పుస్తక పరిచయం – వి. బాల సుబ్రహ్మణ్యం
ప్రపంచం ఉనికిలోకి ఎలా వచ్చింది ? ఈ ప్రశ్నే తత్వశాస్త్రానికి మూలం. ‘ఒక మానవాతీత శక్తి దీనికి కారణం’ అనేది ఒక భావన. దీని చుట్టూ శతాబ్దాల తరబడి చర్చోపచర్చలు చేశారు. సిద్ధాంతాలు సృష్టించారు. మన వేదాలనుంచి సూత్ర గ్రంధాల దాకా దీని సమర్థన అవిచ్ఛిన్నంగా కొనసాగింది. తర్వాత వచ్చిన పురాణాలు కూడా ఇదే ఒరవడిని కొనసాగించాయి. దీన్ని ప్రాచీనం, సనాతనం అంటే అనొచ్చు కూడా. సమాజాన్ని నియంత్రించగల, నడిపించగల శక్తుల మద్దతు కూడా దీనికి దక్కడంతో దీర్ఘకాలికంగా దీనికి విస్తృతమైన ఆమోద యోగ్యత కూడా చరిత్ర పొడవునా లభించింది. ఇదే ఆస్తికవాదం.
దీనికి భిన్నంగా ప్రపంచానికి ఏ సృష్టికర్తా లేడనీ, అది తనకంత తనే ఆవిర్భవించిందనే లౌకిక భౌతిక భావన కూడా చరిత్ర పొడవునా సాగింది. దీని చుట్టూ సైతం కావలసినన్ని వాదాలు, చర్చలు జరిగాయి. సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. పుంఖానుపుంఖాలుగా గ్రంథాలు వెలిశాయి. ఇలా చూస్తే ఈ తాత్వికవాదం కూడా అంతే ప్రాచీనం, అంతే సనాతనం. అంతే బలీయం. ఇదే నాస్తిక వాదం.
రెండూ సమాంతర స్రవంతులు. సుదీర్ఘ స్రవంతులు.
తాత్వకరంగంలోనూ వర్గఘర్షణ
సహజంగానే ఈ రెండూ ఒక వొరలో ఒదిగే కత్తులు కాకపోవడంతో వీటి మధ్య తలలు పగలగొట్టుకునే ఘర్షణలు జరిగాయి. ఒక్కోసారి హద్దులు దాటి భావ పరమైన ఘర్షణల స్థాయి నుండి భౌతికమైనవిగానూ మారాయి. చరిత్రనుండా ఈ ఘర్షణ సైతం ఒక స్రవంతిగా సాగింది. సాగుతూనే వుంది.
అయితే మొదటి దానికి మద్దతు దారులుగా పాలకులు, వారికి వత్తాసుదారులైన పండితులూ వున్నారు. దాన్ని వాళ్ళు ఆకాశానికి ఎత్తారు. రక్షణ కవచంగా దాని చుట్టూ నిలబడ్డారు. అధికారిక భావనగా దానికి ఒక రాజ ముద్ర కూడా వుంది. కారణం రాజ్యం ప్రయోజనాలు దానితో ముడివడి వున్నాయి. ఫలితంగా దానిది నల్లేరుపై నడక.
భౌతిక వాదానికీ మద్దతు లేదు. అది సత్యం పక్షాన, ప్రజల పక్షాన నిలబడేది. అందువల్ల అది అడుగడుగునా ఘర్షణ పడుతూ ఎదురీదాల్సి వుంటుంది. ఈ ఘర్షణలో భౌతిక వాదం కొన్ని సందర్భాల్లో వెనకబడుతుంది. ఒక్కోసారి పలుచబడుతుంది. సారాన్ని కోల్పోతుంది. మూలాధారాలన్నీ ‘మాయమై’, దానికి దాని శత్రువులు చేసిన నిర్వచనాలూ, వ్యాఖ్యనాలే మిగులుతాయి. గడ్డు పరిస్థితిలో కాలం కలిసి రాక రాజీపడ్డమూ జరుగుతుంటుంది. అంతిమంగా విజ్ఞాన శాస్త్రం ఎదిగొచ్చి తోడొచ్చేదాకా ఇది ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూనే వుంటుంది. అయినా అసిధారా వ్రతంగా భౌతిక వాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎంత ప్రతిఘటనకైనా సిద్ధపడే వారికి చరిత్రలో కొదవేమీ లేదు. కారణం సత్యానికున్న బలం! వాస్తవానికిదే తాత్విక రంగ చరిత్ర సారం. ఇదో వర్గ పోరాటం.
అంతిమంగా వీటిలో ఏది శాస్త్రీయమో ఏది రుజువుకు, నిర్ధారణకు నిలబడుతుందో, దేనితో మానవాళి ప్రయోజనాలు ముడివడి వున్నాయో అదే నిలబడుతుంది. విజ్ఞాన శాస్త్రం వికసించే కొద్దీ దీనికి గొప్ప తోడు లభిస్తుంది. దీంతో మానవుడి భౌతిక ప్రపంచమంతటనీ ఇది అల్లుకుంటుంది. అంతిమంగా కాదనలేని స్థాయికి చేరుకొని ఎక్కువ మందికి అంగీకార యోగ్యంగా మారుతుంది.
మన బాధ్యత ఏమంటే చరిత్రలోని ఈ సజీవాంశాలన్నిటిని ఓపిగ్గా వెతికి ఒక చోటికి చేర్చడం. వాటిని పునర్నిర్మించడం. ఒక్కొక్కప్పుడు ఇది కష్టతరంగా మారొచ్చు. ఎక్కడో ఒకచోట మొత్తం లింకు తెగిపోవచ్చు. మనల్నిగందరగోళం లోకి నెట్టవచ్చు. అందుకే దీనికి పట్టుదలా, నిబద్ధతలతో పాటు పరిశోధనా ప్రతిభా పాండిత్యాలు కూడా వుండాలి. దీన్ని మించిన తాత్విక స్పష్టతా, ఆధునిక వైజ్ఞానిక పరికరాలు కూడా వుండాలి.
అసాధారణ పాండిత్యం, నిబద్ధతా!
ఈ గ్రంథంలో దేవీ ప్రసాద్ చటోపాధ్యాయ కృషీ,ముందుకు తెచ్చిన వాదాలూ, సాక్ష్యాలు చూస్తే దిగ్భ్రమ కలుగుతుంది. ఆయన శ్వేతాశ్వతరోపనిషత్తులో బౌద్ధానికి ముందే స్వభావ వాద (Naturalism) ఛాయల్ని పట్టుకొంటాడు. భగవంతుడి విషయంలో బుద్ధుడిది ఉపేక్షాధోరణి అంటూ ప్రతీతి సముత్పాదాన్ని బౌద్ధ భౌతిక తాత్వికంగా వర్ణిస్తాడు. వైభాషికులు మూలకధర్మాల సిద్ధాంతకర్తలంటూ వారిది ప్రతివాదం అనీ, అది భగవత్ వ్యతిరేకమని నిరూపించే ప్రయత్నం చేస్తాడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు నుంచి ఖగోళ విజ్ఞానం దాకా కాలానికి గల ప్రాధాన్యతను ముందుకు తెస్తాడు. ఉద్దాలకఅరుణిని మానవాళి మేధో చరిత్రలోనే మొదటి ప్రకృతి శాస్త్రవేత్త అంటూ, ప్రకృతికి మనిషికి గల సంబంధాల్ని ప్రయోగాత్మకంగా అర్థం చేసుకోవడం అతనికే మొదటి చెల్లిందంటాడు. వజ్రకోపనిషత్తును శంకరుడు ఎందుకు వ్యాఖ్యానించలేదని ప్రశ్నిస్తాడు. పండితులు కపిలుడిని మహా విద్వాంసుడని ఒక పక్క కీర్తిస్తూనే చరిత్ర పొడవునా కించపరచడాన్ని ఎత్తిచూపుతాడు. మొదట వైద్యశాస్త్రమే ప్రకృతి శాస్త్రమనీ, తొలి భౌతికవాదం కావడంతో బ్రాహ్మణులు దీనికి దూరమై తీవ్ర నష్టం తెచ్చారనీ అంటాడు. చివరికి భగవత్ సమర్ధకులైన న్యాయవిశేషకుల్ని కూడా ప్రపంచానికి అంతిమ భౌతిక కారణంగా అణువుల (పదార్థాల) సమ్మేళనాన్ని ప్రతిపాదించినందువల్ల భౌతిక శాస్త్రవేత్తలే అంటూ కొత్త నిర్ధారణ చేస్తాడు. యోగమూ అంతే. అది వ్యాయామంగా వున్నంతకాలం భౌతికమే. మోక్షం ప్రవేశించాకే అలౌకికం అయిందంటాడు. చిట్ట చివరకు శంకరుడి మాయావాదంలో కూడా నాగార్జునుడి శూన్యవాద ప్రభావాన్ని చూపుతూ, “ప్రపంచమే మాయ అయినపుడు సృష్టికర్తా లేడు గదా” అని అందులోనూ భౌతిక వాద ఛాయల్ని అన్వేషిస్తాడు.
భౌతికవాదుల బలహీనత
అయితే ఇంత శక్తీ ఇంత నిబద్ధత గల భౌతిక (నాస్తిక) వాదం అలౌకిక భావవాదం ముందు సమాజంలో ఎందుకు ప్రాచుర్యం పొందలేక పోయింది. అలౌకిక (ఆస్తిక) వాదనదే పై చేయిగా ఎందుకు మారింది? అనే ప్రశ్నను కూడా ఆయన ముందుకు తెచ్చి దీనికి రెండు కారణాలను, పరిష్కారాలను చూపుతాడు. విజ్ఞాన శాస్త్రం తగినంత అభివృద్ధి కాకపోవడం వల్ల స్వభావాదులూ, అణువాదులూ లాంటి వారు తమ వాదాన్ని తాత్విక రంగానికి పరిమితం చేసుకోవలసి వచ్చింది. వారి భావనలు ఒక తార్కిక చర్చగానే సాగాల్సి వచ్చింది. ఇది ఆ కాలపు పరిమితి.
రెండోది మరీ ముఖ్యమైనది అప్పటి భౌతిక వాదుల అవగాహనా పరిమితి. వారికి ప్రాపంచిక దృక్పథం లేకపోవడం. ఆస్తిక భావవాదులకున్న సామాజిక మూలాలను గుర్తించలేకపోవడం. ఒకానొక భౌతిక స్థితిలో భగవంతుడు స్థిరపడ్డ ఊహగా అవతరించాడని అర్థం చేసుకోలేకపోవడం. ఒక మాటలో చెప్పాలంటే దీనికున్న సాంఘిక మూలాలను విస్మరించి తాత్విక రంగంలో మాత్రమే దర్శించడం. మార్క్సిజం రంగం మీదికి వచ్చేదాకా ఈ ముడి వీడలేదు.
మన కర్తవ్యం
చివరగా రచయిత మన బాధ్యతను కూడా స్పష్టంగా, ఒక్కింత కఠినంగా కూడా నిర్దేశిస్తాడు. శ్రామిక ప్రజలంతా తమకు తామే చైతన్యవంతులై ఏమీ వున్నట్టుండి మార్క్సిస్టులుగా మారిపోరు. వారికి ఓపిగ్గా అవగాహన కల్పించాలి. వర్గ స్పృహ కల్గించాలి. సంఘటిత పరచాలి. వారి పోరాటంతోనే దీనికి అంతిమ పరిష్కారం లభిస్తుందని సుస్పష్టం చేస్తాడు.
అయితే దీనికి ఎంత పట్టుదల వుండాలో అంత మెలకువ వుండాలి. భౌతిక వాదులేమీ ఒంటరివాళ్ళు కాదు. వాళ్లకూ సుదీర్ఘ సుసంపన్న వారసత్వం వుంది. అద్భుతమైన వాదనా రూపాలున్నాయి. అనుభవాలున్నాయి. వాళ్లెన్నో డక్కా మొక్కీలు తిన్నవాళ్ళు. అలాగే ఇప్పటి మాటల్లో చెప్పాలంటే వాళ్ళూ సనాతనుల్లో కెల్లా సనాతనులు. ప్రాచీనులోకెల్లా ప్రాచీనులు. ఇప్పుడు వారందరి జ్ఞాన సామగ్రికి ఆధునిక వైజ్ఞానిక పరికరాలను కూడా జతపరచుకోవాలి. ఓపిగ్గా తలపడాలి. జనంలో నుంచి వేరుపడకుండా జాగ్రత్త పడాలి.
దేవి ప్రసాద్ చటోపాధ్యాయ తాత్విక రంగంలో పనిచేసే వారందరికీ వైజ్ఞానిక దృక్పథం కూడా వుండాలంటాడు. వైజ్ఞానిక శాస్త్రాలకు తాత్విక శాస్త్రాలకు ఒక సయోధ్య కుదర్చాలంటాడు. దేనికోసం భారతదేశపు ప్రోటోసైన్స్ రూపాలను సైతం వెలుగు లోకి తెచ్చే ప్రయత్నం చేస్తాడు.
ఈ గ్రంధం చదువుతున్నంత సేపు మన ప్రపంచం మొత్తాన్ని కొత్త దృష్టితో తిరగజూస్తున్నట్టనిపిస్తుంది. ఇలా దీన్ని దర్శించిన వారెవరూ లేరనిపిస్తుంది.
ఈ గ్రంథం ఎంత విలువైందో అంత లోతైంది. కాకుంటే ఓపిగ్గా చదవాలి. అవసరమైతే ఒకటికి రెండుసార్లు చదవాలి. ఇలాంటి గ్రంథాల అనువాదం కూడా ఏమీ ఆషామాషీ వ్యవహారం కాదు. నల్లేరు మీద నడకలా సాగిందనలేము గానీ అనువాదం మూలాన్ని అక్షరం అటూ ఇటూ పొల్లు పోకుండా మన ముందు ఆవిష్కరిస్తుంది.
దేవీప్రసాద్ తెలుగువాళ్లకేమీ కొత్తవాడు గాదు. ఆయన గ్రంథాలు ‘లోకాయత’ లాంటివి ఎంతో కాలం ముందే తెలుగులోకి వచ్చి గొప్ప ప్రాచుర్యం పొందాయి. ఇప్పటి దాకా ఇది తెలుగులో వెలుగు చూడక పోవడం పెద్ద కొరతే. ఆలస్యంగానే అయినా ఎంతో బాధ్యతతో ఇందుకు పూనుకున్న రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు గారిని, ఇప్పటికీ ఇలాంటి గ్రంథాలపై మాదే పేటెంట్ అని నిరూపించుకున్న విశాలాంధ్రవారినీ ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. సనాతనం పేర మన వారసత్వాన్నంతా ఏకశిలాసదృశ్యం చేసే దుర్మార్గం వికృతంగా జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో దీనివిలువ ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.