– ప్రొ. యన్ వేణుగోపాల్ రావు,  వ్యవసాయ శాస్త్రవేత్త

జీవాలకు నిర్జీవాలకు సంధానకర్తలుగా వున్న వైరస్ లు ఇంకా అత్యంత శక్తివంతమైనవిగా ఎలా మనగలుగుతున్నాయి? పంట మొక్కలను తెగుళ్ల రూపంలో, మనుషులను రోగాల రూపంలో ఎలా ఈ వైరస్ లు దాడి చేస్తూ బెదిరించగలుగుతున్నాయి? కరోనా క్యాన్సర్ కారకాల్లాంటివి మానవులకూ; మిర్చి పైరు నాశించే బొబ్బర వైరస్ తెగుళ్లు, అపరాల పంటలను ఆశించే ఆకు ముడత(కింకిల్), ఆకు మచ్చ (పండాకు) తెగుళ్ల లాంటివి మొక్కలకూ అంతుచిక్కని బెడదగా ఎలా పరిణమించగలిగాయి? మందుల కంపెనీలు, “సర్వజ్ఞాన” సైంటిస్టులు వాటి అదుపుకు ఘాటు రసాయనాలు కనిపెట్టీ కనిపెట్టక ముందే ఈ వైరస్ లు ఇన్ని భిన్నరూపాలని ఎలా సంతరించుకోగలుగుతున్నాయి?

కరోనా వచ్చిన గత సంవత్సరానంతర కాలంలో రైతులు, రైతు కూలీలు, భవనం నిర్మాణ కార్మికులు వంటి శ్రమజీవులు తప్ప మిగిలిన ప్రజలందరూ మాస్క్ లు, సానిటైజర్లు వాడుతూనే ఉన్నారు. అవి వైరస్ ను అరికడతాయని ప్రచారం జరుగుతూనే ఉంది. అదే విధంగా పంట వైరస్ తెగుళ్ల అదుపు కోసం కూడా కొత్త కొత్త కృత్రిమ రసాయనాలని వాడి పంటలను రక్షించకోండి అంటూ నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. రైతులు కోట్లు కుమ్మరించి వాటిని వాడుతూనే ఉన్నారు. అయినా జరిగే నష్టం పెరగడమే తప్ప తరగడం లేదు.

కావల్సింది మందులు గాదు, రోగనిరోధకత

కరోనా వైరస్ వ్యాధినిరోధకశక్తి కలిగిన వారికి, తెగుళ్ల వైరస్ లు వాటిని తట్టుకోగలిగిన పంట రకాలకు రావడం లేదని తెలుస్తూనే వుంది. అలానే మంచి పోషకాలున్న ఆహారం పొందగలిగిన మనుషులకూ, సమగ్ర పోషణ రక్షణలో పెరుగుతున్న పంటలకూ ఈ వైరస్ ల దాడి తక్కువని కూడా తేలింది. అయినా ప్రభుత్వం, దాని నీడలో బ్రతికే మందుల కంపెనీలు మాత్రం ప్రజల్ని గందరగోళంలోకి నెడుతూనే వున్నాయి. మధ్యలో ఆనందయ్యలు, రాందేవ్ బాబాలు రంగంలోకి దిగి మరింత గజిబిజి సృష్టిస్తూనే వున్నారు.

నిజానికి టీకా (వ్యాక్సిన్) మూల లక్షణం వ్యాధి నిరోధక శక్తిని పెంచడం. అంటే వైరస్ ను ఎదుర్కోనగలిగిన శక్తిని జీవుల్లో కలిగించడం. అయితే అమెరికా వంటి ధనిక దేశాలూ, మన లాంటి పేద దేశాలు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ఏ లక్ష్యాన్ని పట్టించుకోవడం లేదు. లాభాల పోటీల్లో కంపెనీలు ప్రాథమిక ఆరోగ్య నియమాల్ని గాలికి వదిలేసాయి. అలానే వైరస్ తెగుళ్ళను రసాయనాలు అరికట్ట లేవని తెలిసి కూడా పదేపదే అదే దిశలో ప్రచారం నడుస్తున్నది. దీనికి ముఖ్య కారణం సామాన్యులకు, రైతులకు కార్యకారక సంబంధాల పరంగా వైరస్ జబ్బుల అదుపు గురించి తెలియకపోవడమే.

రెండు శతాబ్దాల క్రితమే డార్విన్, వాలస్ ల వంటి ప్రకృతి పరిశీలకులు, ఆ తరువాత వారి అనుయాయులు జీవ పరిణామాన్ని విశ్లేషించి సంచలనాన్ని సృష్టించారు. “మనిషి ఎలా రూపొందాడు”  అనే దానితో మొదలెట్టి జీవులు తమ మనుగడకోసం జరిపే పోరాటం వల్ల, వాటి పోటీ తత్వం వల్ల, వాటిలో జరుగుతున్న బాహ్య అంతర మార్పుల వల్ల  నూతన జీవ ఆవిర్భావం  జరుగుతోందని శాస్త్రీయంగా నిరూపిస్తూ అనేక ఉదాహరణలను ప్రపంచం ముందుంచారు. అయినా చాలా రోజులు ఆ దిశలో పరిశీలించడానికి ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మతవాదులు అంగీకరించలేదు. పైగా సామాన్య ప్రజలు ఆలోచించడానికి ఉన్న అవకాశాలకు అవరోధాలు ఏర్పరిచారు. ఆఖరికి శాస్త్ర సాంకేతికాల విస్తరణాల మొదటి వరసలో వున్న బ్రిటన్ దేశ మేధావులు కూడా సాహసం చేసి వాటిని సమర్ధించలేకపోయారు. పైగా కొందరు చులకనగా మాట్లాడారు. గేలి చేసే  స్థాయికి దిగజారారు. చర్చి మెప్పు పొందడానికి అనేక అశాస్త్రీయ ప్రయత్నాలు చేశారు. అయినా డార్విన్ “ఆరిజన్ ఆఫ్ స్పెసీస్” ప్రపంచ మానవ ఆలోచన విధానాన్ని మలుపు తిప్పింది. సామాజిక ఆర్థిక రాజకీయ శాస్త్రాలన్నిటిని మార్చివేసింది. అనేక నూతన ఆవిష్కరణలకు కొత్త సాంకేతికాల ప్రవేశానికి దారిచూపింది. సమకాలీన మార్క్సిస్టు తత్వశాస్త్రానికి దన్ను చేకూర్చింది. సమాజ పరిణామ జీవపరిణామ సిద్ధాంతాలు విప్లవాత్మక మార్పులకు దోహదపడ్డాయి.

అల్పప్రాణి అనంతశక్తిమంతురాలా?

అయినా నిజంగా మనుషులు కోతుల, ఇతర జీవుల నుండి వచ్చి వుంటే ఆ కోతులు ఇతర జీవులు ఇంకా భూమి మీద ఎందుకున్నాయి? అనేది చాలామంది దేవదూతలు, కర్మ సిద్ధాంతకర్తలు వేసే ప్రశ్న. ‘గతంలో ఉన్న జీవి కంటే మార్పు చెందిన (ఉన్నత స్థాయికి చెందిన) జీవి తయారైతే ముందుగా తయారైన జీవి నశించిపోతుంది’ అనే అవగాహన ఈ ప్రశ్నకు మూల కారణం. అటువంటి అవగాహనకు, ఆలోచనలకు, అనుమానాలకు, ప్రశ్నలకు కొనసాగింపే ఇప్పుడు నడుస్తున్న కరోనా వైరస్ మీద చర్చ కూడా.

ఒక అత్యంత ప్రాథమిక (మొదటి నిర్జీవ జీవ దశ) జీవ రూపమైన (జీవి కాని జీవి ) అల్పప్రాణి ఎంతో ఉన్నత స్థాయికి చేరిన మనుషుల్ని ఎలా వణికించగలుగుతున్నది? ఈ అంశాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తే తప్ప వాస్తవాన్ని గుర్తించలేము.  ‘ఇంకా ఆ ప్రాథమిక జీవి ఎలా మనగలుగుతున్నది’ అనే అంశం బోధపడదు. అందునా మత మితవాదనలు, సంప్రదాయ ధోరణి ఇరుసుగా గల దేశాల్లో ఇది ఎంతో కష్టసాధ్యమైన పని.

జీవశాస్త్ర ప్రమాణాల ప్రకారం – ముఖ్యంగా జీవోద్భవ సిద్ధాంతరీత్యా ప్రాథమిక దశ జీవి లేక సూక్ష్మాతి సూక్ష్మ ప్రాణి అనే మాటకు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం రూపొందిన జీవి (senior most) అని అర్థం. అనగా పెద్ద పెద్ద జీవన ప్రమాణాలతో భారీ శరీర నిర్మాణ దశకు చేరిన వివిధ రకాల జీవులు భూమి మీదకు రాక ముందున్న స్థితి. ఈ అవగాహన అనివార్యంగా ఉన్నత తరగతి, క్రింది తరగతి జీవులనే వర్గీకరణకు దారి తీసింది. పైగా మానవుడు అన్ని జీవుల కంటే పైనుండే ఉన్నత స్థాయి జీవి అనే నమ్మకం స్థిరపడిపోయింది. ఈ మానసిక స్థితి వల్లే “వైరస్ ల వంటి మొదటి జీవులు ఇంకా కొనసాగమేమిటి? అవి మనిషి మనుగడకు ప్రతిబంధకంగా మారడం ఏమిటి” అనే ప్రశ్నలు వస్తున్నాయి.

జీవులన్నిటిదీ ఒకే నిర్మాణం

ప్రతి జీవి యొక్క నిర్మాణం భౌతిక శాస్త్ర నియమాలకు అనుగుణంగానే వుంటుంది. అది కణాలు, కణ సముదాయాల కలయిక ద్వారానే జరుగుతుంది. కణాల ఆకృతి, రూపకల్పన అన్ని జీవుల్లో ఒకే మాదిరి ప్రాథమిక సూత్రాల కేంద్రంగానే జరుగుతుంది. అనగా జీవకణం ఒక ప్రాథమిక నిర్మాణ యూనిట్ గా ప్రతి జీవికి ఉంటుంది. వైరస్ అని మనం చెప్పుకొనే జీవి రూపం దాల్చిన నిర్జీవ పదార్థం కూడా కణజాల నిర్మిత జీవుల్ని పోలే వుంటుందన్నది సైన్సు విప్పి చెప్పిన రహస్యం. అయితే ఇది కన్షియంట్ (స్థిరత్వ దశ) స్థితి నుండి రూపం దాల్చిన పదార్థం. అనగా కొన్ని అణువుల సముదాయం రైబో  న్యూక్లియిక్ ఆమ్లపు (ఆర్ఎన్ఏ) పొరలోపల బిగించబడే భౌతిక మార్పులకు గురైనది. ఆ క్రమంలోనే వైవిధ్యత కలిగిన వైరస్ లుగా ఇవి రూపుదాల్చాయి. జీవ పరిణామం నేపథ్యంలో వివిధ జీవులు (తమకు అవసరమైన ప్రత్యేక లక్షణాలను సంతరించుకున్న ప్రాణులుగా) ఉద్భవించి భిన్నస్థితి లక్షణాల్ని సంతరించుకున్న జీవులుగా మారినా మొదటి మూల దశ జీవులు యధాతధంగానే కొనసాగ గలవు. దానికి ముఖ్య కారణం ప్రతి జీవికి దిగ్విజయంగా జీవనం కొనసాగించ గలిగిన ప్రత్యేక జీవ ప్రక్రియల నిలయం /కాలం పద్ధతి ఒకటి ఏర్పాటై వుండడం. దీన్ని మనం ‘ఎకలాజికల్ ప్రత్యేక ఆవాస కేంద్రం’ అనుకోవచ్చు. ఈ ప్రత్యేక నిలయం/ ఆవాసం యొక్క పరమార్థం మనకు ఒక జీవి మరో జీవితో పోటీ పడే ప్రక్రియలో అర్థమవుతుంది. ఒకే తిండి, ఒకేకాలం, ఒకే జీవన విధానం గల జీవులు సమాంతరంగా మనలేవు. కొన్ని తొలగిపోతాయి. అనగా జీవుల మనుగడకు మూలమైన ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి ప్రక్రియలకు స్థానిక కొరత ఏర్పడుతుంది. ఈ స్థితిలో కొన్ని జీవులు పోటీకి నిలవలేనివి అనివార్యంగా అంతరించిపోతాయి. పరిణామ క్రమంలో అనేక జీవులు అంతరించడాన్ని వివిధ దశల్లో మనం గమనించాం. 

బలహీనజీవులూ బతకగలవు

అయితే జీవులు పోటీకి తట్టుకునే క్రమంలో తమ ఆహార, ఆవాస, పునరుత్పత్తి ప్రక్రియల్ని మార్చుకోగలవు. ఉదాహరణగా ఒకే నది, చెరువు, సముద్రంలో బ్రతికే వివిధ రకాల చేపల్ని చెప్పుకోవచ్చు. కొన్ని చేపలు వేగంగా ప్రవహించే నీళ్లలో మనగగలిగితే, మరికొన్ని నీళ్ల అడుగున నిశ్చలమైన పదార్థాల ఆసరాలతో బతక గలవు. కొన్ని వివిధ ప్రత్యేక శరీర భాగాల్ని రూపొందించుకోగలిగిన నేర్పు ద్వారా ప్రతికూలతలను ఎదుర్కొంటూ మనుగడ సాధిస్తాయి. పెద్ద చేపలు సముద్రపు అడుక్కు చేరి తమ ప్రత్యేక నిలయాన్ని నిర్మించుకొని బతకగలవు. దీన్ని పురుగుల్లో కూడా మనం చూడవచ్చు.  దీన్ని “వనరుల పంపకంగా”, ఆవాస రూపకల్పనలో వైవిధ్యతగా మనం గుర్తించాలి. ఈ ప్రక్రియ వల్ల కొన్ని బలహీనమైన జీవులు కూడా పోటీలో తట్టుకునే స్థితిని సంతరించుకుంటాయి.

జన్యుపరమైన వైవిధ్యత, బాహ్య శరీర నిర్మాణాలపై పరిసరాల ప్రభావం ఎక్కువ. డిఆక్సీ (రైబోజ్) న్యూక్లికామ్లాల కలయిక (ఆర్ఎన్ఏ) ద్వారా నిర్మించబడుతున్న మూల జన్యువులు తమ నిరంతర కలయిక ద్వారా, మార్పుల ద్వారా జీవి రూపాలను ప్రభావితం చేస్తంటాయి. వీటిని ప్రాథమికమైనవనో, బలహీనమైనవనో భావించడం అశాస్త్రీయమైన విషయం. ముఖ్యంగా పరాన్న జీవులైన వైరస్ లు, బాక్టీరియా జీవులు నిర్మాణ రీత్యా జన్యుపర సౌలభ్యతకు ప్రతీకలు. కానీ ఉన్నత జీవులుగా మనం పేర్కొనే మనుషుల శరీరం నిర్మాణం జన్యు పరంగా ఉత్పత్పరివర్తన (మ్యుటేషన్) చెందడానికి అంత  అనుకూలం కాదు. పైగా మానవుల 90 శాతం జన్యువులు ఒకే తరహా ప్రక్రియకు మూలాలు. ఇప్పుడు మనం మనుషుల మధ్య చూస్తున్న వైవిధ్యతలన్నీ పరిసరాల ప్రభావంతో మాత్రమే కొనసాగుతున్నవని గుర్తించాలి.

వైరస్ లే వేగంగా మారగలవు!

మరో ముఖ్య అంశం ఏమంటే జీవపరిణామం ఒకే దిశలో జరుగుతూ వుండదు. పునరుత్పత్తి, జన్యువైవిధ్యత, మూల వనరుల లభ్యత వంటి అనుకూలతలు గల్గిన జీవుల నుండే ఉన్నత స్థాయి జీవులు రూపొందే అవకాశం ఉంటుందనేది సరైన అభిప్రాయం కాదు. దీన్ని శాస్త్రవేత్తలు నిరూపించారు. వివిధ సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో జరిగిన జన్యు కలయికలను బట్టి భిన్నమైన దశలో జీవపరిణామం జరిగిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

సూక్ష్మ క్రిములుగా పిలవబడే వైరస్, బూజు, ఫంగస్, మైకో ప్లాస్మా, బ్యాక్టీరియాల్ని తరచుగా ప్రాథమిక జీవులుగా పేర్కొనడం జరుగుతున్నది. వాటి జన్యుపరమైన నిర్మాణం సంక్లిష్టంగా లేకపోవచ్చు గానీ అవే విజయవంతంగా మనుషుల మీదా, జీవుల మీదా, వృక్షాల మీదా దాడి చేయగలుగుతున్నాయి. వాటి మీద బతగ కల్గుతున్నాయి. వేగంగా రూపాంతరం చెందగలుగుతున్నాయి. మన కొలమానాల ప్రకారం ప్రాథమిక జీవులైనవాటికి ఉన్నత జీవులు లొంగిపోతున్నాయి. దీనికి కారణం ఏమంటే జన్యుపరమైన సంక్లిష్టతలు తక్కువగా ఉన్న సూక్ష్మజీవులు మనుగడకవసరమైన జన్యు నిర్మాణాన్ని వేగంగా సమకూర్చుకోగలవు. దాన్నే జన్యుపరంగా ముటేషన్ అంటారు. దీన్ని “తన మనుగడకు తగిన స్థాయిని పెంచుకోవడం, మార్పులు చేసుకోగల్గడం” అనుకోవచ్చు. ఇలా  వైవిధ్య రూపాలు (వేరియన్స్) అనివార్యంగా అవతరిస్తాయి.

మారాల్సింది మానవుడు!

కోవిడ్ 19 నేపథ్యంలో ఆలోచిస్తే “ఒక ప్రాథమిక జీవి బారిన ఒక ఉన్నత స్థాయి జీవి పడ్డది” అనేది అశాస్త్రీయ అవగాహన. నిజానికి మనుషులు ఎప్పుడూ ఉన్నత స్థాయి జన్యపర నిర్మాణం ద్వారా వైరస్ లను దాటిపోలేదు. వాస్తవానికి మనుషుల సంక్లిష్ట జన్యు నిర్మాణమే సూక్ష్మాతి సూక్ష్మజీవులతో పోటీ పడాల్సి వస్తోంది. 

ఇలా వైరస్ లు నిరంతరం రూపాంతరం చెందుతూ (వేరియంట్స్) తమ మనుగడను కొనసాగిస్తున్నాయి. జీవుల్ని వివిధ రకాల జబ్బుల రూపంలో ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం కోవిడ్ -19 ప్రపంచమంతా వివిధ దేశాల్లో స్వైర విహారం చేస్తోంది. మొదటి, రెండవ తెరల కోవిడ్ వల్ల లక్షల మంది చనిపోయారు. మూడవ తెరగా మారిన కొత్త రూపాలు (వేరియంట్స్) ఇంకా భయంకర స్థాయికి వెళ్ళే స్థితిని చూస్తున్నాం. అయినా మనుషుల ధోరణి మారడం లేదు .పౌష్టికాహార లభ్యత, పరిసరాల పరిరక్షణలపై పెట్టే శ్రద్ధ కంటే పనికిరాని రసాయనల వాడకాన్ని విస్తరింప చేస్తున్నారు. టీకా ఆవిష్కరణ గొప్ప పరిష్కారం చూపిస్తుందని ఆశించాంగానీ దాన్ని పేటెంట్ చట్టంలో ఇరికించి పూర్తి వ్యాపార వస్తువుగా మార్చేసారు. టీకా వాడుక ఉద్యమాలు ధనిక దేశాల్లో విస్తరించినంతగా పేద దేశాల్లో విస్తరించడం లేదు. పైగా వైరస్ లు రూపాంతరం చెందుతూ పాత టీకాల ప్రభావాన్ని దిగజార్చే స్థాయికి చేరుకొంటున్నాయి. ఇలా సైన్సు సాంకేతికాలు వ్యాపార వస్తువులవుతున్నంత కాలం వైరస్ లాంటి సూక్ష్మాతి సూక్ష్మజీవులు మనుషుల్ని వణికిస్తూనే వుంటాయి.

మరి పరాన్న జీవి అనే ముద్ర వేయించుకున్న కరోనా వైరస్ ప్రమాదకారా?
ప్రతిభావంతుడనే, స్వతంత్ర జీవనే ముసుగుతో బతుకుతున్న బయోటెక్ ల వ్యాపారి ప్రమాదకారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *