డాII. నాగసూరి వేణుగోపాల్
నేటి తరాలకు పరిపూర్ణంగా ఆదర్శమూర్తిగా నిలిచే మన కాలపు మహా శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లీకర్. జగదీష్ చంద్రబోస్ అనగానే కలకత్తాలోని బోస్ ఇన్స్టిట్యూట్, సి.వి. రామన్ అనగానే బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హోమీ జహంగీర్ భాభా అనగానే ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, మేఘనాథ సాహా అనగానే కలకత్తాలోని సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ వంటివి గుర్తుకు వచ్చినట్లుగానే జె.వి. నార్లీకర్ అనగానే మనకు పుణె లోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనామి అండ్ ఆస్ట్రో ఫిజిక్స్ గుర్తుకువస్తుంది. సి.వి. రామన్ 40 ఏళ్ల వయసులో చేసిన పరిశోధనకు 42 ఏళ్లకు నోబెల్ బహుమతి లభించింది. నార్లీకర్ 26 ఏళ్ల వయసులో సాధించిన పరిశోధన ఒకవైపు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఢీ కొని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడం, ఇంగ్లండ్ లో ఆయన గురువుతో కలిసి సాధించిన ఈ పరిశోధన ఫలితం భారతదేశంలో పద్మభూషణ్ కు అదే సంవత్సరం దారి తీయడం కూడా కచ్చితంగా విశేషమే. ఇలా ఎన్నో రకాలుగా సకల సైన్స్ సుగుణాభిరాముడు జయంత్ విష్ణు నార్లీకర్.
పూణేలో 2025 మే 20వ తేదీన నిద్రలోనే కనుమూసిన డా. జె.వి. నార్లీకర్ అచ్చమైన రోల్ మోడల్ కాదగ్గ శాస్త్రవేత్త జె. వి. నార్లీకర్ అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతులైన శాస్త్రవేత్త మాత్రమే కాదు, సామాన్యుడికి జటిలమైన సైన్సును సులువుగా బోధపడేలా చెప్పగలిగే మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో పాపులర్ వక్త. అలాగే మంచి బోధకుడే కాదు, ఉత్తమమైన పరిశోధకుడు కూడా. ఇంకా కమ్యూనికేషన్ కోసం పత్రికలు, రేడియో, టెలివిజన్ వంటి జనమాధ్యమాల ద్వారా ఒకవైపు పాపులర్ సైన్స్, మరోవైపు సైన్స్ ఫిక్షన్ ను కూడా సృజించిన విజయుడైన త్రిభాషా రచయిత. శాస్త్రీయ సంగీతాన్ని ఎంత ఇష్టపడతారో; క్రికెట్, బ్యాట్మెంటన్ వంటి క్రీడలను కూడా అంతే ఆనందంగా ప్రేమించడం మహా స్ఫూర్తివంతమైన విషయం.
ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా ప్రఖ్యాతులైన జయంత్ విష్ణు నార్లీకర్ 1938 జూలై 19న కొల్హాపూర్ లో జన్మించారు. తండ్రి విష్ణు వాసుదేవ్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రం, సైద్ధాంతిక భౌతిక శాస్త్రాలలో అధ్యాపకుడుగా, తర్వాతి కాలంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. తల్లి సుమతి సంస్కృతపు పాండిత్యంలో ప్రవేశంతో పాటు ఆంగ్లంలో ఆసక్తి గల వ్యక్తి. మేనమామ వి. ఎస్. హుజూర్ బజార్ పేరు గాంచిన సాంఖ్యాక శాస్త్రవేత్త. బాల్యం నుంచి విశేష ప్రతిభ కనబరిచిన నార్లీకర్ పాఠశాల, కళాశాల స్థాయిలలో ప్రథముడిగా రాణిస్తూ వచ్చారు. గణిత, ఖగోళ భౌతిక శాస్త్రాలు సబ్జెక్టులుగా 1957లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి బి.ఎస్సీ. ఆనర్స్ పట్టా పొందారు.

కుటుంబ ప్రోత్సాహంతో డిగ్రీ తర్వాత ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ లో పైచదువులు కొనసాగించారు. అక్కడ ఫ్రెడ్ హోయల్ (Fred Hoyle) రాసిన ‘ప్రంటీర్స్ ఆఫ్ ఆస్ట్రానమీ’ పుస్తకం చదివిన తర్వాత నార్లీకర్ ఆసక్తి ఖగోళ భౌతికశాస్త్రం వైపు మొగ్గింది. కేంబ్రిడ్జి నుంచి 1960 లో గణిత శాస్త్రంలో బి.ఏ. పట్టాను పొందిన తర్వాత అక్కడే విశ్వం గురించి వివరించే ‘కాస్మాలజీ’లో ఫ్రెడ్ హోయల్ పర్యవేక్షణలో పరిశోధన ప్రారంభించారు. గురుత్వాకర్షణ సిద్ధాంతాలు, కాస్మాలజీ సంబంధించి పిహెచ్.డి పట్టా 1963లో పొందారు. మహా విస్ఫోటనం కారణంగా ఈ జగత్తు ఒక్కదూటున ఉద్భవించిందని చెప్పే ‘బిగ్ బ్యాంగ్ థియరీ’ అప్పటికి ప్రచారంలో ఉంది. దీనిని విభేదించే రీతిలో ప్రత్యామ్నాయ సిద్ధాంతంగా ‘హోయల్-నార్లీకర్ థియరీ ఆఫ్ గ్రావిటీ’ (లేదా కన్ఫార్మల్ గ్రావిటీగా పేరు గాంచినది) ప్రతిపాదించి ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు.
1964లో చేసిన ఈ ప్రతిపాదన ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1915 కాలపు సాపేక్షతాసిద్ధాంతానికి కొనసాగింపు లేదా మెరుగైన జోడింపుగా మారింది. విశ్వంలోని ప్రతి వస్తువు యొక్క ద్రవ్యరాశి, ఆ వస్తువు మిగతా వాటితో కలిగి ఉన్న సంబంధం, చర్య బట్టి ప్రభావితం అవుతుందనే ‘మ్యాచ్ ప్రిన్సిపల్’ వీరి సిద్ధాంతంలో ఆయువుపట్టు. ఐన్స్టీన్ ఈ ధర్మం గురించి చర్చించినా, దానిని తన సిద్ధాంతంలో అంతర్భాగంగా చేయలేదు. ఈ విశ్వం ఒక్కసారిగా కాకుండా, క్రమంగా విస్తరిస్తూ పోతోందనే సిద్ధాంతం (స్టీడి స్టేట్ థియరీ) ఫలితంగా నార్లీకర్, ఆయన గురువు ఫ్రెడ్ హోయల్ పేర్లు ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా మ్రోగిపోయాయి.
1964లో డా జె.వి.నార్లీకర్ పేరు భారత దేశంలో విపరీతంగా ప్రచారంలోకి వచ్చి వారిని స్వదేశంలోకి ఆహ్వానించాలని పెద్ద ఎత్తున చర్చలు జరగడం చరిత్ర. 1965లో నార్లీకర్ భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పొందారు. నార్లీకర్ ప్రతిభను గుర్తించిన ఫ్రెడ్ హోయల్ 1966లో కేంబ్రిడ్జ్ లో ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియరీటికల్ ఆస్ట్రానమీ’ ని ప్రారంభించినప్పుడు వ్యవస్థాపక భాగస్వామిగా చేశారు. జీవితకాలపు స్నేహితులుగా మారిన వీరిద్దరూ 1974లో ‘యాక్షన్ అట్ ఎ డిస్టెన్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ కాస్మాలజీ’ (1974), ‘ఎ డిఫరెంట్ అప్రోచ్ టు కాస్మోలజీ’ (2000) వంటి విఖ్యాతమైన రచనలు చేశారు.
1972లో భారతదేశం తిరిగి వచ్చిన నార్లీకర్ బొంబాయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ప్రొఫెసర్ గా చేరారు. 1989 దాకా ఈ సంస్థలో బోధిస్తూ, పరిశోధన చేయిస్తూ, చేస్తూ; మరోవైపు మూఢనమ్మకాలను పెకలించే రీతిలో ప్రసంగాలు, రచనలు చేస్తూ ప్రజాజీవితంలో కూడా ప్రసిద్ధులయ్యారు. ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (IUCAA) స్థాపన కోసం ముంబై నుంచి 1989 లో పూణే తరలివచ్చి స్థాపించిన ఆ సంస్థకు 2003లో పదవీవిరమణ చేసే దాకా నేతృత్వం వహించారు. తద్వారా విశ్వవిద్యాలయాలలో ఆస్ట్రోనమి, ఆస్ట్రోఫిజిక్స్ సంబంధించిన పరిశోధనలకు విజయవంతంగా దిశానిర్దేశం చేయడమే కాకుండా, తగిన పరిశోధనావనరులు కూడా ఏర్పరిచారు.
అదే సమయంలో జన సామాన్యంలోకి సైన్సు అక్షరాస్యతను, హేతుబద్ధమైన అవగాహనను పెద్ద ఎత్తున తీసుకువెళ్లడానికి ప్రతినెలా ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చారు. ఐ. యు. సి. ఎ. ఎ. వెబ్సైట్ చూస్తే వారి 1200 కు మించిన సైన్సు వ్యాసాలు, 140కు పైగా మూడు భాషల్లోనే కాకుండా ఇటాలియన్, రష్యన్, జపనీస్, స్పానిష్, గ్రీక్ ఇంకా తెలుగుతోపాటు పలు భారతీయ భాషలలోకి అనువాదమైన పుస్తకాల జాబితాలుగా కనబడతాయి.

Pic Courtesy : www.jvnarlikar.blog
పరిశోధక పట్టా రాకముందే ఇంగ్లాండ్ లోని ‘డిస్కవరీ’ సైన్స్ మ్యాగజైన్ లో తన తొలి పాపులర్ సైన్స్ కథనం వెలుగు చూసింది. తరువాత ‘న్యూ సైంటిస్ట్’ పత్రిక కాస్మాలజీ కు సంబంధించి నార్లీకర్ తో వ్యాసాలు రాయించుకునేది. పరిశోధనలు చేయడం, పాపులర్ సైన్స్ వ్యాసాలు రాయడం మాత్రమే కాకుండా వీరు ఇంగ్లాండులో ఆదరణ పొందిన సైన్స్ విషయాల వక్తగా కూడా మారిపోయారు. దాదాపు అదే కాలంలో వారి తొలి పుస్తకం కూడా అక్కడ నుంచే ప్రచురింపబడింది. మాతృభాష మరాఠీలోను, అలాగే తొలి రెండు దశాబ్దాల జీవితకాలం వారణాసిలో సాగడం వల్ల హిందీలోనూ మాత్రమే కాక ఇంగ్లీషులో కూడా మంచి రచయిత, వక్త. ‘ధూమకేతు’ అనే సైన్స్ ఫిక్షన్ నవల సినిమాగా రూపొందితే; ‘నాలుగు నగరాల్లో సాగిన నా కథ’ అనే 600 పేజీల మరాఠీ స్వీయ చరిత్ర ప్రచురణైన మరుసటి సంవత్సరం 2014లో సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. ఆయన విద్యార్ధి దశ నుంచి టెన్నిస్, బ్యాట్మింటన్, క్రికెట్ ఆడిన క్రీడాకారుడు. భార్య మంగళా నార్లీకర్ గణిత శాస్త్రంలో పట్టా పొంది ప్రొఫెసర్ గా రాణించిన రచయిత్రి కూడా. ఆయన ముగ్గురు కూతుళ్లు గీత, గిరిజ, లీలావతి సైన్స్ రంగంలోనే పట్టాలు పొందారు. కొంతకాలం క్రిందట తుంటి ఎముక శస్త్రచికిత్స చేయించుకున్న నార్లీకర్ కన్నుమూయడానికి ముందు రోజున కూడా మూడు గంటల పాటు చదువుకోవడమే కాకుండా, నిద్రపోయే ముందు కూతురును కౌగిలించుకొని తన దినచర్యను ముగించిన అదృష్టవంతుడు.