రవిరాజా పోతినేని

సూర్యుడు ఉదయిస్తేనే మన రోజు మొదలవుతుంది. వెలుగు, వేడి, వర్షాలు, పంటలు ఇలా మన జీవన విధానంలోని ప్రతి అంశం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూర్యుడిపైనే ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ సూర్యుడిలో జరిగే అనేక కీలక ప్రక్రియలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా అర్థం కాలేదు. ఆ రహస్యాలను ఛేదించేందుకు భారతదేశం చేపట్టిన చారిత్రక అంతరిక్ష మిషన్‌నే ఆదిత్య‑L1.

సూర్యుడి నుంచి కేవలం కాంతి మాత్రమే కాకుండా, నిరంతరం శక్తివంతమైన విద్యుత్ ఛార్జ్ కలిగిన కణాలు, అయస్కాంత అలలు కూడా వెలువడుతుంటాయి. ఈ ప్రభావాల సమాహారాన్నే శాస్త్రవేత్తలు అంతరిక్ష వాతావరణం (Space Weather)గా పిలుస్తారు. సాధారణ పరిస్థితుల్లో ఇది భూమిపై పెద్దగా ప్రభావం చూపదు. కానీ సూర్యుడిపై భారీ మంటలు లేదా విస్ఫోటనాలు సంభవించినప్పుడు, అవి భూమి వైపు ప్రయాణించి ఉపగ్రహాలు, సమాచార వ్యవస్థలు, విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే సూర్యుడిని నిరంతరం గమనించడం ఆధునిక సమాజానికి ఎంతో అవసరంగా మారింది.

చిత్రం: PSLV-C57 (XL)  రాకెట్. సౌజన్యం: ఇస్రో

ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన తొలి ప్రత్యేక సౌర పరిశీలనా మిషన్‌నే ఆదిత్య‑L1. ఈ ఉపగ్రహాన్ని 2023 సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి PSLV‑C57 రాకెట్ ద్వారా విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు. ఇది భూమి చుట్టూ తిరిగే సాధారణ ఉపగ్రహం కాదు. భూమి నుంచి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో, సూర్యుడు–భూమి మధ్య ఉన్న ఒక ప్రత్యేక ప్రాంతంలో ఇది పనిచేస్తోంది.

ఈ ప్రాంతాన్ని L1 లాగ్రాంజ్ పాయింట్ అంటారు. ఇక్కడ సూర్యుడు మరియు భూమి గురుత్వాకర్షణ శక్తులు ఒకదానిని ఒకటి సమతుల్యం చేస్తాయి. అందువల్ల అక్కడ ఉంచిన ఉపగ్రహం తక్కువ ఇంధనంతోనే దీర్ఘకాలం స్థిరంగా ఉండగలుగుతుంది. ముఖ్యంగా, ఈ స్థానం నుంచి సూర్యుడు ఎప్పుడూ నేరుగా కనిపిస్తాడు. భూమి నీడ అడ్డురాకుండా, పగలు–రాత్రి తేడా లేకుండా 24 గంటలూ సూర్యుడిని గమనించవచ్చు. ఈ కారణంగానే ప్రపంచంలోని ప్రముఖ సౌర పరిశోధనా మిషన్లు కూడా ఇలాంటి లాగ్రాంజ్ పాయింట్లను ఎంచుకుంటాయి.

చిత్రం:ఆదిత్య-L1 అంతరిక్షంలోని ఊహా చిత్రం. సౌజన్యం: ఇస్రో

ఆదిత్య‑L1 ఈ L1 ప్రాంతం చుట్టూ ఒక ప్రత్యేకమైన హాలో కక్ష్యలో తిరుగుతోంది. ఈ కక్ష్య వలన ఉపగ్రహం ఒకే స్థిర బిందువులో నిలిచినట్లు కనిపించినా, వాస్తవానికి సూర్యుడిని ఎల్లప్పుడూ స్పష్టంగా చూసేలా కదులుతూ ఉంటుంది. ఈ విధానం వల్ల ఉపగ్రహంపై ఉష్ణ ఒత్తిడి తగ్గుతుంది, ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది, అలాగే సంవత్సరాల పాటు నిరంతర పరిశీలనలు చేయడం సాధ్యమవుతుంది.

ఈ ఆదిత్య‑L1లో మొత్తం ఏడు అత్యాధునిక శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. వీటిలో కొన్ని శక్తివంతమైన టెలిస్కోపులు సూర్యుడి ఉపరితలం, దాని చుట్టూ ఉన్న అత్యంత వేడైన కరోనా, అలాగే అల్ట్రావైలెట్ మరియు ఎక్స్‑రే కాంతుల్లో జరిగే మార్పులను చిత్రాలుగా నమోదు చేస్తాయి. మరికొన్ని పరికరాలు సూర్యుడి నుంచి వస్తున్న సౌర గాలి వేగం, శక్తి, అయస్కాంత క్షేత్ర మార్పులను నేరుగా కొలుస్తాయి. ఈ రెండు రకాల పరిశీలనలు కలిసివచ్చి, సూర్యుడిపై జరిగిన ఒక సంఘటన భూమి వద్దకు చేరే వరకు జరిగే మొత్తం ప్రక్రియను శాస్త్రవేత్తలు అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది.

ఆదిత్య‑L1 ద్వారా శాస్త్రవేత్తలు ముఖ్యంగా కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. ఉదాహరణకు, సూర్యుడి ఉపరితలం సుమారు 6,000 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉండగా, దాని పైన ఉన్న కరోనా లక్షల నుంచి కోట్ల డిగ్రీల వరకు ఎందుకు వేడిగా ఉంటుంది? సౌర మంటలు, భారీ పేలుళ్లు ఎలా ఏర్పడతాయి? సూర్యుడి నుంచి వచ్చే సౌర గాలి ఎలా అంత వేగంగా ప్రయాణిస్తుంది? ఇవన్నీ భూమిపై ఉన్న సాంకేతిక వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తాయి? వంటి ప్రశ్నలకు ఈ మిషన్ సమాధానాలు అందించనుంది.

కక్ష్యలోకి చేరిన కొద్ది నెలల్లోనే ఆదిత్య‑L1 తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఇప్పటికే ఇది శక్తివంతమైన సౌర మంటల చిత్రాలు, సౌర గాలి మార్పులపై విలువైన డేటా, అయస్కాంత తుఫానులకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ సమాచారాన్ని ఇస్రో దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు అందుబాటులో ఉంచుతోంది.

సాధారణ మనిషికి ఈ మిషన్ ప్రయోజనం ఏమిటంటే—మన రోజువారీ జీవితంలో ఆధారపడే మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్, టెలివిజన్ ప్రసారాలు, GPS ఆధారిత రవాణా వ్యవస్థలు, విమానయానం వంటి సేవలను సౌర తుఫానుల ప్రభావం నుంచి కాపాడే అవకాశం కలుగుతుంది. ముందస్తు హెచ్చరికల ద్వారా ఉపగ్రహాలను సురక్షిత మోడ్‌లోకి మార్చడం, విద్యుత్ వ్యవస్థలను రక్షించడం సాధ్యమవుతుంది.

L1 వంటి దూరమైన ప్రాంతంలో ఉపగ్రహాన్ని ఉంచి, దాన్ని సంవత్సరాల పాటు విజయవంతంగా నడపడం భారత్‌కు ఒక గొప్ప సాంకేతిక విజయం. ఇది భవిష్యత్తులో మరిన్ని లోతైన అంతరిక్ష మిషన్లు, గ్రహయాత్రలు, పరిశోధనలకు బలమైన పునాది వేస్తుంది.

మొత్తానికి, ఆదిత్య‑L1 ఒక శాస్త్రీయ ప్రయోగం మాత్రమే కాదు. ఇది మన ఆధునిక జీవితానికి రక్షణ కవచం. సూర్యుడిని అర్థం చేసుకోవడం అంటే మన భవిష్యత్తును మరింత సురక్షితంగా, స్థిరంగా మార్చుకోవడం. సూర్యుడి వైపు భారత్‌ వేసిన ఈ అడుగు, దేశానికి వెలుగుల భవిష్యత్తును చూపిస్తున్నది.

చిత్రం: ఆదిత్య-L1. సౌజన్యం: ఇస్రో

సూర్యుడిని అధ్యయనం చేయడం కొత్త విషయం కాదు. అమెరికా మరియు యూరప్ సహా అనేక దేశాలు దశాబ్దాలుగా సౌర పరిశోధన మిషన్లు చేపట్టాయి. అమెరికా మరియు యూరోపియన్ అంతరిక్ష సంస్థ కలిసి నిర్వహించిన SOHO (Solar and Heliospheric Observatory) మిషన్ కూడా L1 లాగ్రాంజ్ పాయింట్ వద్ద నుంచే సూర్యుడిని పరిశీలిస్తోంది. అదే విధంగా నాసా యొక్క SDO (Solar Dynamics Observatory) సూర్యుడి ఉపరితలం మరియు వాతావరణాన్ని భూమి కక్ష్య నుంచి అధ్యయనం చేస్తోంది.

ఇటీవలి కాలంలో నాసా Parker Solar Probe మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ Solar Orbiter మిషన్లు సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్లి ప్రత్యక్ష కొలతలు చేస్తున్నాయి. అయితే ఈ మిషన్లు సూర్యుడిని ఎప్పుడూ నిరంతరంగా చూడలేవు.

ఈ నేపథ్యంలో ఆదిత్య‑L1 ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒకే మిషన్‌లో దూరం నుంచి సూర్యుడిని చిత్రీకరించే పరికరాలతో పాటు, సూర్యుడి నుంచి వచ్చే కణాలను నేరుగా కొలిచే పరికరాలను కూడా కలిగి ఉంది. అంతేకాదు, భారతదేశం స్వయంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన తొలి ప్రత్యేక సౌర పరిశీలన కేంద్రం ఇదే. సూర్యుడిని నిరంతరం గమనిస్తూ, భూమికి వచ్చే సౌర ప్రభావాలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడంలో ఇది భారత్‌కు స్వతంత్ర సామర్థ్యాన్ని అందిస్తోంది.

అంతర్జాతీయ మిషన్ల సరసన నిలబడి, భారతదేశం తన స్వంత డేటా, తన స్వంత శాస్త్రీయ దృక్పథంతో సూర్యుడిని అధ్యయనం చేయగలగడం ఆదిత్య‑L1 యొక్క నిజమైన ప్రాముఖ్యతగా చెప్పుకోవచ్చు.

చిత్రం: ఆదిత్య-L1 సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT) తీసిన సూర్యుని చిత్రం.  సౌజన్యం: ఇస్రో

సాంకేతిక పదాలు – సులభమైన అర్థాలు
ఈ వ్యాసంలో ఉపయోగించిన కొన్ని శాస్త్రీయ పదాలు సాధారణ పాఠకులకు కొత్తగా ఉండవచ్చు. అవి ఏమిటో సులభంగా చూద్దాం.

కరోనా (Corona): ఇది సూర్యుడి బయట కనిపించే అతి పలుచని వాతావరణ పొర. సూర్యగ్రహణ సమయంలో సూర్యుడి చుట్టూ తెల్లగా మెరిసే కాంతి వలయంలా ఇది కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సూర్యుడి ఉపరితలం కంటే కరోనా లక్షల నుంచి కోట్ల డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకోవడమే ఆదిత్య‑L1 ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.

సౌర మంటలు (Solar Flares): సూర్యుడి ఉపరితలంపై అకస్మాత్తుగా విడుదలయ్యే అపార శక్తి పేలుళ్లను సౌర మంటలు అంటారు. ఇవి కాంతి వేగంతో భూమికి చేరే కిరణాలను విడుదల చేస్తాయి. బలమైన మంటలు రేడియో కమ్యూనికేషన్, GPS వ్యవస్థలను తాత్కాలికంగా దెబ్బతీయగలవు.

కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME): సూర్యుడి కరోనా నుంచి భారీగా ప్లాస్మా మరియు అయస్కాంత క్షేత్రం అంతరిక్షంలోకి విస్ఫోటనంగా వెలువడటాన్ని CME అంటారు. ఇవి భూమిని తాకితే పెద్ద అయస్కాంత తుఫానులు ఏర్పడి, ఉపగ్రహాలు మరియు విద్యుత్ గ్రిడ్‌లకు ప్రమాదం కలిగించవచ్చు.

సౌర గాలి (Solar Wind): సూర్యుడి నుంచి నిరంతరం బయటకు ప్రవహించే విద్యుత్ ఛార్జ్ కలిగిన కణాల ప్రవాహమే సౌర గాలి. ఇది భూమి అయస్కాంత క్షేత్రంతో పరస్పరం చర్య చేసి ఔరోరా (ఉత్తర ధ్రువ కాంతులు) వంటి అద్భుత దృశ్యాలను సృష్టిస్తుంది.

L1 లాగ్రాంజ్ పాయింట్: సూర్యుడు మరియు భూమి మధ్య ఉన్న ఒక ప్రత్యేక గురుత్వ సమతుల్యత ప్రాంతం. ఇక్కడ ఉంచిన ఉపగ్రహం తక్కువ ఇంధనంతో దీర్ఘకాలం స్థిరంగా పనిచేయగలదు.

హాలో కక్ష్య (Halo Orbit): లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉపగ్రహం వలయంలా తిరిగే ప్రత్యేక కక్ష్య. ఇది ఉపగ్రహానికి ఎల్లప్పుడూ సూర్యుడిని చూడగల అవకాశం కల్పిస్తుంది.

రచయిత: రవి రాజా పోతినేని, డాక్టోరల్ రీసెర్చ్ కాండిడేట్,  డిపార్ట్మెంట్ అఫ్ ఆస్ట్రానమీ, ఉస్మానియా యూనివర్సిటీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *