డా. యం. గేయానంద్
క్లాసిక్ గ్రీకు, రోం సామ్రాజ్యాల ప్రభావం నశించి, చిన్నచిన్న ముక్కలుగా, ఆటవిక రాజ్యాలుగా యూరోప్ మారిపోయింది. క్రైస్తవం క్రమేణా ఈ ఖాళీలో ఎదిగి నిలదొక్కుకొంటున్నది. ప్రజల్లో క్రైస్తవానికి ఉండే ఆదరణ చూసిన పాలకులూ, క్రైస్తవంలోకి మారడం ప్రారంభించారు. అది క్రీ.శ.5-6 శతాబ్ధాల మాట.
ఈ సమయంలో మధ్య ప్రాచ్యంలోని ఎడారులలో ఉండే ఎన్నో తెగల మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. బహుదేవతారాధనతో గొడవలు పడుతూ వుండేవారు. పేద ప్రజల్నివడ్డీపీడనలతో బానిసలుగా మార్చుకోనే ధనవంతులుండేవారు. చీలికలు, పీలికలై దశా దిశాలేని ఈ సమాజాలలోకి మహమ్మద్ ప్రవక్త (610 AD) ఆగమనం, చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం.
ప్రవక్త ప్రజలందరూ ఒకటే అన్నాడు. దేవుడు ఒక్కడే అన్నాడు. సామాజిక జీవితాన్ని నియమబద్ధం చేసే చర్యలు చేపట్టాడు. మహమ్మద్ వారసులే ఖలీఫాలుగా స్పెయిన్ నుండి సింధూ ప్రాంతం దాకా విస్తరించి, పాలించారు. పర్షియా, ఇండియా, బైజాంటైన్‍ల దారులన్నీ మధ్య ప్రాచ్యంలో కలిసేవి. ఎన్నో భాషలూ, మతాలూ ఉన్న ఒక వ్యాపార కేంద్రంగా ఆ ప్రాంతం ఉండేది. ముస్లిం వ్యాపారులు చైనా, భారతదేశం, ఐరోపా దేశాలతో విస్తృతమైన వ్యాపారం చేసేవారు. ఈ సంబంధాల వల్లే వారికి దిక్సూచి కాగితం తెలిసింది. ఆ తరువాత కొత్త సాగు పద్ధతులు తెలుసుకోవడంతో ఆహారోత్పతి పెరిగింది. ఆర్థికంగా స్థిరపడిన సమాజం వైజ్ఞానిక పరిశోధనలపై దృష్టి పెట్టగలిగింది.
అయితే తొలి ఇస్లాంకు ఒక ప్రత్యేకత ఉంది. ఖురాన్‍లో జ్ఞానం సంపాదించడం (ఇల్మ్) చాలా ముఖ్యమైన అంశంగా చెబుతారు. విశ్వాన్ని పరిశీలించాలని ఖురాన్ చెబుతుంది. అట్లే అరబిక్ భాష సాధారణ భాషగా, అందరి భాషగా ఉండి సమాచార వినిమయం సులభతరం చేసింది. అదేవిధంగా అల్లాను కాదని క్షుద్ర విద్యలు, జ్యోతిష్యం లాంటి వాటిని నేర్చుకోవడాన్ని ఇస్లాం తప్పు పట్టేది.
అటువంటి సమయంలో 8 వ శతాబ్ధం మధ్యలో, విజ్ఞాన శాస్త్రం మధ్య ప్రాచ్యంలో మళ్ళీ వికసించడం ప్రారంభించింది. 762AD లో ఒక పెద్దనగరం నిర్మాణం ప్రారంభమైంది. దాన్ని శాంతి నగరం అన్నారు. అదే బాగ్దాద్. అబాసిడ్ ఖలీఫాల పాలనలో రాజధానిగా బాగ్దాద్ నిర్మాణం జరిగింది. 937 AD లో బాగ్దాద్‍లో 10 లక్షల జనాభా ఉండేదట. ఈ కాలంలోనే స్పెయిన్ నుండి సింధూ దాకా అబాసిడ్ సామ్రాజ్యం విస్తరించింది. బాగ్దాద్ విజ్ఞానం, సృజనాత్మకతల కేంద్రమైంది. ఆ పాలకులలో అప్పటి విజ్ఞానాన్నంతా గ్రహించాలనే తృష్ణ ఉండేది. ప్రయోగం, పరిశీలన లాంటి కొత్త ఆలోచనలు ప్రోత్సహించారు. మేధోమధనాలని ఆ సమాజం ఆహ్వానించింది. తత్వశాస్త్రం, గణితం, ఖగోళ విజ్ఞానాలు, వైద్యం, చట్టం – తదితర అంశాలలో తీవ్ర కృషి ప్రారంభమైంది. ఈ మేధో కృషికంతా కేంద్రం బాగ్దాద్‍లోని వైజ్ఞానిక గృహం (HouseofWisdom). ఈ వైజ్ఞానిక గృహం లో నిరంతర అనువాదాలు జరిగేవి. బైజంటైన్ నుండి గ్రీకు మానుస్క్రిప్ట్స్ ను తెప్పించేవారు. అరిస్టాటిల్ ను అనువదించడానికి పోటీ పడేవారట. అరిస్టాటిల్ మీద అరబ్ లో ఆనాడు వచ్చినన్ని వ్యాఖ్యానాలు ఈనాటికి కూడా ఇంగ్లీషులో ఉండవంటారు. ఖలీఫా అల్ రషీద్ అనువాదాలని ఒక మహత్ కార్యంగా ప్రోత్సహించేవాడు (అరేబియన్ నైట్స్ కథలో వచ్చే అల్ రషీద్ ఇతనే). అదో హోదాగా భావించేవారు. ప్రధానంగా మూలనపడిన గ్రీకు విజ్ఞానాలను వెలికి తీసి, అనువాదాలు చేశారు. అయితే ఈ పాత విజ్ఞానాల ఆధారంగా ఇస్లాం విజ్ఞానులు కొత్త ఆలోచనలు చేసేవారు. అవి ప్రపంచాన్ని మార్చిన ఆలోచనలు.గ్రీకు, రోమ్, చైనా, భారతీయ విజ్ఞానాలు అరబిక్‍లోకి అనువాదం మాత్రమే చేసుకోలేదు. వాటిని మక్కికి మక్కిగా ఒప్పుకోలేదు. వాటిని పరిశీలించారు, ప్రశ్నించారు, కొత్త విషయాలు కలిపారు. ఆవిష్కరణలు చేశారు. వారు ఆ ప్రాచీన నాగరికతల విజ్ఞానాలనే కాదు, వారి మేధో విజ్ఞతలను కూడా తీసుకొని, వాటిని అభివృద్ధి చేశారు, అధ్యయనం చేశారు.
ఖలీఫా అల్ రషీద్ ఆస్థానంలో స్త్రీలు కూడా కొందరు ఉన్నత స్థానంలో కన్పిస్తారు. అల్ ఖజురాన్ అనే యమని బానిస స్త్రీ అల్ రషీద్ భార్య స్థాయికి చేరుకొని పాలనలో, సైనిక తంత్రంలో, విదేశీ వ్యవహారాల చర్చలలో పాల్గొనేదట. అల్ రషీద్ ఏనుగులను, నీటి గడియారాలను ఫ్రాన్స్ చక్రవర్తికి బహుమతులుగా పంపాడట. ఆ ఏనుగును ఇండియా నుండి బాగ్దాదుకు అక్కడి నుండి ఫ్రాన్సుకు నడిపించుకుంటూ తెచ్చారు. ఎంతోకొంత జంతు విజ్ఞానం అభివృద్ధి చెందకుండా ఇది జరగదు.
8 వ శతాబ్దంలో చైనా నుండి కాగితం తయారీ రహస్యాన్ని అరబ్బులు తెలుసుకోవడం, చౌకగా కాగితం లభ్యం కావడంతో పుస్తకాల ప్రచురణ, జ్ఞాన వ్యాప్తి సులభమైంది. 1150 AD కి అంతా సమర్కండ్, బాగ్దాద్, కైరో, మొరాకో, స్పెయిన్‍లలో కాగితం పరిశ్రమలు వచ్చేశాయి.మదరసాలు విజ్ఞాన వ్యాప్తి కేంద్రాలుగా ఉండేవి. ఇటువంటివి 1200 AD లో బాగ్దాదులో 30, 1500 AD డమాస్కస్‍లో 150 ఉండేవట.
వైజ్ఞానిక గృహం అనేక మంది విదేశీయుల్ని ఆకర్షించింది. అబ్బాసిద్ ఖలీఫాల వద్ద మంత్రులుగా బర్మకీడ్స్ కుటుంబం ఉండేది. వారు సింధూ ప్రాంతం నుండి వచ్చిన బౌద్ధ సంబంధం ఉన్నవాళ్ళు. వీరు భారతీయ వైద్యులను, పండితులను బాగ్దాదుకు పిలిపించి సంస్కృత గ్రంథాల అనువాద ప్రక్రియను ప్రోత్సహించారు.
మహమ్మద్ ఇబ్న్ మూసా అల్ ఖ్వారిజ్మీ బాగ్దాద్ వచ్చిన మరో పండితుడు. అతడు, ఇప్పటి ఉజ్బెకిస్తాన్ వాడు. బాగ్దాద్‍లో ఒక గొప్ప విజ్ఞానిగా ఎదిగాడు. అతడు అనేక గణిత సూత్రాలను, వాటిని సాధించే పద్ధతులను ఆవిష్కరించాడు. ‘అల్గోరిధం’ అనే పేరు వచ్చింది ఆయన పేరు నుంచే. క్రీ.శ.9 వ శతాబ్ధంలో బాగ్దాద్‍లో ఉండి, ఆయనొక గణిత శాస్త్ర పుస్తకం రాశాడు. భారతీయ దశాంశ పద్ధతిని, సున్నా ప్రాధాన్యతను గుర్తించి తన పుస్తకంలో భారతీయ అంకెలను ఎలా వాడాలో వివరించాడు. ఇదే నేటి ఆల్‍జీబ్రాకు పునాది వేసింది. కాని గణిత సమస్యల పరిష్కారానికి కొన్ని సాధారణ పద్ధతుల్ని, సూత్రాలని ఆయన ఆవిష్కరించాడు. ఇవే ఆతరువాత ఆల్గోరిధమ్స్ అన్నారు. స్కూళ్ళలో చెప్పే x+y లాంటి సమీకరణాలకు మొదటి రూపాలు ఆనాటివే.
ఖలీఫా అల్ మమూన్ (813 – 833 AD) భూమి చుట్టుకొలతను కనుక్కోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశాడు. అవి ఎడారిలోకి వెళ్ళి నక్షత్రాలను పరిశీలించాయి. ఒకచోటు నుండి ఒక బృందం ఉత్తరం వైపుకు, మరో బృందం దక్షిణం వైపుకు వెళ్ళి మళ్ళీ వెనక్కు వచ్చి కొలతను తీసుకొని క్లిష్టమైన గణితంతో లెక్కించి భూమి చుట్టుకొలత 24480 మైళ్ళని తెల్చాయట. ఖగోళ పరిశోధనలకు ఉపయోగించే ఆస్ట్రోలాబ్స్ ను కూడా ఆ కాలంలోనే అభివృద్ధి చేశారు.
ఆ కాలంలో ప్రభావపూరిత విజ్ఞానుల్లో మహమ్మద్ అల్ ఇద్రిసి ఒకడు. ఉత్తర ఆఫ్రికాలో 1100ADలో పుట్టాడు. యూరప్, స్పెయిన్‍లలో తిరిగాడు. తిరుగుతూ యాత్రాదర్శినిలు రాశాడు. 1138 ADలో ఉత్తర సిసిలీ చక్రవర్తి, వర్తకులు, యాత్రికులతో మ్యాపులను సేకరించే పని ఇతనికి ఇచ్చాడు, ఆ సమాచారాన్ని సేకరించాడు. 18 ఏళ్ళు ఆస్థానంలో ఆయన ఉన్నాడు.
ఒక 70 రకాల మ్యాపులు సేకరించాడు. వాటికి నోట్సు రాశాడు. అవన్నీ కలిపి చూస్తే అవి ఒక ప్రపంచ ప్రణాళికగా మారాయి. స్పెయిన్ నుండి చైనా దాకా, బ్రిటన్ నుండి ఆఫ్రికా దాకా సమాచారం ఇచ్చే పుస్తకంగా ఇది రూపుదిద్దుకొంది. బహుశా ఇంక ఏ మధ్యయుగాల దేశ పటాల కంటే కూడా ప్రజల గురించి, ప్రాంతాల గురించి ఇందులో ఎక్కువ సమాచారం ఉంది. బహుశా భూగోళాన్ని వాళ్ళు గుండ్రంగా భావించారు.ఇంకో మూడు శతాబ్ధాలు పాటు ఈ పటాలకు ఎదురు లేకపోయింది.
ఆకాలంలో అంతరిక్షం గురించి పెద్ద ఆసక్తి వుండేది. నమాజు సమయాలు, మక్కా దిక్కును సూర్యుని చలనాన్ని బట్టి, చంద్రుడిని బట్టి అంచనా వేయడం నేర్చుకొన్నారు. అప్పటికి ఇంకా గడియారాలు లేవు. అయితే వారు గ్రీకుల గ్రంధాల నుండి, భారతీయ గ్రంథాల నుండి ఖగోళ విజ్ఞానం తెలుసుకొన్నారు. ఎక్కడో మూలనపడిన అరిస్టాటిల్, టాలమిలు రాసిన ఖగోళ పుస్తకాలను మళ్ళీ పట్టుకొన్నారు. అందులో భూమే కేంద్రం. అయితే కొందరు సూర్యుడు కేంద్రంగా ఉండొచ్చని,అప్పుడే ఊహలు చేశారు. సూఫీ,అల్‍బిరూని, అల్‍బత్తాని లాంటి వాళ్ళూ ఖగోళ పట్టికలు తయారు చేశారు. వాటిని మరో 500 సం.లు తరువాత కూడా కోపర్నికస్ లాంటి వారు వాటిని ఉటంకించారు. ఇటువంటి పట్టికలు యూరప్‍లో కొలంబస్ లాంటి వారు కూడా వాడుకొన్నారు.
బాగ్దాద్ నిర్మించిన 20 ఏళ్ళ తరువాత, స్పెయిన్‍లోకార్డోవా నగరం ముందుకు వచ్చింది. అదీ ఖలీఫాల పాలనలోనే ఉంది. ఆకాలంలో యూరప్‍లోనే అతి నాగరికమైన, పెద్ద నగరంగా కార్డోవా ఉండేది. కార్డోవా పంటల విజ్ఞానంలో, తోటల పెంపకంలో ముందుండేది. వారి కొత్త పంటలను ఇతర దేశాల నుండి కార్డోవాకు తెచ్చుకొన్నారు. మట్టి గురించి విజ్ఞానం పెంచుకొన్నారు. మొక్కలను ఆహారం కోసం, వైద్యం కోసం ఎలా వాడాలో నేర్చుకొన్నారు. వరి, చెరకు, ఆరంజ్‍లు, ఆల్‍మండ్‍లు లాంటి కొత్త కొత్త పంటలను బయటి దేశాల నుండి తెచ్చుకొన్నారు. దిగుబడి పెంచడం ఎలా? అని ఆలోచించారు. ఎప్పుడో మరచిపోయిన రోమన్ నీటి పారుదలా పద్ధతుల్ని, నదుల నుండి నీటిని తెచ్చుకొనే విధానాలను, భూగర్భ పారుదలలను మళ్ళీ పునరుజ్జీవింపజేశారు. నదుల నుండీ నీటిని తోడిపోసే, ఎత్తులకు చేరవేసే పద్ధతుల్ని ఆవిష్కరించారు. ‘నోరియా’ అనే నీటి చక్రం అప్పటిదే. బకెట్‍లతో వుండే ఈ నోరియా నీటి చక్రాలను సేద్యానికీ, మంచినీటి సరఫరాకూ విస్తృతంగా వాడింది ఇస్లామిక్ ప్రపంచంలోనే.
క్రీ.శ.10వ శతాబ్ధంలో కార్డోవాలో ఒక ఇస్లామిక్ విజ్ఞాని పక్షుల్ని చూసి ఎగిరే ప్రయత్నం చేశాడు. ఆయన పేరు అబ్బాస్ ఇబ్న్ ఫెర్నాస్. అతడొక సృజనాత్మక తయారీదారు, కవి కూడా. ఉమయ్యుద్ పాలకుల ఆస్థానంలో ఉండేవాడు. ఆయన ఒక ఇరవై ఏళ్ళు రాలే ఆకుల్నీ, ఎగిరే గబ్బిలాలనీ, పక్షుల్నీపరిశీలించాడు. చివరికి ఒక చట్రాన్ని, దానికి రెక్కల్ని తయారు చేసుకొన్నాడు. వాటిని కట్టుకొన్నాడు. ప్రయోగం చేశాడు. ఎత్తు నుండి దూకాడు. కాసేపు గాలిలో తేలాడు కాని, కిందికి పడిపోయాడు. బాగా గాయాలయ్యాయి. కాని ఎందుకు పడిపోయానా? అని ఆలోచించాడట. ఆయన వచ్చిన నిర్ధారణ ఏమంటే… తోక లేదు కాబట్టి అని అట. బహుశ మొట్టమొదటి ఆకాశయాన ప్రయోగం అది.
ఆ కాలంలో ఎందరో విజ్ఞానులు బృందాలుగా పని చేశారు. వైజ్ఞానిక గృహంలో గణిత శాస్త్రవేత్తలు పనిచేస్తే, ఖగోళశాలలో ఖగోళ శాస్త్రవేత్తలు పని చేశారు.
ఈజిప్టు రాజధాని కైరోలో అసాధారణ మేధావులుండేవారు. ఇబ్న్ అల్ హైతమ్ ఒకడు. ప్రపంచం చూసిన గొప్ప శాస్త్రవేత్తలలో ఆయన కూడా ఒకడు. అతను ఒక ఖగోళ శాస్త్రవేత్త, ఒక ఆవిష్కర్త, ఒక గణిత విజ్ఞాని, ఒక ప్రయోగశీలి. ఒక ఆలోచన, ప్రయోగంలో రుజువుకు నిలబడకపోతే, ఆ ఆలోచనను వదిలివేయాలనేవాడు. ప్రయోగం విలువను ఆకాలంలోనే గుర్తించాడు. కంటిని, వెలుతురును ఆయన ప్రధానంగా పరిశీలించాడు. కంటి నుండి వెలువడే కాంతి వస్తువులపై పడటం వల్ల వస్తువులు కనిపిస్తాయని గ్రీకులు భావించేవారు. అయితే హైతమ్ అందుకు భిన్నంగా వస్తువుల నుండీ వచ్చే కాంతి, కంటిలోకి పడటం ద్వారా వస్తువు కనిపిస్తుందని భావించాడు. దాన్ని నిరూపించడానికి ఒక ప్రయోగం చేశాడు. ఒక గది గోడకు చిన్న రంధ్రం పెట్టి, ఒక కొవ్వొత్తిని ఆ గోడ బయట పెట్టాడు. ఆ రంధ్రం ద్వారా గదిలోకి కాంతి ప్రసరించి, కొవ్వొత్తి బింబం తలకిందులుగా పడింది. ఆవిధంగా కాంతి చేసే ప్రయాణం గమనించాడు. గ్రహింపుకు మెదడు అవసరం అని కూడా భావించాడు. కన్ను, దృష్టి, కాంతి లాంటి విషయాలలో తన ప్రయోగాలను, పరిశీలనలను రెండు సంపుటాలుగా ప్రచురించాడు. వందల సంవత్సరాలు ఈ పుస్తకాలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి.
అవిసెన్నా (980 AD) అనే గొప్ప వైద్యుడు ఆకాలంలో ఉండేవాడు. అతనిది ఉజ్బెకిస్తాన్. అతనొక 100 పుస్తకాలు రాశాడట. ఆయన రాసిన ‘కానన్ ఇన్ మెడిసిన్’ అనే పుస్తకం లాటిన్‍లోకి అనువాదమై, యూరప్‍లో వందల సంవత్సరాలు వైద్యశాస్త్ర పాఠ్య పుస్తకంగా ఉండేదట. క్షయ వ్యాధిని అంటువ్యాధిగా గుర్తించిన మొదటివాడు అవిసెన్నా. ఈ వ్యాధి వ్యాప్తి నివారించాలంటే ‘క్వారంటైన్’ అవసరమని చెప్పాడు. అల్ రాజి (900 AD) బాగ్దాద్‍లో ఆసుపత్రి నిర్మాణం చేశాడు. స్పెయిన్ లో అల్ జహ్రవి (936 AD) శస్త్ర చికిత్సలు చేశాడు. అల్ బిరూనీ (1050 AD) భారతదేశాన్ని సందర్శించి ‘కితాబ్ అల్ హింద్’ రాశాడు.
టర్కీలో ఇస్మాయిల్ అల్ జెజరి అని ఉండేవాడు. అతడొక ఆర్టిస్టు, ఇంజనీరు, ఆవిష్కర్త. ఇప్పటి టర్కీలో క్రీ.శ.12 వ శతాబ్ధంలో జీవించాడు. అతడు స్థానిక యాంత్రిక పనిముట్లు గురించి పుస్తకం రాశాడు. ఒక 100 పనిముట్లను అందులో వర్ణించాడు.గడియారాలు, వాటికవే తిరిగే యంత్రాలు, చక్రాల సహాయంతో నీళ్ళు లాగే యంత్రం వంటివి ఉన్నాయి. 1206 ADలో ఆయన చనిపోయాడు.
మరో 50 ఏళ్ళ తరువాత ఈ ఇస్లామిక్ ప్రయోగం ముగిసింది. మంగోల్ చెంగీజ్ ఖాన్ 1258 ADలో బాగ్దాద్ పై దాడి చేసి ఆక్రమించాడు. అక్కడున్న వేలాది పుస్తకాలను టైగ్రిస్ నదిలో పడవేశాడు. నీరు నల్లగా చాలాకాలం ప్రవహించిందట. దీంతో 500 సం.ల విజ్ఞానం, ఆవిష్కరణ చరిత్ర ముగిసింది. కాని యూరోపియన్ పునరుజ్జీవానికి ఇవన్నీ పునాదులయ్యాయి.
ఇస్లాం సైన్సు చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం. సైన్సు ఏ ఒక్క ప్రాంతం సొత్తో కాదని, అందరి జ్ఞాన విజ్ఞానాలు కలగలసి విజ్ఞాన శాస్త్రం ముందుకు పోతుందని ఇది నిరూపిస్తుంది.
(వచ్చే నెల: ‘భారతదేశంలో మధ్యయుగాల విజ్ఞానం’)



