మిఠాయి యుగంధర్ బాబు

నమ్మకాలు- నిజాలు

సుమారు 454 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడి చుట్టూ భూమి, శని, ఇతర గ్రహాలు కూడా ఏర్పడ్డాయి కదా. పాపము వాటి పాటికి అవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. 380 కోట్ల సంవత్సరాల క్రితం నిర్జీవం నుండి జీవం పుట్టి పరిణామం చెందుతూ 70 లక్షల సంవత్సరాల క్రితం మనుషులు పోలిన జీవాల అభివృద్ధి చెంది 70 వేల సంవత్సరాల క్రితం మాత్రమే ఆధునిక మానవుడు పుట్టాడు. 10వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం అభివృద్ధి చెంది మానవుడు స్థిర నివాసం ఏర్పరచుకొని సాంస్కృతిక అభివృద్ధి జరిగాయి.

ఆ తరువాత అనేక నమ్మకాలు మనిషి చుట్టూ చేరుకున్నాయి. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు కొన్ని నమ్మకాలు ముదిరి మూఢ నమ్మకాలుగా మారాయి. దానికి పరాకాష్ట శని ప్రభావం. శనిగ్రహం కూడా భూమి లాగే మట్టి, ధూళి నిండిన గ్రహం. సూర్యుడు నుండి ఆరవ గ్రహం అయిన శని గ్రహం చుట్టూ నీటి మంచు (98 శాతం స్వచ్ఛమైన నీరు), ధూళి రింగు రింగులుగా తిరుగుతున్న గ్రహం. ఈ గ్రహానికి ఓ రూపం ఇచ్చి,అతని ప్రభావాన్ని శని ప్రభావం అని చెప్పి నమ్మకాలు పెరిగిపోయాయి. ఈ దెబ్బతో కోట్ల సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న అన్నెం పున్నెం ఎరుగని, అమాయక శని గ్రహానికి ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా చేతుల నిండా పని తగిలింది. అది అందరినీ శిక్షించే పని. పీడించే పని. ఎవరెవరు తను సంచరిస్తున్న రాశులలో పుడుతున్నారో, ఎవరి పైన శని ప్రభావం చూపించాలో, ఎవరికి తొలగించాలో, జనాభా పెరుగుదలతో చాలా బిజీ బిజీగా తలమునకలవుతూ తల పట్టుకుంటున్నాడు (తల ఉంటే సుమా) శని గ్రహం. మీకు నవ్వొస్తుంది కదా. కానీ ఇది ఈ సమాజంలో ఉన్న ఓ పెద్ద నమ్మకం… అందరిని భయపెట్టి నిర్వీర్యం చేసే ఓ పెద్ద మూఢనమ్మకం.

భారతీయ సమాజంలో శని గ్రహం గురించి అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. జ్యోతిష్యంలో శని కష్టాలు, ఆలస్యాలు, శిక్షలు కర్మ ఫలాలతో అనుసంధానం చేస్తారు ‌.జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి జన్మించిన సమయంలో చంద్రుడు ఉన్న రాశికి ముందు రాశి, అదే రాశి, తర్వాత రాశి ….ఈ మూడు రాశుల గుండా శని గ్రహం సంచరించే కాలాన్ని “ఏలినాటి శని” అంటారు. శని ఒక్క రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు. మూడు రాశుల మీదుగా ప్రయాణం చేయడానికి సుమారు 7 1/2 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకే దీనిని ఏలినాటి శని అంటారు. శని గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి సుమారు 29.5 భూమి సంవత్సరాల కాలం పడుతుంది. అందువల్ల రాశుల గుండా దాని ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది. అందుకే శని ప్రభావం అంతకాలం ఉంటుందట.

జాతకంలో శని బలహీనంగా ఉంటే జీవితమంతా కష్టాలే అట. శని ఉంటే పూర్వజన్మ కర్మ ఫలాలు అనుభవించక తప్పదట.శనికి శాంతి పూజలు చేయకపోతే ప్రమాదాలు జరుగుతాయట. ఏలినాటి శని వస్తే ఉద్యోగం పోవడం, అప్పులు రావడం, కుటుంబ సమస్యలు ఎదురవుతాయని భయపడడం జరుగుతుంది. శని ప్రభావం ఉన్నది అని భావించే సమయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, మంచి పనులు చేయనే చేయరు. ఎందుకంటే శని దోషం ఉంటే జీవితంలో అభివృద్ధి ఉండదు అనే తప్పుడు భావన. నువ్వులు, నూనె దానం చేస్తే భాధలు తొలగిపోతాయని ప్రచారంలో ఉంది. నివారణ కోసం రకరకాల పూజ పద్ధతులు, అవి చేయకపోతే కలిగే దుష్ఫలితాలు… ఇవన్నీ కలిపి శని అంటే ప్రతి ఒక్కళ్ళు జీవితంలో భయపడేలా చేస్తున్నారు.. శని ప్రభావం వల్ల కష్టాలు వస్తాయి అని చెబుతున్నప్పుడు అదే శని స్థానంలో ఉన్న అందరికీ ఒకే విధమైన కష్టాలు ఎందుకు రావడం లేదు?.

శని ప్రభావం వల్ల కష్టాలు వస్తాయి అని నమ్మిన వ్యక్తి ఆ సమయంలో జరిగిన ప్రతికూల సంఘటనలు అన్నీ శనితో అనుసంధానిస్తారు. “కష్టాలు వస్తాయి” అని ముందే భయపడితే సాధారణ సమస్యలు కూడా మరింత తీవ్రమైనదిగా అనిపిస్తాయి. ఆ కాలంలో మంచి జరిగితే కూడా దానిని విస్మరిస్తారు. (మూఢ) నమ్మకానికి అనుకూలమైన సంఘటనలు గుర్తించుకొని దానికి వ్యతిరేకమైన మంచి వాటిని పట్టించుకోకపోవడం జరుగుతుంది. కుటుంబ సంప్రదాయాలు, జ్యోతిష్యుల మాటలు, మీడియా ద్వారా ప్రచారాలు, యూట్యూబ్ లలో ప్రవచనం కారుల ఊక దంపుడు ఉపన్యాసాలు మరింత అయోమయాన్ని, భయాన్ని సృష్టిస్తున్నాయి. శనిని ఆరాధించడం ఒక వ్యక్తిగత విశ్వాసం కావచ్చు. కానీ శని పేరుతో భయపెట్టడం, ఆర్థికంగా దోపిడీ చేయడం లేదా జీవితం నిర్ణయాలు భయంతో తీసుకునేలా చేయడం ప్రశ్నించాలి.

గుడ్డిలో మెల్లగా ఓ ప్రవచనకారుడు తమాషాగా మాట్లాడుతూ ” శని మన నెత్తి మీద వచ్చి కూర్చోడు. శని అంటే అనారోగ్యం అంతే. భయపడవలసిన పని లేదు. ” గోళ్లు కొరికితే శని ” అంటే అనారోగ్యమే కదా. ప్రతి పని దగ్గర శని వచ్చి కూర్చుని మనతో సెల్ఫీ దిగడు కదా” అని శని ప్రభావాన్ని ప్రశ్నిస్తున్నాడు. నిజానికి ఏ గ్రహాల ప్రభావం మన పైన ఏ విధంగానూ ఉండదు. పుట్టినప్పటి నుండి చివరి శ్వాస వరకు ఉన్న కాలమంతా ఒక్కటే. అన్నీ మంచి కాలాలే. అన్నిటినీ మనము అనుకూలంగా ఉపయోగించుకోవాలి.

ఆన్లైన్లో ఓపద్యం బాగా నచ్చింది

“శని దోషమంటూ భయపడుకునేస్తమా !
శాస్త్రం చెప్పని మాటలు నమ్మకు మిత్రమా !
గ్రహాల గమనమే గాని నీ తలరాత కాదు,
నీ కష్టఫలితాలకు గ్రహాలు కారణం కాదు !
శని గ్రహమంటూ శిక్షలు వేయడు,
నీ కర్మల లెక్కలు వాడు చూడడు !
గ్రహాల గమనానికి గతి ఉంది నిజమే,
నీ బతుకు మారేది నీ కృషితోనే.

శని ఒక నిజమైన ఖగోళ వస్తువు. దాని కక్ష, గురుత్వాకర్షణ, వలయాలు మొదలైనవి శాస్త్రవేత్తలు కొలిచి అధ్యయనం చేస్తున్నారు. దాని స్థానం వల్ల మనిషికి అదృష్టము, దురదృష్టము కష్టాలు వస్తాయనే వాదనలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. మన జీవితాన్ని ప్రభావితం చేసేది మన నిర్ణయాలు, ఆరోగ్యం, సామాజిక పరిస్థితులు, ప్రకృతి పరిణామాలు వంటి అంశాలు తప్ప గ్రహాలు కానేకాదు. శని గ్రహం వల్ల నష్టాలు ఎలా జరగవో, వేరే గ్రహాల వల్ల లాభాలు కూడా జరగవు.

కాబట్టి శని గ్రహము… మట్టి గ్రహమే గాని దుష్ట గ్రహం మాత్రం కాదు సుమా!!

రచయిత : మిఠాయి యుగంధర్ బాబు, మొబైల్ 9394782540, పలమనేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *