సి.వి.కృష్ణయ్య

అర్థం చేసుకోకుండా చదివితే ఏమవుతుంది?
కొంప కొల్లేరవుతుంది.
చేసిన కష్టమంతా వ్యర్థమవుతుంది.

వల్లెవేత చదువుల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో చూస్తున్నాం గదా. ప్రపంచ దేశాల్లో మన స్థానం ఎక్కడ వుందో అర్థం కావడం లేదా? ఇప్పటివరకు మనకు వచ్చిన నోబుల్ అవార్డులు ఎన్ని? మనం ఎన్ని కొత్త ఆవిష్కరణలు చేశాము? ప్రతి ఏటా మనం సంపాదిస్తున్న పేటెంట్లు ఎన్ని? ప్రపంచ దేశాల్లో మన విశ్వవిద్యాలయాల స్థానం ఎక్కడ? చదువులు పూర్తి చేసుకుని బయటకు వచ్చే వారిలో నైపుణ్యం గల వారు ఎంతమంది? ఉత్తమమైన చదువుల కోసం విదేశాల్లో చదివే వారిలో భారతీయులు ఎంతమంది? అందుకోసం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు? నేరాలు, ఘోరాలు, మూఢ నమ్మకాలు ఇవన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి? విదేశాల్లో రాణిస్తున్న భారతీయులు స్వదేశాల్లో ఎందుకు రాణించడం లేదు? ఇలా చెప్పుకుంటూ పోతే, అర్థం లేని మన చదువుల వల్ల ఈ దేశం ఎంత నష్టపోతోందో తలచుకుంటే గుండెలు తరుక్కుపోతాయి.

కాలాన్ని, వయస్సును, డబ్బును ఖర్చు చేసి మన పిల్లలు చదువుల పేరుతో చేస్తున్న కృషి బూడిదలో పోసిన పన్నీరవుతుంటే చూసి ఎలా తట్టుకోగలుగుతున్నాం? జరుగుతున్న నష్టం ఎంతో ఇప్పటికీ అర్థం కావడం లేదా?

అర్థం చేసుకోవడం అంటే….

నిజంగా అర్థం చేసుకోవడం ఎలా వుంటుందో ఒకసారి చూద్దాం. అర్థం చేసుకునేటప్పుడు మనసులో ఎలాంటి భావాలు కలుగుతాయో, సందేహాలు వస్తాయో, ఎలాంటి మార్పు కలుగుతుందో చూద్దాం. ఒక సైన్సు పాఠాన్ని ఉదాహరణగా తీసుకుందాం.

మొక్కల్లో కిరణ జన్య సంయోగ క్రియ ఎలా జరుగుతుందో తెలుసుకునే పాఠం పిల్లలు ఎలా అర్థం చేసుకుంటున్నారో, టీచరు ఏమి చేయాలో పరిశీలించి చూద్దాం. “మొక్కలు సూర్యుడి నుండి కాంతిని, భూమి నుండి నీటిని, గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి.ఈ సందర్భంగా జరిగే రసాయన చర్యల వల్ల మొక్కలు గాల్లోకి ఆక్సిజన్ ను, నీటి ఆవిరిని విడుదల చేస్తాయి. దీన్నే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఇది మొక్కల్లో ఆకుపచ్చని భాగంలోని హరిత కణంలో జరుగుతుంది”. ఇదీ పాఠం.

ఈ పాఠం తొమ్మిదవ తరగతిలో వుందనుకుంటే ఇప్పటికే కింది తరగతిలో తెలిసి వుండాల్సిన విషయాలు చాలా వుంటాయి. తెలియకపోతే ఈ పాఠానికి ముందు ఈ క్రింది విషయాలన్నీ టీచరు తెలియజేయాలి. అప్పుడే పాఠం అర్థమవుతుంది. అవేమిటో చూద్దాం.

గాలి ఒక సమ్మేళనమని, అందులో కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, హైడ్రోజన్ వంటి మూలకాలతో పాటు చాలా వాయువులు వుంటాయని తెలిసి వుండాలి. ఆ మూడు వాయువుల ప్రయోజనాలు, వాటి గుణగణాలు తెలిసి వుండాలి. వాటిని ప్రయోగశాలలో చేసి చూడాలి. అలాగే సూక్ష్మదర్శిని సాయంతో ఆకులోని కణజాలం చూడాలి. సూర్యరశ్మి తగలకపోతే ఆ భాగాలు ఎలా తెల్లగా మారిపోతాయో ప్రయోగపూర్వకంగా మనం చూపించి వుండాలి. మొక్కలు నీళ్ళ ద్వారా నీటిని పీల్చుకుంటాయని ప్రయోగపూర్వకంగా తెలుసుకొని వుండాలి.

ఈ కొత్త విషయాలన్నీ తెలుసుకునేప్పుడు పిల్లల్లో ఎంతో ఆనందం, ఉత్సాహం పెల్లుబికడమే గాదు ఎన్నో ఆలోచనలు కూడా వస్తాయి. సందేహాలు కలుగుతాయి. ‘ఒక చిన్న ఆకులో ఇంత గొప్ప సంగతి వుందా’ అని ఆశ్చర్యపోతారు. ఇదొక అద్భుతం అనుకుంటారు.

మొక్కల్లా జంతువులు, మనుషులు సూర్యరశ్మి సహాయంతో ఎందుకు ఆహారం తయారు చేసుకోవడం లేదు? మనిషి శరీరానికి సూర్యరశ్మి తగలకపోతే ఏమవుతుంది? స్వయంగా ఆహారం చేసుకునే ఆకులాంటి కృత్రిమ యంత్రాన్ని తయారు చేయవచ్చా? ఈ మొక్కలు లేకపోతే మనకు ఆక్సిజన్ దొరకదా? గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతుందా? అప్పుడు కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొనే యంత్రాలు తయారు చేయవచ్చు కదా! ఆక్సిజన్ గాల్లోకి వదిలిపెట్టే యంత్రాలు తయారు చేయవచ్చు గదా ! ఎందుకు చేయడం లేదు ? ఈ విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు గదా! ఇలాంటి సృజనాత్మక ఆలోచనలన్నీ రావాలి.

అప్పుడు కొత్త కొత్త పేటెంట్లు వస్తాయి. చెట్ల పైన ప్రేమ, గౌరవం కలుగుతుంది. తనలో మార్పు వస్తుంది. పర్యావరణ స్పృహ పెరుగుతుంది. మొక్కలు పెంచాలనే దీక్షా, రక్షించాలనే పూనికా ఏర్పడతాయి. నిజంగా పాఠం అర్థమైతే ఇదంతా జరిగి తీరుతుంది.

మనం చేస్తున్నదేమిటి?

ఇప్పుడు మన క్లాస్ రూమ్ లో జరిగే చదువుల తతంగం చూద్దాం. పాఠాన్ని పిల్లలు చదవడం, ప్రశ్నించడం, చర్చించడం ఇలాంటివి ఏమీ వుండవు. పాఠాన్ని ఉపన్యాస పద్ధతిలో వివరించి టీచర్ ప్రశ్నలు జవాబులు ఇస్తాడు. పిల్లలు కంఠస్థం చేస్తారు. అర్థం చేసుకోవడం, ఆనందించడం, ప్రశ్నించడం, చర్చించడం అనే వాటికి తావే వుండదు. పాఠాన్ని ముక్కలు ముక్కలు చేసి, వాటిని గుర్తు పెట్టుకోవడానికి గొడ్డు చాకిరీ చేయించి, ఒత్తిడి పెంచి, పరీక్షలు పెట్టి, మార్కులు వేసి, ర్యాంకులు ఇచ్చి పిల్లల్ని భయపెట్టి, అవమానించి, ఉరికంబం ఎక్కిస్తాం. లేదా స్వయంగా ఏమాత్రం ఆలోచించ లేని, చెప్పిన పని మాత్రమే చేసే మరబొమ్మల్ని చేస్తున్నాం. ఎలాగూ కృత్రిమ మేధ వచ్చింది. రోబోలు వచ్చాయి. ఇక రోబోలు తయారు చేసే మనుషులు కావాలి గానీ రోబోట్ల పని చేసే మనుషులెందుకు?

అసలు సమాచారాన్ని గుర్తుపెట్టుకొని రాయడం ఎందుకు? అది ఎలాగూ పుస్తకాలలో వుంది గదా! గూగుల్ లాంటి సమాచారం అందించే సైట్లు వున్నాయి గదా! దీని కంటే పుస్తకాలు చూసి పరీక్షలు రాసే పద్ధతి కొంత మేలు. కనీసం ఆ పాఠంలో జవాబులు ఎక్కడున్నాయో వెతికే శక్తి సామర్ధ్యాలైనా వస్తాయి. కావలసింది సమాచారం గుర్తు పెట్టుకోవడం కాదు. స్పందన, మార్పు, కొత్త ఆలోచన, ఆ సమాచారానికి మరి కొత్తది జోడించగలిగే సృజనాత్మక ఆలోచన!

స్పందన లేని చదువులెందుకు?

వేల సంవత్సరాల మానవజాతి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ కట్టిన విజ్ఞాన సౌధంలో మనం నివసిస్తున్నామన్న సంగతిని పిల్లలు మరిచి పోకూడదు. పాఠంలోని సారాన్ని వదిలి, చెత్తని పిల్లల ముందు పడేస్తే అది తినలేక, మింగలేక వాళ్లు పడుతున్న బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? ఏదైనా అర్థం కాకపోతే మళ్లీ అడుగుతాం. ఒక స్వీట్ లేదా హాట్ తింటాం, బాగుందో లేదో చెబుతాం. ఎంతో ఆసక్తిగా సినిమా చూస్తాం. ఆనందంగా పాటలు వింటాం. ఇష్టంగా కబుర్లు చెప్పుకుంటాం. ఏదో ఒక సంతృప్తి పొందుతాం. వేల సంవత్సరాలు ఎందరో మహానుభావులు జీవితాలు ధార పోసి కనుక్కున్న ప్రకృతి రహస్యాలు, విస్తుగొలిపే విషయాలు వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు కూడా పిల్లల్లో ఎలాంటి స్పందనలు కలగలేదంటే వారికేమీ అర్థం కావడం లేదని మనం ఒప్పుకోవాలి గదా! ఇంత చిన్న విషయం కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నామంటే మనం కూడా ఆ చెట్టు కాయలమే అని సరిపెట్టుకుందామా? చివరిగా ఒక మాట పిల్లల్లో దేన్నైనా అర్థం చేసుకునే అపారమైన శక్తి సామర్ధ్యాలున్నాయి. కనీసం వాటిని అలా వుంచనైనా వుంచకుండా చదువుల పేరుతో వాళ్ల బుర్రల్ని ఖాళీ చేస్తున్నాం గదూ.

తప్పు మనదే గానీ పిల్లలది కాదు గదూ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *