మిఠాయి యుగంధర్ బాబు
ఓ పుల్లా.. ఓ పుడకా.. ఎండు గడ్డి..
చిన్న కొమ్మ… చిట్టి గూడు..
పిట్ట బతికే ఎంతో హాయి…..
అని గోరేటి వెంకన్న అద్భుతమైన పాట రాశారు. “పిట్ట బతుకే ఎంతో హాయి” అన్నారు గానీ అన్ని పిట్టల బ్రతుకులు హాయిగా అయితే లేవు. అందులో పాలపిట్ట (Indian Roller) బతుకు మొదటి స్థానంలో ఉంది.
మనదేశంలో అందమైన రంగులలో కనిపించే పక్షులలో పాలపిట్ట ఒకటి. దీని శాస్త్రీయ నామం Coracias Benghalensis. నీలము, ఆకాశ నీలము, గోధుమ రంగుల కలయికతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. భారతదేశంలో పర్యావరణ సమతుల్యతకు తోడ్పడే ముఖ్యమైన పక్షి ఈ పాలపిట్ట. ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో పురుగులు, మిడతలు వంటి కీటకాలు తింటుంది. తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా రాష్ట్రాల “రాష్ట్ర పక్షి” ఈ పాలపిట్టే. ఈ అందమైన పాలపిట్ట చుట్టూ రకరకాల మూఢనమ్మకాలు అందంగా పోగుబడ్డాయి.
రాష్ట్ర పక్షిగా ఉన్న తెలంగాణలో పాలపిట్టకు ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. విజయదశమి రోజున జమ్మి చెట్టు పూజ చేసిన తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకుంటే ఏడాది పొడవునా పడిన కష్టాలు, మానసిక ఒత్తిడి తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయని ఓ ప్రగాఢ నమకం. విజయదశమి రోజున పాలపిట్టను దర్శనం చేసుకోవడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూస్తే ఆ సంవత్సరమంతా సుభిక్షంగా ఉంటుందని, సకల విజయాలు కలుగుతాయని ప్రజలు విశ్వాసం.
ఈ నమ్మకానికి పురాణాలు కూడా తోడ్పడుతున్నాయి. శ్రీరాముడు రావణాసురునిపై యుద్ధానికి వెళ్లే ముందు దసరా రోజులలో పాలపిట్టను దర్శించుకున్నాడని, ఆ తర్వాత ఆయనకు లంకపై విజయం దక్కిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఆచారం కాలక్రమేణా అనవాయితీగా వస్తోంది. అంతేకాదు మహాభారతంలో పాండవులు తమ అజ్ఞాతవాసం ముగించుకొని శమీ పూజ చేసి పాలపిట్ట దర్శించుకున్న తర్వాత శత్రువులపై విజయం సాధించారని ప్రతీతి.
కాబట్టి దసరా రోజున పాలపిట్టను చూడాలని, చూసి తరించాలని, చూస్తూనే “హాం ఫట్” అని తమ జీవితాలు మారిపోతాయని తపన పడేవారి సంఖ్య ఎక్కువ అయిపోయింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఈ సంఖ్య విపరీతంగా ఉంది. ఇక్కడే ఓ తిరకాసు. చూసేవారి సంఖ్యకు అనుగుణంగా పాలపిట్టల సంఖ్య లేకుండా పోయింది. ఈ పాలపిట్ట రాను రాను భారతదేశంలో తగ్గిపోతోంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ పిట్ట గూళ్ళు కట్టుకోవడానికి అనువైన పాత చెట్లు తగ్గిపోతున్నాయి. వ్యవసాయ రంగంలో రసాయన పురుగుల మందుల వల్ల ఆహారంగా ఉపయోగపడే కీటకాలు తగ్గుతున్నాయి. సహజమైన గడ్డి భూములు, పొలాలు పరిసరాలు కనుమరుగు అవుతున్నాయి. కాంక్రీట్ జంగిళ్ళుగా ఊళ్శు మారిపోతున్నాయి. కొన్ని ప్రాంతాలలో పక్షులు పట్టుకోవడం కూడా సమస్యగా మారుతోంది.
పాలపిట్టలు సంఖ్య తగ్గింది కాబట్టి అందరికీ పాలపిట్టను చూపడం కోసం కొందరు వ్యాపారం ప్రారంభించారు. దసరా పండుగ సమయంలో జరుగుతున్న హింస, అక్రమబంధనం ఆందోళన కలిగిస్తోంది. పాలపిట్టను పట్టుకొని బోనులో బంధించి ప్రజలకు చూపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకోసం అడవులు, పొలాల్లో చెట్ల నుండి పాలపిట్టను పట్టుకొని బోనులో బంధిస్తున్నారు. అవి ఎగరకుండా రెక్కలు కత్తిరించడం, రెక్కలకు జిగురు పూసి ఎగరలేని స్థితికి తీసుకురావడం, కాళ్లకు దారాలు కట్టి వేయడం, చిన్న బోనులో బంధించి ఆహారం నీరు సరిగా అందించకపోవడం చేస్తున్నారు. పండుగలో ఊరూరా తిప్పడం, డబ్బులు వసూలు చేయడం, సంపాదించుకోవడం తరువాత వాటిని వదిలివేసినా, గాయాలతో, నీరసంతో అవి చనిపోతున్నాయి. మరలా దసరాకి ఇదే తతంగం పునరావృతం అవుతోంది. ఈ విధంగా రాను రాను పాలపిట్టల సంఖ్య తగ్గిపోతున్నాయి.
ప్రకృతిలో స్వేచ్ఛగా ఎగురుతున్న పాలపిట్టను చూడడం సమంజసం కానీ, దానిని బంధించి హింసించి రెక్కలు విరిచి బోనులో పెట్టి దర్శించుకుంటే నీకు ఏం శుభం కలుగుతుంది?.
అసలు పాలపిట్టను ఎప్పుడు చూసినా కంటికి ఆనందమే. ఫలానా పక్షిని ఫలానా దసరా రోజున చూస్తే మాత్రమే మంచి జరుగుతుందా? అలా జరుగుతుంది అనుకోవడం మూర్ఖత్వము, మూఢనమ్మకము. అసలు ఆ మాటకొస్తే ఏ పక్షిని, ఈ జంతువునూ ఏ పండుగ రోజున చూస్తే మీకు ఒరిగేదేమీ ఉండదు. పలాన రోజున ఫలానా నదిలో స్నానం చేయాలనడం, ఓ ప్రత్యేక రోజున పాముకు పాలు పోయాలి అనుకోవడం ఇవన్నీ కూడా మూఢనమ్మకాల జాబితాలోనివే. ఆ “ఫలానా” రోజులే కొంపలు ముంచుతున్నాయి. విపరీతమైన రద్దీతో తొక్కిసలాట జరిగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
2025లో Bird life International తాజా అంచనా ప్రకారం పాలపిట్టలు ముప్పుకు దగ్గరగా ఉన్న జాతి (Near Threatened NT) గా గుర్తించారు. భారతదేశంలో కూడా దీని జనాభా తగ్గుతున్నట్లు State of India’s birds నివేదిక సూచిస్తోంది.
కాబట్టి పాలపిట్ట, కనిపిస్తే దూరం నుంచి చూడండి (కనిపించకపోతే కొంపలు మునిగేది ఏమీ లేదు). బోనులో బంధించిన పాలపిట్టను చూస్తే, అధికారులకు రిపోర్ట్ చేయండి.
అదే సూర్యుడు, అదే భూమి, అదే చంద్రుడు వాటి పాటికి అవి తిరుగుతున్నాయి. రేయింబవళ్ళు, రుతువులు, గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఇవి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఈ పదివేల సంవత్సరాలలో మనం (అ)విజ్ఞానవంతులం అయిపోయి ఈ రోజులకు లేనిపోని ప్రత్యేకతలు ఆపాదించింది మనమే కాబట్టి వాటిని అవగాహన చేసుకుని ఈ దిక్కుమాలిన మూఢనమ్మకాలకు స్వస్తి పలికి పాలపిట్టలు పరిరక్షించుకుందాం.
మిఠాయి యుగంధర్ బాబు, పలమనేరు. మొబైల్ 9394782540



