డా నాగసూరి వేణుగోపాల్
వైజ్ఞానిక వెలుగు దివ్వెలు-3

అణుకేంద్రకంలో ఉండే ‘మెసాన్’ (Meson) ద్రవ్యరాశిని తొలిసారి లెక్కించిన శాస్త్రవేత్త బిభా చౌదురి (Bibha Chowdhuri)! అంతేకాదు మనదేశంలో ‘హై ఎనర్జీ ఫిజిక్స్’ (High Energy Physics) విభాగపు తొలి మహిళా శాస్త్రవేత్త, ఇంకా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ తొలి మహిళా శాస్త్రవేత్త కూడా ఆమే.
మహా శాస్త్రవేత్తల సహచర్యం
బిభా చౌదురి (1913-1991) గురించిన వివరాలకు వెళితే అబ్బురవుతుంది. మహాశాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ కు బంధువు. ఆయన మేనల్లుడు దేవేంద్రమోహన్ బోస్ తో కలిసి ఆమె పరిశోధన చేశారు. ఆమె పిహెచ్డీ పట్టాకు పర్యవేక్షణ చేసిన పి.ఎం.ఎస్. బ్లాకెట్ (P.M.S. Blackett) తర్వాత దశలో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కు సైన్స్ పరిశోధనలకు సంబంధించిన సలహాదారు. అంతే కాకుండా ప్రఖ్యాత శాస్త్రవేత్తలు హోమీ జహంగీర్ భాభా, విక్రమ్ సారాభాయ్ స్థాపించిన పరిశోధనాసంస్థలలో ఆమె శాస్త్రవేత్త. ఎం. జి. కె. మీనన్, యశ్ పాల్ వంటి శాస్త్రవేత్తలకు సహ పరిశోధకురాలు. ఇటీవల కనుమూసిన కస్తూరి రంగన్ కు మొదట న్యూక్లియర్ ఫిజిక్స్ బోధించిన ఉపాధ్యాయిని!
ఇంత నేపథ్యం ఉన్నా ఆమె చివరి వరకు చాలా ప్రాధాన్యత లేని పరిశోధక స్థాయిలోనే ఉండిపోయారు. అంతకుమించి ఆశ్చర్యమేమిటంటే 2018 లో జీవిత చరిత్ర వచ్చేదాకా ఆమె పేరు భారతీయ పరిశోధనా రంగంలోని దాదాపు అందరికీ తెలియకుండా పోవడమే!
బిభా చౌదరి 1913 జూలై 3న కలకత్తాలో బంకు బిహారి చౌదరి, ఊర్మిళాదేవి దంపతులకు కలిగిన ఐదుమందిలో మూడవ సంతానం. ఆమె తండ్రి జమీందారీ వంశానికి చెందిన వైద్యులు కాగా, తల్లి జగదీష్ చంద్రబోస్ బంధువు, అలాగే బ్రహ్మ సమాజపు అనుయాయి. ఈ వివాహం కారణంగా బంకు బిహరి చౌదరి దంపతులను కుల బహిష్కరణ చేశారు. తమ పిల్లలు ఉన్నత చదువులు పొందేందుకు ఆ దంపతులు శ్రమించాల్సి వచ్చింది.
తొలి మహిళా భౌతిక శాస్త్రవేత్త
కలకత్తా విశ్వవిద్యాలయపు 20 ఏళ్ల ఫిజిక్స్ శాఖ చరిత్రలో ఎమ్మెస్సీ చేసిన మూడవ మహిళ బిభా. అలాగే 1934-36 మధ్యకాలంలో ఫిజిక్స్ చదివిన 24 మందిలో బిభా మాత్రమే అమ్మాయి. ఎం. ఎస్. సి. పూర్తి కాగానే అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న దేవేంద్ర మోహన్ బోస్ దగ్గర పరిశోధన చేయడానికి ఆమె సంప్రదించారు. మహిళలు పరిశోధన చేయడానికి తగిన అంశం లేదని తొలి భారతీయ విశ్వకిరణాల శాస్త్రవేత్త దేవేంద్ర మోహన్ బోస్ తొలుత తటపటాయించారు. ఈ వ్యవహారాన్ని గమనిస్తే కమలా సోహాని విషయంలో సి. వి. రామన్ అనుసరించిన ధోరణి మనకు గుర్తుకు రాక మానదు.
చివరకు డి. ఎం. బోస్ పరిశోధనకు అంగీకరించగానే 1935లో సైద్ధాంతికంగా సూచింపబడిన మెసేట్రాన్ (మెసాన్ తొలి పేరు) గురించి బిభా పరిశోధనలలో దిగిపోయారు. విశ్వ కిరణాలనబడే కాస్మిక్ రేస్ వేర్వేరు తీక్షణతల కోసం ఎత్తైన డార్జిలింగ్ (7వేల అడుగులు), సందక్ఫూ (12 వేల అడుగులు), ఫరిజాంగ్ (14 వేల అడుగులు) నుంచి ఫోటోగ్రఫిక్ ప్లేట్లు అక్కడకు తీసుకుని వెళ్లి పెట్టడం, మళ్ళీ ప్రయోగం పూర్తయిన తర్వాత తీసుకురావడం … అలాగే మరికొన్ని ప్లేట్లను నీళ్లలో, ఫెరాఫిన్ వంటివాటిల్లో ఉంచడం ఆమె ప్రయోగాల్లో తప్పనిసరి భాగాలు. ఇది ఒక రోజుతో ముగిసే కార్యక్రమం కాదు, చాలా పెద్ద సంఖ్యలో ప్రయోగాలు చేయాల్సి ఉండేది.
ఈ ప్రయోగాల వల్ల వారు ఒక కొత్త న్యూక్లియర్ పార్టికల్ సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించడమే కాకుండా అవి కిందకు ప్రయాణం చేసే కొద్ది ద్రవ్యరాశిని కోల్పోతున్నాయి అని కూడా ఆమె గమనించారు. వాటి ద్రవ్యరాశి, శక్తి, ద్రవ్యవేగం వంటి విలువలను కూడా లెక్క కట్టడానికి ప్రయత్నించారు. ఈ ప్రయోగాల ఫలితాలు ఆధారంగా ‘నేచర్’ వంటి రీసెర్చ్ జర్నల్ లో 1941-43 మధ్యకాలంలో 4 పరిశోధనాపత్రాలు ప్రచురింపబడటం చాలా గొప్ప విషయం. లభ్యమైన ఫోటోగ్రాఫిక్ ప్లేట్లు అంత నాణ్యమైనవి కాకపోవడం ఒక సమస్య. తర్వాత దశలో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా అసలు ఫోటోగ్రాఫిక్ ప్లేట్లు దొరక్కపోవడంతో కాస్మిక్ రేస్ కు సంబంధించిన పరిశోధనలు అర్థంతరంగా ముగిసాయి. అయితే తమాషా ఏమిటంటే బిభా చౌదురి, డి. ఎం. బోస్ ద్వయం చేసిన రీతిలోనే ప్రయోగాలు చేసిన సి. ఎఫ్. పోవెల్ ఫిజిక్స్ 1950లో నోబెల్ బహుమతి పొందడం.

అవరోధాల మధ్య
కుటుంబం ప్రోత్సహించడంతో 1945లో బిభా ఇంగ్లాండ్ వెళ్లి, మాంచెస్టర్ యూనివర్సిటీలో విశ్వకిరణాల మీద పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్న పి. ఎం. ఎస్. బ్లాకెట్ (P.M.S. Blackett) వద్ద పీహెచ్డీలో చేరారు. తన సిద్ధాంత గ్రంథం సమర్పించిన 1949 సం. లోనే ఆమె పర్యవేక్షకుడికి నోబెల్ బహుమతి రావడం విశేషం. ఈ బహుమతి కృషిలో కూడా బిభా చౌదురీ భాగస్వామ్యం గురించి ఎక్కడా పేర్కోలేదని 2018 లో ‘ఏ జువెల్ అనర్తడ్ బిభా చౌదరి: ఏ స్టోరీ ఆఫ్ అండ్ ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్’ గ్రంథ రచయితలు సుప్రకాష్ సి. రే, రాజేందర్ సింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
తర్వాత కొంతకాలం పారిస్ లో పరిశోధనలు కొనసాగించాలని బిభా భావించి, దానికి భారత ప్రభుత్వ సహాయం కావాలని ప్రయత్నించారు. ప్రభుత్వం దీనికి సంబంధించి హోమీ జహంగీర్ భాభా అభిప్రాయాన్ని కోరడం, ఆ అభిప్రాయం అనుకూలంగా లేకపోవడంతో ఆ సహాయం అందలేదు. ఫలితంగా ఆమె భారతదేశానికి తిరిగి వచ్చి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ఫెలోగా చేరారు. అక్కడ చేరిన తొలి మహిళా శాస్త్రవేత్త ఆమె. క్లౌడ్ చేంబర్ పరిశోధక బృందానికి ఆమె నాయకత్వం వహించారు. ఇక్కడ ఆమె పనిచేసిన ఐదేళ్ల కాలంలోనే ఎం. జి. కె. మీనన్ మొదలైన వారు సహ పరిశోధకులు. ఈ సమయంలో ఆమె కేవలం ఒకే ఒక పరిశోధనా పత్రం వెలువరించడం గమనార్హం.

Pic Credit : TIFR
1953 తర్వాత తక్కువ జీతానికి బెంగాల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి సొంత ఊరు కలకత్తా వెళ్లిపోవడం మరో ఆసక్తికరమైన విషయం. అయితే అక్కడ ఒక సంవత్సరం కూడా ఆమె పనిచేయలేదు. 1955-59 మధ్యకాలంలో ఆమె యూరోప్ వెళ్లి తొలుత ప్యారిస్ లో రెండేళ్లు, పిమ్మట మిచ్ గాన్ స్టేట్ యూనివర్సిటీలో రెండేళ్లు పరిశోధనలు చేశారు.
1959 సం. చివరలో కొడైకెనాల్ లోని సోలార్ అబ్జర్వేటరీ లో చేరారు. ఈ సమయంలోనే కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో ‘ఫోటాన్ డీకే’ (Photon decay) ప్రాజెక్టుకు ఎంతగానో కృషి చేశారు. అయితే దీనికి సంబంధించిన ఆమె కృషి గురించి తర్వాత ఎక్కడా నమోదు కాలేదని అంటారు. 1966 లో అహ్మదాబాద్ లోని విక్రమ్ సారాభాయ్ నేతృత్వం వహించే ఫిజికల్ రీసెర్చ్ లేబరేటరీ లో చేరారు. ఇక్కడ కూడా ఆమె తృప్తిగా ఉన్నట్టు కనబడదు. పరిశోధనా పత్రాలు కూడా పెద్ద సంఖ్యలో రాలేదు.
చిట్టచివరిదాకా
రాజస్థాన్ లోని మౌంట్ అబూ పర్వతం పైన ఆమె రేడియో ఫ్రీక్వెన్సీ ఎమిషన్స్ కొలవాలని తలపెట్టిన ప్రయోగం విక్రమ్ సారాభాయ్ 1971లో కనుమూయడంతో ముందుకు సాగలేదు, తర్వాత స్వచ్ఛంద పదవీవిరమణ చేసి ఆమె కలకత్తా వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం, సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్, ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ సంస్థల శాస్త్రవేత్తలతో పరిశోధనలు కొనసాగించారు.
1991 జూన్ 2వ తేదీ బిభా కన్నుమూశారు. ఆమె చివరి పరిశోధనా పత్రం 1990లో వెలుగు చూడటం గమనిస్తే చివరి దాకా ఆమె పరిశోధన మానలేదని బోధపడుతుంది. బెంగాలీ సాహిత్యమన్నా, బ్రహ్మ సమాజపు విలువలన్నా ఎంతో ఆసక్తి చూపే బిభా విదేశాలు వెళ్లి వచ్చాక, తన పరిశోధనా పత్రాలు భారతీయ జర్నల్స్ లోనే ప్రచురించారు. మహిళలు భౌతిక శాస్త్రం వంటి సైన్స్ విషయాలను తెలుసుకోవాలని, అందులో పరిశోధన చేయాలని భావించేవారు.
2018 లో జీవిత చరిత్ర రావడంతో ప్రపంచానికి బిభా గురించి పెద్ద ఎత్తున తెలిసింది. ఆమె మరణించాక ఇటీవల కాలంలో రెండు గొప్ప గౌరవాలు ఆమెకు లభించాయి. 2019 డిసెంబర్ 17న ది ఇంటర్నేషనల్ అస్ట్రోనామికల్ యూనియన్ సెక్స్టాన్స్ (Sextans) నక్షత్రం మండలంలోని తెల్లని-పచ్చ నక్షత్రానికి భారతీయ మహిళా శాస్త్రవేత్త ‘భిభ’ అని పేరు పెడుతున్నట్టు ప్రకటించింది. 2020 మార్చిలో భారత ప్రభుత్వపు మహిళా,శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన 11 పీఠాల్లో ఫిజిక్స్ పీఠం బిభా చౌదురి పేరున ఉండటం గర్వకారణం.
– డా నాగసూరి వేణుగోపాల్, 9440732392