డా. నాగసూరి వేణుగోపాల్
వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 12
అది 1927 శతాబ్దంలో సంభవించిన పెను తుఫాన్లలో ఒకటి, అది తెలుగుతీరాన్ని తాకింది. అప్పటికి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడలేదు. నెల్లూరు పట్టణం ఈ తుఫానుకు చాలా నష్టపోయింది. ఎన్నో ఇళ్లు కూలిపోయాయి, మరెన్నో నష్టాలు జరిగాయి. ఈ ప్రకృతి చూసి తల్లడిల్లిపోయింది పన్నెండేళ్ల కుర్రాడి హృదయం. తుఫాను వైపరిత్యం అతని మనసును సంక్షుభితం చేసింది. ఇది జరిగిన పదమూడేళ్ళకు ఆ కుర్రాడే డాక్టరేటు పట్టాతో కలకత్తాలో వాతావరణ శాఖలో ఉద్యోగంలో చేరాడు. మొదటి సంఘటన కాకతాళీయం కావచ్చు, కానీ, రెండవది ఎంత మాత్రమూ కాదు. తీరప్రాంతపు జీవితాలతో చెలగాటమాడే తుఫాన్లకు సాంకేతిక విజ్ఞానంతో ముక్కుతాడు వేయాలనే లక్ష్యంతో ఆ యువకుడు తన దృష్టి నిలిపాడు . జీవితాన్ని రగిలించిన జ్వాల కనుకనే అది విజ్ఞానజ్యోతిని రూపొందించింది. ప్రపంచ స్థాయిలో పేరెన్నిక గన్న శాస్త్రవేత్తగా అతను సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. అతనే పద్మభూషణ్ పంచేటి కోటీశ్వరం.
అయితే ఆ కుర్రాడు సంపన్నుని ఇంట పుట్టిన వాడంటే మనం పొరపాటు వడ్డట్టే. ఒక పేద కుటుంబంలో 1915 మార్చి 25న కోటీశ్వరం జన్మించారు. జన్మించిన నాలుగు నెలలకే తండ్రిని కోల్పోయిన దురదృష్టవంతుడతడు. అప్పటికి తల్లికి ఇరవయ్యేళ్లు కూడా లేవు. దాంతో అమ్మమ్మ ఇంట్లో, తల్లిచాటు బిడ్డగా పెరిగాడు. ఇంటి వాతావరణం కూడా చాలా సాదాసీదా అయినదే! వందేళ్ళ క్రితం మద్రాసుకు 160 కిలోమీటర్ల దూరంలో వుండే ఒక సుమారైన వూరులో ఉండే వాతావరణం అది. అటువంటి సమాజం నుంచి తయారైన విజ్ఞాన వృక్షం వంటి వాడు – డాక్టర్ కోటీశ్వరం.
నెల్లూరులోనే కోటీశ్వరం ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. 1931లో ఇంటర్మీడియట్ స్థాయిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉండే విద్యార్థులలో ప్రథముడిగా నిలిచారు. ఈ విజయానికి రఘుపతి వెంకటరత్నం నాయుడు బంగారు పతకం లభించింది. తర్వాత చదువు మద్రాసులోనే మాత్రమే వుంది. పరీక్షలో సాధించిన స్థాయి కారణంగా మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రవేశం సులువుగా లభించింది. భౌతిక శాస్త్రం ప్రధాన అంశంగా కోటీశ్వరం బి.యస్సీ. ఆనర్సులో చేరాడు . 1934లో పట్టా పొందిన తర్వాత ఉద్యోగ అన్వేషణ మొదలైంది. ఆయన గుంటూరులో డెమాన్స్రేటర్ గా మొదలై తర్వాత విశాఖపట్నం ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాశాలలో, పిమ్మట బందరులోని హిందూ కళాశాలలో చేరారు. అక్కడున్న సౌకర్యాలతో పరిశోధనలవైపు దృష్టి పెట్టాడు. అప్పట్లో ‘రామన్ ఎఫెక్టు’కు మంచి ఆకర్షణ వుండేది, ఎందుకంటే అంతకు క్రితమే ఆ పరిశోధనకు సి.వి. రామన్ కు నోబెల్ బహుమతి లభించింది. అంతకు మించి సి.వి. రామన్ విశాఖపట్నంలో చదువుకున్నవారు కూడా. కోటీశ్వరం 1936లో రామన్ ఎఫెక్టు రీసర్చి ప్రాజెక్టులో చేరారు . ద్రవాలలో అణువుల మధ్య వుండే సామరస్యం గురించి ఆయన డాక్టరేటు పొందారు. ఆయన సిద్ధాంత గ్రంథం పేరు ‘స్టడీస్ ఆఫ్ అసోసియేటెడ్ లిక్విడ్స్ బై రామన్ ఎఫెక్టు’, 1939లో ఈ పి.హెచ్.డి. పట్టా మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి లభించింది.
మనసు తుఫాన్ల మీదనే లగ్నమై వుంది, కానీ దానికి సంబంధించి దేశంలో ఎక్కడా కోర్సులేదు. 1948లో వాతావరణ అధ్యయనంలో ఆంధ్రావిశ్వవిద్యాలయం రెండేళ్ళ ఎం.యస్సీ. ప్రారంభించింది. అప్పటికి అది ప్రపంచంలో నాలుగవ విద్యాసంస్థగా ఈ కోర్సు మొదలు పెట్టింది. మిగతా మూడింటిలో ఒకటి లండన్ లో, రెండవది చికాగోలో వుండగా, మూడవది మసాచెసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలోఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో కోటీశ్వరం ప్రకృతిని వివరించి చెప్పే భౌతిక శాస్త్రాన్ని ఎంచుకున్నారు. 1940లో ఇండియన్ మెటిరియోలాజికల్ డిపార్ట్మెంట్ మూడు ఉద్యోగాలకై ప్రకటించింది. అవి అసిస్టెంట్ మెటిరియోలాజిస్ట్ ఉద్యోగాలు. అప్పటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు ఏర్పడలేదు. అందువల్ల ఒకటి ముస్లింలకు, రెండవది అల్ప సంఖ్యాక ప్రాంతాల వారికి కేటాయించారు. కోటీశ్వరం పోటీ పడగలిగింది కేవలం ఒక పోస్టుకు మాత్రమే! కోటీశ్వరం ఎంపికయ్యారు. అయితే ఇంటర్వ్యూలో – ఈ ఉద్యోగానికి ఎలా తగినవాడవో వివరించమని అడిగారు. ఉద్యోగం యిచ్చి చూడమని కోటీశ్వరం జవాబు! అతని ఆత్మవిశ్వాసానికి వెనుక వున్నది 1927 నెల్లూరు తుపాను అని -ఎరిగిన వారికి మాత్రమే తెలుసు. ఈ సంఘటన అతనికే కాదు, భారత వాతావరణ విజ్ఞానానికే ఒక పెద్ద మలుపు.
కోటీశ్వరం కలకత్తాలో ఉద్యోగంలో చేరాడు. బంగాళాఖాతంలో ఏర్పడే ఉష్ణమండల తుఫాన్లు గురించి హెచ్చరికలు జారీ చేయడం, నావికులకు వాతావరణ సూచనలు అందించడం ఆ ఉద్యోగం. అప్పటికి అతను చదివింది, దీనికి సంబంధించి కాదు. ఉద్యోగంలో చేరిన తర్వాత అసలు అధ్యయనం ప్రారంభం అయ్యింది. అలా సమాచారం సేకరించి, విశ్లేషించడం మొదలైంది. వేసవికాలంలో ఈశాన్య ప్రాంతంలో సంభవించే తుఫాన్ల గురించి శోధనలు ప్రారంభించాడు. కొంతకాలానికి ఢిలీకి బదిలీ అయ్యాడు. తన కృషి గురించి అక్కడ వివరించాడు. సర్ చార్లెస్ నోర్మాండ్ వాతావరణ హెచ్చరికలు జారీ చేసేవారికి సూచనలు గురించి రాయమన్నారు. అదే అంతర్జాతీయ వాతావరణ శాఖ సాంకేతిక అంశంగా ప్రచురింపబడింది. అదే వాతావరణ అధ్యయనంలో అతని తొలి పరిశోధనా పత్రం. తర్వాత బొంబాయికి కోటీశ్వరం బదిలీ అయ్యాడు. దక్షిణ ప్రాంతపు వ్యక్తి యిలా కలకత్తా, ఢిల్లీ, బొంబాయికి బదిలీ కావడంతో ఆయా ప్రాంతాల వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఎంతో వీలు కలిగింది. దీన్ని పూర్తిగా కోటీశ్వరం సద్వినియోగం చేసుకున్నారు. 1953లో తన పరిశోధనా ఫలితాలని ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెటిరియోలజి అండ్ జియోఫిజిక్స్’లో ప్రచురించారు. ఫలితంగా చికాగో విశ్వవిద్యాలయం నుంచి భారత ప్రతినిధిగా ఆహ్వానం లభించింది, 1955-56లో అక్కడ వున్నారు.
టిబెటన్ పీఠభూమికి ఉష్ణం మార్పిడి కావడంతో నైరుతి రుతుపవనాలు ఏర్పడతాయని ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో కోటీశ్వరం ప్రతిపాదించారు. అయితే దీన్ని రుజువు చేయడానికి తగిన ఆధారభూతమైన సమాచారం లేదు. ఆ సమయంలో హిందూ మహాసముద్రంలో అమెరికా భారీ ఎత్తున ప్రయోగాలు చేస్తోంది. అప్పటికి సముద్ర అధ్యయనానికి ప్రత్యేక శాఖ, సంస్థ లేవు. దాంతో దీనికి సంబంధించిన అంశాలు వాతావరణ శాఖ వద్దకు వచ్చేవి. కోటీశ్వరం దీనిని సద్వినియోగం చేసుకున్నారు. తర్వాతనే సముద్ర అధ్యయనం మొదలయ్యింది.
వాతావరణ శాఖలో కంప్యూటర్లు రావడం ఒక కీలకమైన విషయం. దీన్ని సాధించింది కోటీశ్వరం. వాతావరణం మీద సముద్ర ప్రభావం గురించి హవాయి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సి.యస్. రామ్ కి ఆసక్తి వుండేది. దీని మీద దృష్టి నిలిపిన కోటీశ్వరాన్ని 1961లో రామ్ ఆహ్వానించారు. అప్పట్లో టెలివిజన్ ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేషన్ శాటిలైట్ (TIROS-I) ద్వారా ఛాయా చిత్రాలు వచ్చేవి. వీటి ఆధారంగా ఉష్ణమండల తుఫాన్లు ఎలా రూపొందుతున్నాయో పరిశీలించడానికి వీలయ్యింది. అప్పటికి మనదేశంలో వున్నది చాలా పెద్ద పరిమాణంలో వుండే యంత్రాలే! అప్పుడే ఐ.బి.ఎం. రెండవతరం కంప్యూటర్లతో వచ్చింది. అది సరిగ్గా మన అవసరాలకు తగినది. అయితే అటువంటివి కొనడం అంత సులువు కాదు. ఆర్ధిక సమస్య, చివరకు అంతర్జాతీయ అవసరాలకు ఉపయోగపడుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ మొత్తం ధనం కేటాయిస్తే, సమస్య తీరింది. ఇలా కంప్యూటర్ మన వాతావరణ శాఖలో ప్రవేశించింది.
అరేబియా సముద్రంపై రుతుపవన వాతావరణాన్ని అధ్యయనం చేయడం లక్ష్యంతో అమెరికా వాతావరణ శాఖ బొంబాయికి నాలుగు ఎయిర్ క్రాఫ్ట్ లను పంపింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయోగశాల వుంటుంది. అప్పటి ప్రధాని నెహ్రూకు ఈ విషయం ఆసక్తి కల్గించింది. దీన్ని నెహ్రూ, ఇందిరాగాంధీ, యితర నాయకులు పరిశీలించారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ సాయంతో తుపాన్లు ఎలా రూపొందుతాయి, వాటిలో శక్తి విన్యాసం ఎలా ఉంటుంది వంటి విషయాలను కోటీశ్వరం అధ్యయనం చేశారు. 1968లో వాతావరణ శాఖకు డిప్యూటి డైరెక్టర్ జనరల్ అయ్యారు. అలాగే పూనా వాతావరణ విభాగం కేంద్రానికి డైరెక్టరుగా కూడా వున్నారు. 1969లో డా॥ ఎల్. యస్. మాధుర్ తర్వాత కోటీశ్వరం వాతావరణ శాఖకు డైరెక్టర్ జనరల్ అయ్యారు. కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, భువనేశ్వర్, విశాఖపట్నంలలో ఉపగ్రాహలనుంచి ఛాయా చిత్రాలు అందుకునే ఏర్పాట్లు చేశారు. అలాగే తీరప్రాంతాలలో రాడార్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల బంగాళాఖాతంలోనే కాక, అరేబియా సముద్రంలో కూడా తుఫాన్ల ఆచూకీ పసిగట్టే వీలయ్యింది.
కోటీశ్వరం 58 సంవత్సరాలకు 1973లోనే పదవీ విరమణ చేయాల్సింది. అయితే అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ మరో రెండేళ్ళు కొనసాగమని కోరారు. 1975లో ప్రపంచ వాతావరణ సంస్థ ప్రాజెక్టు మీద ఇరాన్ లో వాతావరణ సేవలో రూపకల్పన చేయడానికి వెళ్ళారు. 1978లో అయోతుల్లా భోమైనీ రాకతో ఈ ప్రయత్నాలు ఆగిపోయాయి.
వాతావరణ శాఖ ప్రయోగాలూ, ఫలితాలూ సగటు మనిషికి తోడ్పడాలని కోటీశ్వరం కోరిక. సాంకేతిక విజ్ఞానం రైతు సేద్యానికి దోహదపడి, దేశ ఆర్థిక సౌభాగ్యానికి చేయూత నివ్వాలని ఆయన భావన. పశ్చిమ కనుమల జలసంపద గురించి 1985లో కోటీశ్వరం అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుకి రాసిన ఉత్తరం యిదే విషయం తెలుపుతుంది.
కోటీశ్వరం అందుకున్న గౌరవాలు ఎన్నో! 1974లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలో, 1975లో జాతీయ సెన్స్ అకాడమీ, మరియు ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీ ఫెల్లో, 1976లో పద్మవిభూషణ్, 1972లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు, 1981లో అసోసియేషన్ ఆఫ్ హైడ్రాలజిస్ట్ అధ్యక్షుడు – యిలా ఎన్నో గౌరవాలు పొందారు.1997 జనవరి 11న విశాఖపట్నంలో మరణించిన కోటీశ్వరం సాధించిన ప్రగతిని, వైజ్ఞానిక కృషిని భారతదేశ సముద్రపు అలలు నినదిస్తూనే వుంటాయి. అన్నట్టు ఆయన ఇంటికి పెట్టుకున్న పేరు ‘వర్ష!
డా. నాగసూరి వేణుగోపాల్, ప్రముఖ సైన్స్ రచయిత & ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు మొబైల్: 9440732392



