స్వతంత్ర భారతపు  తొలి వేకువలో
“స్వావలంబన కోసం సైన్సు” ప్రయత్నాలు !

ఆధునిక భారతదేశం సాధించిన శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక విజయాలకు కారణం స్వాతంత్రం వచ్చిన కొత్తలో  ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగంలోని పరిశోధనశాలలు, పరిశ్రమలు. వీటిని స్థాపించడం లో ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రు పాత్ర మాత్రమే చూస్తే సరిపోదు. మేఘ నాధ్ సాహా, సాహిబ్ సింగ్ సోఖి, సయ్యద్ హుస్సేన్ జహీర్ వంటి శాస్త్రవేత్త లే కాక J.B.S హాల్డేన్, J.D . బెర్నాల్ వంటి విదేశీ శాస్త్రవేత్తల కృషి, నిబద్దత  కూడా కాదనలేనిది.

ఒక ఆధునిక దేశ నిర్మాణం శాస్త్రీయ దృక్పథం, శాస్త్ర సాంకేతిక ఆర్థిక రంగాల్లో ప్రభుత్వ ప్రణాళిక  మిళితం అయితేనే సాధ్యం అనే ఆలోచనతోనే మన దేశ శాస్త్ర ప్రయాణం  ప్రారంభమైంది. సైన్స్ అభివృద్ధికి ప్రణాళికలు ఉండటం ఇప్పుడు చాలా సామాన్యమైన విషయంగా అనిపించవచ్చు గాని రెండో ప్రపంచ యుద్ధానికి ముందు శాస్త్రవేత్తల్లో కూడా అది ఊహించలేని విషయం.

1917 రష్యన్ విప్లవం తర్వాత ఆ దేశంలో ప్రణాళికాబద్ధంగా సైన్సు ,పారిశ్రామిక రంగాల ప్రగతి ద్వారా ఆధునిక దేశ నిర్మాణం జరగడం ఆనాడు రష్యా బయటి శాస్త్రవేత్తలకు మింగుడు పడని విషయంగా ఉండేది. 1931లో లండన్ లో జరిగిన “ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్  హిస్టరీ ఆఫ్ సైన్స్” లో రష్యా నుంచి శాస్త్రవేత్త బుఖారిన్ నేతృత్వంలో వచ్చిన బృందం సామాజిక రంగంలో సైన్సు పాత్ర గురించి ఒక భిన్న దృక్పథాన్ని పరిచయం చేసింది. ఆనాటి యువ బ్రిటిష్ శాస్త్రవేత్తలైన జె.డి. బెర్నాల్, జేబీఎస్ హాల్డేన్, జోసెఫ్ నీథంలు  సోవియట్ బృందం సమర్పించిన పత్రాలు నుండి ఎంతో ఉత్తేజితులయ్యారు. ఇదే తరువాత కాలంలో జేడీ బెర్నాల్ తన ప్రఖ్యాత రచన  ‘సోషల్ ఫంక్షన్ ఆఫ్ సైన్స్‘ (1939) రాయడానికి, అదేవిధంగా సైన్స్ సొసైటీ ఉద్యమాలు నిర్మించడానికి, సైంటిస్టులని, సైన్స్ వర్కర్లని సంఘటితం చేయడానికి పునాది అయ్యింది .

అదే సమయంలో భారతదేశంలో మేఘనాథ్ సహా లాంటి కొందరు యువ శాస్త్రవేత్తలు ప్రణాళిక బద్ధంగా సైన్స్ ని అభివృద్ధి చేయడంలో సోవియట్ యూనియన్ చేస్తున్న ప్రయోగాల్ని అధ్యయనం చేశారు.

సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక మేఘనాథ్ సాహా ఆయన్ని ఒప్పించి ప్రణాళిక కమిటీని ఒక దాన్ని వేయించాడు. దానికి నెహ్రూ అధ్యక్షుడు. ఈ కమిటీ భారత దేశంలో పారిశ్రామికరణకు కొత్తగా ప్రారంభించాల్సిన శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థల గురించిన ఒక ప్రణాళికను రూపొందించింది.  ఈ కమిటీయే స్వాతంత్రానంతరం ప్రణాళికాసంఘంగా మారింది. సి ఎస్ ఐ ఆర్ ఆధ్వర్యంలో పలు పరిశోధనాశాలలు ఏర్పాటు అవ్వడం అణు, రోదసీ రంగాల్లో పరిశోధనా సంస్థలు, ఐఐటీలు నెలకొల్పడం లాంటివి అన్నిటికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వావలంబన సాధించడం ద్వారా ఆధునిక దేశంగా మారడం అనే ఆ  కమిటీ దృక్పథమే కారణం.

భారతదేశం పారిశ్రామికంగా ఎదగాలంటే కేవలం ఆర్థిక వనరులు ఉంటే సరిపోదని, శాస్త్ర విజ్ఞాన పరిశోధనా సంస్థలు కూడా ఉండాలని నెహ్రూకి అవగాహన ఉండేది. ఈ అవగాహనతోనే ఆయన శాస్త్రవేత్త జేడీ బర్నాల్ ను ఎన్నోసార్లు భారతదేశానికి ఆహ్వానించాడు. జన్యు శాస్త్రవేత్త  జి బి ఎస్  హాల్డేన్ నెహ్రూ ఆహ్వానంపై  భారతదేశం వచ్చి ఇక్కడి పౌరసత్వం తీసుకుని మనదేశంలోనే ఉండిపోయాడు.

భారతీయ శాస్త్రవేత్తలైన మేఘనాథ్ సాహా,  హుస్సేన్ జహీర్,  సాహిబ్ సింగ్ సోఖీ అమెరికా మొదలైన దేశాల్లో ఎంతో గౌరవింపబడేవాళ్లు. అక్కడ వాళ్లు “ఫెలో  ట్రావెలర్స్” అనే పేరుతో పాపులర్ కూడా. మేఘనాథ్ సాహా హోమీబాబా తో కలిసి భారతదేశంలో అణు పరిశోధనలకు పునాది వేశాడు. సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ గా హుస్సేన్ జహీర్ ఆ సంస్థను మరింత విస్తరించారు. అలాగే హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్ కి మొదటి భారతీయ డైరెక్టర్ గా 1932లో నియమితుడైన సోఖీ, దానిని ఒక కుటీర పరిశ్రమ స్థాయి నుంచి వాక్సిన్స్ పెద్ద మొత్తంలో తయారు చేయగలిగిన ప్రతిష్టాత్మక సంస్థగా తీర్చిదిద్దాడు. ఆయన బ్రిటిష్ ఆర్మీలో కల్నల్ హోదాలో ఉన్నప్పటికీ 1938లో నెహ్రూ చైర్మన్ గా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్లానింగ్ కమిటీలో హెల్త్ సెక్షన్ కి నాయకత్వం వహించాడు. స్వాతంత్రానంతరం సోఖీ స్థాపించిన ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మసిటికల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్  ఫార్మా రంగంలో భారతదేశం స్వావలంబన సాధించడానికి  వేసిన మొదటి అడుగులు. ఈ శాస్త్రవేత్తల కృషి  కేవలం కొన్ని సైన్సు సంస్థల్ని  స్థాపించి సైన్స్ మౌలికవసతుల్ని అభివృద్ధి చేయడంతోనే ఆగిపోలేదు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశ స్వావలంబన కోసం కూడా వాళ్ల కృషి సాగింది.

ఇక్కడ మనం ఫార్మా పరిశ్రమను చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేసరికి మనదేశంలో ఫార్మా రంగం అంతా వాళ్ళ కంపెనీల చేతుల్లోనే ఉండేది. యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రిడియంట్(API) అంటే మందులు తయారీకి కావలసిన ముడిసరుకు మొత్తం యూకే నుంచే దిగుమతి అయ్యేది. ఇక్కడ కేవలం మాత్రల రూపంలో ప్యాకింగ్ మాత్రమే జరిగేది. కొన్ని చిన్న కంపెనీలు ఉన్నా వాటికి పరిశోధనలు చేసే అంతటి వనరులు, బ్రిటిష్ కాలం నాటి పేటెంట్ చట్టం ఇచ్చిన గుత్తాధిపత్యాన్ని ఎదిరించే శక్తి, ప్రణాళిక లేవు.

ఈ పరిస్థితుల్లో కేవలం ఫార్మ పరిశ్రమలను స్థాపిస్తే మాత్రమే సరిపోదు. మందులు  తయారు చేయగలిగిన సామర్థ్యం కోసం పేటెంట్ చట్టాల్ని భారత ప్రజల  ప్రయోజనాలకు అనుగుణంగా మార్చాలి కూడా.

సాహిబ్ సింగ్ సోకి   డైరెక్టర్ గా  హాఫ్ కిన్స్ ఇన్స్టిట్యూట్ బాధ్యతలు చేపట్టాక దాన్ని వ్యాక్సిన్స్ తయారు చేసే  కుటీర పరిశ్రమ స్థాయి నుంచి ఒక ఆధునిక పరిశ్రమ స్థాయికి తీసుకువెళ్లాడు అని ఇంతకుముందే చెప్పుకున్నాం. హాఫ్ కిన్స్ ఇన్స్టిట్యూట్ ని ఆ స్థాయికి చేర్చిన సోఖీ టీం తర్వాత  డబ్ల్యు హెచ్ ఓ, సోవియట్ యూనియన్ సహకారంతో ఏర్పడిన హిందుస్థాన్ ఆంటీబయాటిక్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మసిటికల్ లిమిటెడ్ లను బలోపేతం చేయడానికి  పనిచేశారు.  

భారతదేశం ఫార్మా రంగంలో తన కాళ్లపై తాను నిలబడాలంటే పేటెంట్ చట్టాన్ని మార్చాలని సోఖీ కి స్పష్టమైన అవగాహన ఉండేది. (ఇది సాకారమై ‘పేటెంట్ చట్టం 1970’ అమల్లోకి రావడానికి రెండు దశాబ్దాలు పట్టింది). సోకి దృష్టిలో భారత ఫార్మా రంగం ముందు మూడు సవాళ్లు ఉన్నాయి.
1.  వాడుకలో ఉన్న,  కొత్తగా వచ్చే మందుల్ని ఎలా తయారు చేయాలి అనే శాస్త్ర పరిజ్ఞానం భారతదేశానికి ఉండాలి .
2.  కేవలం మందుల్ని పరిశోధనశాలల్లో చేయడం తెలిసి ఉండడం మాత్రమే కాక ఆ మందుల్ని పెద్ద ఎత్తున తయారు చేయగలిగిన పరిశ్రమలు కావాలి.
3. ఆ తయారైన మందులు చౌకగా జనానికి అందుబాటులో రావాలి. 

ఈ సమస్యలను అధిగమించి ఫార్మా స్వావలంబన సాధించటానికి జరగాల్సింది పేటెంట్ చట్ట సవరణ ఒకటైతే, ప్రభుత్వ రంగంలో ఫార్మా పరిశ్రమలు పెట్టడం పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేయడం రెండోది. దీనికోసం సీఎస్ఐఆర్ లాబరేటరీలు ఫార్మా రంగానికి కావలసిన సైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమకూర్చాయి.

ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే హుస్సేన్ జహీర్ నేతృత్వంలోని సీఎస్ఐఆర్ దాని అనుబంధ సంస్థలు  నిత్య ఆనంద్ నేతృత్వంలో సిడిఆర్ఐ లక్నో, ఎన్సీఎల్ పూణే లు అభివృద్ధి చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లనే దేశీయ ఫార్మా రంగం మల్టీనేషన్ కంపెనీల ఆధిపత్యానికి గండి కొట్టగలిగింది. 

ప్రజలకు అందుబాటు ధరల్లో మందులు అందివ్వాలి అనే ఈ లక్ష్యంతో కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా దేశంలో ఏర్పాటు అయ్యాయి. మహాత్మా గాంధీ అనుచరుడైన అబ్దుల్ హమీద్ ప్రారంభించిన సిప్లా అలాంటి సంస్థల్లో ఒకటి. సోకీ తో పాటు హమీద్ కూడా సిఎస్ఐఆర్ విస్తరణ కమిటీలు సభ్యుడు. తర్వాత కాలంలో ఆయన కొడుకు యూసఫ్ హమీద్ కూడా తక్కువ ధరల్లో మందులు అందించాలనే తండ్రి ఆలోచననే అనుసరించాడు. రాబిన్ హుడ్ ఆఫ్ డ్రగ్స్ అని అనిపించుకుంటూ సిప్లా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎయిడ్స్ మందును అందుబాటు ధరకు సరఫరా చేసింది.

సైన్సు ఉద్యమాల్లో పని చేస్తున్న వాళ్లకి  నిత్యానంద్, యూసఫ్ హమీద్, రాన్బాక్సీ వ్యవస్థాపకుడు భాయ్ మోహన్ సింగ్ వంటి రెండవ తరం శాస్త్రవేత్తల గురించి తెలుసు కానీ వీళ్ళకు ప్రేరణనిచ్చిన అభ్యుదయ,  సామ్రాజ్యవాద వ్యతిరేక, స్వాతంత్ర సమరయోధులైన మొదటి తరం శాస్త్రవేత్తల గురించి తెలియదు.

ఇక పేటెంట్ చట్టాల విషయానికి వస్తే స్వాతంత్రం వచ్చిన వెంటనే లాహోర్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ బక్షి టేక్ చంద్ అధ్యక్షతన పేటెంట్ చట్టాల్లో జరగాల్సిన మార్పులను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ బ్రిటిష్ కాలం నాటి చట్టం మందులు ధరలు పెరగడానికి ఎలా దోహదం చేసింది అనేంతవరకు చెప్పింది కానీ ప్రత్యామ్నాయాన్ని సూచించలేదు.

1957లో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ రాజగోపాల్ అయ్యంగార్ అధ్యక్షతన పేటెంట్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో సూచించడానికి ఇంకొక కమిటీ ఏర్పాటు అయింది.  ఆయన తన రిపోర్టులో  పేటెంట్ చట్టాల వల్ల ఫార్మా రంగానికి వచ్చిన చిక్కులను అర్థం చేసుకోవడానికి  సోకి ముఖ్య అనుచరుడు గణపతి సహాయం తీసుకున్నట్టు చెప్పాడు. అయితే ఆయన సోకి కోరుకున్నట్టు అసలు పేటెంట్లు లేకుండా చేయాలని మాత్రం రిపోర్టులో చెప్పలేదు . కానీ,  మందులు, ఆహారం, రసాయనాల తయారీలో ప్రోడక్ట్ పేటెంట్లు ఉండకూడదని తయారీ ప్రాసెస్ కి మాత్రమే పేటెంట్ ఉండాలని  అది కూడా కొద్ది కాలానికే పరిమితం చేయాలని సూచించాడు. ఈ రిపోర్టు ఆధారంగా 1965లో పార్లమెంటులో పేటెంట్ చట్ట బిల్లు ప్రవేశపెట్టబడింది.  అది 1970లో చట్టంగా ఆమోదించబడింది. నిజానికి 1911లో వచ్చిన బ్రిటిష్ ఇండియా పేటెంట్ యాక్ట్ స్వాతంత్రం వచ్చిన వెంటనే మార్చాల్సింది. కానీ భారతీయులకు మందులు అందుబాటులో ఉంచేందుకు అవసరమైన మార్పులు చట్టంగా ఆమోదించబడడానికి రెండు దశాబ్దాలు పట్టింది. ఇది బహుళ జాతి కంపెనీల, వలసవాద మద్దతుదారుల బలాన్ని సూచిస్తోంది.  

  1970 పేటెంట్ చట్టం వల్ల బహుళ జాతి కంపెనీల వాటా  85% నుంచి 1999 కల్లా 40% నికి పడిపోయింది.  భారతదేశం కేవలం ప్రాణవసర మందుల్నే కాకుండా  మందులు తయారీకి కావలసిన ఏపీఐలను కూడా తయారు చేయడం ప్రారంభించింది.  భారతదేశ ఫార్మా రంగంలో  సాధించిన ఈ విజయం  శాస్త్ర విజ్ఞానం, పారిశ్రామిక అనుభవం, సీఎస్ఐఆర్ లేబరేటరీలు అభివృద్ధి చేసిన ప్రత్యామ్నాయ తయారీ పద్ధతుల ఉమ్మడి విజయం. ఈరోజు మనం చూస్తున్న భారతీయ మందుల పరిశ్రమ విజయాలలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఐడిపిఎల్,  హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ పాత్ర విస్మరించలేనిది.  ఈ రెండు పరిశ్రమలు  హఫ్కిన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎలాగైతే వ్యాక్సిన్లు, సీరమ్, మందులు తయారు చేయడం నేర్చుకున్నాయో, వీటి నుండి దేశీయ ప్రైవేట్ కంపెనీలు మందులు వ్యాక్సిన్లు తయారు చేయడం నేర్చుకున్నాయి. ప్రభుత్వ ఫార్మారంగం ఈరోజు ఖాయిలా పడి ఉండొచ్చు కానీ  దేశీయ ఫార్మా రంగం అభివృద్ధిలో వాటి పాత్ర మరువలేనిది.

దీనికి కొనసాగింపుగా  పీఎం భార్గవ, అతని ఆధ్వర్యంలో సిసిఎంబి  బయోలాజికల్ మందుల విప్లవానికి బాటలు వేశారు.

స్వాతంత్ర ఉద్యమ కాలం నాటి శాస్త్రవేత్తలు దార్శనికుల కృషి నిబద్ధతల వలనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రత్యేకించి ఫార్మా రంగంలో భారతదేశం ఈ స్థాయిలో ఉంది. జనం కొనుగోలు శక్తి మీద కాక వారి అవసరానికి అనుగుణంగా మందులు అందుబాటులో ఉండాలనే వారి ఆశయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే    సైన్స్ ఉద్యమకారులుగా మనం  వారికిచ్చే నివాళి.

4 thoughts on “స్వతంత్ర భారతపు  తొలి వేకువలో..

  1. పేటెంట్ గురించిన సమాచారం బాగుంది

  2. Very detailed information on patents and the thinking, planning and development of pharmaceuticals in India. As the artical has focused more on patient and phara I fell the subject should be renamed accordingly.

  3. పేటెంట్ చట్టాల పై బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యం అప్పుడు ఇప్పుడు ఏ మాత్రం తగ్గలేదు. పెరుగుతునే ఉన్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *