ఉద్దాలక అరుణి ఉవాచ!
– విటపు బాల సుబ్రహ్మణ్యం
“పుత్రా! శ్వేతకేతూ! వచ్చావా నాయనా? పన్నెండేళ్ళ గురుకుల వాసంలో ఎంత పెద్దవాడివైపోయావురా? విద్యాభ్యాసం సంతృప్తిగా పూర్తి చేసావా? ఇరవై నాలుగేళ్లు వచ్చాయి కదా! గురువులు గృహస్థాశ్రమానికి అనుమతించారా?”

“తండ్రీ! నాలుగు వేదాలు ఆపోశనం పట్టాను. షడ్దర్శనాలు నా నాలుక మీదే వున్నాయి. ‘ఉద్దాలకపుత్రుడు శ్వేతకేతువిప్పుడు సకల శాస్త్ర పారంగతుడు! తండ్రిని మించిన కొడుకు! గురువును మించిన శిష్యుడు!’ అని మా గురువులే మెచ్చుకున్నారు!”
“కుమారా! స్వాతిశయం పనికి రాదు. ‘విద్యా వినయేన శోభతే’ అన్నారు. ‘శిష్యాదిచ్ఛేత్ పరాజయం’ అనేది గొప్ప గురువుల లక్షణం. అది వాళ్ళ ఔన్నత్యం!”
“అంటే నా పాండిత్యాన్ని మీరే శంకిస్తారా తండ్రీ!”
“లేదు నాయనా! వల్లెవేత చదువులే చదువులు కాదు. జిహ్వాగ్ర పాండిత్యమే సర్వస్వమూ కాదు. చదువుల్లోని సారమెల్ల చదివిన వాడే నిజమైన చదువరి! దేనిని తెలుసుకుంటే సకల అజ్ఞాత విషయాలు తెలుస్తాయో అదే విద్యలోని మర్మం”
“మీరు చెప్పే ఆ మర్మం ఏమిటి తండ్రీ! దాన్ని నేను విననే లేదు. మా గురువులకు సైతం అది తెలిసినట్టు లేదే!
“తప్పు నాయనా! అలా అనకూడదు”
“అలాంటిది ఏమిటో నాకు త్వరగా చెప్పండి. నాకు భరించరానంత ఆత్రుతగా ఉంది.”
“మంచిది నాయనా కావలసింది ఈ జిజ్ఞాస. ‘అథాతో బ్రహ్మ జిజ్ఞాసా’ అన్న బ్రహ్మసూత్ర ప్రారంభ వాక్యం నీకు తెలియని కాదుగా! ఓ మర్రి పండు తీసుకొని రా!
“తెచ్చాను తండ్రీ!”
“దాన్ని చీల్చి, లోపల ఏముందో చూడు”
“చిన్న చిన్న గింజలున్నాయి తండ్రీ!”
“ఆ గింజలు మళ్ళీ చీల్చు. అందులో ఏముంది”
“ఏమీ కనిపించలేదు తండ్రీ ! అణువంత పదార్థం. దృగ్గోచరం కావడం లేదు.”
“నీకు అగోచరమైన ఆ విత్తులోని అణువంత పదార్ధం నుంచే మహా వటవృక్షం పుట్టి పెరుగుతుంది. అంటే ‘సత్తు’ నుండి ప్రపంచం వెలువడుతుంది, శూన్యం నుంచి ఏదీ పుట్టదు”
“ఆ సత్తు ఎక్కడ వుంటుంది తండ్రీ ?”
“నాయనా ఒక ఉప్పు కల్లు తీసుకొని, దాన్ని రాత్రంతా నీళ్లలో ఉంచి రేపు పట్టుకొని రా!”
“తెచ్చాను తండ్రీ !”
“ఉప్పు ఎక్కడుంది?”
“కనిపించడం లేదు తండ్రీ”
“పై నీటిని తాగు, ఎలా వుంది?”
“ఉప్పగా వుంది ?”
“మధ్య నీటిని తాగు! ఎలా వుంది ?”
“ఉప్పగా వుంది”
“కింది నీటిని తాగు. ఎలా ఉంది?”
“ఉప్పగా ఉంది?”
“సత్తు నీటిలోని ఉప్పు లాగే సర్వాంతర్యామి నాయనా! ప్రకృతి అంతా సత్తు మయమే. దాన్ని చూడలేము గాని అదే జగత్తుకు మూలం. అది బుద్ధిమంతులకే అవగతం అవుతుంది”
“ఆ బుద్ధికి ఆధారం ఏది తండ్రీ?”
“నాయనా! రేపటి నుంచి ఉపవాసం చెయ్యి. మంచినీళ్లు మాత్రం తప్పకుండా తాగుతుండు. పదహైదవ రోజు మళ్ళీ పాఠం ప్రారంభిద్దాం”
“ఉపవాసం మొదలెట్టి ఇది పదహైదవ రోజు తండ్రీ !”
“నాయనా శ్వేతకేతూ ఋగ్వేదంలో ఒక ఋక్కు పఠించు”
“నాకేమీ గుర్తుకు రావడం లేదు తండ్రీ!”
“పోనీ సామవేదంలో ఒక పనస ఆలపించు”
“గొంతు పెగలడం లేదు తండ్రీ!”
“ఈరోజు పాఠం వద్దు గానీ భోజనం చేసి రా.. రేపు ప్రారంభిద్దాం,”
“తండ్రీ! అపరాధాన్ని మన్నించండి. తత్వసారం ఇదన్న మాట. బుద్ధికి అన్నం ఆధారమన్న మాట! సత్తు బుద్ధికే అవగతం అన్నమాట! ఆ సత్తు (పదార్థం) నుంచే సర్వం పుడుతుందన్న మాట. శూన్యం నుంచి ఏమీ పుట్టదన్నమాట!”
“శుభం భూయాత్ శ్వేతకేతూ! శుభం భూయాత్!!”
(ఉద్దాలక అరుణిని ప్రపంచంలోనే మొదటి ప్రకృతి శాస్త్రవేత్తగా నేడు భావిస్తున్నారు కారణం ప్రకృతిని గురించి వస్తుగత దృష్టితో క్రీ.పూ 10-7 శతాబ్దాల కాలంలోనే ఆయన సూత్రీకరణలు చెయ్యడం. గ్రీకు సప్తరుషుల్లో ఒకడుగా ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త “థేల్స్” కంటే (క్రీ.పూ 6.శ ) ఆయన ముందటివాడు కావడం.
ఉద్దాలకుడు విశ్వాన్ని, ప్రకృతిని, మానవుడిని వస్తుగతంగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే పద్ధతిని రూపొందించాడు. సూత్రీకరణలతో సరిపెట్టక ప్రయోగాత్మకంగా వివరించడం, నిర్ధారించడం ఆయన ప్రత్యేకత. కంటికి కనిపించే వాటిని వున్నవి వున్నట్లు చూడాలని, కట్టుకథల్ని తిరస్కరిస్తేనే జ్ఞానాన్ని పొందగలమంటూ, “ఈ ప్రపంచం మొట్టమొదటి నుంచి వుంది. ఇంకొక ప్రపంచం అంటూ ఏదీ లేదు. ఈ ప్రపంచమే సత్తు. కొందరు మొదట శూన్యం (అసత్తు) ఉండేదనీ, దాన్నుంచి సత్తు (పదార్థం) వచ్చిందనీ అంటారు. ఉనికిలో లేని దాన్నుంచి ఉనికిలో వున్నదెలా వస్తుంది? శూన్యం నుంచి శూన్యమే తప్ప మరేది పుట్టే అవకాశంలేదని” సుమారు ముప్పై శతాబ్దాల ముందే కుండ పగలగొట్టినట్టు చెప్పటం ఉద్దాలకుడి ప్రత్యేకత.
అయితే కాలక్రమంలో ఇతని సూత్రీకరణలు కలగాపులగం అయిపోయాయి. వాటి అసలు రూపం మసకబారిపోయింది. మన మాయా ప్రపంచవాదులు ఉద్దాలకుణ్ణి సైతం తమలో కలిపేసుకొని భారతీయ భౌతికవాద దృక్పథానికి తీవ్రనష్టం తెచ్చారు. ఆయన నిజమైన వారసత్వానికి కొనసాగింపు కరువైంది. ఉద్దాలకుడి గాధ మనకు మొదట శతపథ బ్రాహ్మణంలో కన్పిస్తుంది.
(ఆధారం: ఛాందోగ్యోపనిషత్తు. ప్రేరణ : ‘ఏకలవ్య’ వారి “స్రోత్”)
పదార్థం ఆధారమని చాలా బాగా వివరించారు