మిఠాయి యుగంధర్ బాబు

గూబ యెక్కినట్టి గురము పాడుగ బెట్టి
వెళ్లి పోదురంత వెర్రి వారు
గూబ యేమి చేసె గురమేమి చేసును?
విశ్వదాభిరామ వినురవేమ!

ఆరు శతాబ్దాల క్రితమే వేమన గారు పై పద్యములో ప్రజల మూఢనమ్మకాల గురించి గుడ్డి నమ్మకాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. పై పద్యంలో గుబ అంటే గుడ్లగూబ గురము అంటే ఇక్కడ గుర్రము అనుకోవచ్చు (లేక ఓ ఇల్లు అనుకోవచ్చు) ఒక గుడ్లగూబ ఓ ఇంటి లోపల లేదా గుర్రం పైన కూర్చుంటే ఆ గుర్రాన్ని ఆ ఇంటిని పాడు పెట్టి జనం వెళ్ళిపోతారు కదా. గుడ్లగూబ వచ్చి కూర్చోవడంలో దాన్ని తప్పేముంది గుర్రం (ఇల్లు) తప్పేముంది? అని నిలదీస్తారు వేమన గారు. వేమన విగ్రహాలు అన్నిచోట్ల పెట్టేస్తున్నాం. కానీ వేమన చెప్పిన నగ్నసత్యాల గురించి సాంఘిక దురాచాల గురించి మాత్రం మనం పట్టించుకోము.

ఆనాటి సమాజంలో గుడ్లగూబ గురించి ఎలాంటి అపోహలు ఉండేవో ఈనాడు కూడా ఇంకా అలాంటి అపోహలు ఉన్నాయి. గుడ్లగూబ గురించి ప్రపంచ వ్యాప్తంగా అన్ని సమాజాలలో రకరకాల కథలు, పురాణాలు, జానపదాలు అల్లుకుని ఉన్నాయి. చూడ్డానికి అందవికారంగా ఉండి, పెద్ద కనుగుడ్లతో, విచిత్రంగా ఉండే చెవులతో, వింతగా తల తిప్పుతూ రాత్రిపూట మాత్రమే తిరిగి ఈ పక్షి గురించి రకరకాల భయాలు, అపోహలు వ్యాప్తిలో ఉన్నాయి.

క్షుద్ర పూజలలో మంత్రగత్తెల తో పెనవేసుకొని గుడ్లగూబ గురించి అనేక కథలు ఉన్నాయి. మంత్రగాడు లేక మంత్రగత్తె గుడ్లగూబగా మారిపోతుందని, గుడ్లగూబలను వార్తాహరులుగా వాడుకుంటారని, చిన్నపిల్లలను గుడ్లగూబలు ఎతుకుపోతాయని కూడా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఆమధ్య అత్యంత ప్రజాధరణ పొందిన హరిపోటర్ పుస్తకాలలో కూడా హేరికి పెంపుడు జంతువుగా గుడ్లగూబ ఉంటుంది. హార్వర్డ్ పాఠశాల ఉత్తరాల చేరవేయడానికి గుడ్లగూబలనే వాడుకుంటుంది.

ఇక మన దేశంకి వచ్చినట్లయితే ఉత్తర భారత దేశంలో ఉల్లు (ullu) అంటే హిందీలో గుడ్లగూబ.”ఉల్లుకే పట్టే” అంటే తెలివిలేనివాడా దద్దమ్మ అని ఓ తిట్టు. తెలుగులో కూడా ‘గుబ’ అని తిడుతారు. నిజానికి గుడ్లగూబలో రాత్రిపూట చూడగల చాలా తెలివైన పక్షి.

గుడ్లగూబ ఇంట్లోకి ప్రవేశిస్తే ధన నాశనం, గుడ్లగూబ గబ్బిలం కంటే ప్రమాదము. ఇంట్లో గాని, మన కాంపౌండ్ లో గాని వచ్చి వెళితే ఆరు నెలలలో చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది, ప్రాణాపాయం సంభవిస్తుంది అని ప్రవచనకారులు ఊదరగొడుతున్నారు. అదే గుడ్లగూబ పూజా మందిరం లోనికో, దేవుని ఫోటో దగ్గరకో వచ్చి వెళ్ళినట్లైతే శుభ సూచకమట. అంటే పోలీసులు వచ్చి మేడంగారు (దేవత) వస్తున్నారు అని చెబుతున్నారా? లేక మిమ్మల్ని అరెస్టు చేయాలని వచ్చారా (మీ దుంప తెంచడానికి) అన్నదే తేడా అంట.! ఈ గుడ్లగూబ ఓ దేవతకు వాహనం అనే అందరూ నమ్ముతారు. అన్ని దేవతల వాహనాలకు పూజలు చేస్తారు. ఉదాహరణకు ఎలుక, నెమలి, పులి, హంస ఇలాంటివి. కానీ ఈ వాహనానికి అంటే గుడ్లగూబకు మాత్రం పూజ చేయము అని ప్రవచనకారులు చెబుతారు. ఆ గుడ్లగూబ దైవ సందేశాన్ని తీసుకువచ్చిందా? లేక నెగటివ్ ఎనర్జీతో వచ్చినదా?? అన్నది ముఖ్యమట. దానికి ఓ టెస్టు కూడా చెప్తారు. అదేమిటంటే గుడ్లగూబ వచ్చి మిమ్మల్ని సందర్శించిన తర్వాత ఇంట్లో ఎవరికైనా క్రానిక్ జబ్బులు వస్తున్నాయా? ఏదైనా ఆర్థిక ప్రమాదం జరిగే సూచన ఉందా…. ఇలాంటివి బేరీజు వేసుకుంటే గుడ్లగూబ దేనికోసం వచ్చిందో మనకు అర్థం అయిపోతుందట.

గుడ్లగూబ వచ్చి వెళితే ఇల్లు వదిలేసి కొన్ని నెలలు దూరంగా ఉంటారు. గుడ్లగూబ కనిపిస్తే కూడా కొన్నిసార్లు ప్రమాదం అని భావిస్తారు. కలలో గుడ్లగూబను చూడడం జ్యోతిష్య ప్రకారం ఏదో కారణం ఉంటుందట. ఇది మీకు ఎన్నో అంతర్గత సత్యాలను వెల్లడిస్తుంది లేదా మిమ్మల్ని హెచ్చరిస్తుంది. అలాగే భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుందట. ఎందుకంటే గుడ్లగూబ చీకటి, రాత్రి, చందమామలతో సంబంధం ఉన్న ఒక పక్షి అని అంటారు. కొంతమంది గుడ్లగూబ కనిపించడం శుభసూచకము అని, ధనవంతులవుతారు అని భావిస్తారు. గుడ్లగూబ శబ్దాలలో బిడ్డ జన్మిస్తే శుభప్రదంగా కొంతమంది భావిస్తారు. కొంతమంది తెల్లటి గుడ్లగూబలను పూర్వీకుల ఆత్మగా పరిగణిస్తారు. తెల్లని గుడ్లగూబ కనిపిస్తే శుభసూచకంగా భావిస్తారు. పూర్వీకుల సందేశంగా అనుకుంటారు. ఇది కూడా ఓ అపోహ. శుభాలు, అశుభాలు జరుగుతాయి అనుకోవడం రెండు కూడా తప్పే. ఎలాంటివి జరగవు.

శ్రీధర స్వామి అని ఒక ఆయన అంతర్జాలంలో గుడ్లగూబల గురించి చాలా చక్కగా వివరించాడు. “గుడ్లగూబలు వాటి మానాన అవి బతుకుతూ ఉంటాయి. వాటికీ కుటుంబము, సమాజమూ ఉంటుంది. అవి పొరపాటున ఇంట్లోకి వస్తే ఆ ప్రాణి పట్ల దయ, కరుణ చూపండి. అంతేకానీ అరిష్టంగా, దోషంగా భావించి ఆందోళన పడడం సబబు కాదు. అదృష్టం అని భావించడం కూడా సమంజసం కాదు. ఆ గుడ్లగూబ తన గుంపు నుండి తప్పిపోయి అభద్రతతో భయం భయంగా ఉంటుంది దాని ప్రదేశానికి దాన్ని పంపించడానికి ప్రయత్నించాలి. నువ్వు ఏ విధంగా అయితే సుఖాన్ని, సంతోషాన్ని, భద్రతను కోరుకుంటావో ప్రతి ప్రాణి కూడా అదే విధంగా కోరుకుంటుంది. అది ప్రత్యేకంగా మీ ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ రాదు. (దానికి చదువు రాదు, అడ్రస్సు తెలియదు కాబట్టి ). మనకు చెడుపు చేయాలని, నష్ట పరచాలని ఉద్దేశ్యము దానికి ఉండదు. ఏదో దారి తప్పి అలా వస్తుంది. నిజానికి మనకు ఎలాంటి నష్టమో,లాభమో జరగదు. ఇటువంటి చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసి బెంబేలు పడడం సమంజసం కాదు. గుడ్లగూబ వచ్చి వెళితే ఎలాంటి శాంతి కార్యక్రమాలు అవసరం లేదు” అని శ్రీధర స్వామి చెబుతున్నాడు

గుడ్లగూబను ఓ దేవతకు వాహనంగా చాలామంది భావిస్తారని ఇదివరకే చెప్పుకున్నాం కదా. ఇందువల్ల ఉత్తర భారత దేశంలో ఓ దారుణమైన సాంప్రదాయం అమల్లో ఉంది. అదేమిటంటే దీపావళి రోజున ఆ దేవత గుడ్లగూబ వాహనంపై భూమికి దిగి వస్తుంది. కాబట్టి ఆ రోజున గుడ్లగూబని చంపినట్లైతే ఆ దేవత శాశ్వతంగా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతుందని భావించి గుడ్లగూబను పట్టి చంపడం ఓ సంప్రదాయంగా మారిపోయింది. వాహనం లేకపోతే ఆ దేవత తిరిగి వెళ్ళదు కదా!! అని వారి వాదన. చూడండి ఎలాంటి దారుణమైన సంప్రదాయమో. అంటే ఒకవేళ ఆ దేవత నిజంగా భూమికి వస్తే వాహనం లేకపోతే తిరిగి వెళ్ళలేదా? ఆమెకి దారి తెలియదా? ఈ గుడ్డి నమ్మకం పేరుతో ప్రతి సంవత్సరము ఉత్తరాదిన వేల సంఖ్యలో గుడ్లగూబలను చంపేస్తున్నారు. దీనివల్ల గుడ్లగూబల ఉనికికే ప్రమాదం ఏర్పడింది.

అంతేకాదు క్షుద్ర పూజ చేసే వాళ్ళు నాటువైద్యం చేసే వాళ్ళు పల్లెలలో, చిన్న చిన్న ఊర్లలో గుడ్లగూబల వేట ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే గుడ్లగూబల శరీర భాగాలు అంటే వాటి ఈకలు, చెవులు గోర్లు, గుండె, కాలెయము, రక్తము, కళ్ళు, ముక్కు ఇవన్నీ కూడా క్షుద్ర పూజలలో, సంప్రదాయ పూజలలో, ఉత్సవాలలో, నాటు మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఇందుకోసం 16 రకాల గుడ్లగూబలను వేటాడి పట్టుకొని చంపుతున్నారు. ఓ అమాయక చిన్న ప్రాణిపైన ఎంతటి అమానుష్యమైనా అకృత్యాలు చేస్తున్నారో మీకు అవగతమవుతోంది కదా.

దృవ ప్రాంతాలు తప్ప ప్రపంచమంతా విస్తరించి ఉన్న ప్రాణి ఈ గుడ్లగూబ. వీటిలో దాదాపు 200 రకాల గుడ్లగూబలు ఉన్నాయి. మనకు నష్టం కలిగించే అనేక కీటకాలను, చిన్నచిన్న జంతువులను తిని బ్రతుకుతాయి. ఇవి మనిషికి ఎలాంటి హాని చేయవు. పై పెచ్చు పర్యావరణ సమతుల్యానికి దోహదం చేస్తాయి ఈ గుడ్లగూబలు. వీటిని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది.

వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారము గుడ్లగూబలను బంధించడం, వేటాడడం, వ్యాపారం చేయడం చట్టరీత్యా నేరము. శిక్షార్హులు కూడా. అంతర్జాతీయంగా కూడా వీటి వ్యాపారాన్ని నిషేధించారు. 2010 TRAFFIC & WWF పరిశోధన ప్రకారం రిపోర్ట్ ప్రకారం అధిక సంఖ్యలో గుడ్లగూబల వేట జరిగిపోతోంది. వాటి సంఖ్య నానాటికి క్షీణిస్తోంది.

వీటి రక్షణ కోసం ప్రజలలో అవగాహన కల్పించాలని, చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, “ఆగస్టు 4న అంతర్జాతీయ గుడ్లగూబల అవగాహన దినోత్సవం” (International Owl awareness day) జరుపుకుంటున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము ప్రజలలో గుడ్లగూబల గురించి గూడుకట్టుకున్న మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించడం, గుడ్లగూబలను కాపాడుకోవడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడము ముఖ్య ఉద్దేశం. వేమన వారసులమైన మనం కూడా కాస్త ఆలోచించి, ముఢనమ్మకాలను వదిలిపెట్టి గుడ్లగూబ పరిరక్షణలో భాగస్వాముల అవుదాం.

One thought on “ప్రమాదంలో (ప్రమాదమైన) గుడ్లగూబ

  1. యుగంధర్ గారు, మీరు మూఢ నమ్మకాల మీద వ్రాస్తున్న “నమ్మకం – నిజం” అనే సిరీస్ చాలా బాగుంది. మంచి వివరణ ఇస్తున్నారు. గుడ్ల గూబ గురించి చాలా చక్కగా వివరించారు. మీ ఆర్టికల్ చదివిన వారికి ఖచ్చితంగా మూఢ నమ్మకాలు పోతాయి. అలా ఉంటుంది మీ రచన శైలి. ధన్యవాదాలు సర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *