మిఠాయి యుగంధర్ బాబు
“తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుందని” సామెత. అంటే చిన్న చిన్న విషయాలకే ఘర్షణ పడే సంబంధాలు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు నిలబడదని అలా చెప్పారు. తుమ్ము వస్తే అంత గట్టిగా, అంత బలంగా తుమ్ముతాము. ఎవరైనా గాట్టిగా తుమ్ముతుంటే “జాగ్రత్తరోయ్ ముక్కు ఊడిపోయేను” అని తమాషా చేస్తుంటారు. కొంతమంది అదేపనిగా తుమ్ము రావాలని పలుచనిన గుడ్డ కొనని గొట్టంలా చుట్టి ముక్కులో పెట్టుకుంటారు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. మా ఇంటి పేరు ఎం.ఎస్., అయితే వాడి మారుపేరు ఎం.ఎస్. అంటే మద్రాసు నస్యం అని అర్థం .
నస్యం పొడిని మద్రాస్ నస్యం కంపెనీ భలే తయారు చేసేది. ఆ పొడిని చిన్న గొట్టం డబ్బాలో వేసుకుని ఆ డబ్బాని జోబులో వేసుకుని తిరిగేవాడు మా ఫ్రెండ్. దాని పేరు పొడుం డబ్బా. ముక్కులో కాస్త ఇబ్బంది అనిపిస్తే పొడుం డబ్బా తీసి దాని ఎత్తిన టాప్ టాప్ మని రెండుసార్లు కొట్టి, కొంచెం పొడి తీసుకొని ముక్కులో ఒక రంధ్రం మూసుకొని ఇంకొక రంధ్రంలోనూ, అలా మార్చి మార్చి 2 రంధ్రాలలోనూ నస్యం పొడిని గట్టిగా దట్టించి ,ఎగ పీల్చుకొని నాలుగు తుమ్ములు తుమ్మేవాడు . ఓరకంగా అది వ్యసనం కూడా.
మనం తుమ్మల గురించి కాస్త తమాషా చెప్పుకున్నాం కానీ ఈ తుమ్ములే కొందరిని భయభ్రాంతులకు కూడా చేస్తాయి. ఎలా అంటారా? అదే తుమ్ము పురాణం.
బల్లి పురాణం లాగ “తుమ్ము పురాణం” కూడా ఉంది. దేవ గురువు బృహస్పతి శకున పురాణం రాసారట అందులో స్వప్న ఫలితాలు, తుమ్ములు ఎవరికి ఫలిస్తాయి , ఎవరికి ఫలించదు వాటి గురించి కూడా వివరంగా రాశారట. బృహస్పతి ప్రకారం ఆరోగ్యవంతుడైన వారి తుమ్ములు మాత్రమే శకునంగా పరిగణించాలట. జబ్బుతో బాధపడేవారి తుమ్ములు లెక్క చేయవలసిన అవసరం లేదట. అదొక సబ్త్ క్లాజు!!? మరి ఏమిటా శకునాలు? కాస్త సింహావలోకనం చేస్తామా.
ఏదైనా పని పైన బయలుదేరేటప్పుడు ఎవరైనా తుమ్మితే అపశకునమని, కాసేపు ఆగి కూర్చుని నీళ్లు తాగి వెళ్లాలట. అంతేకాదు. ఎవరైనా తుమ్మినప్పుడు “గాడ్ బ్లెస్స్ యు”, అని “చిరంజీవ” అని అంటా ఉంటారు. వచ్చే తుమ్ముల లో సంఖ్యను బట్టి అదృష్టం దురదృష్టం లెక్కలు మారిపోతాయట. ఒకసారి తుమ్మితే ఎవరో నీ గురించి మాట్లాడుకుంటున్నారని అర్థమట. రెండు సార్లు తుమ్మితే ఎవరో నిన్ను ఎగతాళి చేస్తున్నారని అర్థమట. ఇక మూడుసార్లు తుమ్మితే ఎవరో నిన్ను ప్రేమిస్తున్నారని అర్థమట. నాలుగు సార్లు తుమ్మితే నీకు జలుబు చేసింది అని అర్థం(అట)!!.
ఏవైనా కర్మలు ఆచరించేటప్పుడు ఎవరైనా తుమ్మితే అపశకునమని భావిస్తారు. శుభ కార్యాలప్పుడు , ఏదైనా పని ప్రారంభించినప్పుడు తుమ్మితే కూడా అశుభంగా భావిస్తారు.అంతేకాదు మీరు బయలుదేరేటప్పుడు మీరే తుమ్మితే ఒక అర్ధం, వేరే వాళ్ళు తుమ్మితే ఇంకొక అర్థం అట. అదే కాకుండా మీకు ముందు ఉన్న వారు తుమ్మితే మంచిది కాదు, మీ వెనక ఎవరైనా తుమ్మితే మంచిది అని చెబుతారు.
ఇనుము కానీ వెండి కానీ పట్టుకున్నప్పుడు తుమ్మితే హాని జరుగుతుందట. కంచు కానీ రాగి కానీ పట్టుకున్నప్పుడు తుమ్మితే చాలా మంచి జరుగుతుందట. ఉదయం నిద్ర లేవగానే ఎవరైనా తుమ్మితే వారికి ఆ రోజంతా మంచి జరుగుతుందట. నీటి వద్ద, నలుగురు చేరి చర్చించే చోట తుమ్ము వస్తే ఏదో కీడు జరగబోతోంది అని అర్థమట. చిన్నపిల్లలు, బాలింతలు తుమ్మితే ధన లాభమట. ఎవరైనా మాట్లాడేటప్పుడు తుమ్మితే “ఆ మాట సత్యం” అని అంటావుంటారు.
పెళ్లి మండపంలో వరుడు తాళి కట్టేటప్పుడు ఎవరైనా తుమ్మితే అందరూ ఏదో అనర్థం జరగబోతుంది అని భయపడతారట.అందుకే వరుడు తాళిబొట్టు కట్టే సమయం లో “గట్టిమేళం, గట్టిమేళం” అని భజంత్రీలు గట్టిగా తాళం వాయిస్తూ డోలు కొడుతూ శబ్దం చేస్తారు. అంటే ఆ సమయంలో ఎవరైనా తుమ్మినా ఎవరికి వినపడదన్నమాట. అంటే తుమ్ము వినపడకపోతే దోషం మాయమై పోతుందా?? ( కొన్నిచోట్ల తుమ్మితే ఎవరేమైనా అనుకుంటారని కొంతమంది తుమ్ము ఆపడానికి ప్రయత్నిస్తారు అలా చేయడం చాలా ప్రమాదకరం).
ఇలా తుమ్ములు గురించి రకరకాల నమ్మకాలు అపోహలు ప్రచారంలో ఉన్న మాట మీకు అందరికీ తెలుసు. దీని గురించి ఎక్కువ లోతుగా కూడా ఎవరూ ఆలోచించరు. పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి, ఇంట్లో ముందు తరం వాళ్ళు చెప్పారు కాబట్టి అలాగా వాటి ఆచరిస్తూ పోతూ ఉంటారు. ఇంతకీ తుమ్ము ఎందుకు వస్తుందో మీకు తెలుసు కదా. ముక్కు రంధ్రాలలో కానీ, శ్వాస కోశాలలో కానీ ఏదైనా అంతరాయాలు కలిగినా , ముక్కు రంధ్రాలలో ఎక్కువగా స్రవించినా, అలా ఏర్పడిన అంతరాయాన్ని తొలగించేందుకు శరీరం తీసుకునే చర్యే తుమ్ము. దీని ద్వారా ఊపిరి తిత్తులలోని గాలి ముక్కు ద్వారా వేగంగా, బలంగా బయటకు వస్తుంది. ఫలితంగా ముక్కులో ఉన్న అనవసర పదార్థాలు (మ్యూకస్) ముక్కు ద్వారా, ఎంగిలి నోటి ద్వారా బయటికి వస్తుంది.
తుమ్ము రావడానికి ముందు గొంతు, నోటిలో కండరాలు, శ్వాస సల్పంగా స్థంబిస్తాయి. కనురెప్పలు మూతపడతాయి.నిమిషానికి 72 సార్లు కొట్టుకోవలసిన గుండె 26 సెకండ్ల పాటు ఆగిపోతుంది. మనము శ్వాస తీసుకునే వేగము తుమ్ము రాకముందే కాసేపు ఆగుతుంది. అంటే ప్రసారంలో అంతరాయం లాగ అన్నమాట. (అందుకే తుమ్మిన తర్వాత పునర్జన్మ వచ్చిందని భావించి “చిరంజీవ” అంటారు.) ఒక్క తుమ్ములో దాదాపు 40 వేల సూక్ష్మజీవులు సెకనుకు వందమైళ్ళ వేగంతో గాలిలోకి విసరబడతాయట.
కాబట్టి తుమ్ము వల్ల అపశకునం కాదు గాని ఎదుటి వాళ్ళకి జబ్బులు సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి తుమ్మేటప్పుడు ముక్కుకి చేతి గుడ్డను అడ్డం పెట్టుకోవడం, లేక మోచేతి మడత మధ్యలో తుమ్మడం చేయాలి . కరోనా సమయంలో మీరు గమనించి ఉంటారు .ఎవరైనా తుమ్మితే అందరూ భయం భయంగా శత్రువును చూసినట్టు చూసేవాళ్ళు.
ఈ తుమ్ములలో ప్రపంచ రికార్డులు కూడా ఉన్నాయి. ఓ బ్రిటన్ మహిళ 977 రోజులపాటు ప్రతిరోజు తుమ్ముతూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొలిపింది (13 జనవరి 1981 నుండి 16 సెప్టెంబర్ 1983 వరకు).
ఇందులో మొదటి సంవత్సరంలోనే దాదాపు పదిలక్షల తుమ్ములున్నాయట. మనుషులే కాదు సుమా జంతువులు కూడా తుమ్ముతాయి. పిల్లి తుమ్మితే అదృష్టం అంట!!?. కుక్కల తుమ్ముల గురించి ఎవరు రాసినట్లు లేదు.
పుప్పొడి రేణువుల వల్ల, దుమ్ము పురుగుల వల్ల, పెంపుడు జంతువుల చర్మం వల్ల ముక్కులో ఏర్పడే చికాకును తొలగించే ఒక సహజ ప్రక్రియ తుమ్ము . అది ఒక హఠాత్తుగా జరిగే అసంకల్ప చర్య. దానిని పనికి ఆటంకమని, అశుభమని భావించడం అవగాహన లోపం మాత్రమే. మన పనికి ఏదో ఇబ్బంది కలిగించాలని, జరగబోయే చెడు గురించి హెచ్చరించాలని ,పనిగట్టుకుని దుమ్ము ముక్కులో దూరి తుమ్ములను సృష్టించదు కదా. ఇలాంటి సహజ ప్రక్రియలకు లేనిపోని అపోహలు అంటగట్టి, వాటికి ఆపాదించి, భయపడి, భయపెట్టడం సమంజసం కాదు కదా.
మిఠాయి యుగంధర్ బాబు 9394782540



