ఎస్. వెంకట్రావు
మన సౌరకుటుంబంలో గ్రహాలూ ఎన్ని? ఇప్పుడు అవి ఎనిమిది అని అందరికీ తెలిసిందే! ఒకప్పుడు ప్లూటో కూడా ఉండేది. మొత్తం తొమ్మిది. కానీ ఇప్పుడు ప్లుటోని గ్రహంగా లెక్కించటం లేదు. 2006 లో జాకోస్లోవేకియాలోని ప్రాగ్ నగరం లో సమావేశమయిన అంతర్జాతీయ ఖగోళశాస్త్ర సంఘం (ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్-ఐఎయు) చేసిన నిర్ణయాన్ని బట్టి ఇకపైమనం సూర్య కుటుంబాన్ని అష్ట గ్రహ కూటమిగా పిలవాల్సి ఉంటుంది… అవి: బుదుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు(కుజుడు), బృహస్పతి(గురుడు), శని, యురేనస్, నెప్ట్యూన్. సరికొత్త ఖగోళ పరిశోధనలు చెప్పిన వివరాల ప్రకారం మన సూర్య కుటుంబం నుండి ఒక గ్రహాన్ని తీసివేసి లెక్కేసుకోవాలి. అలా కాదు గ్రహాలను తగ్గించడానికి వీల్లేదు అనుకుంటే మరో మూడు గోళాలను కూడుకుని 12 గ్రహాలుగా పిలవాల్సి వచ్చేది. ప్రాగ్ సమావేశంలో శాస్త్రవేత్తలు తీసివేత లెక్క చెప్పారు కాబట్టి ఫరవాలేదుగాని కూడికలయ్యుంటే మాత్రం లెక్క ఇంతటితో ఆగకపోయి ఉండేను. రానున్న రెండేళ్ళలో మరో పన్నెండు గోళాలు వచ్చి చేరి సూర్యుని చుట్టూ మొత్తం 24 గ్రహాలు ఉన్నాయి అని చదువుకోవలసి వచ్చేది.
అసలు సమస్యంతా ‘ప్లూటో’తో వచ్చింది. 1930లో ప్లూటో గ్రహాన్ని కనుగొనక ముందు అంతర్జాతీయ ఖగోళ సంఘం సూర్య కుటుంబంలో ఎనిమిది గ్రహాలు మాత్రమే ఉన్నాయని గుర్తించింది. ప్లూటో వచ్చి చేరడంతో మొత్తం తొమ్మిది గ్రహాలైనాయి. అంతకు ముందు 1801వ సంవత్సరంలో ఖగోళ శాస్త్రవేత్తలు అంగారక, గురు గ్రహాల మధ్య ‘సెరెస్’ అనే మరో గ్రహాన్ని కనిపెట్టారు. అయితే తరువాతి కాలంలో ఇది గ్రహం
(ప్లానెట్) కాదని గ్రహశకలం (ఆస్టరాయిడ్) మాత్రమేనని తెలుసుకున్నారు. అంగారక, గురు గ్రహాల మధ్య అనేక వేల సంఖ్యలో ఆస్టరాయిడ్లు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ‘ఆస్టరాయిడ్ బెల్ట్’ అంటారు. ఆస్టరాయిడ్లలో చిన్నవి పెద్దవి లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ గ్రహాల మాదిరిగానే సూర్యుని చూట్టూ పరిభ్రమిస్తున్నాయి. వాటిలో గ్రహం ఏదో, కానిదేదో తెలుసుకోవడం ఎలా? అసలింతకీ గ్రహం అని దేన్ని అనాలి, గ్రహ శకలం అని దేన్ని అనాలి? ఈ సందేహాలన్నీ శాస్త్రవేత్తలకు వచ్చాయి. ఖగోళంలో 700 కిలోమీటర్ల వ్యాసం కలిగిన పదార్ధపు ముద్దలన్నీ తమలోని గురుత్వాకర్షణ శక్తివల్ల గుండ్రంగా మారుతాయి. అంతకన్నా తక్కువ వ్యాసం గలవి గుండ్రంగా మారవు. కనుక అవి సాధారణంగా బంగాళ దుంప ఆకారంలో ఉంటాయి. అంగారకుని చుట్టూ ఇతర గ్రహాల చుట్టూ తిరిగే చిన్న చిన్న ఉపగ్రహాలు పరిమాణంలో తక్కువగా ఉన్నందున బంగాళదుంప ఆకారంలో ఉంటాయి. కాని మన భూమి చుట్టూ తిరిగే చంద్రుడి వ్యాసం 700 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటుంది కనుక అది గుండ్రంగా ఉంటుంది. అందువల్ల ఒక నిర్ధిష్ట పరిమాణం కన్నా పెద్దదిగా ఉండి, సూర్యునిచుట్టూ తిరిగే గోళాలను గ్రహాలూ అనీ, మిగిలిన వాటిని గ్రహశకలాలు అనీ అన్నారు. ఈ లెక్కన చూస్తే సెరెస్ గ్రహం కాదని ఒక పెద్ద గ్రహ శకలం మాత్రమేనని తేల్చి దాన్ని సూర్య కుటుంబంలోని గ్రహాల జాబితా నుండి తొలగించారు.
ఇక 1930లో ప్లూటోను కనుగొనడం జరిగింది. దాన్ని నేరుగా గమనించలేదు. నెప్ట్యూన్ గ్రహానికి దగ్గర్లోనుండి టెలిస్కోపులకు అందుతున్న సంకేతాలను బట్టి అక్కడ ఒక గ్రహం ఉండాలని కనిపెట్టారు. దాని పరిమాణం, కక్ష్య మొదలైన వాటిని కూడా లెక్కకట్టారు. ఆ విధంగా లెక్కల ద్వారా కనుగొనబడిన గ్రహానికి ప్లూటో అని పేరు పెట్టారు. తరువాత ఖగోళ పరిశోధనల్లో ప్లూటో దూరదర్శిని కంటికి కనిపించింది.
అయితే దీని పరిమాణం చాలా చిన్నది. మన చంద్రుని కన్నా చాలా చిన్నది. దాని వ్యాసం 2,300 కిలోమీటర్లు మాత్రమే. చంద్రుని వ్యాసం 3,476 కిలో మీటర్లు. ప్లూటో చంద్రుని కన్నా చిన్నదిగా ఉన్నప్పటికీ చంద్రుని మాదిరిగా మరో గ్రహం చుట్టూ తిరగడం లేదు కాబట్టీ, భూమి మాదిరిగా సూర్యుని చుట్టూ తిరుగుతోంది కాబట్టీ దాన్ని గ్రహంగా పరిగణించారు.
అయితే ప్లూటోను కనుగొన్న కొద్దికాలం తరువాతే నెప్ట్యూన్కు ఆవల సూర్య కుటుంబంలో ప్లూటోతో బాటు మరిన్ని గోళాలున్నాయని వాటిలో ప్లూటో పరిమాణంతో సమానమైనవీ, ఇంకా పెద్దవీ, చిన్నవీ చాలా ఉన్నాయని శాస్త్ర వేత్తలు కనుగొన్నారు.100 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వ్యాసం గల గోళాలు ఇక్కడ ఒక లక్షకు పైనే ఉన్నాయని అంచనా. ఇంకా చిన్న చిన్న గోళాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. సూర్యునికి చాలా దూరంలో ఉన్నాయి గనుక ఈ గోళాలన్నీ మంచుతో గడ్డకట్టుకుని ఉంటాయి. నెప్ట్యూన్కు బయట ఇటువంటి గోళాల సముదాయం ఉన్న ప్రాంతాన్ని ‘క్యూపెర్ బెల్ట్’ అని అంటున్నారు. అంగారకుడు-గురుగ్రహాల మధ్య ‘ఆస్టరాయిడ్ బెల్ట్’ మాదిరిగానే నెప్ట్యూన్ వెలుపల ఈ ‘క్యూపెర్ బెల్ట్’ ఉన్నది. ప్లూటో ఈ క్యూపెర్ బెల్ట్ ఒక పెద్ద గోళమేనని అటువంటి సైజు గోళాలు అక్కడ ఇంకా చాలా వున్నాయని తరువాత కనుగొన్నారు. అంతే కాదు కొన్ని లక్షణాల దృష్ట్యా చూసినప్పుడు కూడా ఇతర ఎనిమిది గ్రహాలకూ ప్లూటోకూ మధ్య చాలా తేడాలున్నాయి. ప్లూటో వంటివే చాలా గ్రహాలు తరువాత కనుగొనబడ్డాయి. వాటిలో ఇటీవల కనుగొన బడిన ‘దశమ గ్రహం’ -గీనా- ఒకటి. అందువల్ల ప్లూటో గ్రహం కాదనీ, ప్లూటో మాదిరి ఇతర గోళాలు కూడా గ్రహాలు అంతకన్నా కావని శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. అందువల్ల ప్లూటోను గ్రహాల జాబితాలోంచి తీసేసి ఎనిమిది గ్రహాలుగా ప్రకటించాలని కొందరు నిపుణులు డిమాండ్ చేశారు. అయితే ప్లూటో గ్రహం కాదన్న మాట వాస్తవమేగాని దాన్ని గ్రహాల జాబితా లోంచి తొలగించడం సాధ్యం కాదని, ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లోనూ, విద్యార్థుల్లోనూ, చారిత్రకంగా పుస్తకాల్లోనూ నవగ్రహాలు అనేది అలవాటైపోయిందని వారు చెప్పారు. చివరికి ఈ చర్చను ముగించడం కోసం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన గిబోర్ బస్రి అనే శాస్త్రవేత్త అంతర్జాతీయ ఖగోళశాస్త్ర సంఘంలో ఒక ప్రతిపాదన ప్రవేశపెట్టాడు. దాని ప్రకారం “800 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వ్యాసం కలిగి, భూమి ఘనపరిమాణంలో సుమారు 12,000వ వంతు కలిగి ఉండి, గుండ్రంగా ఉండి, సూర్యుని చుట్టూ తిరిగే గోళమే గ్రహం.” గుండ్రంగా ఉండడం అనేది కీలకమని, గుండ్రంగా ఉండడమంటే అంతటి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉన్నట్లని నిపుణుల చెబుతున్నారు.
బస్రి నిర్వచనం ప్రకారం అయితే ప్లూటో గ్రహం కిందకే వస్తుంది. కాని చంద్రుడు మాత్రం గ్రహం కిందకు రాడు. ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు గనుక. అయితే ఈ నిర్వచనం ప్రకారం ఏనాడో 1801లో శాస్త్రవేత్తలు కనుగొని, గ్రహంగా పరిగణంచి, తరువాత మళ్లీ గ్రహం కాదని తేల్చేసిన ‘సెరెస్’ కూడా ‘గ్రహం’ కిందకు వచ్చేస్తుంది. అంతే కాకుండా క్యూపెర్ బెల్ట్ ఇటీవల కనుగొన్న చరన్, గ్జీనా (2003 యుబి 313)లు కూడా గ్రహాల కోవలోకి వచ్చేస్తాయి. ‘2003 యుబి 313’ గ్రహానికి టివి సీరియల్లో యోధురాలైన గ్జీనా పేరు పెట్టారు. ఈ మూడు కొత్త గ్రహాలను కలుపుకుంటే మనం సూర్య కుటుంబంలో గ్రహాల వరుసను ఇలా చదువుకోవలసి వచ్చేది: బుదుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు (కుజుడు), సెరెస్, బృహస్పతి(గురుడు), శని, నెప్ట్యూన్, ప్లూటో, చరన్, గ్జీనా. బాగుంది కదూ వరస! అయితే ఈ ప్రతి పాదన చేసిన శాస్త్ర వేత్తలు సూర్య కుటుంబాన్ని రెండు ఉప కుటుంబాలుగా విభజించారు. బుధ గ్రహం నుండి వరుసగా నెప్ట్యూన్ వరకు తొమ్మిదింటిని గ్రహాలు గానూ, ప్లూటో దాని తరువాత ఉన్న మరో రెండు గ్రహాలను కలుపుకుని మొత్తం మూడింటిని ‘ప్లూటాన్లు’ అనీ పిలిచారు. ప్లూటాన్లన్నీ ‘క్యూపెర్ బెల్ట్’లో ఉంటాయి. వీటికి ఇతర గ్రహాలతో పోలిస్తే కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి.
అంతర్జాతీయ ఖగోళశాస్త్ర సంఘం ఈ నిర్వచనాన్ని ఆమోదించి ఉంటే గ్రహాల సంఖ్య ఇంతటితో ఆగిపోయేది కాదు. త్వరలోనే మరో 12 గ్రహాలు దీనికి చేరి గ్రహాల జాబితా మొత్తం 24గా తేలేది. అప్పుడు నవగ్రహాలను 24 గ్రహాలను గుర్తుపెట్టుకో వలసి వచ్చేది. ప్రేగ్ సమావేశంలో శాస్త్రవేత్తలు ఒక అంతరిక్ష వస్తువుకి గ్రహంఅనే హోదా ఇవ్వాలంటే అది తప్పనిసరిగా సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేయాలి, దాదాపు గుండ్రంగా (గోళాకారంగా) ఉండాలి ఇంకా దాని కక్ష్య చుట్టూ ఉన్న ” ప్రాంతాన్ని శుభ్రం చేయాలి “. అంటే తన గురుత్వాకర్షణ శక్తితో తన చుట్టూ వున్నా చిన్న చిన్న గ్రహశకలాల్ని తనలో కలిపేసుకునెంత శక్తివంతమయినది అయి ఉండాలి అని నిర్ణయించారు. సరిగ్గా ఈ మూడో లక్షణమే ప్లుటోకి లోపించింది. అది నెప్ట్యూన్ గ్రహం ఆవల వున్న చాలా గోళాల్లో అది ఒకటి మాత్రమే అయింది. సౌరకుటుంబంలో ఎనిమిది మాత్రమే గ్రహాలుగా మిగిలాయి.



