నమ్మకం-నిజం
బల్లి పురాణం!
– యుగంధర్ బాబు
బల్లిని చూడగానే చాలామంది కెవ్వుమంటారు. ఎక్కడ మీద పడిపోతుందోనని కంగారు పడతారు, హడలిపోతారు. చాలామందికయితే బల్లి అంటే ఎక్కడాలేని అసహ్యం. దాన్ని బయటకు తరిమేంతవరకు ఆ గదిలో అడుగు కూడా పెట్టరు. ఇక దీని చుట్టూ అల్లుకున్న నమ్మకాలు, అపోహలు రాస్తే ఒక పురాణమే అవుతుంది.
ఇంట్లో బల్లిని తాకితే అపచారమనీ, అసహ్యమనీ ఈసడించుకొనే వారే కంచిపెళ్లి బంగారు బల్లిని తాకడం కోసం నానా తండాలు పడతారు. బంగారం బల్లిని కూడా పవిత్రం చేసేస్తుందన్నమాట! బల్లి పురుషుల మీద పడితే ఒక నష్టమట. అదే ఆడవాళ్ళ పైన పడితే ఇంకో నష్టమట. అవయవాల్ని బట్టి, వాటి కుడి ఎడమల్ని బట్టి, రాత్రింబవళ్ళను బట్టి ఇలా బల్లి తెచ్చే కష్టాలు బహుముఖాలట!
మనషులు చాలా విచిత్రమైన వారు. వాళ్ల విశ్వాసాలు, చేష్టలూ చిత్రచిత్రంగా వుంటాయి. ఏదో తాము నమ్మింది తమతో సరిపెట్టుకోరు. చుట్టూ వున్న వాళ్లందరూ నమ్మాలంటారు. అలా నమ్మించడానికి – అంటే లొంగదీసుకోడానికి శాస్త్రప్రమాణం అంటూ బెత్తం పట్టుకొంటారు. ఇలా వచ్చిందే బల్లిశాస్త్రం! మా చిన్నతనంలో ‘పెద్ద బాలశిక్ష’ అనేదొకటుండేది. అది కంఠతా వచ్చిన వాళ్ళే టాపర్లు! అందులో వుండేది ఈ మహాబల్లి శాస్త్రం! పురుషాంగం మీద బల్లి పడితే పరలోకం తథ్యమని అందులో వుండేది. మాలో కొందరు ‘పురుషపుంగవుల’ నిక్కర్లంతా తడిసిపోయేవనుకోండి!
శాస్త్రాలు, నమ్మకాలు సరే అసలు నిజం ఏమిటి? బల్లి తల పైన పడితే మరణం అని అంటే ఒక పెద్దాయన అన్నాడట ‘అవును నిజమే ఆ బల్లికి మరణమే’ అని. అంటే మన తల పైన పడితే, కంగారుగా చేత్తో విదిలించి కొడితే ఆ దెబ్బకు బల్లి కాస్తా కింద పడి ఠకీమని చచ్చిపోతుంది కదా! ఇంట్లో గోడలు పైనా, పాపం ఏ మూల మూలల్లోనో నక్కినక్కి వుండే వేలెడంత బల్లంటే చెట్టంత మనుషికి అంత భయం దేనికి? గగుర్పాటు కల్గించే దాని ఆకారం కారణమా? పాఠం చెప్పినట్టు బెదరగొట్టే బల్లి శాస్త్రం కారణమా?
నిజానికి చిన్న పురుగుల్ని తిని బతికే బల్లులకు పాపం మనలాంటి మనుషుల ప్రాణాల మీదికి తెచ్చే శక్తి ఏమాత్రం లేదు. అదంత క్రూరమైనది కూడా కాదు. దానికా స్థాయి లేనే లేదు. బల్లి అనేది మన ఇంట్లో వుండే చాలా చిన్న ప్రాణి. మనకు ఇష్టం వున్నా ఇష్టం లేకున్నా దానితో మనం, మనతో అది కలిసి జీవించక తప్పదు. మనం ఎంత ఏవగించుకున్నా బల్లులు లేని ఇల్లు లేదు ! ఇంట్లోని చిన్న చిన్న పురుగుల్ని -మరీ ముఖ్యంగా సాలె పురుగుల్ని ఆహారంగా తీసుకొని నిజానికి బల్లి మన ఇంటిని శుభ్రం చేస్తుంది. బల్లులే లేకపోతే ఈ సాలె పురుగులూ గట్రా సంతతి సరిపోయి జీవవైవిధ్యం లోపిస్తుంది. బల్లితో వచ్చే కష్టమేదీ మనకు లేదు. పిల్లి, కుక్క, దోమ, బొద్దింక, ఎలుక ఎలాగూ మనతో పాటు కలిసే ఉంటాయి. బల్లీ అంతే! అన్నీ మనపై ఆధారపడ్డ ప్రాణులే. అదే జీవవైవిధ్య రహస్యం! దోమ, ఈగ, ఎలుక బొద్దింక లాంటి వాటి వల్ల మనకు కొంత హానీ, నష్టం జరగొచ్చు. కానీ మిగతా వాటివల్ల మనకు ఇలాంటి నష్టం కూడా లేదు.
బల్లి మన ఆహార పదార్థాల్లో పడితే వాటిని విషపూరితం చేసేస్తుందనేదీ నిజం గాదు. కాకపోతే అలాగే వదిలేస్తే కుళ్ళిపోయి హాని చేస్తుంది. ఆ విషయానికొస్తే ఏ చిన్న ప్రాణి అయినా ఆహారంలో పడితే ఇలాగే జరుగుతుంది. బల్లి మన శరీరంపై ఏ భాగం పైన పడినా, అది ఆడవాళ్ళపై పడినా, మగవాళ్ళపై పడినా ఎలాంటి నష్టం జరగదు. పాపం మనలా దానికే లింగవివక్షా లేదు. అట్లని బల్లి వల్ల ఎలాంటి శుభమూ ప్రత్యేకంగా జరగదు. మనం ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు అవి ఇచ్చే కిచ్ కిచ్ అని శబ్దం చేస్తే “అదే జరుగుతుంది” అనుకోవటం లాంటివి కూడా అపోహలు మాత్రమే.
ఆధునిక యుగంలో అనేకాంశాలపై మన దృక్పథంలో తీవ్రమైన మార్పులు రావాలన్న చర్చ జరుగుతోంది. చరిత్రలో జంతువుల స్థానం ఏమిటి? మానవుడికీ జంతువులకూ మధ్య ఏకాలంలో ఏ సంబంధాలుండేవి? వాటిని బట్టి చరిత్రలో కొత్త కోణాలు ఏమైనా దొరుకుతాయా? అనేవి కూడా వీటిలో కొన్ని.
ఇలా చూచినపుడు ఏదైనా ఒక మంచి “బల్లి ఆత్మకథ” వెలువడితే తెలుగు సాహిత్యం ఎంత సుసంపన్నమవుతుందో గదా అని నాకన్పిస్తోంది! నేనే పూనుకొని ఓ”ఆధునిక శాస్త్రీయ బల్లిపురాణం” రాసి పడేసి మా వంటింటి బల్లికి అంకితమిస్తే (మనుషులెవరు అంకితం తీసుకొంటారు గన్క?) పోలేదా అని కూడా అన్పిస్తోంది!! కాకుంటే “పురాణంలో ఆధునికత ఏమిటి? శాస్త్రీయత ఏమిటి” అని మీరంతా విరుచుకపడతారని జడిసి ‘గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో’ అన్న ఆప్తకవి వాక్యం తలచుకొంటూ ఆవేశం అణుచుకుంటున్నాను!!!
బల్లి శాస్త్రీయ దృక్పథం వివరణ బాగుంది
బాగా వ్రాసారు!
బల్లి గురించి చాలా చక్కగా చెప్పారు