మిఠాయి యుగంధర్ బాబు
ఓ ప్రశ్న.. ఓ చలికాలపు రాత్రి 10 మైళ్ళ దూరంలో కొండపై మండుతున్న చిన్న కొవ్వొత్తి ఇంట్లో కూర్చున్న మీకు వెచ్చదనాన్ని ఇస్తుందా?….. లేదు కదా!. మరో ప్రశ్న. నేను విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ పైన కూర్చొని ఒక పేద్ద అయస్కాంతంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గేటు పైన ఉండే ఒక చిన్న సూదిని ఆకర్షించగలనా?, లేదా కదిలించగలనా? ……లేదు కదా!!. అలాంటప్పుడు కోటానుకోట్ల కిలోమీటర్ల దూరాల్లో ఉన్న రాశులలోని నక్షత్రాల సముదాయము మన శరీరం పైన, మన భవిష్యత్తు పైన ప్రభావాన్ని ఎలా చూపించ గలుగుతాయి? విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. అవును.మన జ్యోతిష్య శాస్త్రం గురించే. జ్యోతిష్యం అనేది గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు స్థానాలను ఆధారం చేసుకుని మానవ జీవితంలో సంఘటనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఓ ప్రాచీన సంప్రదాయము. దీని చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నాటిది. జ్యోతిష్యంలో జాతకం రాయడం లేదా జాతక చక్రం (కుండలి) వేయడానికి వ్యక్తి యొక్క పుట్టిన తేదీ, ఖచ్చితమైన సమయం (నిమిషాలతో సహా) మరియు పుట్టిన ప్రదేశము చాలా ముఖ్యమని చెబుతారు. ఆ సమయంలో ఆకాశంలో ఉండే గ్రహగతులను గణించి, లగ్నం నిర్ధారించి 12 రాశుల గడులలో గ్రహాలను అమర్చడం ద్వారా సంప్రదాయ పద్ధతిలో లేదా ఆన్లైన్ పద్ధతిలో జాతక చక్రాన్ని తయారు చేస్తారు. ఈ మొత్తం వ్యవహారంలోనే అనేక లోపాలు ఉన్నాయి. అది ఎలాగో చూద్దాం. “ఖచ్చితమైన సమయం”.. అదీ నిమిషాలతో సహా అన్నారు కదా. సమయం ఎంత ఖచ్చితమో చూద్దామా!
భారతదేశంలో సమయం– భారతదేశంలో మన అనుసరిస్తున్న టైం జోన్ సామాన్య శకం 1906 లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశం మొత్తంలో ఒకే సమయ కాలం “భారత ప్రామాణిక కాలం” ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (I.S.T…..GMT+5.30గం.) ను ప్రవేశపెట్టారు. అంతకుముందు కలకత్తా, మద్రాస్, బొంబాయి లలో వేరువేరు స్థానిక సమయాలను పాటించే వాళ్ళు. ఎందుకంటే అవి వేరువేరు. రేఖాంశాల స్థానంలో ఉన్నాయి గనుక. సా.శ.1884లో కలకత్తాలో సమయం GMT+5.53 గం. (GMT గ్రీన్ విచ్ మీన్ టైం) ఉన్నప్పుడు ముంబైలో GMT+4.51గం.. సమయం ఉండేది. అంటే అప్పుడు కలకత్తాలో ముంబైలో ఒకేసారి పుట్టిన ఇద్దరు పిల్లలకు రాసిన జన్మ కుండలాలు, జాతకాలు వేరువేరుగా ఉండేవి.(వేరు వేరు కాలాలు కాబట్టి గ్రహాలు, నక్షత్రాల స్థానాలు మారిపోతాయి కదా). మరి ఇప్పుడు భారతదేశంలో ఒకే కాలమానం అనుసరిస్తున్నాం. కాబట్టి ముంబైలో కలకత్తాలో ఒకే సమయం లో పుట్టిన పిల్లలిద్దరికీ గ్రహాలు ఒకే విధంగా ఉంటాయి కదా. అంటే ఆ మేరకు అది లోప భూయిష్టమే కదా. భారతదేశం తూర్పు పడమరలుగా 68° – 97°డిగ్రీల రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ప్రతి ఒక్క డిగ్రీకి సమయం లో నాలుగు నిమిషాల తేడా ఉంటుంది. అంతెందుకు మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుందాం. తూర్పు సరిహద్దు న 84°46′ డిగ్రీల రేఖాంశము ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు మరియు బంగాళాఖాతం గుండా పోతుంది. అదే పశ్చిమ వైపున కర్ణాటక సరిహద్దు అనంతపురం జిల్లా దగ్గర 76°46′ రేఖాంశం పోతుంది. కాకినాడ గుండా సరాసరి 82°30′ రేఖాంశం పోతుంది. అంటే కాకినాడలో ఉదయం 6 గంటల సమయంలో పలాస వద్ద 6గం.8 నిమిషాలు, అనంతపురం వద్ద 5గం. 36ని. సమయం ఉండాలి. కానీ వీటిని త్రోసిరాజని ఒకే సమయాన్ని పాటిస్తున్నాం. కాబట్టి ఆ మేరకు జాతకాలు సరైనవి కావు కదా. *తరువాత గ్రహాల గురించి*- వేద కాలంలో భారతదేశంలోనూ అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన గ్రహాలు, కనిపించిన నక్షత్రాలు కొన్ని మాత్రమే. కనిపించని నక్షత్రాల గురించి వారికి తెలియదు.సూర్యుడు ప్రయాణించే దారిలోని నక్షత్రాల సమూహాలను రకరకాల రాశులుగా (12 రాశులుగా ) ఊహించుకున్నారు. ఆ సమయంలో ఖగోళ శాస్త్రము (ఆస్ట్రానమీ ) జ్యోతిష్య శాస్త్రము (ఆస్ట్రాలజీ ) దాదాపు రెండూ ఒక్కటిగానే ఉండేది. అప్పుడు సూర్యుడు, చంద్రుడు కూడా గ్రహాలు అనుకున్నారు. రెండు చాయా గ్రహాలు రాహువు, కేతువులను ఊహించుకున్నారు. కానీ సూర్యుడు ఒక నక్షత్రమని, చంద్రుడు ఒక ఉప గ్రహమని మనకు ఇప్పుడు తెలుసు. కాబట్టి వారనుకున్న గ్రహాలు కూడా తప్పే. 17 శతాబ్దం తర్వాత సైన్స్ అభివృద్ధి చెంది, జ్యోతిష్యం నుంచి విడివడిన ఖగోళ శాస్త్రం ఆధారాలతో అభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళింది. జ్యోతిష్యం అక్కడే ఆగిపోయింది.
మనకి తెలిసి ఇప్పుడు విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి. మన సూర్యుడు ప్రయాణించే దారిలో కూడా కోట్ల కోట్ల నక్షత్రాలు (కంటికి కనిపించేవి, కనిపించనివీ) ఉన్నాయి. అలాంటప్పుడు ఎన్ని కోట్ల రాశులు ఉండాలి? కాబట్టి 12 రాశుల పైన మాత్రమే ఆధారపడి తయారు చేస్తున్న జాతకాలు,జ్యోతిష్యము ఏమాత్రం నిజం కాదు. *నక్షత్ర దూరాలు*- మనకు సమీప నక్షత్రం అయిన సూర్యుడు భూమి నుండి 14.96 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మేషరాశి అనేక నక్షత్రాల సముదాయం కదా. అందులో ఒక ప్రధాన నక్షత్రము భూమి నుండి సగటు 11,87,33,000 కోట్ల కిలోమీటర్ల దూరంలో వుంది. (123.5 10 కాంతి సంవత్సరాల దూరం). అదేవిధంగా మిధున రాశి లోని ఓ నక్షత్రము భూమి నుండి 3,21,66,720 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది (34 కాంతి సంవత్సరాల దూరం) ఇలా మనం అనుకుంటున్న 12 రాశుల్లోని నక్షత్రాలు కోటానుకోట్ల కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నా యి. కాబట్టి వాటి ప్రభావం మనుషుల పైన, వాళ్ళ జీవితాల పైన, భవిష్యత్తు పైన ఇసుమంతైనా ఉండదు సుమా. మరి వీటి ఆధారంగా రాసే వార ఫలాలు, జాతకాలు, జన్మ కుండలాలు ఎంతవరకు శాస్త్రీయమో ఆలోచించారా. కానీ చాలామంది ఈ వార ఫలాలను తమకు నచ్చినట్లుగా అర్థం చేసుకుని, అన్వయించుకుని యాదృచ్ఛికంగా సరిపోయినప్పుడు ఇవి నిజం అని నమ్ముతున్నారు. చాలామంది జాతకాలపై ఆధారపడే అన్ని పనులూ చేస్తున్నారు. నామకరణం మొదలుకొని పెళ్లిళ్ల వరకు అనేక కార్యక్రమాలు వీటి చుట్టూ అలుముకుని ఉన్నాయి. జాతకాలు కుదిరితేనే పెళ్లిళ్లు చేస్తారు. అలా వెతికి వెతికి జాతకాలు కుదరక, పెళ్లిళ్లు జరగక బ్రహ్మచారులుగా మిగిలిపోయిన వాళ్ళు చాలామంది నాకు తెలుసు. తీరా జాతకం కుదిరి (అన్ని గుణాలు, పొంతనాలు కుదిరి) చేసుకునే పెళ్లి ఎన్నో విఫలమవుతున్నాయి కూడా. ఈ ఊహాజనిత జాతకాల చుట్టూ ఇంకో వ్యాపారం కూడా జరిగిపోతోంది. జాతకాలు మార్చి రాయడం, అనుకూలంగా తయారు చేయడం, దోషాల పేరుతో శాంతి, వ్రతాలు చేయడం, ఖర్చులు తడిసి మోపెడవడం ఒక ఎత్తు. జాతకంలో ఏలినాటి శని ఉందని, దోషముందని, సర్ప దోషమని, కుజదోషమని రకరకాల భయాలతో జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకునేవాళ్లు ఇంకొక ఎత్తు.. కర్మమేమి గలదో కర్మఫలమేమి జాతకములో వ్రాసి జాలమేల తనకు తాను చేసిన దానిని అనుభవించు విశ్వదాభిరామ వినురవేమ వీటన్నిటికీ మూల కారణం భయం. మా తాత వాళ్ళు జాతకాలు అనుసరించారు, మా నాన్న జాతకాలను పాటించారు, నేనూ పాటిస్తున్నాను. నా పిల్లలు పాటించకపోతే ఏమవుతుందో అని ప్రజలలో భయం. ఉదాహరణకు మా నాన్న జాతకాలు చూసేవాడు, పాటించేవాడు. నేను మానేశాను. నా పిల్లలకు జాతకాలు తయారు చేయలేదు. వాళ్లకు రాసులు తెలీదు. వాళ్ళకి పెళ్లిళ్లు అయ్యాయి, హాయిగా ఉన్నారు. అర్థం చేసుకుంటే, అన్వయించుకుంటే భయాలు తొలగుతాయి. ఒకప్పుడు కాశీకి పోయిన వాడు… కాటికి పోయిన వాడు ఒకటే అనేవాళ్ళు. ఇప్పుడు ఉదయం ఫ్లైట్లో పోయి రాత్రి ఫ్లైట్ లో తిరిగి ఇంటికి రావచ్చు. కాబట్టి కాలంతోపాటు ఆలోచనలు మారాలి.. ఆచరణ మారాలి.
రచయిత: మిఠాయి యుగంధర్ బాబు, పలమనేరు. ఫోన్ : 9394782540



