మిఠాయి యుగంధర్ బాబు

“కొత్త ఒక వింత పాత ఒక రోత” అనే సామెత విదితమే కదా. కొత్త కొత్త వస్తువులు వస్తుంటే పాత వాటిని (మార్చి) మర్చిపోతూ ఉంటాం. ఈ కొత్త సరుకుల ప్రచారం కోసం మార్కెట్లో మనకు కావలసినన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్, పత్రికల్లో ప్రకటనలు.. ఇక మన “ఇడియట్ బాక్స్” టీవీ ఉండనే ఉంది. అందులో సందు దొరికితే సందులో భాగంగా వ్యాపార ప్రకటనలు పుంఖానుపుంఖాలుగా కుమ్మరిస్తూ ఉంటారు. ఈరోజు ఈ కొత్త పేస్ట్ లో ఉప్పుందంటాడు, రేపు ఉప్పెందుకు బొగ్గు చాలంటాడు. మరి వాడే కదా మొన్నటి వరకు ఉప్పు లేకుండా అమ్మినాడు.. అది మన ఆలోచించం. దోమల కోసం పాత మిషన్ కంటే కొత్త మిషన్ బాగుందంటాడు. పాత మిషన్ వాడే అమ్మాడు….కొత్త మిషనూ వాడే అమ్ముతున్నాడు. కానీ దోమలు మాత్రం అన్ని మిషన్లని మించి పోయాయిలెండి . అది వేరే సంగతి. అలా మార్కెట్లో కొత్తగా ప్రకటనలతో యూట్యూబ్లో వీడియోలతో సినిమా తారల ఫోటోలతో వ్యాపారం ఊపందుకున్న కొత్త సరుకుల… “కమాడిటీ” నే *కరుంగళి మాల*.

మన తెలుగు సూపర్ స్టార్లు(!!!!!) ధరించడం వల్ల ఈ మధ్య ఈ మాల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే రకం మన జనాలు. అంతేకాదు ఎద్దు ఈనిందీ! అంటే గాట్లో (కొట్టంలో) కట్టేయరా!! అనే రకం కూడా మనమే. అరే ఎద్దు ఈనుతుందా (అంటే దూడను కంటుందా?).అది మగది కదా అని ఆలోచన కూడా చేయరు. అలా ఈ కరుంగళి మాల గురించి ప్రచారం వచ్చిన వెంటనే పోలోమని ఇంటిల్లిపాది కొని మెడలో దిగేసుకుంటున్నారు. వాళ్ల స్థాయిని బట్టి బంగారుతో, వెండితో జతకూర్చి ఈ కరుంగళి మాల వేసుకుంటా ఉన్నారు. అసలు ఈ కరుంగళి మాల ఏమిటి,దాని కథా కమామీషు ఏమిటి, కాస్త పరికించి చర్చించుకుందాం.

నల్ల తుమ్మి చెట్టు లేక నల్ల చేవమాను లేక కారుకలి వృక్షము అనబడే బ్లాక్ ఎబొని చెట్టు (black ebony tree) కలప నుండి తయారుచేసిన పూసలతో కూడినదే ఈ కరుంగళి మాల. ఈ నల్ల మచ్చ చెట్టును కరుణలి ,కరుంగలి లేదా నల్ల తుమ్మి చెట్టు అని పిలుస్తారు. ఇది చాలా గట్టి ముదురు నలుపు రంగు కలపకు ప్రసిద్ధి. దీని శాస్త్రీయ నామము డయోస్పైరోస్ ఎబొనం (diospyros ebonum) . కోరమాండల్ ఎబొనీ ఇంకా సిలోన్ ఎబోని అని కూడా పిలుస్తారు. దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దాదాపు 80 అడుగులు ఎత్తుకు ఈ చెట్టు ఎదుగుతుంది, గట్టి కలపని ఇస్తుంది. కాబట్టి పూర్వకాలంలో రాజ సౌధాల నిర్మాణానికి దేవాలయ నిర్మాణంలోనూ వీటిని వాడారు. ద్వారబంధనాలు తలుపులు తయారీలో ఈ చెక్కని ఎక్కువగా వాడారు. ఈ చెక్కకు చెదలు పట్టవు ఇది నీటిలో తడవదు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. సులభంగా పాలిష్ చేయొచ్చు పాలిష్ చేయబడిన చెక్క చల్లగా ఉంటుంది. ఈ లక్షణాల వల్ల వీటిని విరివిగా వాడారు. అంతేగాని వాటికి ఎలాంటి ప్రత్యేక లక్షణాలు లేవు కానీ గుడిలో వాడారు కాబట్టి మెల్లమెల్లగా వీటి చుట్టూ రకరకాల కథలు అల్లారు. ఈ చెట్టు సౌరవక్షము అని , సూర్యనారాయణుడి శక్తిని మొత్తం గ్రహిస్తుందనీ (సోలార్ కుక్కర్ ఉంటుంది కదా ఆ రకంగా అన్నమాట), పగటిపూట సౌరశక్తి నుంచి గ్రహించి రాత్రిపూట ఆశక్తిని విడుదల చేస్తుందని ప్రచారం చేశారు. సూర్యకిరణాలలో సూర్యుడు విడుదల చేసే శక్తిలో 75% ఈ కారుకళీ చెట్లు గ్రహిస్తాయట. అందుకే మంచి జరగాలంటే రాత్రిపూట గుడిలో నిద్ర చేయాలని చెప్పేవాళ్ళు అట. తమిళనాడులో చాలా కాలం నుంచి ఇది ప్రచారంలో ఉంది.

ఆ కరుంగళి చెక్క నుంచి తయారు చేసిన పూసలతో మాలలు చేసి అక్కడి దేవాలయాల్లో విగ్రహాలకు అలంకరిస్తారు కూడా.ఆ మాలలు తీసి భక్తులు కూడా మెడలో వేసుకొనేవారు. రాను రాను వాటికి లేనిపోని మహిమలను ఆపాదించారు. “ఈ కరుంగలళి మాలను ధరిస్తే నరాలకు విశ్రాంతినిస్తుంది, రక్తపోటు ను నియంత్రిస్తుంది, దుష్ట శక్తులను తొలగిస్తుంది. మానసిక ప్రశాంతతను, అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏకాగ్రత పెంచుతుంది. దిష్టి దోషాలు నరగోష నకారాత్మక శక్తులను తొలగించి రక్షణ కవచంగా పనిచేస్తుంది. వ్యాపారంలో లాభాలు, విద్యార్థులకు జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతను పెంపొందిస్తుంది. కుజ దోషాల వల్ల కలిగే దుష్టప్రభావాలు తగ్గించడానికి ఉపయోగ పడుతుంది.”అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీనికి తోడు సినిమా యాక్టర్లు ధరించడం వల్ల ,ఆ ఫోటోలు వైరల్ అయి ఈ మాలలపై డిమాండ్ పెరుగుతుంది. (సినిమా వాళ్లకు ఉన్నటువంటి భయాలు, నమ్మకాలు, సెంటిమెంట్లు, ఒక్కో హీరోల చేతికి పది పన్నెండు రంగు దారాలు, మెడలో పూసల దండలు చూస్తే జాలి, జుగుప్స కలుగుతుంది, వారిపై వారికి నమ్మకం లేకపోవడం వల్లనే ఇదంతా) డిమాండ్ తోపాటు మార్కెటింగ్ లో భాగంగా రకరకాల ఆంక్షలు, నమ్మకాలు జోడించారు.

ఈ మాలను ఎవరెవరు ధరించాలి? ఎప్పుడు ధరించాలి? పగటి పూట వేసుకోవచ్చా? రాత్రిపూట వేసుకోవచ్చా? పడుకునేటప్పుడు వేసుకోవచ్చా? మాల వేసుకున్న తర్వాత నియమాలు ఏంటి? ఏమి తినొచ్చు? ఏమి తినకూడదు? మాల సైజు ఎంత ఉండాలి? పూసల సైజు ఎంత ఉండాలి? బంగారు తో వేసుకోవాలా వెండితో వేసుకోవాలా? ఏ రోజు వేసుకోవాలి. మంగళవారం వేసుకోవాలా శుక్రవారం వేసుకోవాలా? రకరకాల ప్రశ్నలు…. రకరకాలుగా వాటికి జవాబులు. ప్రవచనం కారులు ఎవరికి తోచిన విధంగా, అది ఆపిల్ మ్యాక్ బుక్ లాప్టాప్ పెట్టుకొని చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో “నాన్సెన్స్” ని, “నాన్ సైన్స్” ని ప్రజలముందు కుమ్మరిస్తున్నారు. మాలను సరైన సైజులో, సరైన గురువు దగ్గర, సరైన కాలంలో వేసుకొని సరైన సూచనలు పాటిస్తూ ఉంటే అప్పుడే మంచి జరుగుతుందని, వాటిని తప్పిస్తే చాలా నెగిటివ్ ఎనర్జీకి ఆస్కారం ఏర్పడుతుంది, చాలా బాధలు పడతారు, ఆర్థికంగా నష్టపోతారు, డైవర్స్ అనేవి కూడా ప్రముఖంగా సెలబ్రిటీలలో జరిగిందట. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఇంకో ప్రవచన కారుడు.. ఎవరైనా ధరించవచ్చు, ఎప్పుడైనా ధరించవచ్చు కానీ నాన్-వెజ్ మాత్రం తినకూడదు అని చెబుతాడు. వినేవాడు చెప్పేవాడిని లోకువే కదా.

ఇదివరకు ఉన్నటువంటి రుద్రాక్ష మాలలు తులసి మాలలు, జ్వాలాముఖి మాలలు వాటి బదులు ఈ కరుంగళి మాలకు ఎగబడడం కొత్తొక వింత పాతొక రోత సామెతే కదా. ఈ మాలలు 6,7,8,10 mm సైజులలో దొరుకుతాయి. సైజును బట్టి రేట్లు. ఈ మాలను అమ్మేవాళ్లు ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా ఇస్తారట. సర్టిఫైడ్ కాకుండా తీసుకుంటే తక్కువ రేటు సర్టిఫికెట్ తో తీసుకుంటే ఎక్కువ రేటు. సర్టిఫికెట్లు ఇంటర్నేషనల్ జెమ్ లాబ్ ఇన్స్టిట్యూట్ తరఫున ఇస్తారట.అది ఎప్పుడు ఏర్పడిందో మనకు తెలియదు. మరి పెద్ద పూసలు వేసుకుంటే అది గ్రహించే రేడియేషన్ తట్టుకోలేరట. అందువల్ల చిన్న పూసలే వేసుకోవాలట. ఈ రేడియేషన్ ను వీళ్లు ఎలా కొలుస్తారో? ఈ పూసలు అసలైనవో, నకిలీవో తెలుసుకోవడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. నీటిలో వేస్తే మునిగితే అది అసలైంది (కరుంగళి మాల సాంద్రత ఎక్కువ కదా తప్పకుండా మునుగుతుంది). తేలితే నకిలీ. ఆ పూసలు నేలపై రుద్దితే చివరివరకు నల్లగా రంగు వస్తే అది అసలైంది. కొంచెం నలుపు రంగు వచ్చి తర్వాత పసుపు రంగు వస్తే అది నకిలీది అని తెలుసుకోవచ్చని ఉవాచ. ఈ మాల వేసుకుంటే పాటించవలసిన నియమాలు ఏమంటే హెయిర్ కటింగ్, షేవింగ్ అప్పుడు తీసివేయాలి, చావు దగ్గరికి వెళ్ళినప్పుడు తీసివేయాలి, పెళ్లయిన వాళ్లు రాత్రిపూట తీసివేయాలి, సింగిల్ గా అయితే రాత్రి పూట వేసుకోవచ్చు, స్నానానికి ముందు తీసివేసి, స్నానం తర్వాత వేసుకోవాలి, మాల వేసుకుని సంగమం చేయకూడదు ,బాత్రూంకి వెళ్లకూడదు … ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఈ మాల నేరుగా వేసుకోకుండా, మాలను ఆక్టివేట్ చేయాలట. ఎలా? ఈ మాలను మొదట నీళ్ళలో కడగాలి, తర్వాత పాలలో కడగాలి. ఆపై పొడి గుడ్డతో బాగా రుద్ది దేవుని ముందర పెట్టి పూజ చేయాలి… ప్రార్థిస్తే అప్పుడు అది ఆక్టివేట్ అవుతుందట. పూసలకే శక్తి ఉంటే ఈ ఆక్టివేషన్ తతంగం ఎందుకు? మాల బయట కనిపించినట్టు వేసుకోవాలట. అంటే పూసలు ఆకాశం వైపు చూస్తూ ఉండాలట. అప్పుడే సూర్యశక్తిని అది బాగా గ్రహిస్తుందట. ఎండ ముఖమే చూడని సెలబ్రిటీస్ కి మరి ఎండ ఎలా పడుతుంది. ఆ మాలకు శక్తి ఎలా వస్తుంది? అది వాళ్ళను ఎలా ప్రభావితం చేస్తుంది? అదేదో సినిమా పాట లాగా “కావాలీ ప్రశ్నలకూ.. జవాబులూ…” ప్లాస్టిక్ పూసల దండ, వెండి పూసల దండ, బంగారు పూసల దండ, నల్లచెక్క పూసల దండ… అన్నీ దండలే. డబ్బులు బట్టి స్తోమత బట్టి ఆ పూసలు, ఆ దండలు…. అవి దండలే తప్ప వాటికి ఎలాంటి ప్రత్యేకతలు, మహిమలు లేవు. ఉండవు కూడా. ఎలాంటి శక్తులు లేవు. ఎలాంటి ఎనర్జీని గ్రహించుకోవడం విడుదల చేయడం అనేది ఉండదు. ఏవో నమ్మకాలతో ఎవరో దండ వేసుకుంటే… ఆ ఫోటోలు చూపి వ్యాపారం చేసుకోవడం తప్ప ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. మనుషుల భయాలు, ఆందోళనలు, మానసిక దౌర్బల్యం, అత్యాశ మొదలగు వాటిని పునాదులుగా చేసుకుని వ్యాపారం చేసేవాళ్ల ప్రచారంలో భాగమే ఇదంతానూ. నిజానికి అంతరించిపోతున్న వృక్షాలలో ఈ కరుంగళి వృక్షం కూడా ఒకటి. అందుకే శ్రీలంకలో ఈ కలపను పెంచడం రవాణా చేయడం నిషేధించబడింది.1994 లో ప్రపంచ పరిరక్షణ యూనియన్ (ప్రస్తుతం “అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి” *IUCN* International Union for Conservation of Nature) ఈ కరుంగళి వృక్షాన్ని Red book లో చేర్చింది. ఇప్పుడు కరుంగళి మాల…. ఇంకొన్ని రోజులకి మరో మాల … రకరకాల పేర్లతో రకరకాల మోసాలు. మోసపోవడానికి అజ్ఞానంతో మనం తయారుగా ఉన్నంతకాలం వీళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *