సంపాదకీయం
“ప్రపంచ నాగరికతల ఘర్షణా ప్రవక్త” శామ్యూల్ హటింగ్టన్ సమాధి నుంచి లేచొచ్చి అమాంతం అమెరికా ప్రభుత్వాన్ని ఆవహించినట్టుంది! పాశ్చాత్యదేశాల నాగరికతకు ఎప్పుడూ లేని ముప్పు ముంచుకొచ్చిందనీ, వలసల్ని అడ్డుకోకుంటే వాటి ప్రాభవం, భవిష్యత్తూ మంటగలిసి పోతాయనీ అది గగ్గోలు పెట్టడం మొదలెట్టింది.
దీనికోసం ఒక “నూతన వ్యూహాత్మక నివేదికను” రూపొందించి, దాన్ని ప్రపంచ దార్శనికతా పత్రంగా వర్ణిస్తూ ముందుకు తెచ్చింది. ఒకవైపు అమెరికా మానవ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన దేశంగా నిలబడి పోవడానికీ విధానం రాచబాట వేస్తుందని రెచ్చగొడుతూ మరోవైపు పాశ్చాత్యదేశాలు సైతం ఈ దారి పట్టి వలసల్ని నిరోధించకపోతే వాటి నాగరికత నాశనమై పోతుందనీ, వాటిని నమ్మకమైన మిత్రులుగా గుర్తించడం అసాధ్యమవుతుందనీ హెచ్చరిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంపు ఇదే ధోరణలో నిప్పులు చెరిగాడు!
ఈ వాదం ప్రకారం ఆధునిక ప్రపంచ భవిష్యత్తును నాగరికతల మధ్య ఘర్షణ నిర్ణయిస్తుంది. మతం, సంస్కృతి ఆధారంగా ఈ నాగరికతలే ఆర్థిక కూటాలుగా మారుతాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇస్లాం, క్రైస్తవ, కన్ఫ్ఫూషియన్ మతాల ప్రాతిపదికన రాజ్యాలు చీలి, ఆర్థిక సాంస్కృతిక ఆధిపత్యాల కోసం పోటీపడి సమీప భవిష్యత్తులో భీషణ సంగ్రామం సంభవిస్తుంది. దీని పట్ల పాశ్చాత్యదేశాలు అప్రమత్తంగా వుండాలి ! లేకపోతే వాటి “మహత్తర నాగరికతల” కొంప కొల్లేరవుతుంది. ఈ ఉత్పాతం అమెరికానూ చుట్టుకొంటుంది. కానీ తన గొప్ప “విజ్ఞతతో, దురదృష్టితో” ఈ పెను ప్రమాదాన్ని పసిగట్టి, ముందుగా మేల్కొని సోదర పాశ్చాత్య దేశాల్నీ తట్టి నిద్ర లేపుతోంది!
ఇంతకీ అమెరికా పాశ్చాత్య దేశాలు తమదిగా ఆపాదించుకుంటున్న ఈ “ప్రాభవోపేత నాగరికతా” సారమేమిటి? రూపురేఖలేమిటి? మొదట పాశ్చాత్య దేశాలకూ, తర్వాత అమెరికాకూ ఇది ఏ కృషి ఫలంగా లభించింది? ఏ దైవదత్తంగా సిద్ధించింది? ఏ జన్యుపరంగా ప్రాప్తించింది? వీటికే గాదు చరిత్రలో ఏ సామ్రాజ్యాలకైనా ఈ జ్ఞానం, ఈ విజ్ఞానం, ఈ సంస్కృతి, ఈ సంపద ఎలా సొంతమయ్యాయి? ఇక వీరు మాత్రం “నాగరీకు” లైతే మరి మిగిలిన ఆ “అనాగరిక ” దౌర్భాగ్యులెవరు? వారెందుకలా వుండిపొయ్యారు? కొంచెం మనం గతం లోపలికెళితే వీటి తాలూకు నిజమంతా తన్నుకొంటూ నిప్పులా బయటికొస్తుంది.
రోమన్లు ఒకనాడు “అనాకరికులందరికీ శాంతినీ, నాగరిక ప్రవర్తననూ ప్రసాదిస్తామనే కుంటిసాకుతోనే స్కాట్లాండును ఆక్రమించి, స్థానిక కెలడోనియన్ తెగల్ని దుంప నాశం చేసి, ఆ దేశాన్ని నేలమట్టం చేసారు . చుట్టుపక్కలి ఈజిప్షియన్, ఫెనిషియన్, ఆఫ్రికన్ దేశాల నుంచి పరాజితుల్ని హీనాతిహీనంగా బానిసలుగా పట్టుకురావడం కూడా పవిత్ర రోమన్ సామ్రాజ్యపు నాగరికతా సంరక్షణా విస్తరణల పేరుతోనే జరిగింది. ఇక్కడ ఈ రాజ్యబలాన్నీ, రాబందున్యాయాన్నీ కలిపితే “రోమన్ నాగరికత “అవుతుంది. దీనాతి దీనంగా ఊచకోతకు గురైన వారిదీ, బానిసలైన వారిదీ మాత్రం “అనాగరిత” అవుతుంది!
అలనాటి చైనా సామ్రాజ్యం రెండువేల ఏళ్ల పాటు నిర్దాక్షిణ్యంగా పీక మీద కత్తి పెట్టి తమ హాన్ సంస్కృతిలో కలిపేసుకున్న సమూహాలన్నీ “అనాగరికాలే”! చైనా వల్లే అవి “కొత్త నాగరికతా కాంతుల్ని” చూడగల్గాయి!
న్యూజిలాండునూ, ఆస్ట్రేలియానూ కుక్ కనుగొన్నప్పుడు పాపం స్థానిక జనమంతా అనాగరికులనే, వారు భూమికిభారమనే వారిలో 90 శాతం మందిని హతమార్చాడు! పాశ్చాత్యులొచ్చి అక్కడ తిష్ట వేసాకే నాగరికతా గంధం పరిమళించ సాగింది!
పదివేల ఏళ్ల పాటు ప్రపంచానికి దూరంగా, ఏకాంతంగా బతికిన టాస్మానియా “అనాగరిక” ప్రజల్ని కుక్ సర్వనాశనం చేసింది దేని కోసం ? శాస్త్ర జ్ఞానాన్వేషణలో భాగంగానా? సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగానా?
ప్రవక్త ఉపదేశాలను వీలైనంత శాంతియుతంగా, కాకుంటే కత్తితో లోకమంతా వ్యాపింప చేయాలనే గదా ఖలీఫాలని స్వర్గం ఆదేశించింది ! ఎందుకలా చెయ్యడం ? లోకమంతా హీనజీవులమయమనీ, వారినందరినీ నాగరీకులుగా మార్చాలనే గదా!
అరబ్ సామ్రాజ్యం ఈజిప్టు, సిరియా, ఇరాన్ బర్బర ప్రజల్ని క్రూరంగా అణచివేసి పవిత్ర ఇస్లాంలోకి తీసుకొచ్చింది దేనికి? “నాగరికతా ” కాంతిధారల్ని వారిమీద కురిపించేందుకనే గదా?
కొలంబస్ వచ్చేనాటికి అమెరికా “అనాగరిక” మూలవాసులెందరు? “నాగరిక” స్పెయిన్ నుంచి ఆయన తెచ్చిన రోగాలతో పిట్టల్లా రాలిపోయిన వారెందరు? ఇక యుద్ధాల్లో చాకిరీతో వివక్షతో దీనాతి దీనంగా ప్రాణాలొదిలిన వారెందరు? చివరికక్కడ మిగిలిన వారెందరు? ఇదే జరక్కపోతే పాపం నేటి ఇంగ్లీషు అమెరికన్లకు ఈ నాగరికతా నిక్కులెక్కడివి?
అట్లాంటిక్ సముద్రం మీదుగా పట్టుకొచ్చిన కోటి ఆఫ్రికన్లలో దారిలోనే మరణించిందెంతమంది? పోర్చుగల్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్లు వీరి రక్తంతోనే గదా పత్తిని పండించింది? గనుల్ని తవ్వించింది? ఇప్పుడు ప్రపంచానికి నాగరికతా పాఠాలు చెబుతున్నది .
ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు. నిర్మొహమాటంగా చెప్పాలంటే సామ్రాజ్యాల చరిత్రంతా వనరుల దోపిడీనే! ఆధిపత్య సంస్కృతిని రుద్దడమే! దీన్నంతా మహా నాగరికతావిస్తరణ కోసమని బుకాయించడమే! ఇలా ఓడిపోయిన నాగరికతలన్నీ సంతోషంగా ఈ కొత్త సంస్కృతిని స్వీకరించాయా? బలవంతంగానే గదా వారిపై అనాగరికులన్న ముద్రవేసింది. దుర్మార్గంగానే గదా వారిపై తమ సంస్కృతిని పులిమింది.
తమ ఆలోచనల్ని, ఆచారాలని, నిబంధనల్ని, సంస్థలని విస్తరింప చేయకుండా: తమకు తాము సృష్టించుకొన్న ఒకానొక ప్రామాణికతను ప్రపంచంపై రుద్దకుండా ఎదురైన వాటినన్నిటినీ తమ తమ “గొప్ప గొప్ప” సంస్థల్లో నిర్దాక్షిణ్యంగా కలిపేసుకోకుండా ఏ సామ్రాజ్యాలైనా ఎలా ఏర్పడ్డాయి? ఈ భూమ్మీది అధిపత్యాలన్నిటికీ స్వార్థమే మూలమనీ, అన్నిటిని అదే నిర్ణయించీ శాసిస్తుందనీ గదా వీటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం.
పోతే ప్రస్తుత సామ్రాజ్యవాదులు నూతన పారిశ్రామిక విప్లవం, వైజ్ఞానిక విప్లవం తమ అపారమేధో సంపత్తితోనే భూమ్మీదికి అవతరించినట్టు కూడా చెపుతుంటారు. ఆధునిక ప్రజాస్వామ్య భావజాలమంతా ప్రపంచానికి తాము పెట్టిన బిక్షే అన్నట్టు, ఇవి లేకపోతే భూగోళం మొత్తం గాఢాంధకారంలో కొట్టుమిట్టాడి పోయేదన్నట్టు బడాయికి పోతుంటారు.
చేజెక్కించుకున్న సువిశాల భూభాగం, గుంజుకొన్న దేశదేశాల వనరులు, తరలించుకొచ్చిన బానిసలు లేకుండానే ఇవన్నీ పాశ్చాత్య దేశాల ఒళ్ళో వచ్చి వాలాయా? ఇదంతా వారికి భగవద్దత్తమా లేక జన్యునిక్షిప్తమా?
పాపం దక్షిణ దేశాలకీ వలసలూ, ముడి సరుకులూ, ఖండాంతర మార్కెట్లూ లేవే! వీటిని దొరకబుచ్చుకొనేందుకు ప్రపంచాన్నంతా జల్లెడ పట్టి తెచ్చుకున్న వెండీ బంగారాల మూటలు లేవే!
అంతేకాదు యూరపులో జరిగిన పారిశ్రామికరణే సామ్రాజ్య వాదానికనుగుణంగా జరిగింది. దాని వల్ల దేశ దేశాల సొంత ఉత్పత్తి విధానాలన్నీ నశించాయి. వృత్తులు ధ్వంసమయ్యాయి. మానవ మేధస్సుకు చిహ్నంగా భావిస్తున్న పారిశ్రామికీకరణ అనే ప్రయోగం మిగిలిన సమాజాలపై బలవంతంగా రుద్దడం వల్లనే విజయవంతమైంది. సామ్రాజ్యవాద పారిశ్రామికీకరణ అప్పటిదాకా ప్రకృతి సహజమైన ఉత్పత్తులతో అవసరాలన్నిటినీ తీర్చుకొనే సమాజాల్ని పారిశ్రామిక ఉత్పత్తులపై ఆధారపడేలా చేసింది. ఈ సాంకేతిక విధానం దారిద్య్రం రెండూ చేతులు కలిపి నడిచాయి. దీనికి భారతదేశ చేనేత పరిశ్రమల విధ్వంసం, అది తెచ్చిపెట్టిన విషాదం కన్నా మంచి ఉదాహరణ వుండదు.
ప్రపంచార్థిక అభివృద్ధిలో 1775 నాటికి ఆసియాది 80 శాతం ! భారత చైనాలది కలిపి చూస్తే ప్రపంచ ఉత్పాదకతలో మూడింట రెండు వంతులు! ఆనాటికి యూరపు ఒక మరుగుజ్జు. ఆసియా దేశాలపై దాడితోనే 1854 కల్లా యూరపు ప్రపంచానికి అధికార కేంద్రమై కూచుంది. మళ్లీ కోలుకోలేనంతగా దాని వలసల వెన్ను విరిగిపోయింది.
తమ వలస సంస్కృతిని ఆ దేశాల ప్రజల ఆలోచనల్లో అంతర్లీనం చేసినందువల్లే ఇదంతా సాధ్యమైంది. ఒకానొక సాంస్కృతిక ఆధిపత్యంతో సగం ప్రపంచాన్ని పరాయీకరించకుండా ఘనత వహించిన పారిశ్రామిక విప్లవాన్ని ఊహించనైనా ఊహించలేము. అడుగుపెట్టిన ప్రతి చోటా అక్కడి ప్రజలకు “తెల్ల వారి కన్నా తాము తక్కువ వారం” అన్న ఆత్మన్యూనతను పులమి, వారిని నిరాశ్రయుల్ని చేయడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. దీంతోనే ఎదురులేని దోపిడీకి వారికి దారి దొరికింది. క్రమంగా వారి ఆలోచనలే వీరి ఆలోచనలుగా, వారి అభిరుచులే వీరి అభిరుచులుగా, వారి భాషే వీరి భాషగా, వారి దృష్టే వీరి దృష్టిగా, వారి విలువలే వీరి విలువలుగా, వారి అభివృద్ధి నమూనానే వీరి అభివృద్ధి నమూనాగా మార్చగల్గారు.
విచిత్రంగా పాశ్చాత్యులు తమ “మహోన్నత నాగరికతను” ప్రపంచానికి పంచిపెడుతున్నామన్న కుంటిసాకుతోనే ఈ కథనంతా నడిపించారు. చిమ్మచీకటిని మిగిల్చి, కొత్త లోకంలోకి నడిపిస్తున్నట్టు భ్రమపెట్టారు.
పారిశ్రామిక వైజ్ఞానిక విప్లవాలకు కొల్లగొట్టిన సంపదే పునాది. లాభ పిపాసే ముడిసరుకుల కోసం సముద్రాలు దాటడానికి ప్రేరణ. అదే నూతన యంత్రాల అవసరాన్ని తెచ్చి పెట్టింది. దాంతోనే అన్వేషణలకు రెక్కలొచ్చాయి.ఇదంతా ఒక గొలుసు!
అందువల్లనే ఈ నాగరికతా, ఈ పారిశ్రామికీకరణా, ఈ వైజ్ఞానికాన్వేషణలూ, ఈ అభివృద్ధి చరిత్ర ఎరుగని యుద్ధాల్నితెచ్చి పెట్టాయి. కనీవినీ ఎరుగని హననాల్ని, ధ్వంసాన్ని సృష్టించాయి. చివరకు భూగోళపు ఉనికినే ప్రశ్నార్థకం చేసాయి. ఈ వాస్తవాల్ని దాచిపెట్టి ఆసియా ఆఫ్రికా దేశాల్ని ఛాందసులుగానో, చేతగాని వారిగానో చిత్రీకరించడం దుర్మార్గాల్లో కల్లా దుర్మార్గం !
నిజానికి తూర్పు దేశాల, అరబ్బుల, గ్రీకుల ఆవిష్కరణలు ఆనాటికి ప్రపంచానికే తలమానికమైనవి, మానవ మేధస్సుకు ప్రతీకలుగా నిలిచినవి వాటన్నిటికీ అతీతంగా ఆకాశం నుంచి ఎకాయెకిన యూరపులో పారిశ్రామిక వైజ్ఞానిక విప్లవాలేమి ఊడిపడలేదు. భారతీయ గణితం, చైనా కాగితం, గ్రీకు తాత్వికతా, అరబ్బుల అనువాదాలు లేకుండానే యూరపులో ఆధునిక సైన్సు పుట్టుకొచ్చిందంటే అంతకన్నా ఆత్మవంచన మరొకటి వుండదు. మూడవ ప్రపంచదేశాల్లోని ప్రజాస్వామ్యం, పంచాయతీలు, ఆహారపు అలవాట్లు, కళలు, భాషలు, తాత్వికత, చిన్న పరిశ్రమలు, సహకార వ్యవస్థలు, వ్యవసాయ విధానాలు, నీటిపారుదల ఏర్పాట్లు యూరప్ కు ఊహకందని నాగరికతలు.పాశ్చాత్యులు వీటి నుంచి తామేమీ నేర్చుకోలేదనడం కన్నా బుకాయింపు మరొకటి వుండదు.
అమెరికా యూరపుల సామ్రాజ్యవాద పారిశ్రామిక విప్లవం ప్రస్తుతం ప్రపంచాన్ని ఏ అంచులకు నెడుతోందో కూడా గమనించాలి. విచక్షణారహితంగా గ్రామీణ వనరుల్ని నగరాలకి తరలించడం దీంతోనే మొదలైంది. ప్రకృతికీ సైన్సుకూ, అభివృద్ధికీ ఉపాధికీ, సంపదకు సమానతకూ, ఉత్పత్తికి శాంతికీ మధ్య ఎన్నడూ ఎరగని వైరుధ్యాలు దీంతోనే పుట్టుకొచ్చాయి. సర్వనాశక ఆయుధ సంపద అంతిమ నిర్ణాయక శక్తిగా దీన్నుంచే తయారైంది.
పశ్చిమ దేశాల అభివృద్ధి నమూనాను మిగిలిన దేశాలూ అనుకరిస్తే పరిణామాలు ఎలా వుంటాయి? ప్రకృతి ఏమవుతుంది? ప్రపంచం ఏ దరికి చేరుతుంది? ఇప్పుడీ చర్చ ఎవరికిష్టం వున్నా లేకున్నా బలంగా మొదలైంది.
గతకాలపు ఉత్పత్తుల స్థాయి ఉపాధికి పారిశ్రామికోత్పత్తులు గారంటీ ఇవ్వగలవా? కనీసం మానవాళిని కటిక దరిద్రంనుంచయినా బయటేయగల్గడం ఎప్పటికైనా ఈ అభివృద్ధి నమూనాకు సాధ్యమేనా? పోనీ సకల జంతురాశికీ ఈ భూగోళం చిరనివాసంగా మనగలదనైనా తమ నాగరికత పూచీపడగలదా? అమెరికా గానీ పాశ్చాత్య దేశాలు గానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగల స్థితిలో లేవు.
అంతేకాదు ఈ అగ్ర దేశాలకు ఆధునిక సైన్సు మరో సవాలును కూడా విసురుతోంది. అది ప్రపంచాన్నంతటినీ ఒకటి చేస్తోంది ఇప్పుడు ఏ సంస్కృతీ తాను నిర్మలమైన దాన్నని చెప్పుకోలేదు. సామాన్య దేశాల నాగరికతా సంస్కృతుల్లో కలిసిపోయి “మైలపడని” సామ్రాజ్యవాదులెవ్వరూ ఇప్పుడు లేరు. ఓడించిన దేశాల నుంచే నేర్చుకోక తప్పని స్థితి వాటికెదురవుతోంది. ఒకనాటి తమ వలస దేశాలే ఇప్పుడు తలెత్తుకొని సకలరంగాల్లో సవాళ్లు విసిరే దశకు వచ్చాయి. చరిత్రను తిరగ రాయమంటున్నాయి!
ఇదో కొత్త దశ. అనివార్యపు దశ. దీని ఫలితంగానే ఇప్పుడు దేశ దేశాల వలసదార్లు 31 కోట్లకు మించి ప్రపంచమంతా అల్లుకుపోయారు. ఇది 1990 కంటే రెండింతలు! ఏ రోజు లెక్కించినా ఒక ఏడాదికి మించి దేశం గాని దేశంలో వున్నవాళ్లు 27 కోట్ల మందికి పైగా కనిపిస్తారు వీరిలో చాలామంది బతుకుతెరువు కోసం గడప దాటిన వాళ్ళే గావచ్చు. కానీ ఈ “అనాగరిక దౌర్భాగ్యులు” లేని ప్రపంచం ఊహకైనా అసాధ్యం!
చరిత్రను దాచిపెట్టి ఇప్పుడు వీళ్లంతా తమ నాగరికతను ధ్వంసం చేయడానికే వచ్చారంటే ఏమనాలి? నిషిద్ధ జాతుల జాబితాలు తయారుచేసి వారిపై నిప్పులు కక్కడాన్నేమనుకోవాలి? సోమాలియా, హైతీ లాంటి దేశాల నుంచి సైతం తమ “ప్రాభవానికి” ముప్పు ముంచుకొస్తోందని అమెరికా లాంటి మహోగ్రదేశం భీతిల్లి పోతోందంటే దాన్నెలా అర్థం చేసుకోవాలి?
ఇప్పటికీ పాశ్చాత్యదేశాలూ, అమెరికా తమ విలువలే ప్రపంచ దేశాల విలువలనుకుంటున్నట్టుంది!
చింత చచ్చినా పులుపు చావనట్టుంది!! ‘పాపం పాశ్చాత్య నాగరికత’ అన్పిస్తుంది!
ఏం చేద్దాం? చరిత్ర పాఠాలింత చేదుగా వుంటాయి మరి!



