మిఠాయి యుగంధర్ బాబు
చాలా ఏల క్రితం మా అంకుల్ (నాన్న గారి స్నేహితుడు) ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరింది. ఎన్నో ఏళ్ల పాటు జాతకాలు వెతికి వెతికి, చివరికి నిశ్చయమైన పెళ్లి అది. కానీ అనుకోకుండా పెళ్లికి ముందు పెళ్లికూతురు వాళ్ళ నాన్నమ్మ ఆసుపత్రిలో చనిపోయింది. అంకుల్ దహన సంస్కారాలు చేయాలి. కానీ పెళ్లికి పెళ్లి కొడుకు వాళ్ళు మెలిక పెట్టారు. ఇంట్లో ధన సంస్కారం జరిగితే “అంటు” కాబట్టి పెళ్లి వాయిదా వేసుకోవాలి అది కుదరదు. పెళ్లి క్యాన్సిల్ చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. కుదరక కుదరక కుదిరిన పెళ్లి.. దాన్ని రద్దు చేసుకోవడం ఇష్టం లేక మా అంకుల్ వాళ్ళ ఇంటిదగ్గర వీధిలోనే వారగా ఒక షామియానా వేసి ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకువచ్చి ఆ రోడ్డుపైనే అంతిమ సంస్కారాలు ముగించి అక్కడినుండే స్మశానానికి తీసుకువెళ్లారు.
కన్న తల్లిని ఇంటికి తీసుకురాలేక రోడ్డుపైనే తతంగాన్ని నిర్వహించడం చాలా బాధ వేసింది. ఏమిటి కట్టుబాట్లు ఎందుకీ మూఢత్వం అని మనసు కలిచివేసింది. ఇది మాత్రమే కాదు అద్దె ఇంట్లో ఉండే వాళ్ళ బాధ వర్ణనాతీతం. అద్దె ఇంట్లో ఎవరైనా చనిపోతే వెంటనే భౌతిక కాయాన్ని బయట పెట్టేయాలి. అక్కడ నుంచి తీసివేయాలి. అంతిమ సంస్కారాలు ఇంటి వద్ద చేయడానికి వీలులేదని నిర్ధాక్షిణ్యంగా చెబుతారు. చేసేది లేక అద్దె ఇంట్లో ఉండేవాళ్లు శవాన్ని మార్చురీ లో పెట్టి అక్కడినుండే తీసుకెళ్లి తతంగాన్ని ముగిస్తారు. మనసారా చూసుకుని ఏడ్వడానికి కూడా ఇంటి యజమానులు అవకాశం ఇవ్వరు. ఎందుకింత అమానుషం. ఏమిటి అమానవీయ పద్ధతులు.
చావు అంటే అంతవరకు కొట్టుకుంటున్న గుండె ఆగిపోవడమే కదా. వెంటనే ఆ శరీరం మైల అయిపోతుందా, దెయ్యం అయిపోతుందా అంటరానిది అయిపోతుందా. ఎందుకంత భయం? ఎందుకింత మూఢత్వం.
భారతీయ సమాజంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో చావు తర్వాత జరిగే అంతిమ సంస్కారాలు, తిథులలో అనేక ఆచారాలు ఉన్నాయి. వీటిలో కొన్నిటి వెనుక శాస్త్రీయ లేక మానసిక కారణాలు ఉన్నప్పటికీ చాలావరకు కాలక్రమేణా మూఢ నమ్మకాలుగా మారాయి. భయము, అజ్ఞానము మరియు పాత ఆచారాలను గుడ్డిగా అనుసరచడం వల్ల ఇవి ఇంకా సమాజంలో కొనసాగుతున్నాయి.
చనిపోయిన వ్యక్తి ఆత్మ వెంటనే ఇంటికి తిరిగి వచ్చి తన శరీరంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుందని, కానీ అది యమభటుల ఆధీనంలో ఉంది కాబట్టి అలా చేయడానికి వీలు లేక 13 రోజుల వరకు ఇంట్లోనే తిరుగుతూ ఉంటుందని, తన బంధువులందరిని చూసి బాధపడుతుందని నమ్ముతారు. 13వ రోజు కర్మకాండలు, పిండ ప్రధానము చేసిన తర్వాత ఆత్మను యమలోకానికి తీసుకువెళ్తారని కథ ప్రచారంలో ఉంది. ఇంట్లో ఒకరు చనిపోతే ఇల్లంతా మైల అయిపోయిందని, ఇంట్లోని వస్తువులను తాకకూడదని భావిస్తారు.కొన్ని ప్రాంతాలలో చనిపోయిన వారు వాడిన మంచం, బట్టలు పూర్తిగా తగలబెట్టడం, లేక పారవేయడం చేస్తారు.
ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ఉండే గర్భిణీ మహిళలు ఆ శవాన్ని చూడకూడదని, అంతిమ సంస్కారం ముగిసేంతవరకు అక్కడికి రాకూడదని, చిన్నపిల్లలను బయటకు రానివ్వకూడదని గట్టిగా నియమాలు పెడతారు. శవాన్ని చూస్తే కడుపులో బిడ్డకు ఏదో అయిపోతుందని గట్టిగా నమ్ముతారు.
ఇందులో ఉన్న అసలు మర్మమేమిటో మనం గమనిద్దాం. చనిపోయిన వ్యక్తి యొక్క జ్ఞాపకాలు ఆవేదన నుండి కుటుంబ సభ్యులు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అది 11, 12 ,13 రోజుల పట్టవచ్చు. అంతవరకు ప్రేతాత్మ తిరుగుతూ ఉంటుందని చెప్పడం పూర్తిగా మూఢనమ్మకమే .ఈ భయం కేవలం మానసిక బలహీనత వల్ల ఏర్పడిందే కానీ ఆత్మలు తిరగడం అనేది నిరూపించ బడలేదు. పూర్వకాలంలో అంటు వ్యాధులు (కలరా, ప్లేగు వంటివి) సోకి మరణిస్తే ఇతరులకు ఆ వ్యాధి వ్యాపించకుండా ఉండేందుకు చనిపోయిన వాళ్ళు వాడిన బట్టలు వస్తువులను దూరంగా పారవేసే వాళ్ళు. కానీ నేడు సాధారణ మరణాలను కూడా మైల అని భావించి వస్తువులు పారవేయడం వృధా చేయడమే అవుతుంది.
గర్భవతులు శవాన్ని చూసినప్పుడు తీవ్రమైన మానసిక ఆందోళనకు, బాధకు గురయ్యే అవకాశం ఉంది. అది వారి ఆరోగ్యం పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ మానసిక కారణాన్ని పక్కనపెడితే చనిపోయిన వారిని చూడడం ఒక శాపంగా, చెడుగా చెప్పడం, గర్భస్థ శిశువుకు ఏదో జరిగిపోతుందని అనడం అర్థం లేని విషయం. పెచ్చు ఆ మహిళ చనిపోయిన వారి ముఖం చూడకపోతే, అంతిమ చూపులకు నోచుకోకపోతే జీవితాంతం ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది కదా.
చనిపోయిన వారిని తొలగించే ఒక చిన్న ప్రక్రియను లేనిపోని ఆచారాలు, మడి, అంటు, సూతకం అన్న పేరుతో సంక్లిష్టం చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేశారు. ఈ తతంగానికి మసిపూసి మారేడు కాయ చేసి లేనిపోని భయాలను ఆపాదించి పెట్టారు. తలకొరివి ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టకూడదు? పెట్టిన వాళ్ళు ఏమి చేయాలి? ఎన్ని రోజులు సూతకం పాటించాలి.. ఇలాంటి విషయాలు ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. మళ్లీ ఇందులో ఒక నిర్దిష్టమైన పద్దతంటూ లేదు. ఆ సమయం లో అక్కడ ఎవరు పెద్ద అయితే ఆయన చెప్పింది జరుగుతుంది. ఆయన బుర్రలో ఏ పురుగు తొలిస్తే, ఆయన మనసులో ఏది తోస్తే వాటన్నిటిని చేయాలని పట్టుబడుతుంటాడు. సొంత వ్యక్తి చనిపోయిన బాధలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు ఈ పెద్దలు ఆచారం పేరిట పెట్టే హింసలు భరించలేక పాడె బాధలు వర్ణనాతీతం.
పూర్వం నిప్పును కనుగొన్న తర్వాత (అప్పటికి అగ్గి పెట్టెలు లేవు) దహన సంస్కారం కోసం ఇంటి నుండి నిప్పుని (కొరివిని) తీసుకువెళ్లేవారు. ఇప్పుడు అగ్గి పెట్టే, లైటర్లు వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. మళ్లీ అందులో మగవాడు మాత్రమే తలకొరివి పెట్టాలనే నియమొకటి. అలాంటి సందర్భాల్లో మగ సంతానం లేని వారి బాధ చెప్పలేము. కానీ ఇప్పుడు కొంత పరిస్థితి కొంతవరకు మారింది. కూతుళ్లు కూడా (బంధువులను ఎదిరించి)తల కొరివి పెడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ఆడవాళ్లు శవయాత్రలో వీధి చివర వరకు మాత్రమే రావాలి. స్మశానంలో వాళ్ల ప్రవేశం నిషిద్ధం.
13వ రోజు లేదా కర్మ కాండల రోజున వందల మందికి భారీగా విందు భోజనం పెట్టకపోతే చనిపోయిన వ్యక్తి నరకానికి పోతాడని లేదా కుటుంబానికి కీడు జరుగుతుందని నమ్ముతారు. ఇలా దుబారాగా ఖర్చుపెట్టి తలకి మించి అప్పులు చేసి రోడ్డున పడ్డవాళ్ళు నాకు తెలుసు. కొన్ని వర్గాలలో అయితే సంవత్సరం పొడుగునా ప్రతినెల మాసికమని చెప్పి లక్షలు ఖర్చుపెట్టి దానధర్మాలు, విందులు పూజలు చేయడం చేస్తారు. ఆ వర్గానికి చెందిన మా స్నేహితుడు “మా వర్గంలో ఒకరు చనిపోతే అది లక్షల రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారమని” బాధపడ్డాడు. ఈ కార్యక్రమాలు చేయలేక అప్పులు బారిన పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పాడు. అలా చేయకపోతే తోటి వాళ్లు సూటి పోటి మాటలతో కాకుల్లా పొడుచుకు తింటారట.
బ్రతికున్నప్పుడు ముసలి వాళ్ళను చాలామందిని చివరి క్షణాల్లో సరిగా భోజనం పెట్టక, వాళ్లతో సరిగా మాట్లాడక, సమయం గడపక బాధపెట్టే వాళ్లే ఆ వ్యక్త చనిపోతూనే ఆర్భాటంగా ఖర్చు పెడతారు. పూల పల్లకి తయారు చేసి శవ యాత్రలో మేళ తాళాలతో దారి పొడవునా టపాసులు కాలుస్తూ, నాణేలు, పేలాలు పూలు చల్లుతూ వీదంతా ఖరాబు చేస్తూ (పర్యావరణానికి తూట్లు పొడుస్తూ) నానా హంగామా చేస్తారు. జరుగుతున్నది పెళ్లా,శవ యాత్రా అని అనుమానం వస్తుంది. అందుకే ఓ సినిమాలో కవి అంటాడు “స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్” అని.
దీనిపై ప్రజాకవి వేమన వ్యంగ్యంగా పద్యం రాశారు.
“జీవి పోకముందే జీవ వస్తువులిచ్చి
జీవి నిలుప వలయు జీవనముగా
జీవి తొలగు వెనుక జీవ వస్తువులేల?
విశ్వదాభిరామ వినురవేమ”
మనిషి చనిపోక ముందే అతనికి అవసరమైన ఆహారము, వస్త్రం వంటివి ఇచ్చి అతని బాగా చూసుకోవాలి. మనిషి చనిపోయిన తర్వాత అతనికి ఉపయోగపడని వస్తువులు ఇవ్వడం వల్ల ప్రయోజనమేమి?. జీవించి ఉన్న మనిషికి అవసరమైనప్పుడు సహాయం చేయడం నిజమైన మానవత్వం. చనిపోయిన తర్వాత చేసే ఆఢంబరాలు, కర్మకాండలకంటే జీవించి ఉన్నప్పుడు చేసే సహాయం చాలా విలువైనది. అని వేమన చెప్పాడు.
మహిళ చనిపోతే భర్తకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే భర్త చనిపోతే స్త్రీని అమంగుళులుగా చూడడము, గుండు గీయించడం, తెల్ల చీరలకే పరిమితం చేయడము, పూలు, గాజులు ,కుంకుమ తీసివేయడం శుభకార్యాలకు దూరంగా పెట్టడం, చేస్తున్నారు. ఇవన్నీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు) ఆర్టికల్ 21 (గౌరవంగా జీవించే హక్కు) ల ఉల్లంఘన కిందకి వస్తాయి. అలాంటి మహిళలను విధవ, ముండమోపి, అశుభం అని పేర్లు పెట్టడం కూడా వారి హక్కుల ఉల్లంఘనే అవుతుంది.
చనిపోయిన వారి శరీరాన్ని కాల్చడం లేదా కూర్చోడం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని పక్కన పెడితే వైద్య విద్యార్థుల కోసం పరిశోధన కోసం భౌతిక కాయాన్ని దానం చేయడం (body donation ) చాలా గొప్పది. చనిపోయిన వారి కళ్ళను (రెటీనాను) దానం చేయడం ద్వారా ఎంతో మంది అంధులకు కంటి చూపును ఇస్తోంది .కొంతమంది చదువుకున్న వాళ్ళు, అభ్యుదయ భావాలు కలవాళ్ళు ఈ విషయంలో ముందున్నారు. అలా చేయడానికి మనం ముందుగానే ఆసుపత్రికి పత్రాలు రాసి ఇవ్వచ్చు.
ప్రమాదం వల్ల కోమాలోకి వెళ్లి “బ్రెయిన్ డెడ్” గా ప్రకటించిన తర్వాత బంధువులు వారి శరీరంలోని అవయవాలను ఇతరులకు ఇవ్వడం ద్వారా చాలామందికి ప్రాణ దానం చేస్తున్నారు.
చావును ఒక సంఘటనగా చూస్తూ, భయాలు, అపోహలు మాని, పాత నమ్మకాలను గుడ్డిగా ఆచరించకుండా విచక్షణతో మనం ముందుకు వెళ్లాలి. దీనికి చుట్టూ ఉన్న వాళ్ళు సహకరించక పోవచ్చు. సతీసహగమనాన్ని నిషేధించినపుడు కూడా సమాజంలో తిరుగుబాటు జరిగింది. ప్రజలు దానిని వ్యతిరేకించారు. బాల్యవివాహాలు రద్దు చేసినప్పుడు కూడా అలాగే జరిగింది. కానీ ఇప్పుడు బాల్య వితంతువులు చాలావరకు లేరు. సమాజంలో మార్పులు అంత త్వరగా రావు. అందుకే మనము మారాలి. దాన్ని ఆచరణ చేసి ఇతరులకు చూపించాలి.
రచయిత: మిఠాయి యుగంధర్ బాబు, పలమనేరు. ఫోన్ : 9394782540



