సంపాదకీయం

క్రమంగా మానవ సమాజం మూగబోతోందా? భిన్న దృక్పథాల ప్రవాహాలకూ, నూతన ఆలోచనా స్రవంతులకూ తావులేని ఎడారిగా మారుతోందా? మనిషి ప్రశ్నించడం మరిచిపోతున్నాడా? ఎదిరించడం, నిలదీయడం, ప్రజల పక్షాన నిలబడడం మేధావులు తమ పని కాదనుకుంటున్నారా? మౌనధారణే మేలనుకుంటున్నారా?

ఒకవైపు మానవుడు భూనభోంతరాళాలను జయించానని జబ్బలు చరుస్తున్నాడు. ప్రకృతి శక్తుల్ని గుప్పిట్లో బంధించానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అవును మనిషి చరిత్ర ఎప్పుడూ ఎరగని ఆవిష్కరణలు చేస్తున్నమాట నిజమే. ఎల్లల్ని చెరిపేసి ప్రపంచాన్ని ఏకం చేస్తున్నట్టు కనిపిస్తున్న మాటా వాస్తవమే. మృత్యువును సైతం నిలవరించి అతడు చిరంజీవిగా మారే రోజులు సైతం ఎంతో దూరంలో లేకపోవచ్చు. హద్దులెరగని సుఖభోగాలు అతని ఒళ్ళో వచ్చి వాలుతుండొచ్చు.

కానీ ఇంత విజ్ఞానం, ఇంత సాంకేతికత, ఇంత అభివృద్ధి, ఇంత సంపద, ఇంత ధీమా మనిషిని మాటలు మరిచిపోయిన వాడిలా మారుస్తున్నాయా? బుద్ధి జీవులకు బుర్ర తప్ప నోరు అవసరం లేదని తీర్మానిస్తున్నాయా?

వెనక్కి తిరిగి చూస్తే మానవనాగరికతావికాసం ఎంత అద్భుతమైనది. ఎంత ఘర్షణామయమైంది! అందులో ఎన్ని వాదాలు, ఎన్ని వివాదాలు!

ఒకవైపు భావవాదం మరోవైపు దానికి దీటుగా భౌతిక వాదం శతాబ్దాల తరబడి ఎంత సమాంతరంగా సాగాయి ! అధికార పీఠమూ, పండిత పురోహిత వర్గమూ మొదటి దానికి ఎంత రక్షణ కవచంగా నిలబడ్డా ఆనాడు భౌతికవాదులెంత వీరోచితంగా పోరాడారు? ఎన్ని అడ్డంకులు, ఎన్ని దాడులు, ఎన్ని అవహేళనలు ఎదురైనా ఎన్ని తర్కవితర్కాలతో వారిని ఎదిరించారు! సత్యం కోసం ఎన్ని బలిపీఠాలు ఎక్కారు! ఈ తాత్విక సంఘర్షణే లేకుంటే సమాజం ఇంత దూరం ప్రయాణించగల్గేదా?

బౌద్ధం మనకందించిన వారసత్వం ఒకసారి వెనుదిరిగి చూచుకుంటే శరీరం పులకిస్తుంది. అమానుషక వైదిక యజ్ఞకాండ మీదా, అది సృష్టిస్తున్న సామాజిక సంక్షోభం మీదా అలనాటి భిక్షు వర్గం పోరాడిన తీరు,చూపించిన తెగువా, రూపొందించుకున్న వాదనలు, అన్నిటికంటే మించి వారి ప్రజాపక్షపాతం మనం ముందెన్నడూఎరుగనివి. సత్యం కోసం, జనం కోసం వారలా తెగించి గళం విప్పి వుండకపోతే ప్రపంచపు రూపురేఖలే ఇలా ఉండేవి కావు.

భౌతిక ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చార్వాకులు చూడమన్నారు. నేల విడిచిన సాములు చెయ్యవద్దన్నారు. అతీంద్రియతనూ, పారలౌకికతనూ అడ్డం పెట్టుకొని వంచిస్తున్న వారిని ఢీకొన్నారు. కోరి కష్టాలు తెచ్చుకున్నారు. శతాబ్దాల తర్వాత విజ్ఞాన శాస్త్రం వికసించి వీరికి తోడు దొరగాక గానీ శత్రువుల నోరు మూతపడలేదు. ఇదీ మన అసలు సిసలు వారసత్వం!

దేవుళ్ళ పేరా, దైవంశ సంభూతుల పేరా జరుగుతున్న దౌష్ట్యాన్ని ఎండబెట్టడమే, నిజం పక్షాన నిలబడ్డమే సాక్రటీస్ చేసిన పాపం. అథెన్సు అధికారాన్ని ప్రశ్నించడమే, యువకుల్ని మేల్కొలపడమే అతని నేరం. కానీ ఆనాడు ధీరోదాత్తంగా ఆయన తాగిన విషమే ఇప్పుడు ప్రశ్నకు ప్రాణం పోసింది. ప్రపంచానికి దారి చూపింది

ఒకరోజు ఎమిజోలా ఒంటరిగా నిలబడి రాసిన బహిరంగ ఉత్తరం వందలాది మేధావుల్ని ఒక తాటి మీదికి తెచ్చింది. దేశద్రోహిగా ముద్రపడ్డ ఆల్ఫ్రెడ్ డ్రేయిఫస్ ను నిర్దోషిని చేసింది. ఫ్రాన్సు ప్రభుత్వం అతన్ని తిరిగి సైన్యం లోకి తీసుకోక తప్పని పరిస్థితిని కల్పించింది ! ప్రజల పక్షాన నిలబడ్డ ఒక్క మహిళ గొంతుక అంతటి ప్రభావశీల శక్తి కాగల్గింది!

“ఒక్క మానవజాతిని మాత్రమే గుర్తుంచుకోండి. మిగిలినవన్నీ మరిచిపోండి” అన్న ఐన్ స్టీన్ రెస్సెల్ మేనిఫెస్టో ఎంత అద్భుతమైన ప్రకటన !ఒక సామ్రాజ్యవాది చేతిలోని అణ్వాయుధంతో భూగోళం అంతరించిపోయే ప్రమాదం ముంచుకొచ్చిన వేళ అది మఎనల్ని ఎంత గొప్పగా హెచ్చరించింది ! ఎన్ని లక్షల గళాల్ని తోడు తెచ్చుకోగల్గింది! మానవాళి పట్ల ఎంత బాధ్యతనది ప్రదర్శించింది, ఎంత భరోసానిచ్చింది!

ఇప్పుడు మనమీ మేధోవారసత్వాన్ని నిలుపుకోగల్గుతున్నామా? మన చుట్టూ వున్న ప్రపంచానికి మన బుద్ధిజీవులనుంచి నిరాశే మిగులుతోందా? అసలీ భూగోళమే తిర్యగ్ పరభ్రమణం చేస్తోందా అంటే ఒక్కోసారి నిజమేనన్పిస్తుంది.

చూస్తుండగానే ప్రపంచమంతా మీరూ- మేమూ అంటూ విడిపోతోంది. అగ్రరాజ్యం ఏదో పోగొట్టుకున్నట్టు మళ్లీ మా ప్రాభవం మాకు కావాలంటోంది. దీని కోసం ఎంత సిగ్గునైనా వొదులుకోడానికి సిద్ధపడుతోంది. పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా అన్ని దేశాలు పొట్ట చేతపట్టుకొచ్చిన వలస జనాన్ని అనుమానంగా, తలభారంగా చూడ్డం ఒక జాడ్యంలా విస్తరిస్తోంది. సహనం, సామరస్యం, సహజీవనం అనే మాటలు కాలం చెల్లినవవువుతున్నాయి. మనిషినేదో అభద్రత భయపడుతోంది. దాంతో అతడు చుట్టూ ఉన్న ప్రతిదాన్ని సందేహిస్తున్నాడు. విద్వేషం పెంచుకుంటున్నాడు. దీన్నుంచి జాత్యున్మాదం పుట్టుకొస్తోంది. మరి ఇచ్చిపుచ్చుకోడాలు లేకుండానే ప్రపంచమీ రూపాన్ని సంతరించుకుందా? మానవ స్వభావమే సంచారమూ, విస్తరణా గదా! సంకరం జరక్కుండా స్వచ్ఛంగా ఉన్న జాతి ఏదైనా వుందా ? అసలు జాతిని నిర్వచించే జన్యువేదీ మనలో లేదు గదా! వీటన్నిటిి మనిషి తీరిగ్గా, నిబ్బరంగా ఆచితూచి చూడలేకపోతున్నాడు. తన మూలాల్ని, స్వభావాన్ని గుర్తు తెచ్చుకోలేకపోతున్నాడు. తాను బుద్ధిగల మానవుడినన్న (హోమోసెపియఎన్ ) సంగతే మరిచిపోతున్నాడు. ఈ ప్రమాదాన్ని ఎరుక పరచవలసిన వారు ఎవరు ? మేధావులుగాక !

ఆధునిక యుగాన్ని ప్రజాస్వామిక యుగంగా మనం నిర్వచిస్తుంటాం. పద్దెనిమిదవ శతాబ్దపు ఫ్రెంచి విప్లవం నుంచి ఇరవైయ్యవ శతాబ్దపు సామ్రాజ్యవాద వలస వ్యతిరేక పోరాటాల దాకా స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం మనిషి పడ్డ తపనా, చేసిన ఉద్యమాలూ గతంలో ఎన్నడూ ఎరగనివి. ఇరవైయ్యవ శతాబ్దమంటేనే ప్రజాస్వామిక శక్తుల వీరాంగణం! కానీ రానురాను దేశాలకూ, జాతులకూ మాత్రమే కాదు వ్యక్తులకు సైతం ఈ స్వేచ్ఛ కుంచించుకుతోంది. ఒక విలువగా ప్రజాస్వామ్యం నిటారుగా నిలబడలేక పోతోంది. ఒక్కోదేశంలో ఒక్కో రూపంలో మితవాద, జాతివాద శక్తులు పీఠాలెక్కి కూర్చుంటున్నాయి. నియంతృత్వాన్ని నిత్యజీవితసత్యంగా మార్చేస్తున్నాయి. రాజ్యంతో మొదలుపెట్టి సమాజంలోని అన్ని పొరల్లోకి ఓ పథకం ప్రకారం చొచ్చుకుపోతున్నాయి. దీంతో సమాజానికి సమాజమే కలుషితమవుతోంది. కొత్త రూపంలో మళ్లీ పాసిజం ముంచుకొచ్చేలా కనిపిస్తోంది.మరి ఈ ధోరణిని ముందుగా పసిగట్టాల్సిన వారెవరు? ప్రజా మేధావులుగా నిలబడి ఓపిగ్గా జనానికి వివరించి చెప్పాల్సిన వారెవరు?

సమాచార సాంకేతిక విప్లవం నిజానికి వెయ్యి భావాల కలపోతకు వేదిక కావల్సింది. కానీ అది ఆశ్చర్యకరంగా అల్లరి మూకల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాటి వీరవిహారకేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు చరిత్రకారులు, వైజ్ఞానిక ప్రముఖులు, పురాతత్వశోధకులు, సాహితీ ధురంధరులు, సాంస్కృతిక మేధావులు, రాజకీయ విశ్లేషకులు చివరకు ఆధ్యాత్మిక ప్రభోధకులు కూడా ఈ గుంపే! ఓ చేత్తోఛాందసాన్ని, మరో చేత్తో విద్వేషాల్ని వండి వార్చడానికి వీరెప్పుడూ సిద్ధంగా వుంటారు. సైన్సును చూస్తే చాలు వీరికి చిర్రెత్తుకొస్తుంది. వీరికి రుజువులు, సాక్ష్యాలు, శాస్త్రీయ పద్ధతులు అంటూ ఏమీ వుండవు. ఒకానొక అబద్ధాల విశ్వవిద్యాలయంలో తర్ఫీదు పొందిన ఫాసిస్టు సైన్యమిది. వీరి ముందు వాస్తవాల్ని చెప్పడం కత్తిమీద సామే కావచ్చు. ఒక్కోసారి ప్రాణగండం కూడా రావచ్చు. కానీ చరిత్రలో సోక్రటీసు, చార్వాకులు నడిచింది ఈ బాటలోనే గదా! వారికెదురయిందీ ఈ సవాళ్లే గదా!

ఇప్పుడు నడుస్తున్నది కార్పోరేట్ల సామ్రాజ్యం. పాలకులు కేవలం వీరు చేతిలో తోలు బొమ్మలు. లాభమే వీరికి సర్వస్వం. దీనికోసం మీరు ప్రపంచాన్ని పిడికిట్లో బంధిస్తున్నారు. నియంతలకి పగ్గాలు పట్టిస్తున్నారు.అంక్షలతో, అసమాన ఒప్పందాలతో దేశాలకు దేశాలనే లొంగదీసుకుంటున్నారు. కొల్లగొడుతున్నారు. కాదంటే ప్రపంచ రౌడీల మల్లే వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ చాలవనుకొంటే యుద్ధాలు సృష్టిస్తారు. రాజ్యాల్ని తారుమారు చేస్తారు. ప్రపంచం విస్తుపొయ్యేలా దేశాధినేతల్నే ఎత్తకెళ్ళడం ఇటీవలే మనం చూచాం. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇంత దుర్మార్గం మనమెప్పుడూ చూడనిది. కానీ ఒక్కసారి మన పునరుజ్జీవనోద్యమాన్ని, స్వాతంత్ర్య పోరాటాన్ని తలచుకోండి. ఇదే శక్తుల్ని ఆనాడు ఎంత గొప్పగా ఎండగట్టాం. ఎంత సంఘటితంగా తిప్పికొట్టాం. మనమే కాదు ప్రపంచ ప్రజానీకం మొత్తం ఆనాడెలా అంత ఉత్తేజితం కాగల్గింది ? సామ్రాజ్యవాదుల్ని సముద్రాల దాటించి తరిమికొట్టగలిగింది? దీనికి విద్యావంతులే గదా ముందు నిలబడింది! మేధావివర్గమే గదా మొత్తం ప్రపంచాన్ని తట్టి లేపింది!

క్రమంగా మరో ధోరణి కూడా విస్తరిస్తోంది. మేదో చర్చలకు అవకాశాలు కుంచించుకపోతున్నాయి. లోతైన విశ్లేషణలు, శక్తివంతమైన వ్యాఖ్యలు చేయగల వారు తగ్గిపోతున్నారు లేదా దూరదూరంగా వుండిపోతున్నారు. పత్రికలు,టీవీలు, సామాజిక మాధ్యమాలు కాలక్షేపపు కబుర్లకు పరిమితమవుతున్నాయి. బుద్ధి జీవుల్లో తటస్థవాదం, సర్దుకుపోవడం, లౌక్యప్రదర్శనా పెరుగుతున్నాయి. ప్రజాక్షేత్రం స్థానే వీరికి పాపులరిజం ఇష్టపాత్రమవుతోంది. సీరియస్ గ్రంథ రచనా, పఠనం రెండూ నానాటికి సన్నగిల్లి పోతున్నాయి. దీనికి తోడు మన రచయితలు, కళాకారులు, ఆలోచనపరులు గతంలో ఎప్పుడూ లేనంతగా చీలిపోతున్నారు. ఎవరి ఒంటి స్తంభపు మేడ వారికి సుందరంగానే కాదు సౌకర్యంగానూ కన్పిస్తోంది. మోతాదుకు మించిన అస్తిత్వాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.విశాల ప్రపంచం పట్ల మొహం చాటేస్తున్నారు. సమస్త మానవాళినీ చుట్టుముడుతున్న చిమ్మచీకటిని చూడ నిరాకరిస్తున్నారు

వీరందరికీ సుద్దులు చెప్పి సరిచెయ్యడానికి ఏ జగద్గురువులూ ఆకాశం నుంచి దిగిరారు. తమ విలువను తామే పోగొట్టుకుంటున్నామన్న వీరి సొంత తెలివిడి నుంచే దీనికి పరిష్కారం దొరకాలి. ఎవరో కొందరు దీనికి తెగించి ముందు నిలబడాలి

ఇలా జరక్కపోతే వచ్చే ప్రమాదాలు కళ్ళ ముందు రెండు కనిపిస్తున్నాయి. ఒకటి ఎంతో నిబద్ధతో ప్రజామేధోకృషి చేస్తున్న కొద్దిమంది ఒంటరి వాళ్ళు కావడం. రెండు తమకు దారి చూపగలవారు కరువై మన అధోజగత్ సహోదరులు చుక్కాని లేని నావలుగా మారడం. సరిగ్గా ఇదే ఫాసిజానికి కావలసింది.

ఈ మేధోమాంద్యం ఇలా సాగాల్సిందేనా? ఇదీ మనముందున్న ప్రశ్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *