సి.వి. కృష్ణయ్య
పిల్లలు ఎందుకు ఆనందంగా ఉండాలి ?ఎందుకు సంతోషంగా పెరగాలి? ఆనందం లేకుండా పెరిగిన పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి వ్యక్తులుగా తయారవుతారు? అసలు బాల్యంలో ఆనందం అనేది ఎలా ఉంటుంది? పిల్లలపై ఎలాంటి హింస జరుగుతూ ఉంది? పిల్లల ఆనందం కోసం పెద్దలు ఏమి చేయాలి? ఈ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం.
బాల్యం గురించి ఏమీ తెలియని ప్రపంచం
ప్రపంచ మానవాళి ప్రకృతి గురించి , జీవుల గురించి ఎంతో విజ్ఞానం సంపాదించింది. శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాలు వీటిపై చేశారు. కొత్త ఆవిష్కరణలు రూపొందించారు. చివరకు మానవుడి అవయవాలు ప్రయోగశాలలో పెంచే వరకు వచ్చారు. కానీ మనిషి బాల్యం గురించి, వారి పెరుగుదల గురించిన జ్ఞానాన్ని మాత్రం సంపూర్ణంగా సంపాదించలేదు. శిశువు బాల్య దశలో ఎలాంటి వాతావరణంలో పెరిగితే ఎలాంటి వ్యక్తిగా తయారవుతాడు? గొప్ప కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు ,స్వాములు ,సన్యాసులు, ప్రజా సేవకులు, హంతకులు ,దొంగలు ,మంచివారు, చెడ్డవారు వీరంతా శిశుబాల్య దశల్లో ఎలాంటి వాతావరణంలో పెరిగారు ? వారి తల్లిదండ్రులు ఎలాంటి వారు? కుటుంబ జీవనం ఎలాంటిది ? కొందరు ప్రజల కోసం ఎందుకు ప్రాణాలు ఇస్తున్నారు? మరొకరు ఎందుకు ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు ? ఇలాంటి అన్ని విషయాలపై దీర్ఘకాలం సమగ్ర పరిశోధనలు ఏవీ జరగలేదు ?జంతువులపై చేసిన ప్రయోగాలు మనుషులపై ప్రయోగిస్తున్నారు. బాల్యం అనేది వ్యక్తిగతం కాదు. అది కుటుంబ సమస్యో, ఒక దేశ సమస్యో కాదు. పేదరికానికిి చెందిన సమస్య కూడా కాదు .అది ప్రపంచ మానవాళి సమస్య .మానవ సమాజం ఏ వైపు సాగాలో దిశా నిర్దేశం చేసే సమస్య .బాల్యం అనేది భవనానికి పునాది వంటిది. ఆ పునాది భద్రంగా ఉండాలి కదా! ఆ పునాది నిర్మాణం వైపా,విధ్వంసం వైపా ఆలోచించాలి.
బాల్యంపై జరుగుతున్న హింస
బాలలపై జరుగుతున్న హింస గురించి ఎంత చెప్పినా తక్కువే .పిల్లల భవిష్యత్తు పేరుతోనో, వారి మేలుకోసమో, ఆనందం కోసమో అన్నట్టు జరిగే హింస సంగతి ముందుగా తెలుసుకోవాలి .ఇది చదువుల పేరుతోనూ, సమాజపు అంగీకారంతోనూ, అజ్ఞానంతోనూ జరుగుతున్న హింస. బాల్యం గురించి ప్రపంచానికి ఏమీ తెలియదని నేను మొదట చెప్పిన సంగతి అన్నిటికంటె ఈ చదువులకు ఎక్కువగా వర్తిస్తుంది .ఒక విషయం గురించిన జ్ఞానం పిల్లలు ఎలా సంపాదించుకుంటారు? వారి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా నేర్పడం సాధ్యమవుతుందా? భయంతో జ్ఞానాన్ని సంపాదించగలరా? పరీక్షల భయం, టీచర్ల భయం, తల్లిదండ్రుల భయం, గంటల తరబడి కూర్చుని వినడం, అనుభవంతో తెలుసుకోవలసిన విషయం కంఠస్థం చేయాల్సి రావడం ,ఇతరులతో పోల్చడం, శిక్షలు, బహుమతులు ఇవన్నీ పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి?
బాలికలైనా, బాలులైనా పిల్లలపై జరిగే లైంగిక హింస సంగతి సమాజానికి తెలిసేది ఒక శాతమే. ఇళ్లల్లో ,హాస్టళ్లలో, పనిచేసే ప్రదేశాల్లో, మత సంస్థల్లో చాలా రహస్యంగా ఇది జరిగిపోతూ ఉంటుంది. పైకి చెప్పుకోలేని హింస ఇది. ఆటల్ని అటకెక్కించి కధలనీ, కబుర్లనీ కంచికి పంపించి ,నిరంతరం నీతులు చెబుతూ ,తిట్లతో దబాయింపులతో బాల్యాన్ని నలిపేసి, నరకం చేస్తే ,ఆ పిల్లలు కసి ద్వేషం పగలతో రగిలిపోతూ పెరిగితే వాళ్లు మనుషులుగా మిగులుతారా? మానవత్వంతో పెరుగుతారా? చుట్టూ ఉన్న నేర ప్రపంచం రారమ్మని ఆహ్వానిస్తుంటే ఏమి జరుగుతుందో మనకు తెలియదా?
బాల్యం ఒక బంగారు కాలం
మనుషులు వయస్సును బట్టి ఒక్కో దశ దాటుకుంటూ భవిష్యత్తులోకి అడుగుపెడతారు .వీరు బాల్య కౌమార దశలు దాటి యవ్వనంలో ప్రవేశిస్తారు . నూతన ఉత్సాహంతో ఉరకలు వేస్తూ చదువులు పూర్తి చేసి, ఉద్యోగంలో చేరుతారు. పెళ్లి చేసుకుంటారు .పిల్లలు పుడతారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. పిల్లల చదువులు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మరేవో సమస్యలు చుట్టుముట్టుకొంటాయి. జీవితం ఏదో తేడాగా కనిపిస్తుంది. ఆలోచిస్తూ మధన పడతారు. అప్పుడు గుర్తుకు వస్తుంది ఆనందంగా లేని సంగతి. గతాన్ని గుర్తు చేసుకుంటూ కాలంతో వెనక్కి వెళ్లి చూస్తాం. బాల్యంలోకి తొంగి చూస్తాం. ఒకసారి గుండెలు ఆనందంతో పొంగిపోతాయి. అది బంగారు కాలం. స్వర్గం . బాధ్యతలు బరువులు లేని బాల్యం. కుల మతాల అడ్డుగోడలు లేని స్వేచ్ఛా ప్రపంచం. ఆస్తులు, అంతస్తులు తేడాలు వొంటబట్టని వయస్సు .కల్లాకపటం లేని హృదయాలు. కొట్టుకుంటారు ,తిట్టుకుంటారు అంతలోనే కలిసిపోయి ఆడుకుంటారు.
ఆటలు, మాటలే వారికి ఆనందాలు. వారికి విలువైన ఆట వస్తువులు అవసరం లేదు. మట్టి, ఇసుక, రాళ్లు, కర్ర పుల్లలు, గాజు పెంకులతో ఆడుకుంటారు. చిన్న చిన్న విషయాలకి పగలబడి నవ్వుకుంటారు. కదిలే కుక్క తోకను చూసి కడుపుబ్బ నవ్వుతారు. తెరలు తెరలుగా అలసిపోయే వరకు నవ్వుతూనే ఉంటారు. బ్రహ్మానంద భరితులవుతారు. వారి శరీరంలో ప్రతి అణువు పులగకించిపోతుంది. ఆనందమనేది ఇలా ఉంటుందని, స్వర్గం అనేది బాల్యమేననీ అర్థం చేసుకుంటాం.
మనుషులు జీవితంలో విజయం సాధించినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, కొత్తబట్టలకు కొనుక్కున్నప్పుడు, కోరికలు తీరినప్పుడు పొందేవి ఆనందాలు కాదు .అది తీయటి మిఠాయిలను తిన్నప్పుడు కలిగే సంతృప్తి లాంటిది. అది కొద్దిసేపు ఉండి మరుగున పడిపోతుంది .కానీ బాల్యంలోని ఆనందం అంతరంగానికి చెందినది. బాల్యంలో పొందిన ఆనందం మరి దేని వల్ల కూడా పొంద లేనిది.
ఇష్టముంటే కష్టపడతాం
“పిల్లల ఆనందం కోసం వారు కోరినవన్నీ కొనిస్తుంటాం. సకల సౌకర్యాలు సమకూరుస్తుంటాం. వారికి ఇంకేమి కావాలి? అయినా పిల్లలు మాట వినడం లేదు”అంటూ కొంతమంది తల్లిదండ్రులు వాపోతుంటారు. ఇలాంటి తల్లిదండ్రులకు పిల్లల ఆనందం గురించి ఏమీ తెలియదని అర్థం చేసుకోవాలి .”పిల్లలు బాల్యంలో కష్టపడి పెరిగితే పెద్దవాళ్ళయ్యాక సుఖపడవచ్చు కదా” అంటూ కొంతమంది గొప్ప వ్యక్తుల్ని ఉదాహరణగా చూపిస్తుంటారు.
పిల్లలు కష్టపడకూడదు అనడం లేదు .పనిచేయడంలో, ఏదైనా సాధించడంలో కష్టపడడం వేరు. వారు మనసులను నొచ్చుకునేటట్లు బాధపడేట్లు చేయడం వేరు. మనం ఒక విశాలమైన మైదానానికి పిల్లల్ని తీసుకొని వెళ్తాము. ఆ పక్కన ఉన్న ఎత్తైన కొండ ఆకర్షిస్తుంది. ఎంత కష్టమైనా ఆ కొండనెక్కి విజయం సాధించాలనుకుంటాం. ఇలా పిల్లలు ఇష్టమైయితే ఎంత కష్టమైనా భరిస్తారు .చదువు కూడా ఇలాగే ఇష్టపూర్వకంగా సాగాలి.
బాలల ఆనందం సమాజానికి చుక్కాని
ఆనందంగా, స్వేచ్ఛగా ఎదిగిన బాలల సమాజం ఈ ప్రపంచాన్ని సరైన దిశకు తీసుకొని పోతుంది. తమ జీవితాలతో పాటు ప్రపంచాన్ని కూడా సంతోషంగా ఉండేలా చూస్తుంది . ఆనందంగా ఎదిగిన పిల్లలు ఆశావా దృక్పథంతో ఉంటారు.
అయితే బాల్యం ఆనందంగా ఉండడం అనేది బాలల చేతిలో లేదు .అది పెద్దల చేతిలోనే ఉంది. మానవ సమాజాన్ని హింస వైపు నడిపిస్తారో, శాంతి వైపు నడిపిస్తారో పెద్దల ఇష్టం.
‘బాల్యం ఆనందంగా ఉండాలి. పిల్లల సంతోషంగా ఎదగాలి’ అనే మాటలు పిల్లల మీద ప్రేమతోనో జాలితోనో అంటున్న మాటలు కాదు. మానవ సమాజం ఏ దిక్కు వైపు ప్రయాణం చేయాలో ఆ వైపు వేసే తొలి అడుగును గురించిన హెచ్చరిక -ఆ మాటలు!



