డా.టి.వి.వెంకటేశ్వరన్

డిఎన్ఏ అనేది మన పూర్వీకుల కథలతో నిండిన ఒక పెద్ద పురాతన పుస్తకం. ఇందులో మన తల్లిదండ్రుల లేదా తాత ముత్తాతలు కథలు మాత్రమే కాకుండా వేల సంవత్సరాల క్రితం జీవించిన ప్రజల కధలు కూడా ఉంటాయి. శాస్త్రవేత్తలు భారతదేశం నుండి 200700 మందికి పైగా వ్యక్తుల డిఎన్ఎను అధ్యయనం చేసి ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ప్రజల డిఎన్ఏ తో పోల్చారు. భారతదేశంలో జరిగిన గొప్ప అధ్యయనాల్లో ఒకటైన ఇది 50 వేల ఏళ్ల క్రితం వలసలు సంయోగాలు సాంప్రదాయ సంగమాలు నేటి భారతదేశపు జన్యు వైవిధ్యాన్ని రూపొందించాయని నిరూపించింది.

ఈ పరిశోధనను యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బెర్క్లీ), ఎయిమ్స్ డిల్లీ, సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీ మరియు మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన నిపుణులు నిర్వహించి “సెల్” అనే ప్రఖ్యాత శాస్త్రీయ జర్నల్‌లో ప్రచురించారు.

ఈ పరిశోధన, మానవులు ఆఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు చేరుకున్నారు? నియండర్టల్స్ వంటి అంతరించిపోయిన మానవ బంధువుల నుండి మనకు డిఎన్ఎలో ఎంత భాగం వచ్చింది? భారతదేశ వ్యవసాయ విప్లవంలో ప్రాచీన ఇరాన్ రైతుల పాత్ర ఎలాంటిది? కొన్ని భారతీయ వర్గాలలో జన్యుపరమైన వ్యాధుల ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంది? వంటి ప్రశ్నలకు ఈ పరిశోధన సమాధానం ఇస్తుంది.  నగరాలు నదీ నాగరికతలు నిర్మించడానికి చాలా కాలం ముందు మన పూర్వీకులు భూమిని ఐరోపా ఇంకా పశ్చిమసియాలోని నియాండర్తల్ లు   సైబీరియా ఇంకా ఆగ్నేయ ఆసియా లోని డేనిసోవన్ వంటి ఇతర మానవజాతులతో పంచుకున్నారు. వీరు మన ప్రత్యక్ష పూర్వీకులు కాదు. సుమారు ఐదు లక్షల సంవత్సరాల క్రితం మన కుటుంబ వృక్షం నుండి విడిపోయిన దూరపు బంధువులు.

సుమారు 80,000 సంవత్సరాల క్రితం మన హోమో సేపియన్స్ పూర్వీకులు ఆఫ్రికా నుండి వలస వచ్చినప్పుడు ఈ సమూహాలను ఎదుర్కొని వారితో వివాహాలు చేసుకున్నారు. ఈ వివాహాల వల్ల ఈనాటికి ఐరోపావాసుల డిఎన్ఏ మాదిరిగానే భారతీయ ప్రజలందరికీ జన్యువులలో సుమారు 1.43 % నియాండర్తల్  డిఎన్ఏ ఉంది. అలాగే తూర్పు ఆసియా ప్రజలు మాదిరిగానే మనకు 0.1% డేనిసోవన్ వంశపారంపర్యత కూడా ఉంది. ఇది స్వల్పమే కానీ ముఖ్యమైనది.

భారతదేశం: ప్రాచీన మానవ జన్యువుల కేంద్రం
భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన నియాండర్ఫుల్ జన్యువులు శకలాలు ఉన్నాయని ఈ అధ్యాయం వెల్లడించింది. ఈ ప్రాచీన డిఎన్ఏ శకలాలు ఇతర ప్రాంతాల కంటే ఈ ప్రాంతంలోనే మెరుగ్గా ఇంకా నిలిచి ఉన్నాయని ఈ పరిశోధన చెప్తోంది. గత పదివేల ఏళ్లుగా దక్షిణాసియా ప్రజలు అనేక మానవజాతులతో సంగమాల వల్ల ఈ వైవిధ్యం వచ్చింది. ఇండియాలో ఏ ఇద్దరి జన్యువులలో నియాండర్తల్  జన్యువుల శకలాలు ఒకటిగా ఉండవు.

ఆధునిక మానవులపై ప్రాచీన డిఎన్ఏ ప్రభావం
ఇవి కేవలం యాదృచ్ఛిక “జంక్ డిఎన్ఏ” విభాగాలు కావు. ఈ జన్యువులలో కొన్ని మనపై ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయి. ఉదాహరణకు నియాండర్తల్ డిఎన్ఏ మన రోగనిరోధక శక్తిని, చర్మ రంగును, మన ఆహారం ఎలా జీర్ణం చేసుకుంటాము అనే దానిపై ప్రభావం చూపుతుంది. డేనిసోవన్ జన్యువులు టిబెట్ వాసులు అధికఎత్తులో జీవించడానికి సహాయపడ్డాయి.  

మానవులు మొదట భారతదేశానికి ఎప్పుడు చేరుకున్నారు?
భారతదేశంలో ప్రజల వలసలు అర్థం చేసుకోవడంలో, ఆధునిక మానవులు ఆఫ్రికా నుండి మొదట ఎప్పుడు వచ్చారు అనేది ఒక కీలక ప్రశ్న. తోబా అగ్నిపర్వత విస్ఫోటనం (సుమారు 74 వేల సంవత్సరాల క్రితం) ముందు ఆ తర్వాతా భారతదేశంలో మానవ ఉనికిని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నప్పటికీ, ఆధునిక భారతీయుల పూర్వీకులు ప్రధానంగా సుమారు 50 వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి వలస వచ్చారు. ఆఫ్రికా నుండి భారతదేశానికి ఇంతకు ముందు కూడా వలసలు వచ్చి ఉండొచ్చు. కానీ ఆ సమూహాలు బతికి ఉండకపోవచ్చు లేదా నేటి జనాభా పై తక్కువ జన్యు ప్రభావాన్ని చూపిస్తూ ఉండవచ్చు.

ఇరాన్ రైతులు: భారతదేశంలో వ్యవసాయం
సుమారు ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక ముఖ్యమైన మార్పు సంభవించింది. ఇది వేట-సేకరణ (Hunter-Gatherer) సమాజం నుండి వ్యవసాయ ఆధారిత సమాజానికి మారడం. మెహర్ ఘర్ (పాకిస్తాన్) వంటి పురావస్తు ప్రదేశాలలో గోధుమలు మరియు బార్లీ  సాగుకు ఆధారాలు కనిపిస్తాయి. ఈ పంటలు మొదట సారవంతమైన ఆధునిక ఇరాక్ మరియు ఇరాన్లలో అభివృద్ధి చెందాయి. మరి వ్యవసాయాన్ని భారతదేశానికి ఎవరు తెచ్చారు?

నియోలిథిక్ ఇరానియన్ రైతుల క్రీస్తుపూర్వం 4000 నుండి 3500 నుండి సేకరించిన ప్రాచీన డిఎన్ఏ ను ఆధునిక భారతీయ జన్యువులతో పోల్చడం ద్వారా ఈ వ్యవసాయ వంశపారంపర్యత మూలాన్ని పరిశోధకులు కనిపెట్టారు. ఆ మూలం తజకిస్తాన్లోని సారాజం అనే ప్రాంతం. సారాజం సింధు నాగరికత కాలంలో ఒక కీలక వాణిజ్య కేంద్రం. ఈ జన్యుపరమైన పరిశోధనలు పురావస్తు ఆవిష్కరణలో కూడా సరిపోలుతున్నాయి. ఉదాహరణకు భారతీయ నియోలిథిక్ ప్రదేశాలైన షాహీ – టెంప్,మక్రాన్ ఇంకా గుజరాత్ లోని సుర్కూటడా వద్ద లభించిన శంఖం గాజులు (Shell Bangles) సారాజంలో కూడా కనుకొనబడ్డాయి. ఇది ఆనాటి వాణిజ్య సంబంధాలను సూచిస్తుంది. మరొక ముఖ్యమైన జన్యు ప్రభావం యూరేషియస్ స్టెప్పిల నుండి వచ్చింది. ఇవి ఉక్రెయిన్ నుండి మంగోలియా వరకు విస్తరించి ఉన్న విశాలమైన గడ్డి భూములు. సుమారు 4000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం నుండి సంచార పశుపోషకులు భారతదేశంలోకి వలస వచ్చారు. భారతదేశంలో వారి జన్యు ప్రభావం ఉత్తర వాయువ్య జనాభాలలో బలంగా ఉంది (0-45% స్టెప్పి వంశపారంపర్యత). దక్షిణానికి వచ్చే కొద్ది ఈ శాతం తగ్గుతుంది. మొదట వచ్చిన వేట ప్రధానంగా ఉన్న వాళ్లు, తర్వాత వ్యవసాయదారులు, ఆ తర్వాత వచ్చిన పశుపోషకులు కలిసి నేటి భారతదేశ జన్యు వైవిధ్యానికి దోహదపడ్డారు.

భారతదేశంలో అంతర్ వివాహం తెచ్చిన జన్యుపరమైన పరిణామాలు
సుమారు 4000 సంవత్సరాల క్రితం సంచారపోషకుల రాకతో భారతదేశంలో గణనీయమైన జనాభా అంతర్ వివాహాల వైపు మారింది. ఇది నిర్దిష్ట కులాలు వంశాలు లేదా తెగల్లో వివాహం చేసుకుని పద్ధతి. ఇది కులాల ఆధారిత నిచ్చెన మెట్ల వ్యవస్థకు దారితీసింది. ఈ అమానవీయ వ్యవస్థ అణిచివేత,హింసాత్మక సామాజిక నియంత్రణ మరియు ఆర్థిక దోపిడీని సంస్థాగతీకరించడమే కాకుండా జనాభాను జన్యుపరమైన ఐసోలేషన్ లో బంధించింది. తరతరాలుగా కొనసాగుతున్న హానికరమైన ఆరోగ్య ప్రభావాలకు ఇది దారితీసింది.

1900 లలో పరాగ్వేలో ఎలిజబెత్ నీచే (తత్వవేత్త ఫెడరిక్ నీచే సోదరి) చేసిన న్యూ జర్మనీ ప్రయోగంలో కూడా దీనిని గమనించవచ్చు. అక్కడ ‘జాతి పరంగా స్వచ్ఛమైన’ జర్మన్ల యొక్క ఒక చిన్న, ఎవరితోనూ కలవని సమూహంలో తరతరాలు అంతర్వివాహాలు చేసుకున్నారు. దీని ఫలితంగా చెవుడు మరుగుజ్జుతనం వంటి వినాశకరమైన జన్యుపరమైన రుగ్మతలు సంభవించాయి. భారతదేశంలో కుల వ్యవస్థ యొక్క వైవాహిక విభజన అమలు చేయడం ద్వారా చాలా విస్తృతమైన జన్యుపరమైన గాయాలు సృష్టించబడ్డాయి. సామాజిక అణిచివేత ద్వారా జనాభా బలవంతంగా ఇరుకైన జన్యు సముదాయాలకు పరిమితం చేయబడ్డప్పుడు జీవ సంబంధమైన అనూహ్య పరిణామాలు అనివార్యం. ఇక్కడ పిల్లలు తల్లి తండ్రి ఇద్దరి నుండి ఒకే విధమైన హానికరమైన జన్యు నకళ్ళను వారసత్వంగా పొందుతారు. ఇది రిసెసివ్ జన్యుపరమైన రుగ్మతల ప్రమాదాన్ని అనూహ్యంగా పెంచుతుంది.

ఈ అధ్యాయం ఆందోళన కలిగించే కొన్ని గణాంకాలు కూడా వెల్లడించింది. 51 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులకు వారి వంశంలో కనీసం ఒక మూడవ డిగ్రీ కజిన్ లేదా సన్నిహిత బంధువు ఉన్నారు. ఇది ఐరోపావాసులలో కేవలం 8.8%. వేల సంవత్సరాల అంతర్వివాహం వారి కుల సమూహంలోని ఇతరులను దాదాపు మూడవ డిగ్రీ కజిన్స్ గా మార్చింది. భారతీయులలో సమయజ్ఞత (homozygous) స్థాయిలు ఒక్కొక్క వ్యక్తికి సగటున 12 నుండి 56 సెంటిమోర్గన్ హోమోజీఎస్  డిఎన్ఏ ఉంటుంది ఇది తూర్పు ఆసియా లేదా ఐరోపా వాసుల కంటే రెండు నుండి తొమ్మిది రెట్లు ఎక్కువ ఈ ప్రభావాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ జన్యు విశ్లేషణ 56 సెంటిమోర్గన్ హోమోజైగస్ డిఎన్ఎ ను వెల్లడిస్తుంది. ఉత్తర భారతదేశంలో ఇది 19 సెంటీ మోర్గాన్లే. ఉత్తర భారత దేశంలో పోలిస్తే దక్షిణ భారత దేశంలో జరిగే మేనరిక వివాహాలే దీనికి కారణం. ఈ పద్ధతులు కొన్ని భారతీయ వర్గాలలో జన్యుపరమైన రుగ్మతలను  తెచ్చాయి. ఉదాహరణకు కండరాల పక్షవాతం, వివేరియం వంటి మత్తుమందులకు రియాక్షన్ రావడానికి కారణమయ్యే బ్యూటీరిలో కూలినెస్టెరస్ జన్యువుకు కారణమయ్యే L30P మ్యూటేషన్ కొన్ని భారతీయ కులాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అదే విధంగా రక్తసంబంధిత వ్యాధులు, జీవక్రియ వ్యాధులు చివరికి డిమాండ్షియాకు సంబంధించిన న్యూటేషన్లు ప్రపంచవ్యాప్తంగా ఇతర జనాభాతో పోలిస్తే కొన్ని భారతీయ సమూహాలలో 10 నుండి 100 రెట్లు అధికంగా సంభవిస్తున్నాయి.

భారతీయ జన్యుపటం : ప్రాచీన మూలాలు ఆధునిక ప్రభావాలు
ఈ సంచలనాత్మక అధ్యయనం భారతదేశము యొక్క గొప్ప జన్య చరిత్రను ప్రాచీన మానవ వలసల నుండి నియాండర్తల్ వంటి అంతరించిపోయిన జాతులతో అంతర్వివాహం వరకు గుర్తించింది. మన డిఎన్ఏ వివిధ రకాల జనాభాతో వేల సంవత్సరాలుగా ఎలా కలిసిపోయిందో వెల్లడిస్తుంది. అలాగే శతాబ్దాలుగా జరిగిన కుల ఆధారిత అంతర్వివాహాలు ప్రత్యేక డిఎన్ఏ నమూనాలను ఎలా సృష్టించాయో కూడా చూపిస్తుంది. అవి నేటికీ ఆరోగ్య ఫలితాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.

(డా. టి. వి. వెంకటేశ్వరన్ విజ్ఞాన్ ప్రసార్ లో సైంటిస్ట్ గా పనిచేశారు. ప్రస్తుతం IISER, మొహాలీ లో విజిటింగ్ ప్రొఫెసర్ గా వున్నారు. ఈ వ్యాసం www.thefederal.com లో ప్రచురితం అయ్యింది.)

One thought on “భారతీయుల DNA రూపుదిద్దుకున్న క్రమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *