కె యల్ కాంతారావు

సైన్సు పురోగతిలో ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఒక ప్రాంతంలో శాస్త్రీయ ఆలోచనలు, ఆవిష్కరణలు స్తంభించి పోతే అవి మరొక ప్రాంతాల్లో మొగ్గదొడిగాయి. ప్రాచీన కాలంలో భారతదేశం, చైనా ఈ రంగాల్లో ముందున్నాయి. కానీ మధ్యయుగాలనాటికి వచ్చేసరికి వీటిలో ఈ పరంపర స్తంభించిపోయింది. కానీ అదే కాలంలో అరబ్బు దేశాల్లో శాస్త్రీయ ఆలోచనలు మొగ్గతొడిగాయి. సైన్స్ పురోగతి కొనసాగింది. కానీ 15వ శతాబ్దం నాటికి అరబ్బు దేశాలలో ఈ ప్రవాహం కాస్తా ఇంకిపోయింది. కానీ యూరపు దేశాలలో పునర్వికాసం జరిగి ఇదే శాస్త్రీయ ఆలోచనలు, ఆవిష్కరణలు పునరుద్ధరింపబడ్డాయి.

ఈ శతాబ్దపు మధ్యభాగం నుండి దాదాపు రెండున్నర శతాబ్దాలు సాగిన ఈ కాలాన్ని పునర్వికాస కాలంగా సైన్సు చరిత్రకారులు పేర్కొంటున్నారు. పునర్వికాస కాలానికి ఒక తేదీని నిర్ణయించాల్సి వస్తే అది సామాన్య శకం 1452 కావచ్చు. ఎందుకంటే యూరపు దేశాల్లో జరిగిన సైన్సు పునర్వికాసానికి ఆద్యుడైన లియోనార్డో డావిన్సీ ఈ సంవత్సరంలోనే జన్మించాడు. అలాగే ప్రాచీన కాలపు ఖగోళ శాస్త్ర అశాస్త్రీయ భావాలను తొలగించిన మహా శాస్త్రవేత్త కోపర్నికస్ మరణించిన సామాన్య శకం 1543ను పునర్వికాస యుగానికి చివరి సంవత్సరంగా కూడా సైన్సు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇలా చూస్తే డావెన్సీ, కోపర్నికస్ లు పునర్వికాస కాలపు ప్రముఖ శాస్త్రవేత్తలుగా చరిత్రలో నిలిచిపోతారు.

లియోనార్డో డావెన్సీ గొప్ప ఇంజనీర్, శాస్త్రవేత్త. అంతే కాదు ఆయన మరొక రంగంలో కూడా గొప్పవాడు. ఆశ్చర్యకరంగా ఆయన చిత్రకళా రంగంలోనూ అత్యంత ప్రతిభాశాలి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మొనాలిసా చిత్రాన్ని గీసింది ఆయనే.

డావెన్సీ గొప్పతనం ఏమంటే ఒక శాస్త్రీయ ఫలితాన్ని సాధించాలంటే ప్రయోగాల ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పిన మొదటి వాడు ఆయనే కావడం! అప్పటివరకు శాస్త్రజ్ఞులు గణిత సిద్ధాంతాల ద్వారా వచ్చిన సమాధానాలను అంగీకరించి అదే శాస్త్రీయ ఫలితం అనేవారు. డావెన్సీ దీనికి భిన్నంగా ప్రయోగాలకు అగ్రస్థానం ఇచ్చి సైన్సు రంగాన్ని ఒక గొప్ప మలుపు దిప్పాడు. డావెన్సీ ప్రతిపాదించిన సిద్ధాంతాలు తర్వాత కాలంలో ప్రయోగాల ద్వారా రుజువయ్యాయి.

కానీ బాధాకరమేమంటే ఆయన జీవించిన కాలంలో తనకు కావలసిన ప్రయోగ పరికరాలను తానే తయారు చేసుకోలేకపోయాడు. ఎందుకంటే అప్పటికి స్థితి శాస్త్రం, గతి శాస్త్రం తగినంతగా అభివృద్ధి కాలేదు. యంత్రాలను కదిలించడానికి అవసరమైన ఆవిరి యంత్రం ఇంకా కనుగొనబడలేదు. అయినా వివిధ వైజ్ఞానిక రంగాలలో డావెన్సీ చేసిన ఊహలు సరైనవేనని తర్వాతి శాస్త్రీయ పరిశోధనలు నిరూపించాయి. వాటిని ఒక్కొక్కటి పరిశీలిద్దాం.

జీవశాస్త్ర రంగానికి వచ్చేటప్పటికి శరీరంలో జరిగే రక్తప్రసరణ మార్గాన్ని డావెన్సీ ముందుగానే ఊహించాడు. దీన్ని తర్వాత కాలంలో హార్వే పరిశోధనల ద్వారా నిరూపించాడు. ఇతర గ్రహాల లాగే భూమి కూడా గ్రహం అనీ, గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని కూడా డావెన్సీ భావించాడు. ఆ తర్వాత దీన్ని కోపర్నికస్ నిరూపించాడు. యాంత్రిక శాస్త్రంలో గెలీలియో నూరేళ్ల తర్వాత నిరూపించిన అంశాలను డావిన్సీ ముందుగానే ఊహించి చెప్పాడు. అదేమంటే ‘ప్రతిపదార్థానికి తాను ప్రయాణిస్తున్న దిశలో కొంత భారం ఉంటుంది. పైనుండి కిందికి పడుతున్న ఏ వస్తువైనా అది కిందికి పడే కొలది వేగాన్ని పెంచుతుంది’ అని.

అలాగే విశ్వమంతా కొన్ని యాంత్రిక సూత్రాల ఆధారంగా నడుస్తున్నదనే న్యూటన్ నిరూపణను కూడా డావిన్సీ ముందుగానే ఊహించాడు. కాంతికి సంబంధించి హూజెన్స్ తర్వాత కాలంలో నిరూపించిన “కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది” అనే విషయాన్ని కూడా ముందే ఊహించిన మహా శాస్త్రవేత్త డావెన్సీ. చంద్రుని ఉపరితలం చీకటిగా ఉంటుందని, సూర్యుని కాంతి భూమి మీద పడి, అది ప్రతిఫలించి చంద్రుని మీద పడినంత మేరకు ఆ భాగం ప్రకాశిస్తుందని, అదే చంద్రకాంతి అని భావించిన మొట్టమొదటి శాస్త్రవేత గూడా డావిన్సీనే! మనకు ఆనందకరమైన విషయం ఏమిటంటే సా.శ 6వ శతాబ్దం లోనే భారతీయ ఖగోళ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్టు దీన్ని వివరించడం.

ఇక భౌతిక శాస్త్ర రంగంలో డావెన్సీ కింది విషయాన్ని గమనించాడు. అదేమంటే “ఎక్కడ అగ్ని మండుతున్నా దాని చుట్టూ వాయు ప్రవాహం బయలుదేరుతుంది. ఆ వాయు ప్రవాహమే మంటను నిలిపి ఉంటుంది” అనేది. ఈ వాయు ప్రవాహాన్నే 300 ఏళ్ల తర్వాత సా.శ. 1777లో లోవోయిజర్ అనే శాస్త్రవేత్త ‘ఆక్సిజన్’ అన్నాడు.

ఇక వైద్యశాస్త్ర రంగం దగ్గరికి వస్తే డావెన్సీ శరీర భాగాలకు సంబంధించిన 750 చిత్రాలు గీసి ప్రపంచంలోనే శరీర శాస్త్రజ్ఞులలో ప్రముఖుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తన జీవితకాలంలో ఒక యంత్రాన్ని కూడా తయారు చేయకపోయినా అసంఖ్యాకంగా యంత్రాలను ఊహించి వాటి బొమ్మలు గీశాడు. వాటిలో పిండిమిల్లులు, కదులుతూ కాలువలు తవ్వే యంత్రాలు ఉన్నాయి కూడా. వీటన్నింటినీ మించి మరొక గొప్ప ఊహను డావిన్సీ చేసాడు. దాని పేరునాయన తన నోట్ బుక్కులో “ఎత్తు నుంచి భూమికి దిగే సాధనం” అని రాశాడు. అదే నేటి మన పారాషూట్! ఆధునిక యుగంలో దానిని నిర్మించినా దీన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఊహించి ఊహా చిత్రాన్ని కూడా గీసిన ప్రతిభాశాలి డావిన్సీ. ఆయన హెలికాప్టర్, తుపాకీల నమూనాలు కూడా గీశాడు. అందువల్లనే ప్రతి విజ్ఞాన శాఖ వారు డావిన్సీని తమ వాడు అంటారు. భౌతిక శాస్త్రవేత్తలు ఆయన్ని భౌతిక శాస్త్రజ్ఞుడు అంటారు. ఖగోళ శాస్త్రవేత్తలు ఆయన్ని ఖగోళ శాస్త్రజ్ఞుడు అంటారు. వైద్యులు ఆయన్ని వైద్యశాస్త్ర పరిశోధకుడు అంటారు. శరీర శాస్త్రజ్ఞులు ఆయన తమవాడని గౌరవిస్తారు. ఇంజనీర్లు తమ తోటి యంత్ర నిర్మాత అంటారు, చిత్రకారులాయనను మహా చిత్రకారుడు అంటారు.
ఇంతటి మహా ప్రతిభాశాలి తన 67వ ఏట సా.శ. 1519 లో మరణించాడు.

“సైన్సుకూ చరిత్ర వుంది” గ్రంథం నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *