సృజనను పెంచే సైన్సు ఫిక్షన్
– ఎస్. వెంకట్రావు
మనిషిని జంతువు నుండి వేరు చేసే ప్రధాన లక్షణం ఊహాశక్తి. జంతువు ఆలోచనల్లో “నిన్న” లేదు కాబట్టి” రేపు” కూడా వుండదు. దానికి వున్నది “అప్పుడు” ” అక్కడ” మాత్రమే. కానీ మనిషి ఊహాశక్తి అతన్ని “నేటి” నుండి విడగొట్టింది. అందుకే అతడు నిన్నటి గురించి ఆలోచించగలడు. రేపటి గురించి ఊహించగలడు. ఇదే అతడిని ఆధునిక మానవునిగా మెట్టు మెట్టు ఎదగడానికి దోహద పడింది.
ఊహాలోక విహారం నుంచే….
ప్రముఖ అమెరికన్ పిల్లల రచయిత ఎల్. ఫ్రాంక్ బామ్ ఇలా పేర్కొన్నాడు “ఊహాశక్తి మానవుణ్ణి నాటి అనాగరిక కాలం నుండి నేటి నాగరిక యుగానికి తీసుకువచ్చింది. ఊహాశక్తి వల్లే కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు. ఊహాశక్తి వల్లే ఫ్రాంక్లిన్ విద్యుత్తును తెలుసుకున్నాడు. ఊహాశక్తి వల్లే మనకు స్టీమ్ ఇంజన్ వచ్చింది. టెలిఫోన్ వచ్చింది. యంత్రాలు, మోటారు వాహనాలు వచ్చాయి. ఈ వస్తువుల గురించి మనిషి తొలుత ఊహించుకున్నాడు. తరువాత అవి వాస్తవంగా మారాయి. అందువల్ల కలలు – అవి పగటి కలలే కావచ్చు మనం కళ్ళు తెరుచుకుని ఉండగానే మెదడు ఆలోచనలకు పదులు పెట్టే ఈ కలలే ప్రపంచం మరింత మెరుగ్గా మారడానికి కారణమయ్యాయి. ఊహాలోకంలో విహరించే నేటి పిల్లలే ఊహాశక్తి గల రేపటి స్త్రీ పురుషులవుతారు. ఇటువంటి వారే కొత్త ఆవిష్కరణలతో నాగరికతను ముందుకు తీసుకుపోగల్గుతారు”.
ఫ్రాంక్ బామ్ మాటల్ని మన బాల్యానికి మళ్ళించి చూడండి .చిన్నప్పుడు అమ్మమ్మ ,నాన్నమ్మ, తాతయ్యలు చెప్పిన కథలు మనలో ఎన్నెన్ని ఊహలను రేకిత్తించాయో గుర్తుకుతెచ్చుకోండి. రెక్కల గుర్రం మీద ఆకాశంలో విహరించే రాజకుమారుడు ; కొండలు, గుట్టలు నదులు దాటుకుంటూ పోయే కీలుగుర్రం. చంద్రుడి మీది చెట్టు. చెట్టు కింద కూర్చున్న పేదరాశి పెద్దమ్మ -ఇలాంటి కథలన్నీ మనల్ని ఏ ఏ ఊహాలోకాల్లోకి లాక్కెళ్ళాయో! ఆ మాటకొస్తే మన పురాణాలు కూడా ఇలాంటివే. అవి కూడా నాటి మానవుని సృజన శక్తికి తార్కణాలే. మనిషి గాలిలోకి ఎగిరిపోవాలనుకున్నాడు, పుష్పక విమానం సృష్టించాడు. ఆహారం సమృద్ధిగా ఇచ్చే వృక్షాలు కావాలి, కల్పవృక్షం వచ్చింది. పశువులు కావలసినన్ని పాలు ఇవ్వాలి, కామధేనువు వచ్చింది. ఇలా మానవుడు తనకు కావల్సినవన్నీ ఊహల్లో సృష్టించుకున్నాడు. నాటి ఊహలను నేటి మానవుడు నిజం చేశాడు. అంటే వాస్తవ అభివృద్ధికి ముందు ఊహ నడుస్తుందన్నమాట!.
సైన్స్ ఫిక్షన్ అంటే…
సైన్స్ ఫిక్షన్లు (సైన్సు నవలలు, కథలు) అటువంటి ఊహాశక్తికి పదును పెట్టే గొప్ప సాహిత్య ప్రక్రియలు. కథలు చెప్పటం మనకు పురాతన కాలం నుండే వుంది. పురాణాలన్నీ దాదాపు ఇటువంటి కథలే. ఆ కథల్లో కూడా ఆధునిక ఆవిష్కరణలకు సంబంధించిన అనేక ఊహలు ఉన్నాయి. అయితే వీటన్నిటిని సైన్సు ఫిక్షన్ అనలేము. అవి పురాణగాధలు మాత్రమే.
సైన్స్ ఫిక్షన్ కు ఒక నిర్దిష్టమైన నిర్వచనం ఉంది. ఇది ఆధునిక సైన్సు అభివృద్ధి చెందుతున్న క్రమంలో వచ్చిన కొత్త భావన. ఇది సైన్సు అభివృద్ధిని ముందుగానే ఊహించి చెప్పే భావన. అందుకే దీన్ని “ఆలోచనల సాహిత్యం” (లిటరేచర్ ఆఫ్ ఐడియాస్) అంటున్నారు. అంటే ఈ కథల్లో కేవలం ఊహ మాత్రమే ఉండదు. సైన్సు, టెక్నాలజీ విషయాలు, శాస్త్రీయ సిద్ధాంతాలు కూడా వుంటాయి. మాయలు మంత్రాలతో సరిపెట్టుకోకుండా ప్రస్తుత సైన్సు సిద్ధాంతాల మీద కొత్త సిద్ధాంతాలు, ప్రస్తుత టెక్నాలజీ మీద కొత్త టెక్నాలజీ సృష్టించడం సైన్స్ ఫిక్షన్ లోని ప్రధానాంశం. అందువల్ల సైన్స్ ఫిక్షన్ రచయితలకు మొదట సైన్సు గురించి తెలిసి వుండాలి. సైన్స్ ఫిక్షన్ చదువుతున్నామంటే మనం సైన్సు గురించి తెలుసుకుంటున్నా మన్నమాట. అంటే ఇతర సృజనాత్మక రచనలు భావోద్వేగాలపై పని చేస్తే సైన్స్ ఫిక్షన్లు మన మెదడు మీద కూడా పనిచేస్తాయి.
వాస్తవికత- ఊహ- సైన్సూ
“సైన్స్ ఫిక్షన్” అనే మాటను మొదట వాడినవాడుహ్యూగో గెర్న్స్ బాక్. లగ్జంబర్గ్ లో పుట్టి అమెరికాలో స్థిరపడిన ఈయన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ పత్రికను స్థాపించాడు. అందుకనే ఆయనను సైన్స్ ఫిక్షన్ల ఆద్యుల్లో ఒకరుగా పేర్కొంటారు. సైన్స్ ఫిక్షన్ అంటే ఆయన ఉద్దేశంలో “శాస్త్రీయ వాస్తవాలతోనూ, భవిష్యత్తును గురించిన అంచనాలతోనూ మిళితమైన అందమైన భావావేశాలు”.
వాస్తవానికి సైన్స్ ఫిక్షన్ అంటే ఏమిటి అన్న దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ రచనల్లోనూ చాలా రకాలు ఉన్నాయి .హెచ్ జీ వేల్స్, జూల్స్ వెర్న్ వంటి వారు రాసిన సైన్స్ ఫిక్షన్లలో సైన్స్ ప్రధానంగా ఉంటుంది. కొందరి రచనల్లో ఫాంటసీ ఎక్కువ. ఇవన్నీ ఒకే నిర్వచనంలో ఇమడ్డం కష్టం. అయితే ఉన్నంతలో సైన్స్ ఫిక్షన్ రచయిత రోబర్ట్ ఏ హీన్ లీన్ నిర్వచనం దాదాపు అన్ని రకాల సైన్స్ ఫిక్షన్ లకు సరిపోతుంది . “ఆయన ప్రకారం సైన్సు ఫిక్షన్ గతానికి, వర్తమానానికీ సంబంధించిన విజ్ఞానంపై ఆధారపడి వుండాలి. భవిష్యత్తులో జరగబోయే దాని గురించి వాస్తవికతతో కూడిన ఊహాగానం చేయాలి. ప్రకృతి గురించి సరైన అవగాహనతో, శాస్త్రీయ పద్ధతిని దృష్టిలో పెట్టుకొని ఈ ఊహగానం చేయాలి”
కానీ సైన్స్ ఫిక్షన్ రచనలన్నీ ఈ నిర్వచనాలకు అనుగుణంగా జరగడం లేదు. సైన్సుకన్నా ” నాన్ సైన్సు” (ఇంకా చెప్పాలంటే ‘నాన్సెన్స్’) ఎక్కువగా వుంటున్న వాటిని సైన్స్ ఫిక్షన్లుగా చలామణీలోకి తెస్తున్నారు.
కెప్లర్ ‘కల’!
మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రచయిత జోహాన్నస్ కెప్లర్ (ప్రఖ్యాత శాస్త్రవేత్త, గ్రహగతుల సూత్రాలు కనిపెట్టినవాడు) అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది.

1608లో ఆయన రాసిన సోమ్నీయం (కల) అనే నవల మనకు తెలిసిన మొదటి సైన్స్ ఫిక్షన్ రచన! అయితే 1630లో కెప్లర్ చనిపోయాక ఆయన కుమారుడు లడ్విగ్ కెప్లర్ 1634లో దీన్ని ప్రచురించాడు. అప్పటివరకు ఆయన ఇటువంటి రచన చేశాడనే విషయం ఎవ్వరికీ తెలియదు. నవలలోని అంశం ఏమంటే – ఒక పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకున్నప్పుడు కెప్లర్ కు ఒక కల వస్తుంది. ఆ కలలో ఐర్లాండ్ కు చెందిన 14 సంవత్సరాల బాలుడికీ, అతని తల్లికీ ఒక భూతం ప్రత్యక్షమై లెవానీయా (మన చందమామ) అనే ద్వీపం గురించి చెబుతుంది. ఈ నవలలో కెప్లర్ చంద్రుడి మీది నుండి చూస్తే భూమి ఎలా కనిపిస్తుందో చెప్పాడు. భూమికి ఉపగ్రహమైన చందమామ భూమి నుండి ఏభై వేల మైళ్ళ దూరంలో, ఈథర్ అనే మాధ్యమంలో వుంటుంది అని భూతం చెబుతుంది. భూమి నుండి లావానియాకు వెళ్లడానికి ఒకే తోవ వుంటుంది. ఆ మార్గం తెరిచి ఉంటే భూతాలు నాలుగు గంటల్లో మనుషులను చందమామ దగ్గరకు తీసుకెళ్లగలవు. అయితే మనుషులు ఆ ప్రయాణపు షాక్ ను తట్టుకోలేరు. కాబట్టి భూతాలు వారికి మత్తుమందునిచ్చి తీసుకెళతాయి. దారిలో విపరీతమైన చలి. భూతాలు వాటి శక్తులతో చలిని పారదోలుతాయి. ఊపిరి అందడానికి ముక్కు రంధ్రాలకు స్పాంజ్ పెడతాయి. భూతాలు మహాశక్తితో ఒక్క తోపు తొయ్యడం వల్ల మనషులు వేగంగా చంద్రుని వద్దకు చేరుకుంటారు. చంద్రుని సమీపించినప్పుడు మనుషుల వేగాన్ని భూతాలు తగ్గించేస్తాయి. అందువల్ల వారు చంద్రునిపై నెమ్మదిగా దిగుతారు. ఖగోళ విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ కాలంలోనే కెప్లర్ ఊహాశక్తి చంద్రుడిమీద నుండి చూస్తే భూమి ఎలా ఉంటుందో వర్ణించింది! చంద్రుని చేరుకునే విధానం గురించి చెప్పింది!!
శాస్త్ర వికాసంతో….
నవలతో పాటే సైన్స్ ఫిక్షన్ అభివృద్ధికి 18వ శ. పారిశ్రామిక విప్లవం నాంది పలికింది. ఇంగ్లాండు, యూరపుల్లో సైన్స్ ఫిక్షన్ రచన అభివృద్ధి చెందింది. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ రచయిత్రి మేరీషెల్లీ రచించిన ‘ఫ్రాంకెన్ స్టీన్’ ను తొలి సైన్స్ ఫిక్షన్ అని కొందరు పేర్కొంటారు. విక్టర్ ఫ్రాంకిన్ స్టీన్ అనే యువకుడు చేసిన ఒక శాస్త్ర ప్రయోగంలో వికృతమైన శరీరం నిర్మాణం గల వింత మనిషి తయారు కావడం, అతడు ఎదురు తిరిగి సృష్టించిన శాస్త్రవేత్తనే నాశనం చేయడం గురించి ఈ నవల చెబుతుంది. షెల్లీ 18 ఏళ్ల వయసులో ఈ నవల రాసింది.
విద్యుత్తు,టెలిగ్రాఫ్, కొత్త రవాణా సాధనాలు వచ్చాక ఈ శతాబ్దం చివరిలో చాలా గొప్ప సైన్స్ ఫిక్షన్ రచయితలు వచ్చారు. జూల్స్వెకర్ మంచి కవి, నవలా, నాటక రచయిత. సాహసాన్ని, శాస్త్ర పరిశోధనను మేళవించి ఆయన రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలు “ఎజర్నీ టు ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ “(1864 ), “ట్వెంటీ థౌజండ్ లీగ్స్ అండర్ ద సీ” ( 1870), “అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్”( 1873 ) ప్రఖ్యాతిగాంచాయి. హెచ్ జి వేల్స్ (బ్రిటిష్ రచయిత ) నవలా చరిత్ర రచన, రాజకీయాలు వగైరా అనేక రంగాల్లో నిష్ణాతుడు. “టైం మెషిన్” (1895), “ఐలాండ్ ఆఫ్ డాక్టర్ మోరియా” (1896), “ది ఇన్విజిబుల్ మాన్” (1897), “ది వార్ ఆఫ్ ది వరల్డ్స్” (1898 ) , “ది ఫస్ట్ మెన్ ఇన్ ది మూన్” (1901) మొదలైనవి ఆయన రాసిన గొప్ప సైన్స్ ఫిక్షన్ నవలలు. ఆయన సృష్టించిన టైం మెషిన్ కాన్సెప్ట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. హ్యూగో గెర్న్ బ్యాక్ రచయిత, సంపాదకుడు, పత్రికా ప్రచురణ కర్త. ఈయన మొదటి సైన్స్ ఫిక్షన్ పత్రిక స్థాపించడం ద్వారా ఈ రచనలకు ఎనలేని సేవ చేశారు.
తర్వాత ప్రధానంగా అమెరికా ఈ రచనలకు, రచయితలకు కేంద్రంగా మారింది. హాలీవుడ్ సినీ ప్రపంచం అనేక సైన్స్ ఫిక్షన్ సినిమాలు వెలువరించింది. ఏ ట్రిప్ టు ది మూన్ (1902) మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా విస్తృతంగా పరిగణించబడుతుంది. జార్జెస్ మెలీస్ తన వినూత్నమైన కెమెరా ట్రిక్స్‌ని ఉపయోగించి స్పెషల్ ఎఫెక్ట్స్‌తో చంద్ర మండల యాత్రను చూపించాడు.
ప్రఖ్యాతిగాంచిన అనేక టెలివిజన్ సీరియల్స్ కూడా వచ్చాయి. జాన్ కాంప్ బెల్, ఇస్సాక్ అసిమోవ్, ఆర్థర్ సి క్లార్క్ వంటి అనేకమంది రచయితలు ఈ కాలాన్ని సైన్స్ ఫిక్షన్ కు స్వర్ణయుగంగా మార్చేశారు. ముఖ్యంగా సైన్స్ విజయాలను వీరు శ్లాఘించారు. అనేక హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయాలు సాధించాయి. వీటిలో స్టార్ వార్స్, స్టార్ ట్రెక్ వంటి వాటితోబాటు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ సృష్టించిన ఇ.టి (ఎక్ట్సా టెర్రస్ట్రియల్), జురాసిక్ పార్క్, కెవిన్ రెనాల్డ్స్ తీసిన వాటర్ వరల్డ్, జేమ్స్ కామెరాన్ తీసిన అవతార్ వంటి సినిమాలు ఇటీవల వెలువడిన మచ్చుకు కొన్ని మాత్రమే.
రెండవ ప్రపంచ యుద్ధం ముందు వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ రచనలు ప్రధానంగా సైన్సులో మానవుని విజయాలను శ్లాఘించాయి. భవిష్యత్తు పట్ల భరోసా ఇచ్చే విధంగా ఉండేవి. కానీ, 1980వ దశకం వచ్చేసరికి సైన్సులో ఆశావాదం పోయి నిరాశవాదం బయలుదేరింది. ఈ కాలంలో వచ్చిన రచనలు, సినిమాలు, టీవీ సీరియల్స్ అత్యధిక భాగం సైన్సును ప్రతికూల ఛాయలో చూపడం ప్రారంభించాయి. సైన్సు మనిషికి ఎదురు తిరిగినట్లు చూపేవి ఎక్కువగా రా సాగాయి. గ్రహాంతరవాసుల దాడులు, వాతావరణ మార్పులతో భూమి ప్రమాదంలో పడడం, మనిషి పరిశోధనలే అతనికి ఎదురు తిరగడం వంటి ఇతివృత్తాలతో కూడిన రచనలు. సినిమాలు ఎక్కువగా వచ్చాయి.
భారత దేశంలో సైన్స్ ఫిక్షన్
మనదేశంలో సైన్స్ ఫిక్షన్ రచనలు చాలా ఆలస్యంగానూ, సాపేక్షంగా తక్కువగాను వచ్చాయి. మన దేశంలో మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రచన బెంగాలీలో వచ్చింది. హేమలాల్ దత్తా రాసిన సైన్స్ ఫిక్షన్ కథ ‘‘రహస్య’ 1882లో విజ్ఞాన దర్పణ్ అనే పత్రికలో ప్రచురితమైంది. దీన్ని మొదటి భారతీయ సైన్స్ ఫిక్షన్‌గా చెబుతారు. అయితే ప్రముఖ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ 1997లో రాసిన ‘‘అఘోష్’’ కథ తొలి సైన్స్ ఫిక్షన్ అని మరికొందరు చెబుతారు. ఏమైనా తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్‌కు జన్మనిచ్చింది మాత్రం బెంగాలీలే. జగదీష్ చంద్ర బోస్ గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాక మంచి రచయిత కూడా. ఆయన అనేక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ రచనలు చేసాడు.
బెంగాలీ తర్వాత హిందీలో 1884లో వచ్చిన ‘ఆశ్చర్య వృత్తాంత్’ తొలి హిందీ సైన్స్ ఫిక్షన్ అని చెబుతారు. మరికొందరు బాబు కేశవ్ ప్రసాద్ 1900లో రాసిన ‘చంద్రలోక్ యాత్ర’ తొలి హిందీ సైన్స్ ఫిక్షన్ అంటారు. బెంగాలీ, హిందీ తరువాత మరాఠీ, అస్సామీ, తమిళం, మళయాళం, తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు వచ్చాయి.
ఇక భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమాలను పరిశీలిస్తే ప్రధానంగా హాలీవుడ్ డబ్బింగులు, అనుకరణలు మినహా మనదంటూ ప్రత్యేకత సంతరించుకున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలు మనకు చాలా తక్కువ. తమిళ అమెరికన్ సహా నిర్మాణంలో 1952లో ఇంగ్లీషులో వచ్చిన ‘కాడు’ తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమా అని చెబుతారు. అయితే 1963లో తమిళంలో వచ్చిన ‘కలై అరసి’ని కొందరు తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమాగా పరిగణిస్తారు. ఏమైనా సైన్స్ ఫిక్షన్ సినిమాకు జన్మనిచ్చింది మాత్రం తమిళం. హిందీలొ 1967 వచ్చిన ‘చాంద్ పార్ చడాయే’ తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా.
తమిళం, హిందీ మినహాయిస్తే ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు చాలా తక్కువ.. తమిళ సినిమా ‘‘రోబో’’ మూడు భాషల్లో విడుదలై సంచలనం సృష్టించడమే గాక బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున వసూలు చేసింది.
తెలుగులో…
టేకుమళ్ల రాజగోపాల రావు 1934లో రాసిన ‘విహంగయానం’ తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ నవల అని చెబుతారు.ఈ నవలలోనాయిక ఒక జలాంతర్గామిలో ప్రయాణిస్తుంది. రావూరి భరద్వాజ ‘చంద్రమండల యాత్ర’ రోదసియానం గురించి చర్చిస్తుంది. ఆయన యుక్తవయసులో రాసిన నవల ఇది. బొల్లిముంత నాగేశ్వరరావు ‘గ్రహాంతర యాత్రికులు’ నవలలో మరో గ్రహం నుండి వచ్చిన పర్యాటకులు భూలోకంలోని మనవారిలో ఉన్న ఆర్థిక అసమానతలను చూసి ఇదంతా చాలా అసహజంగా ఉందే అని ఆశ్చర్యపోతారు. కొమ్మూరి వేణుగోపాలరావుగారు రాసిన ‘ఒకే రక్తం, ఒకే మనుష్యులు’ సైన్సుని ప్రాతిపదికగా తీసుకుని రాసన నవల. పురాణపండ రంగనాథ్, అనిల్ రాయల్, యండమూరి వీరేంద్రనాధ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, రెంటాల నాగేశ్వరరావు, చిత్తర్వు మధు వంటి వారు సైన్స్ ఫిక్షన్ రచనలు చేశారు.
తెలుగులో 81 మంది సైన్స్ ఫిక్షన్ రచయితల రచనలను సమగ్రంగా విశ్లేషిస్తూ కె. సదాశివరావు ‘‘సైన్స్ ఫిక్షన్ రచయితలు’’ అనే శీర్షికతో నాలుగు భాగాలుగా పుస్తకాలు రచించారు.
తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలా తక్కువగానే వచ్చాయని చెప్పవచ్చు.1991 సంవత్సరంలో వచ్చిన ‘ఆదిత్య 369’ తెలుగులో వచ్చిన పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ సినిమా అని కొందరు అంటారు. అయితే అంతకు ముందు 1965లో వచ్చిన ‘‘దొరికితే దొంగలు’’, 1969లో వచ్చిన ‘‘శెభాష్ సత్యం’’ సైన్స్ ఫిక్షన్ ఆధారంగా తీసిన సినిమాలే.
ఇటీవలి కాలంలో భారతీయ భాషల్లో అనేక సైన్స్ ఫిక్షన్ సీరియల్స్, సినిమాలు వస్తున్నాయి. అయితే వీటిలో అనేకం సైన్స్‌్ ఆధారంగా కాకుండా పురాణాల ఆధారంగా వస్తున్నాయి. వక్రమార్గం పట్టిన ఈ సైన్స్ ఫిక్షన్ రచనలుగానీ, సినిమాలు, సీరియల్స్ గానీ ప్రజల్లోని ఊహాశక్తిని, శాస్త్రీయ రచనల పఠనాన్ని పెంపొందించేందుకు దోహదపడకపోగా మనుషుల్లో మూఢత్వాన్ని మరింత పెంచుతాయి.
సైన్సు ఫిక్షన్ రచనలను ప్రోత్సహించాలి!
సైన్స్ ఫిక్షన్ కేవలం వినోదమే కాదు, విజ్ఞానం కూడా. ఈ ప్రక్రియలో రచయితలకు సాహిత్యం మీద పట్టు వుండడమే చాలదు. సైన్స్ పై లోతైన అవగాహన కూడా వుండాలి. తన నవల, కథ, నాటకం ద్వారా రచయిత సైన్సు గురించి, దాని భవిష్యత్తు గురించి, సైన్సుకు సమాజానికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి కూడా చర్చించాలి. అదే సమయంలో సైన్స్ ఫిక్షన్ అనేది కేవలం సైన్సు గ్రంథం కాకూడదు. పాపులర్ సైన్సు రచన కూడా కాకూడదు. అదో నాటకం, సినిమా, లేక టీవీ సీరియల్ అనేది మరిచిపోకూడదు. అంటే అదో సాహిత్య ప్రక్రియ అన్నమాట. ఇలా సైన్సును, సాహిత్యాన్ని జమిలిగా సాగించడమే సైన్స్ ఫిక్షన్ అంటే!
ఇటువంటి రచనలు నేటి తరం పిల్లలకు యువతకు మరింత అవసరం. ఎందుకంటే నేటి విద్యా విధానం పిల్లల్లో ఊహాశక్తిని పోగొట్టి వారిని పోటీ జీవులుగా, మార్కులు సాధించే యాంత్రిక ప్రాణులుగా మార్చేస్తోంది. వీడియో గేములు, పజిల్స్, సోషల్ మీడియా కొంతవరకు వారి ఊహకు పదును పెడుతున్నా వాటికి చాలా పరిమితులున్నాయి. పదే పదే వాటిని చూడడం వల్ల మళ్ళీ యాంత్రికత పెరుగుతుంది కానీ సైన్స్ అలా కాదు పిల్లలకు అది కథ చెబుతుంది. సైన్సు చెబుతుంది. సమస్యలను వారి ముందు వుంచుతుంది. వాటికి సైన్సు ఆధారిత పరిష్కారాలపై చర్చ పెడుతుంది సంభవాల చట్రం నుండి వారిని బయట పడవేస్తుంది. సైన్స్ ఫిక్షన్ పిల్లల మెదడుకు పదును పెడుతుంది. వారి ఊహాలకు రెక్కలు తొడుగుతుంది. వారిలో సృజనాత్మక శక్తిని పెంచుతుంది.
తెలుగులో ఇటువంటి రచనలు చేసే వారు తక్కువగా ఉన్నారు. ఇతర భాషల నుండి అనువాదాలు కూడా పెద్దగా లేకపోవడం శోచనీయం. 1950-60 దశకాల్లో తెలుగులోకి సాహిత్య అనువాదాలు పెద్ద ఎత్తున వచ్చాయి. అవంతి పబ్లికేషన్ ద్వారా మహీధర రామ్మోహనరావు పలు సోవియట్ సైన్స్ ఫిక్షన్ నవలలను తెలుగులోకి అనువదించారు. తర్వాత సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన ప్రగతి పబ్లికేషన్స్ కూడా కొన్ని అనువాదాలు పరిమితంగానే అయినా తీసుకొచ్చింది.
ఆధునిక సైన్సు అనేక కొత్త రంగాలను తెరిచింది. జెనెటికల్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, కృత్రిమ మేధ లాంటివి రేపు మనల్ని శాసించనున్నాయి. ఖగోళ రంగంలో మరిన్ని కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. వీటి ఆధారంగా సైన్సు ఫిక్షన్ రచనలు ఎక్కువగా రావాలి. అటువంటి రచనలను, రాసే వారిని ప్రోత్సహించాలి!