డా. విరించి విరివింటి
చరిత్ర పూర్వదశలో మాతృస్వామ్యం అనే ఒక ఆదర్శవంతమైన సమాజం నిజంగా ఉండేదని, ఆ మాతృస్వామ్యం అంతరించిపోయిన తర్వాత లేదా పురుషులు దాన్ని నాశనం చేసిన తర్వాత పితృస్వామ్యం మొదలైందని స్త్రీవాద చర్చల్లోనూ, ప్రగతిశీల మేధావి వర్గాల్లోనూ ఒక అభిప్రాయం/వాదన ప్రాచుర్యంలో ఉంది. ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం పుట్టుక పుస్తకంపై ఇటీవల జరిగిన ఒక చర్చలో, మాతృస్వామ్య ఉనికి సత్యమని ఋజువయ్యాయని కొందరు మేధావులు వ్యాఖ్యానించడం కూడా జరిగింది.
ఐతే, ఈ అభిప్రాయానికి/వాదనకు పూర్తిగా విరుద్ధంగా, అసలు మాతృస్వామ్యం అనేదే మానవ చరిత్రలో లేదనీ, అది కేవలం ఒక అపోహ మాత్రమేననీ ఎవరైనా అంటే?..
ఈ వ్యాసం ఈ అభిప్రాయాలను కేవలం అభిప్రాయాలుగా కాకుండా, పరిశీలించి నిర్ధారించాల్సిన వాదనలుగా పరిగణిస్తూ, వాటిలోని నిజానిజాలను కొంత లోతుగా చర్చించేందుకు ఉద్దేశించబడింది. ఈ చర్చను ప్రారంభించాలంటే, అసలు “మాతృస్వామ్యం అనే భావన మేధోరంగంలో తొలిసారిగా ఎప్పుడు, ఎలా ముందుకొచ్చింది?” అనే ప్రశ్నతో మొదలుపెట్టాలి. దీనిని కేవలం ఒక చారిత్రక అంశంగా చూస్తే సరిపోదు. ఒక భాషనుండి ఇంకో భాషకు జరిగిన అనువాద క్రమంలో ఈ భావన ఎలా అర్థాలను మార్చుకుంది, రాజకీయ ఆకాంక్షలకు, ఆశయాలకు, అవసరాలకు ఎలా సిద్ధాంతపరమైన ఆధారంగా మారింది, చివరికి ఎలాంటి విమర్శలకు గురైంది అనే అంశాలనూ, దాని మేధో పరిణామాన్ని పరిశీలించాలి.
భావన పుట్టుక : బాచోఫెన్, 1861
పంతొమ్మిదవ శతాబ్దంలో యూరప్ మేధావులను తీవ్రంగా ఆకర్షించిన ఆలోచనల్లో డార్విన్ జీవ పరిణామవాద సిద్ధాంతం ఒకటి. శాస్త్రరంగంలోనే కాక, సామాజిక రంగంలో కూడా ఈ సిద్ధాంతం కొత్త ఆలోచనలకు ఊతమిచ్చింది. జీవుల్లాగే సమాజాలు కూడా పరిణామం చెందుతాయనే ఆలోచన సమాజ ‘గత చరిత్ర’ను చూసే దృక్పథంలో గణనీయమైన మార్పులకు నేపథ్యమైంది.
ఇలాంటి ఒక మేధో వాతావరణంలో మానవ సమాజాల గతాన్ని గురించి కొత్త ప్రశ్నలను లేవనెత్తిన ఒక ముఖ్యమైన మైలురాయి 1861లో జోహన్ జాకబ్ బాచోఫెన్ (Johann Jakob Bachofen) రాసిన దాస్ ముట్టర్రెఖ్ట్ (Das Mutterrecht — Mother Right, తల్లి హక్కు పుస్తకం. ప్రాచీన గ్రీకు పురాణాలను, మతపరమైన విశ్వాసాలను, చట్టపరమైన సంప్రదాయాలను ఆధారంగా చేసుకుని మానవ సమాజాల గత చరిత్రను పునర్నిర్మించవచ్చని ఆయన భావించాడు.
బాచోఫెన్ కాలానికి పురావస్తు శాస్త్రం (Archaeology), మానవశాస్త్రం (Anthropology) వంటి రంగాలు నేటి అర్థంలో ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. అందువల్ల పురాణాలను చారిత్రక ఆధారాలుగా చదివి, వాటి ద్వారా సమాజ పరిణామాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈనాటి పరిభాషలో ఆయనను నేరుగా కల్చరల్ ఆంథ్రోపాలజిస్టు అనడమో, స్ట్రక్చరలిస్టుగా వర్గీకరించడమో కాలదోషంతో కూడుకున్నది. అయితే, సమాజాలు చారిత్రక దశల ద్వారా పరిణామం చెందుతాయనే దృక్పథంతో ఆయన చేసిన ప్రయత్నాన్ని “సాంఘిక పరిణామవాద” ఆలోచనల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా చూడవచ్చు.
బాచోఫెన్ ప్రకారం, మానవ సమాజం ఒక నిర్దిష్ట క్రమంలో, అంటే లైంగిక స్వేచ్ఛ నుంచి మాతృస్వామ్యానికి, అక్కడి నుంచి పితృస్వామ్యానికి — పరిణామం చెందింది. పురాణాలు ఆయా సామాజిక పరిణామ దశలను ప్రతిబింబిస్తాయని, వాటి ద్వారా సమాజ గత చరిత్రను పునర్నిర్మించవచ్చని ఆయన భావించాడు. అంటే పురాణాలు సామాజిక పరిణామ క్రమానికి సాక్ష్యాలు¹. ఈ వాదనకు ఉదాహరణగా ప్రాచీన గ్రీకు విషాద నాటక రచయిత ఐస్కిలస్ (Aeschylus) రాసిన ఒరెస్టియా (Oresteia) నాటక త్రయాన్ని, ముఖ్యంగా దాని చివరి భాగమైన యుమెనిడీస్ (Eumenides)ను విశ్లేషించాడు.
ఈ కథలో ఒరెస్టియా తల్లి క్లైటెమ్నెస్ట్రా (Clytemnestra), తన ప్రియుడు ఏజిస్తస్ (Aegisthus)తో కలిసి, తన భర్త అగమెమ్నాన్ (Agamemnon)ను హత్య చేస్తుంది. తండ్రి హత్యకు ప్రతీకారంగా ఒరెస్టిస్ తన తల్లిని చంపుతాడు. దీంతో తల్లిని హత్య చేసిన నేరానికి అతడిని శిక్షించాలని పాత దేవతలైన ఎరిన్యస్ (Erinyes)లు పట్టుబడతారు. తల్లి రక్తసంబంధానికి ప్రాధాన్యమిచ్చే ఈ దేవతలకు, తండ్రి హక్కును సమర్థించే అపోలో ఎదురు నిలుస్తాడు. చివరికి ఎథీనా ఏర్పాటు చేసిన విచారణలో ఒరెస్టిస్కు అనుకూలంగా తీర్పు వెలువడుతుంది.
బాచోఫెన్ ఈ నాటకాన్ని, గ్రీకు వీరయుగంలో క్షీణిస్తున్న మాతృహక్కుకూ, ఆవిర్భవించి విజయం సాధిస్తున్న పితృహక్కుకూ మధ్య జరిగిన సంఘర్షణకు నాటకీయ చిత్రణగా అర్థం చేసుకున్నాడు. ఎరిన్యస్లు క్షీణిస్తున్న మాతృహక్కును, అపోలో, ఎథీనాలు ఎదుగుతున్న పితృహక్కును సూచిస్తాయని భావించాడు. ఈ విధంగా, పితృస్వామ్యానికి ముందు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేదనే తన ప్రతిపాదనకు ఒరెస్టియాను ఒక ముఖ్యమైన ఆధారంగా చూపించాడు.
ఐతే ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన ఉంది. ఇది అర్థం చేసుకోకపోతే అసలు ఈ వ్యాసం అర్థరహితంగా మారుతుంది. అదేంటంటే- నిజానికి బాచోఫెన్ తన మూల గ్రంథంలో ‘Matriarchy’ (మాతృస్వామ్యం), ‘Patriarchy’ (పితృస్వామ్యం) లేదా ‘Matrilineal’ (మాతృ వంశ క్రమం) అనే ఆంగ్ల పదాలను అసలు వాడనే లేదు. ఆయన ఈ బృహద్గ్రంథాన్ని జర్మన్ భాషలో రాశారు. ఆయన వాడిన పదాలు –
1.దాస్ ముట్టెరెచ్ట్ (Das Mutterrecht): దీనికి ఆయన ఇచ్చిన అర్థం “తల్లి హక్కు” (Mother-Right). Vaterrecht -పితృహక్కు.
2.గైనెకోక్రసీ (Gynecocracy): గ్రీకు మూలాలున్న ఈ పదానికి అర్థం “స్త్రీల పాలన” (Woman-rule).
3. హెటెరిజం (Hetaerism): సమాజం యొక్క మొదటి దశ అయిన ‘లైంగిక స్వేచ్ఛ’ లేదా వివాహ వ్యవస్థ లేని స్థితిని చెప్పడానికి ఈ పదం వాడారు.
బాచోఫెన్ ప్రకారం, ఆదిమ సమాజంలో వివాహ వ్యవస్థకు ముందు స్త్రీపురుషుల మధ్య లైంగిక స్వేచ్ఛ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఒక బిడ్డకు తండ్రి ఎవరో నిర్ధారించడం కష్టమవుతుంది. కానీ ఆ బిడ్డ ఏ తల్లి గర్భం నుంచి పుట్టాడో మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల వంశపారంపర్యం, బంధుత్వ గుర్తింపు తల్లి వైపు నుంచే కొనసాగి ఉంటాయని ఆయన భావించాడు.
బాచోఫెన్ వృత్తిరీత్యా న్యాయవాది. రోమన్ చట్టాలపై ఆయనకు లోతైన పరిచయం ఉంది. రోమన్ న్యాయ సంప్రదాయంలో Patria potestas అనే భావన తండ్రికి కుటుంబ సభ్యులపై ఉండే చట్టబద్ధమైన అధికారాన్ని సూచిస్తుంది. ఈ నేపథ్యంలోనే బాచోఫెన్ Mutterrecht (తల్లి హక్కు) అనే భావనను ముందుకు తెచ్చాడు. అయితే, తల్లి ద్వారా వంశపారంపర్యం కొనసాగడాన్ని మాత్రమే కాకుండా, స్త్రీల సామాజిక, మతపరమైన ఆధిపత్యాన్ని కూడా తన సిద్ధాంతంలో భాగంగా పరిగణించాడు.
న్యాయవాద నేపథ్యం ఉన్న ఒక వ్యక్తి ప్రాచీన సమాజాలను విశ్లేషించేటప్పుడు ఎలాంటి భావనాపరమైన గందరగోళం ఏర్పడవచ్చో చెప్పడానికి బాచోఫెన్ ప్రయత్నం ఒక మంచి ఉదాహరణ. ఆధునిక సమాజాల్లో మనకు పరిచయమైన ‘హక్కులు’, ‘ఆస్తి’, ‘చట్టం’ వంటి భావనలను వాటి చారిత్రక సందర్భాల నుంచి వేరు చేసి, ఆదిమ సమాజాలకు యథాతథంగా వర్తింపజేయడం సమస్యలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో, మాతృవంశ క్రమం వంటి ఒక నిర్దిష్టమైన సామాజిక సంబంధాన్ని వివరించడానికి బదులుగా ‘తల్లి హక్కు’ (Mutterrecht) అనే పదాన్ని ఉపయోగించడం బాచోఫెన్ సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన సమస్య.
బాచోఫెన్తో సమస్య ఇక్కడితో ఆగిపోలేదు. ఆయన న్యాయవాది మాత్రమే కాదు; ప్రాచీన గ్రీకు, రోమన్ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన పండితుడు కూడా. ఆ పాండిత్యం ఆయనను మరో భావన వైపు నడిపించింది. అదే ‘గైనెకోక్రసీ’ (Gynaikokratie). మనకు డెమోక్రసీ, బ్యూరోక్రసీ, అరిస్టోక్రసీ వంటి పదాలు పరిచయమే. గ్రీకు మూలమైన kratos అంటే అధికారం లేదా పాలన; gynaiko అనేది స్త్రీని సూచిస్తుంది. కాబట్టి గైనెకోక్రసీ అంటే స్త్రీల అధికారం లేదా స్త్రీల పాలన.
బాచోఫెన్ తన గ్రంథం శీర్షికలోనే Mutterrecht, Gynaikokratie అనే రెండు పదాలను ఉపయోగించాడు. ఆయన ఆలోచనలో మాతృహక్కు అనేది వంశపారంపర్యం, కుటుంబ సంబంధాలు, మతపరమైన విశ్వాసాలతో ముడిపడిన వ్యవస్థ. గైనెకోక్రసీ అనేది స్త్రీల ఆధిక్యత కుటుంబాన్ని దాటి విస్తృతమైన సామాజిక, రాజకీయ అధికార రూపాన్ని సంతరించుకున్న స్థితి. ఐతే బాచోఫెన్ తన సిద్ధాంతంలో ‘ముట్టర్రెఖ్ట్’ (తల్లి హక్కు), ‘గైనెకోక్రసీ’ (స్త్రీల పాలన) అనే రెండు భావనలను విడివిడిగా స్పష్టంగా నిర్వచించలేదు. మాతృవంశ క్రమం, కుటుంబంలో స్త్రీల ఆధిక్యత, సమాజంలో స్త్రీల రాజకీయ అధికారం—ఈ భిన్నమైన అంశాలను ఒకే సామాజిక పరిణామ క్రమంలో అనుసంధానించాడు.
ప్రాచీన గ్రీకు పురాణాల్లోని అమెజాన్ల కథలు కూడా ఆయనకు ముఖ్యమైనవి. అమెజాన్లు స్త్రీ యోధులుగా, పురుషుల ఆధిపత్యానికి వెలుపల తమదైన సామాజిక వ్యవస్థను ఏర్పరచుకున్నవారిగా చిత్రించబడ్డారు. బాచోఫెన్ ఇలాంటి కథనాలను కేవలం కల్పిత గాథలుగా పక్కన పెట్టలేదు. పితృహక్కు ఆధిపత్యం సాధించకముందు స్త్రీలు సమాజంలో విశేషమైన అధికారాన్ని కలిగి ఉండేవారనే తన ప్రతిపాదనకు వాటిని ఆధారాలుగా ఉపయోగించాడు. ఇక్కడే ఆయన పద్ధతిలోని ప్రధాన సమస్య కనిపిస్తుంది: పురాణాల్లో కనిపించే స్త్రీల శక్తిని, అధికారం గురించిన కథనాలను వాస్తవ చారిత్రక సామాజిక వ్యవస్థకు ఆధారాలుగా పరిగణించవచ్చా?
హెరోడోటస్ రచనల్లోని కొన్ని ప్రాచీన సమాజాల వర్ణనలు, రాజులు–రాణుల అధికారానికి సంబంధించిన కథనాలు కూడా బాచోఫెన్ ఆలోచనలకు నేపథ్యమయ్యాయి. అలాగే, అరిస్టాటిల్ తన పాలిటిక్స్ గ్రంథంలో స్పార్టా సమాజాన్ని విమర్శిస్తూ, అక్కడ స్త్రీలకు ఉన్న స్వేచ్ఛ, ఆస్తిపై హక్కులు, వారి ప్రభావం గురించి ప్రస్తావించాడు. స్పార్టాలో స్త్రీల ఆర్థిక, సామాజిక ప్రాధాన్యం పురుషుల రాజకీయ ఆధిపత్యంతో ఎలా ముడిపడి ఉందో అరిస్టాటిల్ చర్చించాడు.
ఈ విధంగా, ప్రాచీన గ్రీకు సాహిత్యం, పురాణాలు, చరిత్ర రచనలు బాచోఫెన్కు స్త్రీల ఆధిక్యతతో కూడిన ఒక పూర్వ సామాజిక వ్యవస్థను ఊహించడానికి అవసరమైన మేధో సామగ్రిని అందించాయి. అయితే, ఈ కథనాలు నిజంగా మాతృస్వామ్య సమాజం ఒకప్పుడు ఉనికిలో ఉండేదనే విషయాన్ని నిరూపిస్తాయా అన్నది వేరే ప్రశ్న. బాచోఫెన్ సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిన అసలు అంశం ఇదే. ఇక హెన్రీ మోర్గాన్, ఎంగెల్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ భావన ఎలా మారింది, వారి సిద్ధాంతాల్లో ఎలాంటి కొత్త అర్థాలను సంతరించుకుంది అనేది మన తదుపరి పరిశీలన.
భావనల గందరగోళం -మోర్గాన్, ఏంగెల్స్, అనువాదాలు
1861 లో జర్మనీలో వచ్చిన ఈ బృహద్గ్రంధానికి 1865 లో ఒక సంక్షిప్త ఆంగ్ల అనువాదం వచ్చింది. అది పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. ఆ తర్వాత అమెరికన్ ఐన మోర్గాన్ , జర్మనీలో బాచోఫెన్ సిద్ధాంతపై వచ్చిన వ్యాసాల ఆంగ్లానువాదాలు, లేఖలు చదవడం ద్వారా బాచోఫెన్ సిద్ధాంతంపై ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చాడు. పైగా ఐరాక్యూలనబడే అమెరికా గిరిజన తెగలపై స్వయంగా క్షేత్రస్థాయి పరిశోధనలు (Fieldwork) చేసిన అనుభవం కూడా కలవాడు. మోర్గాన్ 1877లో ప్రచురించిన తన ప్రసిద్ధ గ్రంథం “పురాతన సమాజం” (Ancient Society) లో బాచోఫెన్ చెప్పిన ‘తల్లి హక్కు’ భావనకు సమాంతరంగా “Female line” (స్త్రీ వంశం) లేదా “Matrilineal clan” (మాతృవంశ గోత్రం) అనే భావనలను ఆంగ్లంలో విస్తృతంగా చర్చించారు. ఒకరకంగా ఆదిమ సమాజాలలో వంశక్రమం తల్లి ద్వారానే సాగిందని శాస్త్రీయంగా నిరూపించిన మొదటి శాస్త్రవేత్త మోర్గాన్. ఐతే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే మ, బాచోఫెన్ వాడిన ‘గైనకోక్రసీ’కి సమాంతరంగా మరో పదం కానీ, ‘మాట్రియార్కీ’ అనే పదం కానీ మోర్గాన్ వాడలేదు. ఈ విషయంలో చాలా మంది చరిత్రకారులు, విద్యార్థులు పొరబడుతుంటారు. మోర్గాన్ వర్ణించిన ఐరాక్యూ తెగలలో కూడా వంశం అనేది తల్లి పేరు మీద నడిచినప్పటికీ రాజకీయార్థిక, సైనిక నిర్ణయాలు పురుషులే తీసుకునేవారు. ఐరాక్యూ గణాల్లో గణదాయీలు ఉండేవారు. శాంతి కాలంలో గణ పెద్దను ‘సాకేమ్’ అంటారనీ, యుద్ధకాలానికి మరో నాయకుణ్ణి ఎన్నుకుంటారనీ, సాకేమ్ ని, యుద్ధవీరుణ్ణీ గణంలోని స్త్రీ పురుషులందరూ కలిసి ఎన్నుకుంటారనీ చెబుతాడు మోర్గాన్. అంటే, అక్కడ తల్లికి గౌరవం, వంశ గుర్తింపు ఉన్నాయి కానీ, బాచోఫెన్ ఊహించినట్లు ‘స్త్రీల రాజ్యాధికారం’ (Gynecocracy) లేదు. కాబట్టి మోర్గాన్ ఆ అర్థం వచ్చే పదమేదీ వాడలేదు. ఈ విషయాలన్నీ క్రోడీకరణతో పాటు, కార్ల్ మార్క్స్ రాసుకున్న వ్యక్తిగత నోట్స్ ఆధారంగా, అద్భుతమైన విశ్లేషణతో ఫ్రెడరిక్ ఏంగెల్స్ కూడా 1884లో “కుటుంబం, వ్యక్తిగత ఆస్థి, రాజ్యం పుట్టుక”* అనే తన పుస్తకం రాశారు. ఆయన ఈ పుస్తకాన్ని జర్మనీలో రాశారు. ఏంగెల్స్ తన 1891 నాలుగో జర్మన్ సంచిక ముందుమాటలో మోర్గాన్ పరిశోధనలను చర్చిస్తూ matriarchal gens అనే పదాన్ని ఉపయోగించారు. దాని ఆంగ్ల అనువాదంలో కూడా ఈ పదం కనిపిస్తుంది. బహుశా ఇప్పటినుండే ఈ పదం వాడటం మొదలై ఉండవచ్చు. ఐతే ప్రాచుర్యం లోకి వచ్చింది మాత్రం చాలా తర్వాతనే అని చెప్పాలి. బాచోఫెన్ వాడిన పదం గైనకోక్రసీ ని మాట్రియార్కీ గా ఆంగ్లానువాదం ఎప్పుడుజరిగింది?. అనే ప్రశ్నకు సమాధానంగా, 1967 లో ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన Myth, Religion, and Mother Right: Selected Writings of J. J. Bachofen గ్రంథాన్ని రాల్ఫ్ మాన్హైమ్ (Ralph Manheim) జర్మన్ నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. అందులో బాచోఫెన్ గ్రంథం Das Mutterrecht కు సంబంధించిన భాగానికి ఇచ్చిన ఉపశీర్షికలో, జర్మన్ పదమైన Gynaikokratie (స్త్రీల పాలన) స్థానంలో Matriarchy అనే ఆంగ్ల పదాన్ని ఉపయోగించారు. బాచోఫెన్ రచనకు ఇదే తొలి ఆంగ్ల అనువాదంగా పరిశోధకులు పేర్కొంటున్నారు. పెగ్గీ రీవ్స్ శాండే అనే సాంస్కృతిక మానవ శాస్త్రవేత్త తన Matriarchy as a Sociocultural Form: An Old Debate in a New Light వ్యాసంలో ఈ పుస్తకం తర్వాతే రెండు పదాలనూ సమానార్థకాలుగా ఉపయోగించే ధోరణి ప్రాచుర్యంలోకి వచ్చిందని ఆమె పేర్కొంటారు.
19వ శతాబ్దం చివరి దశలో, మోర్గాన్, ఏంగెల్స్ రచనలు వెలువడిన తర్వాత, బ్రిటీష్ మానవశాస్త్రంలో Matriarchy అనే పదం Patriarchyకి వ్యతిరేక పదంగా ఒక నిర్దిష్టమైన అర్థంలో స్థిరపడటం ప్రారంభించింది. అంతకుముందు బాచోఫెన్ ఉపయోగించిన Gynaikokratie (స్త్రీల పాలన), మోర్గాన్ చర్చించిన Matrilineal descent (మాతృవంశ క్రమం), ఏంగెల్స్ విశ్లేషించిన కుటుంబం, ఆస్తి, రాజ్యాల చారిత్రక పరిణామం — ఇవన్నీ ఒకే రకమైన సిద్ధాంతాలుగా ప్రతిపాదించబడలేదు.
అయితే, తదనంతర మానవశాస్త్ర చర్చల్లో, అనువాదాల్లో ఈ రచయితల భావనలను కలిపి ‘మాతృస్వామ్య సిద్ధాంతాలు’ (Matriarchal Theories) అనే విస్తృతమైన లేబుల్తో వ్యవహరించడం పెరిగింది. ఫలితంగా, స్త్రీల రాజకీయాధికారం, తల్లి ద్వారా వంశక్రమం కొనసాగడం, కుటుంబ వ్యవస్థలో స్త్రీల స్థానం వంటి భిన్నమైన అంశాల మధ్య ఉన్న తేడాలు క్రమంగా మరుగునపడ్డాయి. వేర్వేరు ప్రశ్నలకు సమాధానాలు వెతికిన రచయితలందరూ ఒకే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారనే అభిప్రాయం ఏర్పడింది.
ఇక్కడ సమస్య ఒక పదం పుట్టుకలో మాత్రమే లేదు; ఆ పదాన్ని ఒక సిద్ధాంతపరమైన వర్గీకరణగా ఉపయోగించడంలో ఉంది. అప్పటికే ఉన్న భావనలకు ఒకే పేరు తగిలించడం ద్వారా, వాటి మధ్య ఉన్న చారిత్రక, సైద్ధాంతిక భేదాలను చెరిపివేసే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల బాచోఫెన్, మోర్గాన్, ఏంగెల్స్లను అర్థం చేసుకోవాలంటే, తరువాతి కాలంలో వారి రచనలకు తగిలించిన లేబుళ్లను మాత్రమే కాకుండా, వారు స్వయంగా ఉపయోగించిన పదజాలాన్ని, వారు చర్చించిన సామాజిక సంబంధాలను విడివిడిగా పరిశీలించాలి.
ఇది ముఖ్యంగా మనం ఎందుకు చెప్పుకోవాలంటే ,ఏంగెల్స్ తన పుస్తకం యొక్క నాల్గవ ఎడిషన్ (1891) ముందుమాటలో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా రాశారు. ఆ రోజుల్లో జర్మన్ విద్వాంసులకు తమ పూర్వీకుల వాస్తవ చరిత్రను తెలుసుకునే ఆసక్తి లేకపోవడమే కాక, వారు పితృస్వామ్యాన్ని మాత్రమే సహజమైనదిగా నమ్మేవారు. బాచోఫెన్ సిద్ధాంతం వారి పాత నమ్మకాలను దెబ్బతీసేలా ఉండటంతో, జర్మన్ అకడమిక్ సర్కిల్స్ బాచోఫెన్ ని పూర్తిగా విస్మరించాయి. ఒకరకంగా అణచివేశాయని ఏంగెల్స్ చేసిన వ్యాఖ్య ఇక్కడ ముఖ్యమైనది². ఐతే ఇంగ్లీషు మాట్లాడే అమెరికా బ్రిటన్ లలో మోర్గాన్ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇంగ్లీష్ లో వచ్చిన మోర్గాన్ పుస్తకాన్ని అమెరికాలో చదివే వారు లేరు. మొదటి ముద్రణ తర్వాత ‘పురాతన సమాజం’ పుస్తకం ముద్రణ ఆగిపోయింది. అమెరికన్లంటే జాతి వైరం పెద్దగా లేని ఇంగ్లండులో సైతం ఆయన పుస్తకాన్ని పనిగట్టుకుని అణచివేశారని అంటాడు అదే ముందుమాటలో ఎంగెల్స్.
దీనికి కారణం బ్రిటీష్ చరిత్ర పండిత లోకం శుష్కవాది ఐన మాక్ లెన్నన్ అనే మరో న్యాయవాది ఆరాధనలో మునిగిపోవడమని అంటాడు ఎంగెల్స్. బహు భర్తృత్వాన్నీ, తల్లి పరంపర గల కుటుంబాలలో వధువులను ఎత్తుకొచ్చి మనువాడే ‘రాక్షస వివాహాల’ను, అందుకు కారణంగా స్త్రీ శిశు హత్య ఆచారాన్నీ తన ఊహాశక్తితో వండి వార్చాడని అంటాడు. ఆయన ఊహించి తయారు చేసిన మరో సిద్ధాంతం ఏంటంటే- అంతర్వివాహ తెగలకూ బహిర్వివాహ తెగలకూ మధ్య శత్రుత్వం ఉందనే సిద్ధాంతం. గమనించి చూస్తే ఇవన్నీ ఆనాటి బ్రిటీష్ వలసవాదానికీ, విక్టోరియన్ నీతికీ సరిగ్గా సరిపడే సిద్ధాంతాలు. తల్లి పరంపర, అంతర్వివాహ పద్ధతులు వంటివి ఉన్న సమాజాలు ఆటవిక సమాజాలని ముద్ర వేసేందుకు, వారిని పరిపాలించి సంస్కరించే బాధ్యత తమ మీద ఉందనుకునేందుకు ఆ విధంగా తమ వలస వాద తత్వానికి ఒక నైతిక పవిత్రతను అందించే సిద్ధాంతాలేమో అనిపిస్తాయి మనకు ఇవన్నీ. ఐతే మోర్గాన్ పరిశోధన మాక్ లెన్నన్ ఊహాగానాలను కొట్టి పారేసింది. గణంలో అంతర్వివాహం లేకపోయినా, కొన్ని గణాల సమాహారమైన ‘తెగ’లో మాత్రం అంతర్వివాహం ఉండిందని మోర్గాన్ ప్రతిపాదించాడు. ఈ పరిశోధనలతో తన సిద్ధాంతం కూలిపోవడంతో మోర్గాన్ ని “చారిత్రక దృక్పథం లేనివాడు” అని మాక్ లెన్నన్ ఈసడించాడు. బహుశా అతని దృష్టిలో వలసవాద దృక్పథం లేకపోవడమే చారిత్రక దృక్పథం లేకపోవడం కావొచ్చు. ఐతే అదే ముందు మాటలో జీవశాస్త్రానికి డార్విన్ సిద్ధాంతం ఎలాంటిదో, ఆర్థిక శాస్త్రానికి మార్క్స్ ‘అదనపు విలువ’ ఎలాంటిదో నాగరిక ప్రపంచంలో నేడు కనిపించే తండ్రి పరంపర సమాజాలకు ముందు తల్లి పరంపర సమాజాలు( మాతృస్వామ్య సమాజాలు కాదు) ఉండిన్నాయని మోర్గాన్ కనిపెట్టడం కూడా అలాగే ఒక విప్లవాత్మకమైప అంశమని ఎంగెల్స్ కీర్తిస్తాడు. తీవ్రమైన పితృస్వామ్యమూ, విక్టోరియన్ నైతికత, పురుషాధికార పునాదుల మీద నడిచిన బ్రిటీష్ సామ్రాజ్యానికి తల్లి పరంపర సమాజాల ఉనికి నచ్చే అవకాశం లేదని వలసానంతరవాద విమర్శగా మనం దీనిని కొనసాగించవచ్చు. తాము పాలిస్తున్న భారతదేశం, ఆఫ్రికా వంటి వలస దేశాల్లో ఎక్కడైనా మాతృవంశ సంప్రదాయాలు కనిపిస్తే (ఉదాహరణకు కేరళలోని నాయర్ల ‘మరుమక్కత్తాయం’ లేదా ఈశాన్య భారత గిరిజనులు), బ్రిటీష్ వారు వాటిని “అనాగరికం”, “వెనుకబడినతనం” అని భావించి, చట్టాల ద్వారా వాటిని మార్చడానికి ప్రయత్నించారనీ అనుకోవచ్చు, అలాగే కరడుగట్టిన కుల ఆచారాలను సరళీకరించే ప్రయత్నం చేశారనీ అనుకోవచ్చు. ఎంగెల్సు బ్రిటీష్ పండితులను ఉద్దేశించి, మోర్గాన్ పరిశోధనల ప్రాముఖ్యతను గుర్తించకుండా, వాటి ఫలితాలను మాత్రం స్వీకరిస్తున్నారని ఆరోపించాడు. మోర్గాన్ అమెరికన్ కావడం, మాక్లెన్నన్కు బ్రిటిష్ మానవశాస్త్రంలో ఉన్న అధికారిక ప్రాధాన్యం కూడా ఈ పరిస్థితికి కారణాలని ఆయన విశ్లేషించాడు. అంటే, మాక్లెన్నన్ వలస వాద చారిత్రక దృక్పథం ముందు, మోర్గాన్ పరిశోధనాత్మక దృక్పథం పలుచనబడింది. అంటే ఇరవైయవ శతాబ్దం మధ్యవరకూ అంటే బ్రిటీష్ వలస వాదం కొనసాగినంత వరకూ యూరప్ లో ‘తల్లి వంశ క్రమం’ వంటి ఆలోచనలు వెనుకబాటుతనంగా చూడబడ్డాయన్నది స్పష్టం.


