విఠపు బాలసుబ్రహ్మణ్యం

మనందరికీ స్టీఫెన్ హాకింగ్,  ఐన్ స్టీన్ తర్వాత అంతటి విశ్వశోధకుడని తెలుసు. స్థల కాలాల ఏకత్వాన్ని విశ్వానికి అన్వయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన హాకింగ్ మెదడులోనే మొదట పుట్టింది. ఆ రెండింటి ఆరంభం బిగ్ బాంగ్ లోనే వుందనీ, అవి కాలబిలాలతో అంతమవుతాయని కూడా ఆయన సూత్రీకరించాడు. దీనికిప్పుడు వైజ్ఞానిక ప్రపంచంలో పెద్ద మద్దతు వుంది.

కానీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో హాకింగ్ తో టేబుల్ టెన్నిస్ ఆడిన (అప్పటికీ హాకింగ్ కు మోటార్ న్యూరాన్ వ్యాధి బయట పడలేదు) ఒక భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త దీన్ని జీవితాంతం వ్యతిరేకించాడు. విశ్వం ఒకే క్షణాన పుట్టలేదనీ, దానికి ఆవిర్భావాంతాలు లేవనీ, బిగ్ బాంగ్ సిద్ధాంతం తప్పని ఆయన వాదించాడు. విశ్వానిది “స్థిర స్థితి నమూనా” (Steady State Model) గా సూత్రీకరించి, ఎన్ని నిరూపణలు బిగ్ బాంగ్ కు అనుకూలంగా వచ్చినా ఎదురీది నిలబడ్డాడు. విభేదించడం, ప్రశ్నించడం లేని వైజ్ఞానిక ప్రపంచాన్ని ఆయన ఏ మాత్రం అంగీకరించ లేదు. ఆయనే మొన్న మే 20న కనుమూసిన జయంత్ నార్లేకర్ !

అయూకా నిర్మాతగా
మన తొలితరం శాస్త్రవేత్తలు ఆరోజుల్లో అంతర్జాతీయంగా ఎంత ఎత్తుకు ఎదిగినా మాతృభూమిని మాత్రం మరిచిపోయేవారు కాదు. నార్లేకర్ దీ ఇదే వారసత్వం. కేంబ్రిడ్జ్ లో పందొమ్మిదేళ్ళు గడిపినా ఆయన చివరకు భారతదేశానికి వచ్చేసారు. టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో (TIFR) చేరారు. ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధనల కోసం ఒక అంతర్ విశ్వవిద్యాలయాల వైజ్ఞానిక కేంద్రం యుజిసి ఆధ్వర్యంలో నిర్మించాలన్న యశ్ పాల్ గారి కలను సాకారం చేసే బాధ్యతను సవాలుగా తీసుకొన్నాడు.

Narlikar’s Newton apple tree tribute at IUCAA withered in Pune heat – pic courtesy- Hindstan Times

ఇప్పుడు “అయూకా” (IUCAA) ఒక అంతర్జాతీయ ప్రమాణాల ఖగోళ భౌతిక శాస్త్ర బోధనా పరిశోధనల కేంద్రం! దాని నిర్మాణంలో నార్లేకర్ అడుగడుగునా ఎంత జాగ్రత్తలను వహించాడో అంత సృజనాత్మకతను ప్రదర్శించాడు. “అయూకా” ఆరుబయట న్యూటన్ విగ్రహం పెట్టినప్పుడు దాని పక్కనే ఆపిల్ మొక్క నాటించాడు ! పూనాలో ఆపిల్స్ కాయవని ఎందరు చెప్పినా వినకుండా న్యూటన్ మీద పండ్లు పడేలా కాయించి మరీ చూపించాడు! గెలీలియో విగ్రహాన్ని ఆయన ఒక చెయ్యి సాచి ఏదో అభ్యర్థిస్తున్నట్టు పెట్టాడు. ఆరోజుల్లో ఖగోళ శాస్త్రవేత్తలు కూటికి నోచుకోని వారనేందుకిది సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పేవాడు!

ప్రతి పరిశోధనా కేంద్రం ఒక శాస్త్ర ప్రచార కేంద్రంగా కూడా వుండాలన్నది నార్లేకర్ పట్టుదల. “అయుకా” లోని “పులస్త్య” ఇందుకోసం ఏర్పడిందే. అరవింద గుప్తా లాంటి ప్రజా విజ్ఞాన ప్రచారకులకు దీన్ని అప్పచెప్పాడు. శని ఆదివారాల్లో వందల మంది పాఠశాల విద్యార్థులు పులస్త్యకు వచ్చేవారు. గుప్తా తన సైన్సు బొమ్మలతో, సులభప్రయోగాలతో పిల్లల్ని అలరించే వాడు. వారు సైన్సు మజాలో మునిగి తేలేవారు. ఇంతకు “పులస్త్య” అంటే ఏమిటి అంటే నార్లేకర్ “చాలామందికిది సప్తర్షి మండలంలో ఒక నక్షత్రం. కానీ పులా దేశ్ పాండే (ఆధునిక మరాఠీ సాహితీ సాంస్కృతిక ఉద్యమకారుడు) కూడా ఇందులో ఉన్నాడని మర్చిపోవద్దు సుమా” అనేవాడు.

Three of the founder members and ex-directors of IUCAA, Pune, from L to R: Prof. Naresh DadhichProf. Jayant Narlikar,, and Prof. Ajit Kembhavi

ఆర్గనైజర్ గా
నార్లేకర్ కు కేంబ్రిడ్జ్ నుంచి భారతదేశానికి రాకముందే (1965) పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇలా దేశంలోకి అడుగుపెట్టేటప్పటికే ఆయనకు గొప్ప గుర్తింపు వుంది. దీంతో ఆయనతో పనిచేయడానికి ఎందరో యువ శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. ఆయన కూడా అలాంటి వారిని వెతికి వెతికి “అయూకాకు” పట్టుకొచ్చాడు. ధాను పద్మనాభన్ (గ్రావిటేషన్ క్వాంటం గ్రావిటీ), సంజీవ్ ధురంధర్ (గ్రావిటేషనల్ వేవ్), అజిత్ కేంభవి (డేటా డ్రివన్ అబ్జర్వేషనల్ వేవ్స్) లాంటి వారంతా ఇలా వచ్చిన వారే. తనకంటే ముందే బిగ్ బాంగ్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా స్థిరస్థితి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన హెర్మన్ బౌండి, థామస్ గోల్డ్, ఫ్రైడ్ హాలే లాంటి వారితో ఆయనకు నిత్య సంబంధాలుండేవి. వీటన్నింటినీ “అయూకా” కోసం అద్భుతంగా ఆయన వాడుకున్నాడు.ఇలా చూస్తే నార్లేకర్ ఎంత గొప్ప ఆర్గనైజరో కూడా తెలుస్తుంది. దీంతో ప్రామాణిక పరిశోధనలకు “అయూకా” చిరునామాగా మారింది.

కొద్దికాలంలోనే అంతర్జాతీయ గుర్తింపు పొందింది. “అయూకా” మన హైదరాబాదులోని సీసీఎంబి తో కలిసి అంతరిక్షంలోని బ్యాక్టీరియాపై చేసిన పరిశోధన ఇప్పటికీ ఒక మైలురాయిగా వైజ్ఞానిక ప్రపంచం భావిస్తుంది. నార్లేకర్ విశ్వశోధకుడే కాదు విశ్వ మానవుడు కూడా. ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా విశ్వాన్ని “బ్రహ్మాండ” మైన ఖగోళ పౌరాణికుల నుండి, సాపేక్ష వాదంతో చరిత్రను తిరగరాసిన ఐన్ స్టీన్, విశ్వ విస్తరణవాద సిద్ధాంతకర్త ఫైడ్ మెన్ ల దాకా ప్రతి ఒక్కరినీ ఎప్పుడూ స్మరిస్తుండేవాడు. భారతీయ, గ్రీకు, అరబ్బు, యూరోపియన్ ఖగోళ వైజ్ఞానిక స్రవంతుల కొనసాగింపే మన ప్రస్తుత ప్రయాణమనే వాడు. విశ్వాన్ని గురించిన మానవుడి ఊహలు, పరిశీలనలు, తాత్విక వాదాలు, గణిత నిరూపణలు, ప్రయోగ నిర్ధారణలు ఇలా ప్రతి మేధోప్రయత్నమూ కలిసి మనల్ని ఇంతదూరం నడిపించాయంటాడు. మనం పయనించాల్సింది ఇంకా ఎంతో వుందని భవిష్యత్తరంపై అపార విశ్వాసం ప్రకటిస్తాడు. ఆయన జీవిత కాలంలోనే ఖగోళ భౌతిక శాస్త్రం విస్తరించి ఖగోళ జీవశాస్త్రానికి, ఖగోళ రసాయన శాస్త్రానికీ కూడా బాటలు వేసింది.

శాస్త్ర ప్రచారకుడిగా
నార్లేకర్ ఎంతటి శాస్త్రవేత్తో అంతటి శాస్త్ర ప్రచారకుడు. మనదేశంలో ఒక సాహిత్య ప్రక్రియగా సైన్స్ ఫిక్షన్ నిలదొక్కుకోవడానికి ఆయనే కారకుడు. “సామాన్యులకు శాస్త్రాన్ని వివరించాలి దాన్ని పాఠంగా కాకుండా కథగా చెప్పాలి. సైన్స్ ఫిక్షన్ లో సైన్సు వుండి తీరాలి. దాని చుట్టూ కల్పనా ప్రపంచం వుండాలి. ఈ కల్పన ఒక్కోసారి భవిష్యత్తులో నిరూపితం కూడా కావచ్చు” అంటాడాయన. “మొత్తం మీద సైన్స్ ఫిక్షన్ పాఠకులకు సైన్సు పట్ల ప్రేమను పెంచాలి. అదే సందర్భంలో అది కేవలం మాజిక్ గా, ఊహాజనితంగా కూడా వుండకూడదు” అంటూ ఆయన దానికో నిర్వచనం, నిర్దేశం కూడా చేస్తాడు. అంతరిక్షంలో మాలిక్యులర్ మేఘాలు వైజ్ఞానికంగా నిరూపణ కాకముందే నార్లేకరు గురువు హార్డ్ సెఫై రాసిన సైన్స్ ఫిక్షన్ వచ్చింది. హెచ్.బి. వెల్స్ “అదృశ్య మానవుడు” (Invisible Man) కూడా నార్లేకర్ ను తీవ్రంగా ఆకర్షించింది. ఈ కొత్త వైజ్ఞానిక సాహిత్య ప్రక్రియ సైన్సు ప్రియుల్ని విపరీతంగా అలరిస్తున్న కాలమది. ఇలాంటి రచనల కోసం పత్రికలు, ప్రచురణకారులూ పొటీలు పెడుతున్న రోజులవి. ఈ ప్రేరణతోనే “ధూమకేతు” ఆయన రాశారు. తోకచుక్క భూమిని తాకి విధ్వంసం చేయక ముందే దాన్ని బలహీనపరిచి మానవ జాతిని కాపాడడం ఇందులోని కథాంశం. అప్పటికది కథే గాని ఇప్పుడది సాధ్యమని వైజ్ఞానికులు నిరూపించారు!

భారతీయ శాస్త్రవేత్తల్లో పాపులర్ సైన్సు రచయితగా నార్లేకర్ తో సరితూగలవాడు మనదేశంలో మరొకరు లేడు. సైన్సు ఫిక్షన్ ఆయనకు కేవలం ఒక రచనా వ్యాసంగం గాదు. శాస్త్ర ప్రచార సాధనం. ‘వామనుడి తిరిగి రాక’, ‘విశ్వవిస్ఫోటనం’, ‘ భవిష్యత్తు కథ’, ‘అభయారణ్య’ లాంటి కాల్పనిక సైన్సు సాహిత్యాన్నే గాదు The lighter side of the Gravity, Seven Wonders of Cosmos లాంటి సాధికార వైజ్ఞానిక సాహిత్యానికి కూడా ఆ రోజుల్లో ఆయనే శ్రీకారం చుట్టాడు. తల్లి సుమతి గొప్ప సంస్కృత విద్వాంసురాలు కావడం ఆయనకు కలిసొచ్చిందేమో! నార్లేకర్ చేతిరాత ఆయన పరీక్ష పత్రాల్ని దిద్దే వారికి తప్ప ఎవ్వరికీ అర్థమయ్యేది కాదట! ఇలా చమత్కరిస్తూ ఆయన ‘మా ఆవిడ మంగళ నన్ను మరాఠీ రచయితగా మార్చింద’ ని కితాబిస్తాడు !

మాతృభాషాభిమానిగా
దశాబ్దాల తరబడి విదేశాల్లో వుండి వచ్చినా, అత్యాధునిక ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధకుడైనా, ప్రయోగశాలల్లో ఎంత మునిగి తేలుతున్నా ఆయన మాతృభాష మరాటీని మాత్రం మరిచిపోలేదు. తల్లి భాషలో చెబితేనే సైన్సు అర్థమవుతుందనీ, హత్తుకుంటుందనీ ఆయన బలంగా నమ్మే వాడు. ఈ ధోరణిని ఒక ఉద్యమరూపంలో అప్పటికే మలయాళీ శాస్త్రవేత్తలు, రచయితలు మరీ బలంగా ముందుకు తెచ్చారు. ప్రముఖ రచయిత్రి దుర్గా భగవత్ ఆయనకు కొండంత అండగా నిలిచింది. ‘మరాఠీ సాహిత్య సమ్మేళన్’ ఆయన్ని రచయితగా స్థిరపరిచింది. నార్లేకర్ కొత్త వైజ్ఞానిక సాహిత్య ప్రక్రియను మరాఠీ పాఠకులెంతో ఆదరించారు. ‘ధూమకేతు’ ఆ తర్వాత ఫిల్మ్ గా కూడా వచ్చింది. ఆధునిక మరాఠీ సాహిత్యంలో ఇది ఏ భారతీయ భాషా ఎరుగని కొత్త వొరవడి. ఈ క్రమంలోనే ఆయన శాస్త్ర ప్రచారకృషికి ‘కళింగ’ అవార్డు లభించింది. ఆ తర్వాత ఆయన జీవిత చరిత్ర ‘చారే నగరంతలే మారే విశ్వ’ కు (నాలుగు నగరాల కథ) సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మెల్లగా ఆయన శాస్త్ర ప్రచార ఉద్యమ సంస్థ ‘మహారాష్ట్ర లోక విజ్ఞాన సంఘటన’ కు దగ్గరయ్యాడు. ఆయన జీవితంలో ఇదో కొత్త మలుపు.

వందకొక్కడుగా
శాస్త్ర పరిశోధన వేరు శాస్త్ర ప్రచారం వేరు. శాస్త్రం ప్రకారం జీవించడం మరీ వేరు తాను అలా జీవించడంతో ఆగక అందరూ అలానే వుండాలని కోరుకోవడం ఇంకా వేరు ఇక్కడికి వచ్చేటప్పటికి శాస్త్రవేత్త ప్రయోగశాల నుంచి ప్రపంచంలోకొచ్చి పడాల్సి వస్తుంది. కానీ ప్రపంచం సంక్లిష్టం. శాస్త్రాన్ని నమ్మినా, దాని ఫలాలను అనుభవించినా శాస్త్రీయ జీవితాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని మానవులు అంత సులభంగా ఒప్పుకోరు. ఛాందస బంధనాల్ని తెంచుకోలేరు. వాళ్లను వెనక్కి లాగే శక్తులు వెయ్యి వుంటాయి. దీంతో శాస్త్ర ప్రచారకులు కొన్ని శక్తులతో ఘర్షణ పడక తప్పని పరిస్థితి ఏర్పతుంది. ఇక్కడికొచ్చేటప్పటికి చాలా మంది శాస్త్రవేత్తలు కొంత దూరం దాటి ముందుకు రాలేరు. రిస్కు తీసుకోలేరు. అసలు సైన్సు ప్రకారం శాస్త్రవేత్తలు మాత్రం ఎందరు జీవిస్తున్నారు? ప్రపంచాన్ని తామెంత శాస్త్రీయంగా చూడగలుగుతున్నారు? అనే ప్రశ్నలు కూడా ఇక్కడే ముందుకొస్తాయి. వందలో పది మంది వైజ్ఞానికుల దగ్గర కూడా వీటికి జవాబులుండవు. ప్రభుత్వాలే పనిగట్టుకుని శాస్త్ర వ్యతిరేక ప్రచారం చేస్తున్న నేటి కాలంలో ఇది మరీ కష్టతరమవుతుంది .

కానీ నార్లేకర్ ఆ పదిమందిలో తానొకడిగా వుండదల్చుకున్నాడు హేతువాదులకు దగ్గరయ్యాడు. సైన్సును అడ్డం పెట్టుకొని ఛాందసాన్ని సమర్థించే సూడో సైంటిఫిక్ వాదులంటే ఆయనకు మహా చిరాకు. వారిపై తీవ్ర విమర్శలు గుప్పించేవాడు. గ్రీకుల నుంచి దిగుమతి చేసుకున్న దిక్కుమాలిన చెత్త సరుకే ‘జ్యోతిష్యం’ అనేవాడు.

మనిషి మూఢనమ్మకాల బంధనాల్ని తెంచుకోలేకపోవడం అతని స్వభావానికే విరుద్ధమని ఆయన అభిప్రాయం. తెలుసుకునే కొద్దీ మనం అల్పప్రాణులమన్న సంగతి అర్థమవుతుందనీ, వైజ్ఞానిక ప్రస్థానం ఓ అనంత ప్రయాణమనీ, దానికి గమనమే తప్ప అంతిమ గమ్యం అంటూ ఏదీ వుండదనీ, ప్రస్తుత సత్యానికి మనకు మనం అంతిమ ప్రామాణికమంటూ ముద్ర వెయ్యలేమనీ నార్లేకర్ ఎంతో వినయంగా చెపుతాడు.

తాత్వికుడిగా
ఇంత చెప్పిన నార్లేకర్ సైన్సుకు అవతలి విషయాల్ని కూడా శాస్త్రవేత్తలు పట్టించుకోవాలంటాడు. తృప్తి, సుఖం, స్పృహ లాంటివి ఇంకా సైన్సు బయటివంటాడు. ఏ బుద్ధుడో తప్ప సామాన్యులందరూ “నిర్వాణం” పొందలేరని గుర్తించుకోవాలంటాడు. ఎంత చెప్పుకున్నా మన భావాల్ని మన పరిసరాలే నిర్ణయిస్తాయంటాడు మనిషి నిజంగా హేతుబద్ధ జంతువేనా అని అనుమానిస్తాడు. శాస్త్రజ్ఞులు గాని సత్యజిత్ రే లాంటి వారు చేసిన కృషి కూడా హేతుతత్వం కోసం వైజ్ఞానికులు చేయలేకపోతున్నారని వాపోతాడు. శాస్త్రం నైతిక విలువలకు దూరమైతే మానవాళికి ఎనలేని ప్రమాదం తెస్తుందంటూ అతి యాంత్రికీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు.

అంతిమంగా మనిషి యవ్వన రహస్యమంతా అతని ఉత్సుకతలోనే వుందంటూ, ఎన్ని అవాంతరాలొచ్చినా, ఏది ఏమైనా ఫలితంతో నిమిత్తం లేకుండా మనిషి కర్మజీవిగా వుండాల్సిందేనంటాడు. ఇదే కర్మయోగమైతే తనకు ఏ అభ్యంతరం లేదంటాడు.

నార్లేకర్ ది విద్వత్తుతో పాటు మానవత్వమూ కలబోసిన నిండు జీవితం
ఒక మనిషి ఎంత బహుముఖంగా, ఎంత సార్థకంగా జీవించగలడో ఆయన స్వీయాచరణలో చూపించాడు.
ప్రజాసైన్సు ఉద్యమకారులందికీ ఆయనో దిక్సూచి, ఆయనో నిరంతర ప్రేరణ!

One thought on “సార్థకం, బహుముఖీనం నార్లేకర్ జీవితం

  1. నార్లేకర్ లాంటి గొప్ప శాస్త్రవేత్తల కృషే మనం నేడు అనుభవిస్తున్న సాంకేతిక ఫలాలు

Leave a Reply to Settipalli Rajasekhar Cancel reply

Your email address will not be published. Required fields are marked *