి విస్తరిస్తూ వుంటాయి. విద్యారంగమేమీ దీనికి మినహాయింపు కాదు.

మానవుడికి బతుకుదెరువు నైపుణ్యాలు, పరిసర జ్ఞానము మాత్రమే అవసరమైన కాలంలో ఒక గురువు, నేర్చుకునేందుకు ఒక వ్యవస్థ వుండేవి కావు. నేర్పేది ఇంటి పెద్దలే కాబట్టి, నేర్చుకునేది ఇంటిపట్టున కొంతా, ప్రత్యక్ష పరిసరాల నుంచి కొంతా మాత్రమే గాబట్టి అసలు ‘నేర్పేవాడు నేర్చుకునేవాడు ‘అన్న విభజనకాకాలంలో అవకాశమే లేదు. ఒకరు గౌరవనీయుడుగా, మరొకరు వినయ సంపన్నుడుగా చలామణీ అయ్యేవారే గాదు.

రాజ్యమూ – విద్యా

కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చి, జ్ఞానం విస్తరించి, ప్రపంచం పెద్దదయ్యే కొద్దీ “జ్ఞానులు ,గురువులు ” వచ్చారు. వారి వద్ద దీక్షతో, భక్తిప్రపత్తులతో క్రమశిక్షణతో నేర్చుకునే “శిష్యులు” వచ్చారు. దీనికోసమో వ్యవస్థ వచ్చింది. దీని చుట్టూ కొన్ని విలువలు ఏర్పడ్డాయి. ఈ దశలో గురుశిష్యుల మధ్య ఒక’ పవిత్ర బంధం’ పుట్టుకొచ్చింది. ఆ వ్యవస్థకు రాజ పోషణ తప్పని అవసరమైంది. ఈ గురువు, ఆ విద్య రాజ్యానికి కూడా అంతే అవసరమయ్యాయి. ఆరాజ్యం మనుగడకు కావలసిన విలువలు ఈ విద్యనుంచే లభించేవి. ఆ విలువల్లో ఒకటి “వ్యవస్థకు లోబడి వుండడం- దాని పట్ల వినయ విధేయతలతో మెలగడం”. దీంతో గురు శిష్యుల మధ్య కూడా దీనికి తగ్గ సంబంధాలే వుండేవి. అన్నిటా గురువుది అగ్రస్థానం. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే పరమాత్మ!

ఈ సంబంధం కృత్రిమమైందని కూడా అప్పటి వారే గుర్తించకపోలేదు. అందుకే మాటిమాటికీ “సహ నౌ అవతు, సహ నౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, మా విద్విషామహై ” అంటూ రోజూ నెమరువేసుకొనేవారు (హెచ్చరించుకునేవారు). ‘మా విద్విషామహై’ అంటే “గురు శిష్యులమైన మేమిద్దరం గొడవ పడకూడదు” అని అర్థం.

ప్రపంచమంతా విద్యావిధానం ఇలానే వుండేది. అరిస్టాటిల్ దగ్గరైనా, వశిష్ఠుడి దగ్గరైనా గురు శిష్యుల సంబంధం ఇలానే సాగేది. గ్రీకులకు కూడా మనకు మల్లే సప్తర్షులు వుండేవారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మన నూతన విద్యా విధానం దీన్నే మన అపురూప వారసత్వమంటోంది.

ఆధునిక ప్రజాస్వామిక దృక్పథం

యూరపులో పారిశ్రామిక విప్లవంతో పాటు సైద్ధాంతిక ఘర్షణలు, నూతన తాత్విక దృక్పథాలు వెల్లువెత్తాక అన్ని రంగాల్లోకి ఆధునిక ప్రజాస్వామ్య ధోరణులు తోసుకొచ్చాక విద్యారంగ విలువలు కూడా తారుమారయ్యాయి. గురుశిష్యుల సంబంధాలు తలకిందులయ్యాయి. బోధనాభ్యసనాలు కొత్త నిర్వచనాలకు లోనయ్యాయి. దీన్నిప్పుడు మనం ‘ఆధునిక ప్రజాస్వామిక విద్యా దృక్పథం ‘అంటున్నాము.

ఇప్పటిదాకా ” గురువులు బోధిస్తారు ,పిల్లలు నేర్చుకుంటారు. టీచరుకు అన్నీ తెలుసు ,పిల్లలకేమీ తెలియదు. క్రమశిక్షణా నీతులూ గరిపేది ఉపాధ్యాయులు, దాన్ని పాటించే వాళ్ళు విద్యార్థులు. టీచరు ఎంపిక చేస్తాడు, విద్యార్థి దాన్ని ఆచరిస్తాడు. గురువులు చేసేవారు ,పిల్లలు వారిని అనుకరించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉపాధ్యాయుడు కర్త, విద్యార్థులు కేవలం కర్మలు” ఇదీ మన దృక్పథం!

ఈ దృక్పథాన్ని గ్రీకుదేశపు లిబరల్సు, రూసో నుంచి ఫాలోఫెయిరీ దాకా బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఇదేదో ఒక బోధనా విధానానికో, అలవాటుకో, సంప్రదాయానికో సంబంధించిన విషయం మాత్రమే కాదని ఒక ప్రాపంచిక దృక్పథానికి, ప్రజాస్వామిక విలువలకు సంబంధించిందని చెప్పసాగారు. ఉపాధ్యాయుడు తనకున్న జ్ఞానపరమైన ఆధిక్యతను, వృత్తి పరమైన అధికారంతో మిళితం చెయ్యడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇప్పుడు గురువే కాదు, శిశువూ బ్రహ్మే ! గురువు నుంచి శిష్యుడే కాదు, శిష్యుడి నుంచి గురువూనేర్చుకుంటాడు. ‘జాన్ కు ఇంగ్లీష్ నేర్పాలంటే టీచరుకు ఇంగ్లీషు తెలిస్తే చాలదు, జాన్ గురించి కూడా తెలియాలి’ అనేది ఇప్పటి నానుడి. శిశువేమీ మైనపు ముద్ద కాదు గురువు దాన్ని శిల్పంగా మార్చడానికి ! శిశువు అఖండ ప్రజ్ఞా మూర్తి, అనుపమ సృజన శీలి. గొప్ప గురువులభించడం శిష్యుడి అదృష్టమే కాదు ,గొప్ప శిష్యుడు లభించడం గురువుకూ అదృష్టమే. ప్రదానమూ లేదు స్వీకరణా లేదు ,అంతా పరస్పరాదాన ప్రదానాలే. అసలు గురువు బోధకుడు, చోదకుడు కూడా కాదు, సహకారి మాత్రమే. పిల్లలకూ హక్కులుంటాయి. ఆత్మ గౌరవం వుంటుంది. వాటిని కాపాడ్డం కూడా బడి బాధ్యత. పిల్లలు ఫెయిల్ గారు బడే ఫెయిల్ అవుతుంది – ఇది ఇప్పటి విద్యా తత్వం.

దీన్ని వొంట పట్టించుకోవడలో మనమెక్కడున్నామనేది తరచి చూచుకోక పోగా, ఇవన్నీ పాశ్చాత్య విలువలంటూ ఎదురు దాడికి దిగడం మనకే చెల్లింది! అందుకే గిజూబాయి లాంటి వారు అంతయుద్ధం చేయాల్సి వచ్చింది. గాంధీ, రవీంద్రుడు, జే కే , డేవిడ్ హాస్పిరో నుంచి యశ్ పాల్, రోహిత్ దన్ కర్, రమాకాంత అగ్నిహోత్రి దాకా ఈ శిశుకేంద్ర విద్యాతత్వ ప్రబోధకులు భారత దేశంలో ఎంతమంది ఎన్ని ప్రయోగాలు చేసినా ఇప్పటికీ బడిలో మన పిల్లలకి కేంద్ర స్థానం దొరకనే లేదు. మన ఉపాధ్యాయులకి ప్రేమమయ బోధనానుభూతి దక్కనే లేదు. పిల్లలకీ ఉపాధ్యాయులకీ మధ్య  రసార్ద్రానుబంధం నిలదొక్కుకోనే లేదు.  భాగస్వామ్య అభ్యసనం మనకు ఇంకా అనుభవానికి దూరంగానే వుండిపోయింది. మన దేశానికిదో మింగుడుపడని సాంస్కృతిక సమస్య.

విద్యా రంగంలోనూ వినిమయ సంస్కృతి

క్రమంగా కాలం మరోవైపు మళ్ళింది. విద్య వ్యాపారమైపోయింది. అందులోని ప్రతిదీ సరుకుగా మారిపోయింది. చదువులు సారహీనాలై డొల్లగా మారిపోయాయి. పరీక్షలు, మార్కులు, గ్రేడులు పరమావధిగా మారాయి. చూస్తుండగానే అభ్యసనం తన సృజనాత్మకతా సారళ్యాలను పోగొట్టుకుంది. సామాజిక అవసరాలు, సంబంధాలు దానికి దూరమయ్యాయి. వైయక్తికత సర్వస్వమైపోయింది. మిడిమిడి జ్ఞానం, మిన్నంటే ఆకాంక్షలు మన మధ్యతరగతి తల్లిదండ్రులనిప్పుడు నడిపిస్తున్నాయి. వారు తమకు తెలియకుండానే చదువులలోని ప్రతిదాన్ని వికృతం చేసేసారు. ఒక వినిమయ సంస్కృతి విద్య చుట్టూ అల్లుకుపోయింది. చిలుక పలుకు లే చదువులైపోయి, జిహ్వాగ్రధారణే ప్రతిభకు సంకేతమై కూచుంది. ఈ గచ్చపొదలో ఇరుక్కొని గురువులూ పిల్లలూ ఇద్దరూ తమ సహజ లక్షణాలకు దూరమైపోయారు.

ఇప్పుడు టీచరు అస్వతంత్రుడు. తనకంటూ ఏ స్వీయ దృక్పథమూ, విధానమూ లేనివాడు. పిల్లల పట్ల అతనిది నిర్మమకారం. సిలబసు పూర్తి చేయడమే, పరీక్షలు పెట్టడమే, గ్రేడులు పిండడమేమే అతని పని. తరగతి గదిలో అతడొక యంత్రం, తొలుబొమ్మ. నిస్సహాయ ప్రాణి. ఇక పిల్లలూ అంతే. బడిలో వారి ఇష్టాయిష్టాలకు చోటు లేదు. స్వీయ అభ్యసన ప్రయత్నాలకు అవకాశమే లేదు. ప్రశ్నించడానికి, స్వీయ వ్యక్తీకరణకు చోటే లేదు. అసలు ఈ మొత్తం ప్రక్రియలో వారి ప్రమేయమంటూ ఏది లేదు. దీంతో గురుశిష్యులు, వారి ఆత్మీయతలు, అనుబంధాలు వారి మధ్య సమానతా ప్రాతిపదికన ఆదాన ప్రదానాలు-అన్నీ విద్యాతాత్విక గ్రంథాల పుటల్లో ఇరుక్కుపోయి శల్యావశిష్టంగా మారాయి.

అసలు మొత్తం చదువుల నుంచే సకల మానవ విలువలు దూరమైనప్పుడు, మానవ సంబంధాలన్నీ యాంత్రికాలయినప్పుడు ఇక గురు శిష్యుల సంబంధాలు స్నేహమయంగా ఎలా వుండగలుగుతాయి? ఈ రోజుల్లో సిలబస్ తయారీలో, బోధనాపరికరాల తయారీలో, అధ్యాపన పద్ధతుల్లో, పిల్లలకి అనుగుణంగా తరగతి గదిని మార్చుకోవడంలో, పరిసరాలకు తగ్గట్లు ప్రతిదాన్నీ రూపొందించుకోడంలో ఉపాధ్యాయుడికి ఏమాత్రం స్వేచ్చలేదు. అన్నీ ఎక్కడెక్కడినుంచో దిగుమతి అయినవి. దీంతో ఉపాధ్యాయుడు పరాధీనుడవుతున్నాడు. తెలియకుండానే తన విద్యార్థులకు దూరమైపోతున్నాడు. ఈ మొత్తం ప్రక్రియలో వ్యాపారవినిమయ విలువలు తప్ప, మానవీయ విలువలకు ఏమాత్రం స్థానం లేకపోవడంతో ఉపాధ్యాయుడు కూడా క్రమంగా తన జీవ లక్షణాలన్నీ పోగొట్టుకుంటున్నాడు.

మాటలకందని విఘాతం

బడి ఒక విలక్షణ సామాజిక ప్రయోగశాల! వైవిధ్య భావాల హరివిల్లు.అఖండ జ్ఞాన ప్రసార క్షేత్రం. ప్రపంచం కొత్త కొత్త కోణాలతో ఆవిష్కృతమవుతుందక్కడ. బిడ్డ విద్యుత్తేజాన్నక్కడ నింపుకుంటుంది. మధురానుభూతుల్ని ఆస్వాదిస్తుంది. మానవాత్మ ప్రబుద్ధమయ్యేది అక్కడే. ఎక్కడా జరగనిది అక్కడేదో జరుగుతుంటుంది. దానికదే ఒక సరళ సుందర పరమాద్భుత ప్రపంచం. దీన్ని సంకుచితం, సంక్లిష్టం చేసి వ్యాపార కేంద్రంగా మార్చాక భవిష్యత్ ప్రపంచం ఏమవుతుంది ? అక్కడి గురువూ, శిష్యుడూ ఎవరికి వారు పరతంత్రులూ, ప్రాణం లేని వాళ్ళూ అయ్యాక సమన్నత మానవ సంబంధాలిక ఎక్కడ నుంచి పుట్టుకొస్తాయి ?

మరీ మన విషాదం ఏమంటే మన విద్యాలయాలు సమాజంలోని ఎగుడుదిగుళ్ళన్నిటికీ ప్రాతినిధ్యం వహించడమే కాదు వాటిని పెంచి పోషించేవిగా మారాయి. ఏ అడ్డంకులు లేని స్నేహం సమానత్వం వుండాల్సిన క్షేత్రాలు కాస్తా, నిలువెత్తు గోడలు గట్టి మన భవిష్యత్తరాన్ని విడదీసేవిగా మారుతున్నాయి. ఈ క్రమంలో నిరుపేదలకు నిలయాలుగా ప్రభుత్వ విద్యాలయాలు మారుతున్నాయి. అమాయకంగా సంచి భుజాన వేసుకొని బడికి వచ్చే గిరిజన బాలికకు ఇక్కడ స్వాగత ద్వారాలేమీ తెరిచివుండవు. అడుగడుగునా సవాలక్ష అడ్డంకులతో బిక్కుబిక్కు మంటూ ఆ బిడ్డ లోనికి అడుగుపెడితే టీచరమ్మే బడిలో ఆమెకు తల్లి కావాలి. బడి తనది అన్పించాలి. అక్కడ తన పరిసర ప్రపంచమంతా కనిపించాలి. మనం చెప్పే లోకాతీత పాఠ్యాంశాల ప్రవచనాలతో ఇక్కడ ఏమీ ఒరగదు. హత్తుకొనే హృదయమే ఇక్కడ సర్వస్వమవుతుంది. మరి ప్రస్తుత టీచరుకు ఈ అవకాశమెక్కడుంది? ఆ స్వభావం ఎక్కడుంది? ఈ ప్రేమమయ ప్రపంచమే మన విద్యారంగంలోని అన్ని అంశాలకీ కీలకమైందనిగుర్తించే దృక్పథం మనలో ఎవరికుంది? టీచరు కూడా ఈ గజిబిజి ప్రపంచంలో ఇరుక్కుపోయి, పిల్లలకు వీలున్నంత దూరమై యాంత్రికంగా మారాక ఇక పిల్లలకు మాత్రం వారిపై ఏ నమ్మకం కుదురుతుంది ? ఇలా పేద పిల్లలకు స్నేహహస్తం అందించే మంచి టీచర్లు కరువవుతున్నారు. టీచర్లకు మట్టి మనుషుల పిల్లలు దూరమవుతున్నారు. ఎగుడు దిగుడు ల్లేని ఒక గొప్ప ప్రపంచావిష్కరణకి ఇది కల్గిస్తున్న విఘాతం మాటలకందనిది.

ఇంత స్పష్టమైన భౌతిక వాస్తవం కళ్ళ ముందు ద్యోతకమవుతున్నా, తరచూ మనకు కనిపించే ధోరణి ఏమంటే ప్రతిదానికి టీచర్ని బాధ్యుడిని చెయ్యడం. సమాజంతో నిమిత్తం లేకుండా అతణ్ని విడదీసి నిలబెట్టడం. ఎత్తితే అతణ్ని ఆకాశానికి ఎత్తడం. సాందీపునితోనో, సర్వేపల్లితోనో పోల్చడం. లేకుంటే అతనిలో అబ్దుల్ కలాంలు లేరని నిందించడం. అద్భుతాలు జరగడంలేదని ఆక్రోశ పడడం. సమాజపు అవలక్షణాలనీ, తమ సొంత వికృతాకాంక్షలనీ పక్కనపెట్టి నిందనంతా టీచరు పైకెత్తడం.

నిజానికి సృజనాత్మక విద్యకూ, పేద పిల్లలకూ, మొత్తంగా సమాజానికి దూరమైపోతున్న టీచరు ప్రస్తుత కాలంలో నష్టజాతకుల్లో కల్లా నష్టజాతకుడు. కొంత తెలిసీ కొంత తెలియకా  మెట్టు మెట్టుకూ దిగిపోతున్నవాడు. అతనికీ పిల్లలకూ మధ్య ఎడం పెరిగిపోతోంది. ఇది వాళ్ళిద్దరికీ ఎంత నష్టం తెస్తుందో సమాజానికి అంతకంటే ఎక్కువ నష్టం తెస్తోంది. మనం సమున్నత మానవ సంబంధాల సమాజాన్ని కోరేవాళ్ళమే అయితే, ఖచ్చితంగా మనబడి దానికి ప్రతిరూపంగానే వుండేది. మన ఉపాధ్యాయులు పిల్లలు కలిసి మొదట దాన్ని బడిలోనే ఆవిష్కరించుకొని వుండేవారు. సామాజిక న్యాయానికి బలమైన పునాదులు అక్కడే వెలిసేవి. మనం కావాలనే చేజేతులారా దాన్ని వొదులుకున్నాం, వద్దనుకున్నాం!

కానీ మళ్ళీ కాలమిప్పుడు కొత్త పురిటి నొప్పులు పుడుతున్నట్టనిపిస్తోంది. మన బడి చుట్టూ, చదువుల చుట్టూ, వాటికుండాల్సిన ప్రజాస్వామిక లక్షణాల చుట్టూ కొంచెం కొంచెంగానైనా, కొన్ని వర్గాలలోనైనా చర్చ మొదలైంది. దీన్ని ఉపాధ్యాయులు సైతం అందిపుచ్చుకొని, ముందుకు నెట్టగలిగితే వారికీ మంచిది, సమాజానికీ మంచిది!

One thought on “మారుతున్న గురుశిష్య ప్రేమానుబంధాలు!

  1. విద్య కొనుకునే ది గా మారింది డబ్బు వున్నవారికే చదువు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *