డా. నాగసూరి వేణుగోపాల్

వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 18

అది 1912 జనవరి. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలోని రసాయనశాస్త్ర శాఖాధ్యక్షులు ప్రపుల్ల చంద్ర రే చాలా రకాల నైట్రైట్లు తయారు చేశారు; లండన్ వెళ్ళి ఈ నైట్రైట్ల ధర్మాలు కనుక్కోవాలని తలంచారు. అయితే ఆ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం.ఎస్సీ. విద్యార్థులలో ఒక చాకులాంటి కుర్రాడు మీరు లండన్ వెళ్ళక్కరలేదనీ, తమ ప్రెసిడెన్సీ కళాశాలలోనే వాటి భౌతిక ధర్మాలు నిర్ణయిస్తానని గురువుకు చెప్పారు. దాంతో గురువు లండన్ ప్రయాణం ఆగింది, శిష్యుడి శోధన సాగింది. అలా లెక్కించిన ఫలితాలను కూడా జోడించిన పి.సి.రే గా ప్రఖ్యాతులైన ప్రఫుల్ల చంద్ర రే తన శిష్యుడి ప్రతిభకు ఎంత పొంగిపోయి ఉంటారో ఊహించగలరా? 

నీల్ రతన్ ధర్ ఆధునిక భారతీయ భౌతిక రసాయన శాస్త్రానికి మూలపురుషుని వంటి వాడని 1938 సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ రజతోత్సవాలలో శాంతి స్వరూప్ భట్నాగర్ శ్లాఘించారు. ప్రపుల్ల చంద్ర రే 1925లో వెలువరించిన తన ఆత్మకథలో కూడా నీల్ రతన్ ధర్ ను భౌతిక రసాయన శాస్త్రానికీ, భౌతిక రసాయన పరిశోధనలకు మనదేశానికి సంబంధించి ఆద్యుడిగా పరిగణిస్తూ శిష్యుడిని అభినందించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆయా దేశాలలో పరిశోధనలకై వెళ్ళి మహాశాస్త్రవేత్తల వద్ద గొప్ప ఫలితాలు సాధించిన మహానుభావుడు కూడా నీల్ రతన్ ధర్ గారే!

మనదేశంలో కెమికల్ కైనెమెటిక్స్, ఫోటోకెమిస్ట్రీ, కొల్లాయిడ్ కెమిస్ట్రీ మొదలైన విభాగాలను అభివృద్ధి చేసిన నీల్ రతన్ ధర్ 1892 జనవరి 2న ( ఇప్పటి బంగ్లాదేశ్ లోని) జెస్సోర్ (Jessore)లో జన్మించారు. సంపన్నులైన నిరోధ్ మోహిని, ప్రసన్న కుమార్ ధర్ దంపతుల తొమ్మిదిమంది సంతానంలో నీల్ రతన్ ధర్ ఒకరు. ఇతని రెండవ అన్న కెప్టెన్ జీబన్ రతన్ ధర్ డా. బి.సి. రాయ్ మంత్రివర్గంలో సభ్యులుగా పనిచేశారు. తన ఇంటికి ఒక మైలు దూరంలో ఉండే పాఠశాలలో 1897లో నీల్ రతన్ చేరారు. 1907లో కలకత్తా విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలో నెగ్గి నెలకు 15 రూపాయల ఉపకార వేతనాన్ని రెండు సం.ల పాటు పొందిన ప్రతిభ బాలుడిగా ఆయన సొంతం. అప్పట్లో సైన్స్ బోధన ఉండేది కాదు. ఇంగ్లీషు, సంస్కృతం, కొంచెం బెంగాలి, గణితం, చరిత్ర, భూగోళశాస్త్రం అధ్యయనాంశాలుగా ఉండేవి. ఇంగ్లీషు, చరిత్ర, భూగోళం ఆసక్తి కల్గించాయి. సంస్కృతంలో చిన్న రచనలు కూడా చేస్తుండేవారు.

సురేంద్రనాథ్ బెనర్జి స్థాపించిన రిప్పన్ కళాశాలలో 1907లో కొత్తగా ప్రారంభించిన ఐ.ఎస్సి. కోర్సులో నీల్ రతన్ ధర్ భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, గణితం, ఆంగ్లం చదువుకున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాలపట్ల అమితమైన ఆసక్తి కలిగి, ఏడు మంది ఉన్న తన తరగతికి నాయకత్వం వహిస్తూ చిన్న ప్రయోగశాలను సైతం రూపొందించుకున్నారు. చాలా మంచి ఉపాధ్యాయులుండేవారు. సర్ సురేంద్రనాథ్ బెసర్జి ఇంగ్లీషు బోధించేవారు. అదే సమయంలో మహేంద్ర లాల్ సర్కార్ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ సంస్థలో జరిగే ప్రసిద్ధుల భౌతిక, రసాయనశాస్త్రాల ప్రసంగాలు శ్రద్ధగా వినేవారు.

1909లో నెలకు 20 రూపాయల ఉపకారవేతనంతో కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితాలతో రసాయన శాస్త్రం ఆనర్స్ కోర్సు చేశారు. ఆ సమయంలో హిందూ హాస్టల్లో 4వ నెంబరు రూములో ఉండేవారు. ఆ గదిలోనే దానికి ఎనిమిదేళ్ళ క్రితం డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఉండేవారు. అప్పట్లో ఆ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం జగదీశ్చంద్ర బోస్, రసాయనశాస్త్ర విభాగం ప్రపుల్ల చంద్ర రే అధ్యక్షతన సాగి గొప్ప పేరుగాంచాయి. వీరిద్దరి ఉపన్యాసాలు, వ్యక్తిత్వ సౌశీల్యాలు నీల్ రతన్ ధర్ ను

బాగా ఆకట్టుకున్నాయి. 1911లో అదే కళాశాలలో ఎం.ఎస్సి. కెమిస్ట్రీ కోర్సులలో చేరిన మేఘనాథ సాహా, జె.సి. ఘోష్ వంటివారు నీల్ రతన్ ధర్ కు రెండేళ్ళు జూనియర్లు,‌ 

ఈ వ్యాసం ప్రారంభంలో పేర్కొన్న దృష్టాంతం ఈ సమయంలోనే జరిగింది. సోడియం, పొటాషియం, కాల్షియం బేరియం నైట్రైట్ల ద్రావణీయత, విద్యుద్వాహకధర్మం, అయనీకరణ స్థాయితోపాటు, అస్థిరమైన అమ్మోనియం నైట్రైట్ ఆవిరి సాంద్రతను లెక్కగట్టి రచించిన పరిశోధనాపత్రం ‘జర్నల్ ఆఫ్ ది కెమికల్ సొసైటీ, లండన్’ లో 1913లో ప్రచురణైంది. అలాగే వాటి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కూడా కనుగొన్నారు. ఎం.ఎస్సి. పరీక్షకు వివిధ రకాల సంక్లిష్టమైన డబుల్ సాల్ట్స్ గురించి సిద్ధాంత వ్యాసం సమర్పించారు. ఎం.ఎస్సి.లో సర్వప్రథముడిగా నిలిచి సుమారు 20 బంగారు పతకాలు. లెక్కలేనన్ని బహుమతులూ పొందడమే కాదు; పరిశోధన కొనసాగించడానికి నెలకు 100 రూపాయల ఉపకార వేతనం కూడా లభించింది. 1913 జూలై తర్వాత తనకు ఒక సంవత్సరం జూనియరైన సహవిద్యార్ధి ఎస్. భట్టాచార్య, నీల్ రతన్ ధర్ తోడ్పాటుతో శూన్య ఉష్ణోగ్రత వద్ద అయాన్ల కదలికను లెక్కగట్టారు. అంతే కాదు వీరిద్దరు సిల్వర్ నైట్రైట్ విద్యుద్విశ్లేషణ చేసి నైట్రైట్ అయాన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ను కూడా గణించారు.

భట్టాచార్యతో కలసి చేసిన పరిశోధన జర్మని రీసర్చి జర్నల్లో ప్రచురించబడగా, మరో సహ విద్యార్థి ఎ.కె. దత్తతో చేసిన ద్వి క్షారామ్లాల పరిశోధన లండన్ జర్నల్లో వెలుగు చూసింది. ఇదంతా 21 సంవత్సరాలు నీల్ రతన్ ధర్ కృషి, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఎంతమంది వారించినా, వెరవకుండా 1915లో పరిశోధన కోసం కలకత్తా నుంచి లండన్ వెళ్ళారు. లండన్ లో ఇంపీరియల్ కళాశాలలో జె.సి. ఫిలిప్ వద్ద పరిశోధనలో చేరి, తన పూర్తి దృష్టి అటు వైపే నిలిపి కృషి చేశారు. ఇక్కడ నీల్ రతన్ ధర్ వెలికి తీసిన అంశమేమంటే ఫార్మిక్ ఆసిడ్ అంతవరకు భావించినట్టు మధ్యస్థ ఉత్పత్తి కాదనీ; ఆక్సాలిక్ ఆసిడ్, పొటాసియం పర్మాంగనేట్ మధ్య జరిగిన చర్య ఫలితమని వెల్లడి చేయడం. ఈ స్థాయిలో పరిశోధన చేసి వెలువరించిన సిద్ధాంత గ్రంథం చూసి అధికారులు మెచ్చుకోలుగా వైవా (మౌఖిక పరీక్ష) రద్దుచేసి, డి. ఎస్సి. డిగ్రికి సిఫారసు చేశారు. అక్కడ లండన్ కెమికల్ సొసైటీలో నీల్ రతన్ ధర్ చేసిన ప్రసంగం పెద్ద శాస్త్రవేత్తల అభిమానాన్ని కూడా పొందింది. అదే సమయంలో జె.జె. థామ్సన్, రూథర్ ఫర్డ్ మొదలైన ఎంతో మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తల ప్రసంగాలు వినే అవకాశం కల్గింది.

లండన్ లో డి.ఎస్సి. పొందిన తర్వాత స్టాక్ హోమ్ లోని ఆర్హీనియస్ శాస్త్రవేత్తకు ఉత్తరం రాసి పరిశోధనకు వస్తానని ఉత్సాహం చూపారు. అయితే లండన్ నుంచి స్టాక్ హోం వెళ్ళడం ప్రాణాంతకంగా ఉండేది. జర్మనీ సబ్మెరిన్లు అన్ని స్టీమర్లను ముంచేసేవారు. దాంతో లండన్ నుంచి 1917 అక్టోబరులో ఫ్రాన్స్ వెళ్ళి అక్కడ ఖనిజ రసాయన శాస్త్రం ప్రొఫెసర్ జి. అర్బైన్ వద్ద కోబాల్ట్ ఆమైన్స్ ఇంకా ఇతర సంక్లిష్ట సమ్మేళనాల గురించి పరిశోధన కొనసాగించారు. ఈ పరిశోధనల ద్వారానే చర్యల ఉష్ణోగ్రతా గుణాంకం దేని మీద ఆధారపడుతుందో నీల్ రతన్ ధర్ వివరించారు. దీనినే ‘ధర్ నియమం’గా పేర్కొంటారు, పారిస్ పరిశోధనలలో ఉన్నతమైన పట్టాపొందారు. 1917లో మేడమ్ క్యూరి డైరెక్టర్ గా ఉన్న రేడియమ్ ఇన్స్టిట్యూట్లో అవిడ ప్రసంగాలు ఎన్నో విన్నారు. 1919 జనవరిలో లండన్ తిరిగి వచ్చి ఇంపీరియల్ కాలేజి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజిలో చేరారు. 

ప్రపుల్ల చంద్ర రే తో నీల్ రతన్ ధర్

మరోవైపు గురువు పి.సి. రే వంటి పెద్దలు భారతదేశం తిరిగి వచ్చేయమని కోరారు. ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కు లండన్ లో నమోదు చేసుకున్నారు. వీరి స్థాయి గమనించి అలహాబాదు, మద్రాసు, అమృత్సర్, రంగూన్, కలకత్తా, లాహెర్ కళాశాలల్లో దేనిలో నైనా చేరమని ఆహ్వానించారు. నీల్ రతన్ ధర్ అలహాబాదులో చేరడానికి సుముఖత చూపారు. 1919 జూన్ 27న లండన్ నుంచి బయలుదేరారు. ఆయనతో పాటు మరో గొప్ప శాస్త్రవేత్త బీర్బల్ సాహ్ని మహాశయుడు బెనారస్ హిందూ యూనివర్సిటీలో వృక్షశాస్త్ర ఆచార్యులుగా చేరడానికి బయలుదేరారు. అలహాబాదు విశ్వవిద్యాలయం, అలాగే మూయర్ సెంట్రల్ కాలేజీకి సంబంధించి రసాయన శాస్త్ర శాఖాధిపతిగా ఆయన కేరళ నుంచి కాశ్మీరు దాకా చురుకయిన విద్యార్థులను ఎం.ఎస్సికి ఎంపిక చేసుకునేవారు. ధర్ కన్నా రెండేళ్ళు పెద్ద అయిన కె.పి. ఛటర్జీగారు పరిశోధక విద్యార్ధిగా కొన్ని అగ్జలేట్స్, టార్గెట్స్, సిట్రేట్స్, ఫ్లోరైడ్స్ గురించి కొనసాగించిన పరిశోధన పి.సి. రే స్థాయి శాస్త్రవేత్తల మన్నన పొందింది. తర్వాత ఎంతోమంది ధర్ వద్ద పరిశోధనలు చేశారు. వారిలో ఆత్మారామ్, డి.ఎస్. కొథారి కూడా ఉన్నారు.

అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ధర్ కాలినడకనే ఇంటినుంచి వచ్చేవారు. ఏడేళ్ళు బోధనా, పరిశోధన చేసిన తర్వాత ఆరునెలలు అధ్యయన సెలవు మీద 1926లో జర్మనీ వెళ్ళారు. 1935, 1937 ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సమావేశాల్లో నీల్ రతన్ ధర్ ప్రసంగాలు చేస్తూ తన ఫోటో కెమికల్ నత్రజని స్థిరీకరణ ఆవిష్కరణ గురించి వివరించారు. ఆవు పేడ ఇంకా ఇతరాలు ఎంతో కాలంగా భూమిని సారవంతం చేయడానికి వినియోగిస్తున్నాం. అయితే ఈ విషయాన్ని సంపూర్ణంగా సవ్యంగా అర్ధం చేసుకున్న ధర్ భూమిలోని సేంద్రియ పదార్థాల ఆధారంగానే వాతావరణంలోని నత్రజని స్థిరీకరించబడుతుందని వివరించారు. దీన్ని తన రసాయన సూత్రం ద్వారా విశదపరిచారు కూడా. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనం ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాం. అంతే కాదు అదే క్రియ పంటల రాబడికి దారి తీసే నేల సారాన్ని కూడా నిర్ణయిస్తుందని కూడా ధర్ వివరించారు నీల్ రతన్ ధర్ ఎంతో లోతుగా అధ్యయనం చేశారు కనుకనే మరెన్నో విషయాలు చెప్పగలిగి ‘సాయిల్ సైన్స్’ ను మరింత సంపద్వంతం చేశారు.

తన సర్వీస్ అంతా ఒకే కళాశాలలో చేశారు. మంచి పరిశోధన చేశారు. చాలామంచి ఉపాధ్యాయుడుగా పేరుగాంచారు. ఒక యాభై సంవత్సరాల కాలవ్యవధిలో వారు ఇంగ్లీషులో, బెంగాలీలో ఎన్నో పుస్తకాలు రాశారు. ‘రిఫ్లెక్షన్స్ ఆన్ కెమికల్ ఎడ్యుకేషన్’ అతని స్వీయచరిత్ర, ‘జనరల్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రి’ అనేది చాలా పేరు గాంచిన గ్రంథం. 1924లో ఇండియన్ కెమికల్ సొసైటీని స్థాపించారు. 1934లో తన స్వంత ధనంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ను స్థాపించారు. గొప్ప రసాయన శాస్త్రవేత్త అయిన ధర్ మొదటి భార్య షీలాధర్ గతించిన తరువాత ఆమె పేరును కూడా ఈ సంస్థ పేరులో 1949లో కలిపారు.  

అలహాబాదులో చాలా రకాలుగా వితరణ చూపి విశ్వవిద్యాలయంలో మెమోరియల్ ఫెలోషిప్, ఒక హాస్టల్ భవనానికి ఆర్థిక తోడ్పాటు, నేషనల్ అకాడమి ఆఫ్ సైన్సెస్ సంస్థ భవనానికి నేల, కలకత్తా విశ్వవిద్యాలయంలో పి.సి. రే ప్రొఫెసర్ షిప్ ఏర్పాటు.. ఇలా ఎన్నో దానధర్మాలు చేశారు. ఇంకా నీల రతన్ ధర్ శాంతినికేతన్ విశ్వభారతి మెరుగుదలకు ఆర్థిక సాయం, కాన్సర్ తో మరణించిన భార్య షీలాధర్ వైద్యం పొందిన హాస్పిటల్ నర్సులకు క్వార్టర్స్ నిర్మాణం; తన నివాసం ఉన్న ముస్సోరి లోని ఇల్లు రామకృష్ణ మఠానికి ఇవ్వడం… వంటి వితరణలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆయన రెండవ వివాహం చేసుకున్నా పిల్లలు లేరు. ఆయనకు రహస్యాలూ, పేటెంట్లూ, రాయల్టీలు లేవు. కిడ్నీ సమస్యతో మొదలైన అనారోగ్యం 1986 డిసెంబరు 5న ఆయనను పొట్టనబెట్టుకుంది. 

నీల్ రతన్ ధర్ సుదీర్ఘకాలం యూనివర్సిటీలో పనిచేసినా ఏనాడూ పాలనా సంబంధమైన ఉద్యోగం చేపట్టలేదు. నిరంతర కష్టానికీ, నిబద్ధతకూ, పట్టుదలకూ, త్యాగానికీ, దేశభక్తి, సరళమైన జీవితానికీ నిలువెత్తు నిదర్శనం నీల్ రతన్ ధర్.

డా. నాగసూరి వేణుగోపాల్, ప్రముఖ సైన్స్ రచయిత & ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు, మొబైల్: 9440732392

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *