డా॥ కాలేషా బాషా
“అల్లోపతి వైద్యంలో ప్రివెస్షన్ (వ్యాధినివారణ) లేదు..అంతా ఇన్వెస్టిగేషన్లూ, ట్రీట్మెంట్లే…
యోగా అంటేనే శారీరక శ్రమ, అది కీళ్లజబ్బులూ, శ్వాస జబ్బులూ, బీపీ, షుగరూ, మానసిక జబ్బులూ, వెన్నుపూస జబ్బులూ …ఇంకా చాలా జబ్బులను నివారిస్తుంది…అల్లోపతికి చాలా పరిమితులున్నాయి….!”
ఇలా అల్లోపతి వైద్యం గురించి జూన్ 21, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా తలో మాటా అన్నారు. కొంత మంది అల్లోపతి వైద్యులు, విజ్ఞానులు కూడా వంతపాడారు!!!
మరి ఇవన్నీ నిజాలా? అల్లోపతి లో కేవలం జబ్బును కనుక్కుని వైద్యం చేయడమేనా?? అల్లోపతిలో ప్రివెన్షన్ లేదా?
మనం చదివిందేమిటి?
మరి ఐదున్నరేళ్లలో మనం ఎం.బి.బి.ఎస్ లో చదివిన సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ టెక్స్ట్ బుక్ ఎక్కడిది? అది చదివితేనే కదా నాలుగో సంవత్సరం పాసయ్యేది. దీన్ని మరిచిపోతే ఎలా?
అల్లోపతి వైద్యానికి పరిమితులున్నాయని ఎవరన్నారు? ఎప్పటికప్పుడు ఉన్నవాటిని సరిదిద్దుకుంటూ, నూతన ఆవిష్కరణలు చేసుకుంటూ అప్రతిహతంగా ముందుకు పోతున్న వైద్యం అల్లోపతినే కదా!
అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో ఎలా బయటపడవేయాలనే ఆలోచనతో నిరంతరం పరిశోధన చేసుకుంటూ మానవజాతి జబ్బులను నయం చేసుకుంటూ పోతున్నది అల్లోపతినే కదా! కాదా? కొన్ని ఎక్సర్ సైజులు తప్పిస్తే యోగా వల్ల పెద్ద ఉపయోగం లేదనేది వాస్తవం. Modern medicine లేదా అల్లోపతి, అనే అధునాతన వైద్య ప్రక్రియ అత్యున్నత సైన్సు యొక్క ప్రతిరూపమనేది ఎన్నటికీ మరవొద్దని మనవి.
అల్లోపతి ఆధునిక శాస్త్రం
ఎక్స్ రే మెషీన్లూ, సీటీ స్కాన్లూ, ఎం.ఆర్.ఐ స్కాన్ లూ, పెట్ స్కాన్లూ, రొబోటిక్ వైద్యాలూ ఇవన్నీ ఆధునిక భౌతికశాస్త్రం మనకిచ్చిన వరాల్లాంటివి. వీటితో ఎన్నో క్లిష్టమైన జబ్బులను కనుక్కొంటున్నాం, వైద్యం చేస్తున్నాం.

వివిధ ఎండోస్కొపీ (బ్రాంకోస్కోపీ, కొలనో స్కొపీ, సిస్టోస్కొపీ, యురెటరొస్కొపీ, హిస్టెరోస్కొపీ, ఇ.ఆర్.సీ.పీ,…) పరీక్షలూ, చికిత్సలూ, లాపరోస్కోపీ ఆపరేషన్లూ ఇవన్నీ మనకు ఆప్టికల్ ఫిజిక్స్ ప్రసాదించినవి.
క్యాన్సర్ వైద్య చికిత్సలో ప్రముఖ ఘట్టమైన రేడియోథెరపీ (కరెంట్ వైద్యం) న్యూక్లియర్ ఫిజిక్స్ యొక్క ఉత్పాదకమే. ఇది మనలోని క్యాన్సర్ రోగుల ఆయుష్షు పెంచే ఒక ఆయుధం.
ఇవే కాకుండా ఇప్పుడు కరోనా చికిత్సకై వాడుతున్న వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాంసట్రేటర్లూ, ఆపరేషన్లప్పుడు ఉపయోగించే అనెస్తీషియా మెషీన్లూ, అత్యధిక పీడనం, ఉష్ణోగ్రతల వద్ద వివిధ రోగ జీవులను చంపే ఆటోక్లేవులూ, స్టెరిలైజర్లూ ఇంకా…..కణం లోపలి నిర్మాణాల్లోకి తొంగిచూసి, వాటిలోని అణువులను సైతం విడదీసి చూపి, ఆధునిక వైద్య ప్రక్రియను మలుపుతిప్పిన ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, ఇవన్నీ ఆధునిక ఫిజిక్స్ యొక్క వివిధ ఉత్పాదక నిర్మాణాలే!
కరోనా కల్లోల కాలంలో మనం ఉపయోగించిన వ్యాక్సిన్లు , ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను కాపాడాయి. ఈ కరోనా వ్యాక్సిన్లు (కోవిషీల్డ్, కోవ్యాక్సిన్, స్పుత్నిక్, DNA vaccinne Zy Cov D ) అత్యున్నత శాస్త్ర సాంకేతిక ఉత్పత్తి చిహ్నాలు.
ఓ అల్లోపతి వైద్యుడిగా వైద్యం చేసేవారూ, ఇతర విజ్ఙులూ ఇవి విస్మరిస్తే ఎలా?
నాలుగున్నర సంవత్సరాలపాటు చదివిన బయోకెమిస్ట్రీ, హ్యూమన్ ఫిజియాలజీ, అనాటమీ, పాథాలజీ, మైక్రోబయాలజీ ఇవన్నీ విస్మరిస్తే ఎలా?
చికిత్స ఒకటేనా మనం చెపుతున్నది?
శారీరక శ్రమ, మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి ఆలోచన…. ఈ నాలుగూ ప్రకృతి ప్రసాదితాలు. ఇవి ఉంటే చాలు. ఇక సైన్స్ తో పని లేదని కూడా అన్నారు. వాటి విషయానికొస్తాను.
MBBS మొదటి సంవత్సరం బయోకెమిస్ట్రీ లో వైద్యవిద్యార్థులు మన ఆహారంలోని వివిధ రకాలైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, క్రొవ్వులు (fat), వాటి మెటబాలిజం (జీవక్రియ), విటమిన్లు, అవి లభించే ఆహార దినుసులు, ఇంకా… మినరల్స్ (లవణాలు) ట్రేస్ ఎలిమెంట్స్ (లఘుకారకాలు), అవి లభ్యమయ్యే పదార్ధాలూ, వాటి ఉపయోగాలూ, శరీరంలో అవి పాల్గొనే జీవక్రియలూ, వాటి లోపాల వల్ల కలిగే వ్యాధులూ.. ఇవన్నీ చదివి పాసౌతారు.
అదే ఫిజియాలజీ (మానవ శరీర ధర్మశాస్త్రం)లో శారీరక శ్రమ (మజిల్ ఎక్సర్ సైజ్) గురించి కూలంకషంగా చదువుతారు. కండర సంకోచ వ్యాకోచాలలోని యాంత్రికతత్వాన్ని, వాటిలో ఖర్చయ్యే ఏ.టీ.పీలు (శక్తిజనకాలు), కెలొరీల గురించి తెలుసుకున్నాం. ఎంత శారీరక శ్రమకు ఎన్ని కెలొరీలు ఖర్చవుతాయో కూడా తెలుసుకుంటారు.
అదే ఫిజియాలజీలో మంచి నిద్ర….దానిలోని REM SLEEP (చేతనావస్థ లోని నిద్ర) NON REM SLEEP (అచేతన లేదా గాఢనిద్ర) CYCLES…గురించి చదువుతారు. ఆ ఫిజియాలజీలోనే మానవ మేథస్సు (BRAIN) యొక్క పనివిధానం, అందులోని వివిధ క్రియాశీలక ప్రాంతాలు, ఆలోచన రేకెత్తించే భాగాలు, జ్ఙాపకశక్తి నిలయాలు, అవి పాడైపోతే కలిగే ఫలితాలూ వీటి గురించి అధ్యయనం చేస్తారు!
మరి ఇదంతా అల్లోపతినే కదా! ఇదంతా సైన్సే కదా! మరి సైన్సుతో పని లేదంటే ఎలా?
సైన్సును అవహేళన చెయ్యొద్దు
ఎప్పుడైతే మనం చదివిన ఆధునిక విజ్ఞానాన్ని మరచి, సూడో సైన్సు ధోరణిలో కొట్టుకు పోయి నేలవిడిచి సాము చేస్తామో అప్పుడే అవరోహణ దిశగా సాగిపోతాం. ఏ అగాధాలలోనికో దొర్లిపోయి, ఏ చీకట్లలోనో తప్పటడుగులు వేస్తూనే ఉంటాం. భావితరాలను అగమ్యగోచరస్థితిలో పడవేసి అభివృద్ధి నిరోధక సంకేతాలను ఇచ్చినవారమౌతాం!
ఏవో ఫార్మా కంపెనీల, కార్పొరేట్ల దోపిడీతో అలోపతీని ముడి వేసి ఒక మిథ్యా సైన్సు విషయాన్ని ఆమోదించడం అల్లోపతి వైద్యులకు, ఇతర విజ్ఞులకు ఏ మాత్రం తగదు. పైగా ఇది ఆత్మవంచనే అవుతుంది. మానవ మేథస్సును మథించి ప్రకృతిని నిర్వచించేదే విజ్ఞానశాస్త్రం. అదే సైన్సు!
సైన్సు నియమాలకు లోబడి ఉండేవే ప్రకృతి ధర్మాలు. ప్రకృతిలో జరిగే ప్రతి ప్రక్రియను విశ్లేషిస్తే అందులో సైన్స్ తప్పక ఉంటుంది. దాన్ని అన్వేషించి పరిశోధించి, ప్రయోగాల ద్వారా నిర్వచించడమే సైన్స్ పరమావధి.
గత కొన్నేళ్లుగా సైన్సుఅవహేళనకు, అవమానాలకు లోనౌతూనే ఉంది. ఇంతవరకూ జరిగిన సైన్సు పురోగతినుండి తప్పింపబడిన భారత ప్రజానీకం మరింత మూఢనమ్మకాలలోకి నెట్టివేయ బడుతున్నారనేది కనుల ముందున్న నిజం.
అల్లోపతి డాక్టర్లుగా మనలో ఉన్న బలహీనత ఐదున్నరేళ్లు ఎం.బీ.బి.యస్ లో చదివిన వైద్యవిద్యను సరిగా ఒంట బట్టించుకోక పోవడమేది సుస్పష్టం. సైన్సు విజ్ఞానాన్ని జీవితాలకు అన్వయించుకుని పురోగమించాలేకాని, సైన్సును ప్రకృతి నుండి విడదీసి, తూలనాడి, అవహేళన చేసి, మిథ్యాసైన్సును పాటిస్తూ తిరోగమన మార్గంలోనికి మరలకూడదు.
వ్యాధినివారణ ప్రభుత్వ బాధ్యత
ఈ దేశంలోని ప్రజారోగ్యవ్యవస్థకు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ (SPM) పుస్తక మొక్కటే సమాధానం.
ప్రివెన్షన్ (వ్యాధి నివారణ వ్యవస్థ) లో ప్రధానపాత్ర వహించాల్సింది ఆ దేశాన్ని పాలించే రాజకీయాలూ, శాసించే ప్రభుత్వాలే. డాక్టర్లు, మిగతా వైద్యసిబ్బంది కొన్ని పాత్రలు మాత్రమే. గ్రామాల్లో, మండలాల్లోని పీహెచ్ సీలూ (ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలూ), సీహెచ్ సీలూ (సామాజిక ఆరోగ్యకేంద్రాలూ) నిర్వహిస్తున్నది 80% ప్రివెన్షన్ పనే.

వ్యాధి నివారణ వ్యవస్థ (PREVENTIVE MEDICINE) అంటే ఏమిటి?
రకరకాల అంటువ్యాధుల్ని, అంటువ్యాధులు కాని వాటిని నివారించే ప్రయత్నంలో చాలా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలి. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లూ, వాటి లోని పారిశుధ్య శాఖలూ, ప్రజా ఆరోగ్య శాఖలూ, ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖలూ, కుటుంబ సంక్షేమ శాఖలూ, ICDS శాఖలూ, నేషనల్ హెల్త్ మిషన్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ లు.. ఇవన్నీ సమన్వయంతో పని చేయాలి. ఇవి సరిగ్గా పని చేయాలంటే GDP నుండి తగిన నిధుల బడ్జెట్ కేటాయింపులు ఉండాలి.
ప్రస్తుతం మన ఆరోగ్య బడ్జెట్ కేటాయింపులు జి.డి.పి లో 1.3% వరకు ఉన్నాయి. కానీ ఇవి మరింత పెంచాల్సిన అవసరం ఉంది. వ్యాధుల నివారణ మార్గాలకు మరింత ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఈ కేటాయింపులు సరిగ్గా ఉండేట్టుగా ప్రభుత్వాలు చూడాలి. వాస్తవానికి వ్యాధి నివారణ చర్యలకు అయ్యే ఖర్చు వ్యాధి వచ్చాక తీసుకునే వైద్యం కన్నా చాలా తక్కువ.
వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, డాక్టర్లు, పరీక్షలు, వైద్యం మాత్రమే సమాజానికి ఆరోగ్యాన్నిస్తుందనే దృక్పధాన్ని కాకుండా అసలు వ్యాధులు రాకుండా కట్టడి చేసే విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి.
దేశ ప్రజలకు తగినంత పని వెసులు బాటు, కనీస వేతన ఆదాయం, మంచి ఆహారం, రక్షిత మంచి నీరు, మంచి నివాసాలు, పారిశుధ్యం ఉంటే 80% శాతం జబ్బులు సులభంగా నివారించ బడతాయి.
ఈ సందర్భంగా పంతొమ్మిదో శతాబ్దపు ఒక మహనీయుని మాటలను గుర్తుంచుకోవలసిన అవసరంవుంది.
సోషల్ మెడిసిన్
ప్రష్యా సామ్రాజ్య కాలంలో డాII రుడాల్ఫ్ విర్షో (RUDOLF VIRCHOW) గొప్ప వ్యాధి నిర్థారణ వైద్యుడూ మరియు శాస్త్రవేత్త. “టైఫస్” అనే అంటువ్యాధి వ్యాపించి ఆ రాజ్యంలో చాలామంది ప్రజలు చనిపోతున్నారని 1846-47లో ఆయనను అప్పటి ప్రభుత్వం ఈ వ్యాధి పరిశోధనా బాధ్యతను అప్పగిస్తుంది. ఆయన ప్రజల పేదరికాన్ని, జీవన స్థితిగతులను, వ్యాధి వ్యాప్తిని, మరణాలను గమనించి ఒక నిర్ధారణకు వచ్చి సామాజిక వైద్యానికి రాజకీయాలకు గల అవినాభావ సంబంధాన్ని వివరించి SOCIAL MEDICINE అనే భావనను తయారు చేసి వ్యాప్తి చేస్తాడు.
“MEDICINE IS A SOCIAL SCIENCE AND POLITICS IS NOTHING ELSE BUT MEDICINE ON A LARGE SCALE” (వైద్య వ్యవస్థ ఒక సామాజిక శాస్త్రం, రాజకీయాలనేవి ఈ వ్యవస్థ పునాదులపై నిలబడే విశాల నిర్మాణాలు) అంటాడు. ఆ తర్వాతనే ప్రపంచ దేశాలు ఈ మాటల వాస్తవికతను చాలా సునిశితంగా గమనించి సోషల్ మెడిసిన్ (ప్రజారోగ్యాన్ని బాధ్యతగా తీసుకోవడం) ను పాటించడం మొదలైంది. క్యూబా, చైనా, వియత్నాం లాంటి సోషలిస్టు దేశాలు దీన్ని తప్పకుండా పాటిస్తున్నాయి.
ఇంకా యూరోప్, గల్ఫ్ లోని అనేక దేశాలు, స్కాండినేవియన్, బాల్టిక్ రిపబ్లిక్కులు ఈ విధానాన్ని పాటిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వ బాధ్యతగా తీసుకున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ఈ దేశాల్లో అక్కడక్కడా ఉన్నా కూడా ప్రధాన బాధ్యత ప్రభుత్వాలు తీసుకున్నాయి. ప్రజారోగ్య వ్వవస్థను పటిష్టపరిచాయి. మన దేశం కూడా ఈ సోషల్ మెడిసిన్ దారిలోనే పయనించడమే ఎప్పటికైనా అంతిమ పరిష్కారం.
(ఈ వ్యాసం మీద చర్చకు ఆహ్వానిస్తున్నాం )
it is good to socity
వాస్తవంగా మన భారత దేశంలో వైద్య విద్య చాలా ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల… ఆ పెట్టుబడిని రాబట్టుకునేందుకు వైద్యులు ఆ భారం ప్రజల మీదే వేస్తున్నారు.. దీని వల్ల ప్రజలు ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వ దవాఖానాల్లో తగిన సిబ్బంది ఉండకపోవడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు.