మిఠాయి యుగంధర్ బాబు
అది 1988… అప్పటికి ఎల్ఐసి లో చేరి సంవత్సరం దాటింది. నేను ఉద్యోగరీత్యా రాయచోటిలో ఉండేవాడిని. మా అన్న కూడా చెన్నైలో ఉండేవాడు. ఓ నెల విరామం తర్వాత ఇద్దరం ఇంటికి చేరాము. తీరా చూస్తే మా ఇంటి ఎదురుగా ఫలానా జ్యోతిష్యాలయం వెలిసి ఉంది. మా ఊరి దగ్గర నల్లగుట్లపల్లె అనే విలేజ్ ఉంది. ఆ పల్లె నుంచి జ్యోతిష్యం చెప్పే వాళ్ళు , ఇంగ్లీష్ రాకపోయినా, జ్యోతిష్యం చెప్పుకుంటూ మలేషియా, సింగపూర్ దేశాలు చుట్టి వస్తూ ఉంటారు.(అదేం ధైర్యమో అర్థం కాదు ).మా ఇంటి ఎదురుగా వెలిసిన జ్యోతిష్యాలయం నడిపే జ్యోతిష్యుడు కూడా ఆ పల్లె వాడే, అలా సింగపూర్ ..మలేషియా దేశాలు తిరిగి వచ్చిన వాడే. అక్కడ వేలాడదీసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. (అప్పటికి ఇంకా ఫ్లెక్సీ బ్యానర్లు అందుబాటులోకి రాలేదు)
మా అన్న నేను ఓ తమాషా చేసాం. నేను పాత లుంగీ కట్టుకొని, ముడతలు పడిన చొక్కాతో షేవింగ్ చేయకుండా దీనంగా మొహం పెట్టుకొని మా అన్న తో పాటు జ్యోతిష్యాలనికి వెళ్లాను. 50 రూపాయలు టోకెన్ తీసుకొని అక్కడున్న క్యూలో కూర్చున్నాను. మా ఎదురుగా ఓ పెద్ద పీట పైన జ్యోతిష్యుడు చేతికి రకరకాల దారాలతో, విభూది, కుంకుమలతో దగద్ధమానంగా వెలిగిపోతున్నాడు. నా వంతు వచ్చినప్పుడు మా అన్న “సామీ వీడు మా తమ్ముడు. చదువుకున్నాడు గాని ఇంకా ఉద్యోగం రాలేదు. ఇంకా పెళ్లి కాలేదు. బాధపడతా ఉన్నాడు. ఉద్యోగం వస్తుందంటారా?” అని అడిగాడు.
ఆ జ్యోతిష్యుడు నా అరచేయి పట్టుకుని చేతిలో రేఖలను భూతద్దంతో చూశాడు, వేళ్లు మడిచాడు. గవ్వలు తీసుకొని నేలపై వేసి ఏదో ఆలోచించి, లెక్కలేసుకొని “మీ వాడికి ఉద్యోగము దగ్గరికి వచ్చి జారిపోతా ఉంది. ఓ గాలి శక్తి అడ్డుపడుతోంది. అంత్రం వేస్తాను. అన్ని శక్తులు లొంగిపోతాయి. అంత మంచి జరుగుతుంది,కానీ కొంచెం ఖర్చవుతుంది” అని అన్నాడు. అంత్రం చేసిన తర్వాత ఉద్యోగం వస్తుందంటారా… అంటే, “ఉద్యోగం వస్తుందా ? అది పరిగెత్తుకొస్తుంది. అంత్రానికి దుడ్డు సరి చేసుకోండి” అన్నాడు. సరే డబ్బులు లెక్కేసుకొని వస్తామని చెప్పి బయటపడ్డాం. (ఓ ఆరు నెలల్లోనే ఆ కొట్టు మూసేశాడు, అది వేరే సంగతి). మీకు అర్థమై ఉంటుంది ఈ జ్యోతిష్యాలయాల్లో ఎంత నిజం ఉందో ఎంత కల్పన ఉందో.
ఇది దాదాపు 37 సంవత్సరాల ముందు నిజంగా జరిగిన ఓ సంఘటన. అప్పుడు ఇలాంటి ప్రచార సాధనాలు అంతగా లేవు. అప్పట్లోనే అలాంటి మోసలు జరుగుతూ ఉన్నాయంటే , ఇప్పుడు టీవీలో ప్రకటన, సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ ,ఎలక్ట్రానిక్ మీడియా రకరకాల ప్రచార సాధనలో అందుబాటులో ఉండి ప్రకటనల్లో ఊదరగొట్టే ఈ మోసాలు చాలా చాలా ఎక్కువవుతున్నాయి. “జ్యోతిష్యాలయం” పేరుతో రకరకాలుగా బోర్డులు పెట్టుకొని ప్రజలను మోసం చేసేవాళ్లు కోకొల్లలుగా ఉన్నారు.
అసలు ఈ చేతిలోని రేఖలేంటో ఈ జ్యోతిష్యం ఏంటో ఒకసారి సింహావలోకనం చేద్దాం.జ్యోతిష్యంలో జాతకచక్రం, హస్త సాముద్రికం రెండు ఉన్నాయి. పుట్టిన తేదీ ప్రాంతాన్ని బట్టి మనిషి పైన గ్రహాల ప్రభావము, గ్రహాల స్థితిలు బట్టి మనిషి జీవితంలో శుభ అశుభ ఫలితాలను అంచనా వేయడమే జాతక చక్ర జ్యోతిష్యం. మనిషి శరీరాన్ని బట్టి భవిష్యత్తును చెప్పే శాస్త్రం సాముద్రికము. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి హస్త సాముద్రికం రెండోది అంగ సాముద్రికం. హస్త సాముద్రికంలో వ్యక్తి చేతి లోని రేఖలు, చక్రాలు చూసి జరిగింది, జరగబోయేది చెప్పడం… అదృష్టాన్ని, భవిష్యత్తును అంచనా వేయడం జరుగుతోంది.
అంగ సాముద్రికం అంటే శరీరం లోని వివిధ భాగాలపై ఉండే పుట్టుమచ్చలు, శరీర ఆకృతి, తల, వెంట్రుకలు పాదాల వేళ్ళు లక్షణాల ఆధారంగా ఒక వ్యక్తి స్వభావాన్ని, భవిష్యత్తును, అదృష్టాన్ని అంచనా వేసే శాస్త్రం అన్న మాట. పుట్టుమచ్చల స్థానము, శరీరము, ముఖము, మెడ, చేతులు, కాళ్లు భాగాలపై ఇతర శరీర భాగాలపై ఉన్న పుట్టుమచ్చల రంగు… పరిమాణము, స్థానాన్ని బట్టి మంచి చెడు ఫలితాలు చెబుతారన్నమాట. ఇందులో భాగమే పెళ్లి చూపులకు వచ్చిన అమ్మలక్కలు అమ్మాయిని (పెళ్లికూతురుని) అటు ఇటు తిరగమని చెప్పడం, నడవమని చెప్పడం, కాలి వేళ్ళను పరికించి చూడడం, జుట్టు సరైన కాదా సవరమా, సొంత వెంట్రుకలా అని అడగడం ఇవన్నీ అంగ సాముద్రికంలో భాగాలే. ఇది ఒక సాంప్రదాయక అభ్యాసం. అనేక సంవత్సరాలుగా ప్రజలు దీన్ని ఉపయోగిస్తున్నారు.
అసలు సాముద్రికం అన్న పదం ఎలా వచ్చిందంటే మొదట ఈ శాస్త్రాన్ని సముద్రుడు చెప్పినందువలన, అంటే శాస్త్ర కర్త సముద్రుడు కాబట్టి దీనిని సాముద్రిక శాస్త్రం అంటారని కొంతమంది చెప్తున్నాను. ఈ శాస్త్రము సముద్రంలాగా అనంతం కాబట్టి ఈ శాస్త్రానికి ఆ పేరు వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. మొత్తానికి ఈ సాముద్రికంలో హస్త సాముద్రికం పైన చాలా ప్రచారం జరిగి అందుబాటులో ఉంది. పెళ్లి విషయం వచ్చేసరికి జాతక చక్రం ప్రముఖ పాత్ర వహిస్తుంది. జాతకాలు మ్యాచ్ అయితేనే పెళ్లి మ్యాచ్ అవుతుందని ప్రభల విశ్వాసము ప్రగాఢంగా సమాజంలో అల్లుకుపోయింది. జాతకాల పిచ్చిలో పెళ్లిళ్లు కుదరక చాలామంది వయసు మీరు పోయిన తర్వాత కూడా అవివాహితులుగా మిగిలిపోతున్నారు. చేసేదిలేక పెళ్లిళ్ల కోసం కొంతమంది జాతకాలు మార్చేసి ఫేక్ జాతకాలు, కంప్యూటర్ జాతకాలు రకరకాల జాతకాలు తయారుచేసే పెళ్లిళ్ల పేరయ్యలు తయారయ్యారు. ఏమన్నా అంటే నూరు అబద్దాలు చెప్పైనా ఓ పెళ్లి చేయాలని సామెత చెప్తారు.
అసలు విషయము హస్త సాముద్రికం. వివేకానందుడు “భవిష్యత్తు అంతా మీ చేతుల్లోనే ఉందని చెప్పారు” దానిని వక్రీకరించి కొంతమంది అవును చేతుల్లోని రేఖల్లోనే అంత ఉందంటారు. నిజానికి అది కాదు కదా. చేతులలో ఉన్న రేఖలు ఎలా ఏర్పడ్డాయి. అమ్మ కడుపులో చేతులు ముడుచుకుని ఉన్నప్పుడు ఏర్పడ్డాయి కదా. ఇది కూడా వాళ్ళ నమ్మరు. ఈ రేఖలే మన భవిష్యత్తులో నిర్ణయిస్తాయి అని చెబుతారు. ముఖ్యంగా పుట్టిన తేదీ సమయం సరిగా రికార్డు కాబడని వాళ్ళకి జ్యోతిష్యమే వాస్తవానికి భవిష్యత్తుకు అసలైన లింకు అంటారు.
హస్త రేఖలలోనే బృహస్పతి, శని , బుధుడు అంగారక, శుక్ర గ్రహాలు వీటన్నిటి ప్రతిబింబం చేతిలోనే ఉన్నాయని చెబుతారు. భవిష్యత్తు లెక్క వేయడంలో వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుంటారంట. ప్రకృతి పరంగా స్త్రీ , పురుషులలో కొన్ని భేదాలను సృష్టించబడి ఉందని, చేతిని చూసి జాతకం లెక్క వేయడంలో అనేకమంది పరిశీలించి మగవారికి కుడి చేయి, ఆడవారికి ఎడమచేయి చూడాలని చెబుతున్నారు. ఇది ఎంతటి వివక్ష. అంటే ఈ రేఖలు సృష్టించే వాళ్ళు మగ పక్షపాతంతో, వివక్షతతో మగ వాళ్ళకు కుడి చెయ్యి ,ఆడవాళ్ళకు ఎడమ చేతిలో భవిష్యత్తును రాసి పెట్టారా?. ఈ ఒక్క విషయం ఆలోచిస్తే ఈ రేఖలకు అర్థాలు మనిషి సృష్టించిందే కానీ ఆ రేఖలలో ఏమీ లేదని అర్థమవుతుంది కదా.
మీరు గమనించినారో లేదో ?.. ఈ రేఖలు మన చేతుల్లోనే కాదు కోతుల చేతుల్లోనూ చింపాంజీ, గెరిల్లాల చేతుల్లో కూడా ఉన్నాయి. కింగ్ కాంగ్ సినిమా చూస్తే మీకు సినిమాస్కోప్ లో ఈ గీతలు, రేఖలు కనిపిస్తాయి. కానీ మన దురదృష్టము ఈ కోతులకు, చింపాంజీలకు జాతకం చెప్పే వాళ్ళు లేకుండా పోవడమే. జూ(జంతు ప్రదర్శనశాల) వాళ్ళు డబ్బు ఇవ్వడం మొదలుపెడితే ఈ కోతులకు కూడా జాతకాలు పుట్టుకొస్తాయి. జ్యోతిష్యాలయాలు వెలుస్తాయి. అందులో అనుమానం లేదు ఎందుకంటే జ్యోతిష్య వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశ్యము డబ్బే కదా.
మొత్తం మీద ఈ జ్యోతిష్యాలయాలు మంచి వ్యాపారి కేంద్రాలుగా తయారయ్యాయి. బాగా ప్రచారం జరిగి, పేరు వస్తే వీళ్ళ ఫీజు వేలల్లో ఉంటుంది. వీళ్ళు పెద్ద పెద్ద హీరోలు, రాజకీయ నాయకులకు జాతకాలు చెబుతున్నట్టుగా ఫోటోలు (మార్ఫింగ్ చేసిన ఫోటోలు) పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ఆ మధ్య ఓ జ్యోతిష్యుడు ఏకంగా ప్రధానమంత్రితో ఉన్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెట్టి ప్రచారం చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు. జాతకాలు చెప్పడమే కాదు జాతకాలు పేరుతో భయపెట్టి ప్రాణపాయము, గండం ఉందని చెప్పి బెదిరించి వాటి ప్రాయశ్చిత్తం కోసం డబ్బులు గుంజుకుంటున్నారు. కలగాపులగంగా ఏవో పిచ్చిపిచ్చిగా ఊహాగానాలు చేసి అవే నిజమని నమ్మించి బెదర గొడుతున్నారు. ఆన్లైన్ జ్యోతిషము ..ఆన్లైన్ పరిష్కారం కూడా అందుబాటులోకి వచ్చేసింది. (టెక్నాలజీ మహిమ).
సోమరిపోతులు, మూర్ఖులు ఈ జాతకాలు, సాముద్రికాలు నమ్ముతారని వివేకానంద పేర్కొన్నారు. ప్రముఖులైన దయానంద సరస్వతి, మహాత్మా గాంధీ, భారతదేశ ప్రథమ మరియు ఆఖరి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి జ్యోతిష్యాన్ని వ్యతిరేకించారు. విచారించదగ్గ విషయం ఏమంటే ఈమధ్య మన సమాజం తిరోగమనంలో పయనిస్తోంది. దానికి పరాకాష్ట కొన్ని యూనివర్సిటీలలో ఈ అశాస్త్రీయ అంశాన్ని శాస్త్రీయ అంశంగా ప్రవేశపెట్టారు. సైన్సు అంతగా అభివృద్ధి చెందని కాలంలో జ్యోతిష్య శాస్త్రమే (ఆస్ట్రాలజీ) ఖగోళ శాస్త్రం (అష్ట్రానమి) రెండు ఒకటిగా ఉండేది. అప్పుడు గ్రహాణాల ఏర్పాటు, గ్రహణము ప్రారంభము ముగింపు అవన్నీ కూడా ఖచ్చితంగా లెక్క పెట్టేవాళ్ళు. రాను రాను జ్యోతిష్యం (ఆస్ట్రాలజీ) అక్కడే ఆగిపోయింది. ఖగోళ శాస్త్రము (అష్ట్రానమి) వేరుపడి ముందుకు పరిగెత్తింది.
నమ్మకం వేరు…. నిజం వేరు…. మూఢ నమ్మకం వేరు. మూఢనమ్మకాలు పక్కన పెడదాం. మనిషిని నిర్వీర్యం చేసే విషయాలు పక్కన పెట్టి ముందుకు పోదాం.



