ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య
17. సార్వత్రిక నియమము
జీవం కేవలం కణాల్లో మాత్రమే ఉండగలదు
(Life Exists only Inside a Cell).
భూమ్మీద మాత్రమే జీవం ఉన్న ఆధారాలున్నాయి. భూమి లాంటి పరిస్థితులు విశ్వంలో కొన్ని గ్రహాల్లో ఉన్నట్లు అంచనా వేశారు. అయినా భూమికి తోడుగా మరెక్కడయినా జీవులు ఉన్న దాఖలాలు ఇంత వరకు ఋజువు కాలేదు. భూమ్మీద జీవులు ఏర్పడే పరిస్థితులు నేటికి సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రిందట ఒనగూరాయి. అప్పుడున్న పరిస్థితుల్లో తొలి జీవ రూపాలు చిన్న చిన్న నైట్రోజన్ భరిత అణువుల రూపంలోను, అమినో ఆమ్లాలు, ఫాస్వాలిపిడ్ల రూపంలోనూ వుండి ఉండవచ్చును. అయితే నేడు మనం జీవులు అంటే ఏమిటో కొన్ని లక్షణాల ఆధారంగా నిర్వచిస్తున్నాము. తమలాంటి వాటినే నిర్జీవ పదార్ధాల సహాయంతో నిర్మించుకొనే (reproduction) శక్తి ఉన్న పదార్థ రాశుల్ని, ప్రకృతిలో జరిగే సహజ మార్పుల్ని ఎదురొడ్డి అసహజ రసాయనిక చర్యల్ని స్వతహాగా కొనసాగించుకోగలిన శక్తి ఉన్న పదార్ధ స్వరూపాల్ని జీవులు అని స్థూలంగా నిర్వచించుకోవచ్చును. అలాంటి లక్షణాలకు నిలబడే పదార్థాలే జీవులనుకొంటే, అవి కణ నిర్మితాలు(cellular). కణం లేకుండా జీవం నేడెక్కడా లేదు. దాన్నే జీవకణం (living cell) అంటారు. కణం అంటే కణ కవచం (cell wall) ఉండాలి. అందులో కేంద్రకం లోపల న్యూక్లిక్ ఆమ్లాలు (DNA or RNA) క్రోమో జోములు, కేంద్రకం బయట కణ కవచానికి లోపల సైటో ప్లాజం, అందులో ఎన్నో కార్యక్రమాల్ని నెరవేర్చేందుకు కణాంగాలు (cell organelle) ఉన్నాయి. ఆఖరికి నిర్జీవో, జీవో తేల్చలేని పరిస్థితిలో ఉన్న వైరస్లకు కూడా కణ స్వరూపం ఉంది. అవి ఇతర జీవులలోకి వెళ్లినపుడు మాత్రమే ప్రత్యుత్పత్తి (re-production) జరుపుకోగలవు. తమంత తాముగా నిర్జీవ పదార్థాల నుంచి ప్రత్యుత్పత్తి జరపలేవు. కణాల్లో ఏ రకమైన జీవ రసాయనిక చర్యలు విడిగా ఉన్నప్పుడు జరగవు. అయినా ఎంతోకొంత జీవ లక్షణం వైరస్లకుందని అనుకోవచ్చును.
దెయ్యాలు, భూతాలు, అంటే నమ్మే వాళ్లు టీవీలు, సినిమాల నిండా అలాంటి పాత్రల్ని గుప్పించే వాళ్లకు ఈ నియమం పెద్ద సవాలు. దయ్యాలు, భూతాలు కదులుతున్నట్టు, మాట్లాడుతున్నట్లు, పగ సాధిస్తున్నట్లు, ఘనకార్యాలు చేస్తున్నట్లు చెప్పడమే కాకుండా అవి ఉన్నాయని వాదిస్తుంటారు. దయ్యాలు, భూతాలు చేసే పనులు నిర్జీవ పదార్ధాలు చేయలేవు. కేవలం జీవ ధర్మాలున్న పదార్ధాలు మాత్రమే చేయగలవు. జీవం కణాల్లో తప్ప ఇంకెక్కడా ఉండలేదని ప్రకృతి నియమాలు తెలియచేస్తున్నాయి. మరి దయ్యాలకు, భూతాలకు కణా లెక్కడివి? కణాల తయారీకి పదార్థాలెక్కడివి ? జీవ కణాలు జీవ కణాలతోనే తయారుకాగలవు. మరి ఏ జీవకణంతో ఈ దెయ్యపు కణాలు తయారయ్యాయి ? ఒక వేళ అవి కూడా మనుషుల్లాగే బహుకణ జీవులే (multi cellular organisms) అయితే మరెందుకని కనిపించవు? రాజుగారి దుస్తుల్లాగా కొందరికే కనిపిస్తాయా ?
18. పద్దెనిమిదవ సార్వత్రిక నియమము
జీవులన్నింటి మధ్య పాదార్ధిక బంధం ఉంది.
(All Life Forms are Connected)
జీవులన్నీ పరిణామ క్రమంలో ఉద్భవించాయని మనకు తెలుసు. పరిణామమనే జీవవృక్షంలో రెండు ప్రధాన కొమ్మలున్నాయి. ఒకటి వృక్ష జాతి. మరొకటి జంతు జాతి. ఈ రెండు జాతుల్లో దేనికీ చెందని మిగిలిన జాతులు కూడా ఆ పెనుజీవవృక్షానికి అంటుకొనే ఉన్నాయి.
వృక్షజాతులనే అతి పెద్దకొమ్మలో పలుశాఖలు ఉన్నాయి. అవి ఎన్నోకుటుంబాల రూపంలో ఉండవచ్చును. ఆ శాఖలు మళ్ళీ శాఖోపశాఖలై అన్ని రకాల వృక్షజాతులకు ఆలంబనగా ఉంది. అలాగే ఆ మహావృక్షంలోని మరో కొమ్మ జంతుజాతి. అందులో మళ్ళీ ఎముకలు లేని జీవులు (invertibrates) ఎముకలున్న జీవులు (vertibrates) అనే రెండు ప్రధాన గ్రూపులున్నాయి. ఇవన్నీమళ్లీ ఎన్నో వర్గాలు (phyla)గా ఉన్నాయి. ఈ శాఖల్లో కోతులు, మానవుడుండే క్షీరదాల శాఖ, అందులో మళ్లీ ప్రైమేటు శాఖలు ఉద్భవించాయి. కాబట్టి ఆ వృక్షపు ప్రధాన శాఖలు, ఉపశాఖలు ఆ తర్వాతి శాఖోపశాఖల్లో ఉన్న అన్ని రకాల జీవులు సంధానించబడి ఉన్నాయనే అర్ధం కదా ! ఈ ఉదాహరణ ప్రకారం భౌతికంగా అన్నీ కలిసి ఉన్నట్టు అర్థం కాదు. ఈ కాల గమనంలో పరిణామ క్రమంలో ఎక్కడో, ఎప్పుడో ఒకప్పుడు అవి ఇవీ అన్నీ బంధువులే! ఒక కుటుంబంలో వంశవృక్షమని, వారి మధ్య ఏదో ఒక విధమైన రక్త సంబంధాన్నీ (Blood Rela-tion) చూడగలుగుతున్నాం. అలాగే ఇంకా వెనక్కిపోతే మనుషు లందరికీ సంబంధం ఉన్నట్లు అర్ధం.
కాలగమనంలో ఒక చోటు ఉంచి కోతులు, మనుషులు అటూ ఇటూ పరిణామం చెందారు కాబట్టి కోతులు, మనుషుల మధ్య కూడా పాదార్థిక బంధం (He, She తదితర జన్యు బాంధవ్యం) ఉండే ఉండాలి. కోతులకు, మనుషులకు, అమీబాలకు, ఆ తర్వాత యుగ్లీనా, ఆల్గేలకు, అక్కణ్నించి వేపచెట్లకు గోంగూరకు కూడా జన్యుపరంగా దూర బంధుత్వం ఉన్నట్లు అర్ధం.
చివరిమాట :
పదార్ధమంతా మిథ్య అనే వాళ్లు, జీవ పరిణామాన్ని వ్యతిరేకించే వాళ్లు ఈ సార్వత్రిక నియమం చూసైనా కళ్లు తెరవాలి. మానవుడు ప్రకృతి పరిశీలన ద్వారా, శ్రమ ద్వారా ఆధునిక మానవ సమాజానికి బీజం వేశాడు. పైన పేర్కొన్న ప్రకృతి సూత్రాల పరిధిలో సాగుతున్న నేటి శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. అయితే ఈ విజ్ఞాన శాస్త్ర ఫలితాలను కొందరు మాత్రమే అనుభవిస్తున్నారు. సామాన్య ప్రజానీకానికి ఈ ఫలితాలు నేటికీ అందుబాటులో లేవు. అత్యంత ధనిక వర్గం ప్రపంచ వనరులలో 85% మేరకు వినియోగిస్తున్నారు. కాగా అత్యంత పేద వర్గాలకు కేవలం ప్రపంచ వనరులలో 1% మాత్రమే అందుబాటులో ఉంది. సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్ర సాంకేతిక రంగాల పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధనలు సాగాలి.

ఆధునికతను సంతరించుకున్న శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ అందరి సమిష్టి కృషి ఉన్నా, ప్రజా బాహుళ్యం అనేక అశాస్త్రీయ పోకడలతోనూ, మూఢాచారాలతోనూ, ఛాంధసత్వంతోనూ కొట్టు మిట్టాడుతుంది. ప్రాంతీయ, కుల, మతవర్ణ, భాషా తదితర అనేకానేక అశాస్త్రీయ ప్రాతిపదికల ఆధారంగా ప్రజలలో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. యుద్ధ వాతావరణం, ఆరాచకత్వం, ఉగ్రవాదం, మతోన్మాదం, మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇది అశాస్త్రీయం. సైన్సు సూత్రాలకు విరుద్ధం. ప్రజలందరిలో సౌభ్రాతృత్వము సాంస్కృతిక వికాసం, వివేకం కలిగించడం ద్వారా ఐకమత్యాన్ని పెంపొందించాలి. తద్వారా ప్రపంచ శాంతిని శాశ్వతం చేయాలి. ఈ లక్ష్య సాధనకు ప్రజా సైన్సు ఉద్యమాల ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ ఉద్యమాల తీవ్రతను బట్టే ప్రజలకు శాస్త్ర సాంకేతిక రంగ ఫలితాలు దక్కుతాయి. ప్రజా సైన్సు ఉద్యమం పట్ల సరిమైన అవగాహన కలిగిన నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. “ప్రకృతి సూత్రాలు – శాస్త్రీయ దృక్పథం” అనే అంశాన్ని అధ్యయనం చేయడం ప్రజాసైన్సు ఉద్యమ నిర్మాణంలో ఒక అత్యవసర భాగం. సమ సమాజ స్థాపనకు కృషి చేసే శక్తుల పట్ల సానుభూతి ప్రకటిస్తూ స్వతంత్రంగా ప్రజా బాహుళ్యంతో ‘ప్రజలకోసం సైన్సు, ప్రగతి కోసం సైన్సు, ప్రపంచ శాంతి కోసం సైన్సు’ అనే నినాదాలతో కృషి చేస్తున్న ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (AISPN) అనుబంధ సంస్థ జన విజ్ఞాన వేదిక ఉద్యమాల్లో భాగమై భారత రాజ్యాంగం సూచించిన శాస్త్రీయ దృక్పథ వ్యాప్తిలో అందరం ఉద్యమించ వలసిన తరుణమిదే !
****



