డా. గేయానంద్

క్రీస్తుపూర్వం 600- 300 మధ్య కాలాన్ని, భారత ఉపఖండంలో ఒక గొప్ప పరివర్తనా కాలంగా భావించవచ్చు. ఉత్తర భారత తొలి చరిత్ర కాలాల ప్రారంభంగా, క్రీస్తుపూర్వం 600 సంవత్సరాన్ని గుర్తిస్తారు. అది వైదిక యుగం ముగుస్తున్న కాలం. వేద కాలాల నాటి, భావాలను సవాలు చేసిన కాలం. వైజ్ఞానిక ఆలోచనలు, సాంకేతికలు పురోగమించిన కాలం. భారత ఉపఖండ చరిత్రలో విశిష్టమైన కాలం. అదేమిటో చూద్దాం. 

ఇనుము తెచ్చిన మార్పు..
తొలివేదయుగానికి, మలివేద యుగానికి ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఇనుము తెలిసినా, తొలి వేదాలలో ఇనుము ప్రస్తావన కనిపించదు. కానీ మలివేద యుగం చివరి కాలాలలో, వ్యవసాయంలో, ఇనుము విస్తృతంగా వాడటం ప్రారంభమైంది. ఆ తరువాతే, గణనీయమైన సామాజిక మార్పులు వచ్చాయని చరిత్రకారులు అంటారు. గంగా మైదానాలలో భూమిని లోతుగా దున్నగలిగిన ఇనుప నాగలి( లాంగలా) వాడకంలోకి వచ్చింది. ఇనుప గొడ్డలితో అడవులను నరకడం సులభమైంది. నీటిపారుదల కోసం తిరిగే చక్రాలు లాంటివి కనుగొన్నారు. వరి సాగు బాగా పెరిగింది. వ్యవసాయంలో మిగులూ పెరిగింది. దీనికి ముందున్న సమాజాలు ఎటువంటివంటే, అవి-పశు పోషణ, ఆహార సేకరణ, వేట, కొద్ది వ్యవసాయమూ- ఆధారంగా నడిచే, అంత నిలకడగా ఉండని గ్రామీణ సమాజాలు. ఈ సమాజంలోకి పెద్ద ఎత్తున ఇనుము ప్రవేశించి, వ్యవసాయంలో, ఎంతో మిగులు పోగుపడింది. హరప్పా నాగరికత తరువాత, రెండవసారి పట్టణీకరణలకు(second urbanization) రంగం సిద్ధమైంది. 

మళ్లీ పట్టణాలు…
క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో, మళ్లీ పట్టణాలు ఆవిర్భవించాయి. మగధ, కాశి, కోసల, అవంతి, రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటినే మహాజనపదాలు అన్నారు. ఇటువంటివి 16 ఏర్పడ్డాయి. రాజగృహ, వైశాలి, కౌశంబి లాంటి నగరాలు/ పట్టణాలు ఏర్పడ్డాయి. వ్యాపారులు, వివిధ వృత్తిదారులు, పాలకులు, పండితులు, సామాన్యులతో, వేలాది మందితో ఈ పట్టణాలు కళకళలాడాయి. కట్టడాలు, చుట్టూ గోడలు,నిర్మాణ ప్రణాళికలు, రహదారులు, వసతులు, మురుగునీటి ప్రణాళికలు అవసరమయ్యాయి. నీటి రిజర్వాయర్లు, మెట్ల బావులు వచ్చాయి. నిర్మాణాలు చేయాలి అంటే, కొలతలు అవసరమవుతాయి. పట్టణాలు/నగరాలంటేనే వస్తు మారకం. దీనికోసం తూనికలు కొలతలు వచ్చాయి. వ్యాపారం పెరిగే కొద్దీ ముద్ర వేసిన నాణేలు వచ్చాయి. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దపు నాటి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో నిర్మాణాల గురించి, లోహ విజ్ఞానం గురించి, మౌలిక వసతుల గురించి ప్రస్తావనలు కనిపిస్తాయి. 

ఆనాటి మహాజనపదాల, నగరాల మేధో వికాస కేంద్రంగా తక్షశిల( ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది) కనిపిస్తుంది. 600-400bc ల మధ్య, ఎంతో ప్రాభవాన్ని చూసింది. వేద వేదంగాలు, వ్యాకరణం, భాష, ఆయుర్వేదం, గణితం, శస్త్ర చికిత్సలు, తర్కం తత్వశాస్త్రం, చట్టాలు సంగీతం, సైనిక శిక్షణ, పాలనాశిక్షణ- ఇవన్నీ తక్షశిలలో పాఠ్యాంశాలు. ఇందులో చదువుకోవడానికి పర్షియా మధ్యాసియా నుంచే కాకుండా, గ్రీసు నుంచి కూడా వచ్చేవారని చెబుతారు. ఇది ప్రధానంగా ఆనాటి పాలకవర్గాలకు, ఉపయోగపడినా, ప్రపంచంలోనే ఒక పెద్ద విద్యా కేంద్రంగా పేరు తెచ్చుకున్నది.

సుల్వ సూత్రాలు…
రేఖా గణితం ఈ కాలంలోనే ప్రారంభమైంది. నిర్వహణకై ఖచ్చితమైన కొలతలతో కూడిన వివిధ రూపాలలో ఉండే వేదికలను( యజ్ఞ వేదికలు) నిర్మించే క్రమంలో ఇవి రూపొందాయి. సుల్వ సూత్రాల పేరుతో ప్రఖ్యాతిగాంచిన గణిత సూత్రాలను ఆవిష్కరించిన భౌధాయనుడు, అపస్తంబుడు ఈ కాలాల వారే.పైథా గరస్ సూత్రాన్ని పోలిన సూత్రం బౌధా యన సులభ సూత్రాల్లో కనిపిస్తుంది. రెండుకు వర్గం గణించడం, పై విలువ అంచనా, వివిధ కోణాలు, అర్థ వృత్తాలు నిర్మించడం లాంటివి ఇందులో చూస్తాం. 

జ్యోతిష…
ఖగోళ ఆలోచనలు కూడా పురోగమించింది ఈ కాలాలలోనే. వేద కాలంలోనే సప్త ఋషి మండలం ప్రస్తావన ఉంది. నక్షత్రాలకు, కాలానికి మధ్య గల సంబంధం గురించి, గ్రహణాల గురించి చెప్పారు. కానీ, రాబోయే గ్రహణాలను ఊహించడం వారికి తెలియదు.. వ్యవసాయం చేసేప్పుడు ఋతువుల ను తెలుసుకోవడం చాలా అవసరం. అట్లే క్రతువులు, తంతుల నిర్వహణకు గ్రహగతుల్ని తెలుసుకోవడం అవసరమయ్యేది. క్రీస్తుపూర్వం నాలుగో చివరికి వచ్చేసరికి. జ్యోతిష పేరుతో ఖగోళ జ్ఞానం క్రమబద్ధీకరింపబడింది. కానీ అది నేడు మనం చూసే జ్యోతిష్యం కాదు.

ఆయుర్వేదం…
ఇది వైద్య విజ్ఞానానికి సంబంధించిన కాలం కూడా. 300-200bc ల మధ్య చరక సంహిత, సుశ్రుత సంహితల సంపుటి కరణలు జరిగాయి. ఆయుర్వేదం పరిశీలన మీద, హేతువు మీద ఆధారపడింది. ప్రత్యక్ష పరిశీలన (పరీక్ష), కారణాలు వెదకటం (యుక్తి), నిర్ధారించుకోవడం (అనుమాన), ఆయుర్వేదంలో కనిపిస్తుంది. అప్పటికి వారికి అర్థమైన భౌతిక కారణాలు (వాత పిత్త కఫ) ద్వారా ఆరోగ్యాన్ని అంచనా వేయడం ఇది. పిండాభివృద్ధి, కాన్పులు, గర్భిణీ చికిత్స, చిన్నపిల్లల వైద్యం, విషా లకు వైద్యం, గాయాల వైద్యం, శరీరంలోకి పోయి విరిగిన వాటిని బయటకు తీయడం, దయ్యం పట్టడం (మానసిక పరిస్థితి), లైంగిక ప్రేరకాలు, సాధారణ ఆరోగ్యం లాంటి భావనలు ఆనా డున్నాయి. పత్యాలు , ఆహార నియమాలు, ఎనీ మా, రక్తాన్ని లాగే చికిత్స, పూత మందులు లాంటి వైద్యాలు కూడా కనిపిస్తాయి. మొక్కలు జంతువులు లోహాలతో చేసిన మందులు కనిపిస్తాయి. చరక సంహిత లో ఇనుము తగరం సీసం రాగి బంగారు వెండి లాంటి లోహాల లక్షణాల గురించి ఉంది. ఐదు రకాల ఉప్పులను, క్షారాలను ఎలా తయారు చేయాలో చెబుతుంది. అన్ని వస్తువులు, 5 పదార్థాలతో, అంటే నీరు నిప్పు భూమి గాలి ఆకాశంతో తయారవుతుందని చెప్పాడు. చరక సంహిత 150 రకాల జబ్బుల గురించి చెప్పింది. 341 మూలికావృక్షాలను, 177 జంతు ఆధారిత మందులను, 64 లోహ ఆధారిత మందులను, ప్రస్తావించింది. 109 దేహ విజ్ఞాన పదాలు, 42 శరీర ధర్మ విజ్ఞాన పదాలు అందులో కనిపిస్తాయి. 33 రకాల ఎముకల గురించి చెప్పింది. సుశ్రుత సంహితలో 121 రకాల శస్త్ర చికిత్సా పరికరాలు పేర్కొన్నారు. ఇప్పటి దృష్టితో చూస్తే ఇవన్నీ, చాలా ప్రాథమికంగా, కొన్ని అసంబద్ధంగా కనిపిస్తాయి. కానీ ఆనాటికి ఆ విజ్ఞానం ప్రపంచ స్థాయి విజ్ఞానం.

భాషా విజ్ఞానం..
భాషా విజ్ఞానాలలో కూడా, ఆనాటి సమాజం ముందంజలో ఉంది. వేదాలు ఒకరి నుండి మరొకరు పరంపరగా నేర్చుకునే క్రమంలో,ఒక ప్రామాణికత అవసరమైంది. మాట్లాడుతున్న సంస్కృత భాషా నిర్మాణాన్ని సూత్రాలలోకి మార్చాల్సి వచ్చింది. దీన్ని క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దంలో పానిణి ప్రతిభావంతంగా చేశాడు. ఈ వ్యాకరణ సూత్రాల వల్ల సంస్కృతం నేర్చుకోవడం సులువు కావడమే కాక, అదొక మేదో భాషగా కూడా ముందుకు వచ్చింది. ఇదే కాలంలో దేవనగరి లిపిని, హల్లులను ఒక ప్రత్యేక పద్ధతిలో అమర్చడం ద్వారా (5×5), ప్రపంచంలో ఆనాటికి ఇంకే భాషలో లేని శాస్త్రీయతను, సాధించారు.

నాటి తాత్విక సిద్ధాంతాలు..
వ్యవసాయం వి స్తృతమై, కీలకంగా మారేకొద్ది, పశువుల ప్రాధాన్యత పెరిగింది. కానీ పశువుల్ని యజ్ఞ యాగాల లో బలి ఇవ్వడం అప్పటి మహాజనపద సమాజాలకు నష్టదాయకంగా తయారైంది. వైదిక క్రతువులు, చిలువలు, పలువలగా పెరిగి, అనుత్పాదకంగా తయారయ్యాయి. వేదాలను ధిక్కరించే ధోరణులు పెరిగాయి. వర్ణం పుట్టుకతో వస్తుందనే భావానికి వ్యతిరేకంగా, క్షత్రియ పాలకుల నిరసనలు ప్రారంభమయ్యాయి. అట్లే వ్యవసాయ మిగులు నుండి ఏర్పడిన సంపదల వల్ల, సమాజంలో అసమానతలు పెరిగాయి. ఇది వైదిక ధిక్కారానికే కాక, కొత్త ఆలోచనలకు, కూడా దారి తీసింది. గంగా మైదాన ప్రాంతాలలో, ఆ రోజుల్లో, ఎంతగా మేధోసంఘర్షణ జరిగిందంటే, 62 అవైధిక మతాలు/ ధోరణులు తల ఎత్తాయని చరిత్రకారులు గుర్తిస్తున్నారు. అందులో మూడు మతాలు ముఖ్యమైనవి మనందరికీ తెలిసినవే. అవి బౌద్ధ జైన అజీవకాలు. జైన బౌద్ధ మతాలు అహింస బోధించాయి.. పైగా వర్తక వ్యాపారాలను ప్రోత్సహించాయి. దీంతో వర్తకులు వ్యాపారులు వృత్తి దారులు వ్యవసాయదారులు అవైదిక మతాల వైపు చూశారు. ఉత్తర భారత దేశంలో ఒక కొత్త సామాజిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక గొప్ప మేధో వికాసానికి ఇది దారి తీసింది.

అజీవ కుల/ చార్వాకుల ‘స్వభావ సిద్ధాంతం’
ఆనాటి తాత్వికతల గురించి, పరిశోధించిన దేవి ప్రసాద్ చటోపాధ్యాయ ఎన్నో విషయాలను వెలికి తీశారు. ఆనాటి భావసంఘర్షణలకు రుజువు శ్వేతాశ్వత రోపనిషత్తు లో కనిపిస్తుం దంటా రాయన. ఈ ఉపనిషత్తు బౌద్ధుల ముందు కాలాలది. బహుశా క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దానిది.ఆ ఉపనిషత్ కారుడు, తొలి కాలాల, పూర్తిస్థాయి వైదిక ఆస్తికుడు. ‘ప్రపంచ ఆవిర్భావానికి ఒక సమర్థ కారణం ప్రకృతికి అతీతమైన శక్తి’ -అన్న దానిపై ఒక వివాదం తల ఎత్తుతుంది. ఉపనిషత్ కారుడు, ఈ విషయంలో అప్పుడున్న అవైదిక భావాలతో, విభేదిస్తూ, వాటిని తిరస్కరించాలనుకొంటాడు. ఈ క్రమంలో, ఆనాడు ఉన్న బౌద్ధిక వాతావరణం చిత్రిస్తాడు. విశ్వం పుట్టుక ఎలా? అనే చర్చ అందులో జరుగుతుంది.అందుకు దైవం కారణమనేది ఆస్తికుల వాదన. కారణం ఏదీ లేదనేది ఒక సిద్ధాంతం( యాదృచ్ఛ సిద్ధాంతం).కానీ, కాలం, స్వభావం / ప్రకృతి, అవసరం, అవకాశం, భౌతిక మూలకాలు, స్త్రీ/ ఆదిమ పదార్థం, పురుషుడు- ఇలా విశ్వం ఆవిర్భావానికి తొలి కారణాలు అనేకం, అని, అనేకానేక వాదనలు, సిద్ధాంతాలు చర్చలోకి వస్తాయి. అందులో ముఖ్యమైనది స్వభావ సిద్ధాంతం. విశ్వం, ప్రకృతి, ప్రపంచం,- వీటి స్వభావంలోనే వీటికి కారణము ఉందని,ఈ స్వభావ సిద్ధాంతం చెబుతుంది. ప్రకృతి ఉనికి లోకి రావడానికి కారణం స్వభావం పనిచేయటం చేతనే అని ఇది చెబుతుంది. అంటే ఒక విధంగా, అతీత శక్తులలో కాకుండా, అంతర్గతంగా ఉండే భౌ తిక కారణాలను వెతకడం లాంటిది ఇది. బహుశా ఇది ఒక ప్రాపంచిక దృక్పధంగా కూడా ఆ కాలంలో ఉండి ఉండాలి. దేవి ప్రసాద్ చటో పాధ్యాయ మాటల్లో చెప్పాలంటే, ఇది ప్రోటోసైన్సు. అంటే సైన్సు కు ముందు రూపం. 

అయితే ఈ స్వభావ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది ఎవరు? వారే సాంఖ్యులు, లోకాయతులు. లోకాయతులనే చార్వాకులు. భార్హస్పత్యులు అని కూడా అన్నారు. 

బౌద్ధ జైనాలు…
క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో, బౌద్ధం ప్రారంభమైంది. జైనం,బౌద్ధం కంటే ప్రాచీనమైనది. సమాజంలో ఉన్న దుఃఖాలకు కారణమేమిటి అన్న గౌతమ బుద్ధుడి అన్వేషణ, ఆయన ను భౌతిక వాద సమీపానికి చేర్చింది. తనకు ముందున్న సాఖ్యం నుండి కూడా బుద్ధుడు ప్రేరణ పొందాడు. దేవుడు వంటిఅధిభౌతిక వాదనలను ఆయన పట్టించుకోలేదు. బౌద్ధంలోని అధిధర్మం, -తర్కం కార్య కారణ సంబంధాలు, భౌతిక మానసిక పరిస్థితుల- గురించి మాట్లాడింది.తన ఆచరణాత్మక కార్యక్రమానికి, దేవుడి ఉనికిని ఉపేక్షించే సైదాంతిక పునాది కోసం బుద్ధుడు అన్వేషించాడు.

గొప్ప జైన ప్రవక్త మహావీరుడు బుద్ధుడికి సమకాలీకుడే. జైనులు నిరీశ్వర వాదులు. ప్రపంచంలోనే వస్తువులన్నింటినీ జీవులు అజీవులుగా విభజించి, అ జీవులను ఐదు రకాలుగా (కాలం, ఆకాశం, పదార్థం, ధర్మాధర్మాలు) భావించించారు. అహింసకు ప్రాధాన్యతనిచ్చారు. జైనంలో ఉన్న అనేకత్వవాదం, అనేక సత్యాలను చూసే దృష్టిని ఇచ్చింది. 

మన వారసత్వం..
మొత్తం భారతీయ చరిత్రలో ఖచ్చితమైన ఆస్తికపక్షం అవలంబించిన ప్రధాన తాత్వికతలు రెండే రెండు తటస్థబడతాయి. ఒకటి వేదాంతం, రెండవది- అనంతర కాలిక న్యాయ వైశేషి కం’ – అని దేవి ప్రసాద్ చటోపాధ్యాయ అంటాడు. దేవుడు ఉన్నాడని పవిత్ర గ్రంధాలు చేసే ప్రకటనలతో, వేదాంతం తృప్తి పడిపోయిందని, ప్రత్యేకంగా రుజువు చేయాల్సిన పని అంతగా పెట్టుకోలేదని అంటాడు. అందుకు భిన్నంగా అనంతర న్యాయవైశేషి కులు, తర్కాన్ని, ప్రదర్శన పద్ధతిని గట్టిగా అనుసరించి, పద్ధతిగా, దేవుడి అస్తిత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నించారు. మొత్తం మీద 2500 సంవత్సరాల నాడు, ఆనాడు ఉన్న అనేకా నేక తాత్విక ధోరణులలో, భౌతిక వాద సంప్రదాయాలదే పై చేయి అని దేవి ప్రసాద్ సాధికారికంగా చెబుతాడు. సాంఖ్యం,బౌద్ధం, జైనం, తొలి న్యాయవై శేషి కాలు, మీ మాంస- ఇలాంటివన్నీ- ఇప్పటి రూపాలు ఎలా ఉన్నా- ప్రజాసైన్స్ ఉద్యమం, చారిత్రకంగా, తన వారసత్వంగా గొప్పగా చెప్పుకోవాల్సిన సంగతులు.

One thought on “బౌద్ధ జైన చార్వాకుల కాలంలో ప్రోటో సైన్సు 600BC

Leave a Reply to s మహేశ్వర rao Cancel reply

Your email address will not be published. Required fields are marked *