డా. యం. గేయానంద్
శాస్త్రవేత్తలంటే ప్రయోగశాలలకు పరిమితమై వుంటారు. కానీ మన దేశంలో పుట్టిన ఒక ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త దేశాభివృద్ధికోసం తనదైన ఆలోచనలతో జీవితపు చివరి ఘడియ దాకా భాగస్వామి అయ్యాడు. ఇలాంటి అరుదైన భారతీయ మేధావి మేఘనాధ్ సాహా! 1854 అక్టోబర్ 6న ఆయన ఇప్పటి బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. బాల్యమంతా కష్టాలమయం. తండ్రి పేదరికం వల్ల చదివించడానికి సిద్ధంగా లేడు. ఎవరో డాక్టర్ సహాయం చేస్తే స్కూల్ కి వెళ్ళాడు. ఒక్కోమెట్టూ ఎక్కి ఢాకా, కలకత్తా యూనివర్సిటీల్లో చదువుకున్నాడు. పేద కుటుంబం నుంచి రావడంతో చదువుల్లో చాలా ఇబ్బందులు పడ్డాడు. యూనివర్సిటీలో సైతం అగ్రకుల విద్యార్థులు ఆయనతో కలిసి కూర్చోవడానికి కూడా ఒప్పుకునే వారు కాదు. అయితేనేం? ఆస్ట్రానమీలో, కెమిస్ట్రీలో సాహావే మొదటి మార్కులు.
ఆయన ప్రతిభ ఆయనను జర్మనీకి తీసుకెళ్ళింది. జర్మనీలో థర్మో డైనమిక్స్, క్వాంటం ఫిజిక్స్ చదువుకున్నాడు. ఆధునిక ఆస్ట్రో ఫిజిక్స్ కి పునాదులుగా భావించే పరిశోధనలు చేశాడు. ఐన్ స్టీన్ జనరల్ రిలేటివిటీ సిద్ధాంతాలను మొట్టమొదట ఇంగ్లీషులోకి అనువదించింది సాహానే! జర్మనీలోని మరో ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ తో కలిసి ఈ అనువాదం చేశాడు.
దేశానికి అప్పుడే స్వాతంత్రం వచ్చింది. స్వతంత్ర భారతదేశ అభివృద్ధి ప్లానింగ్ ద్వారానే సాధ్యమని సాహా భావించాడు. కొత్తగా స్వాతంత్ర్యం తెచ్చుకున్న దేశపు సమస్యల పట్ల ఒక శాస్త్రీయ దృష్టి అవసరమని ఆయన అనుకున్నాడు. కడగండ్లు చిన్నప్పటినుంచి చూసినవాడు సాహా. 1923 బెంగాల్ వరదల్లో వేలమంది నిరాశ్రయులు కావడం ఆయన కళ్ళారా చూశాడు. పరిష్కారంగా 1946 లో దామోదరం ప్రాజెక్టును ప్రతిపాదించాడు. అమెరికాలోని టెన్సిస్సి ప్రాజెక్టు అప్పుడాయన దృష్టిలో వుంది. స్వతంత్ర భారతదేశ అభివృద్ధికి పారిశ్రామికీకరణ చాలా ముఖ్యమని సాహా భావించాడు. కాంగ్రెస్ చెబుతున్న కుటీర పరిశ్రమల భావనను ఆయన పెద్దగా ఒప్పుకోలేదు.
శాస్త్రవేత్తగా ప్రయోగశాలకే పరిమితం అని కూడా ఆయనేమీ అనుకోలేదు. అందుకే కలకత్తాలోని పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. తాను రాసిన పుస్తకం నుంచి వచ్చిన రాయల్టీతో ఎన్నికల ఖర్చు పెట్టుకున్నాడు. గెలిచాడు. పార్లమెంటు సభ్యుడుగా నదీ జలాల ప్రణాళికలను మళ్లీ చర్చ పెట్టాడు. దేశ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై ప్రధాని నెహ్రూతో సైతం లోకసభలో తీవ్రంగా తలపడేవాడు. యూనివర్సిటీలను బలోపేతం చేయడం భారతదేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధికీ, పరిశోధనలకు చాలా కీలకమని ఆయన వాదించేవాడు. అటువంటి పునాది లేకుండా పైపై వ్యవస్థలు నిర్మించడం వల్ల నష్టం జరుగుతుందని కూడా ఆయన అభిప్రాయపడేవాడు. భారతదేశంలో అణు పరిశోధనల విషయంలో ఆయనకు నెహ్రూకూ విభేదాలొచ్చాయి. తొందర తొందరగా అలాంటివి నిర్మించే ముందు యూనివర్సిటీ ల్లో పరిశోధనలను బలోపేతం చేయడం మొదటి ప్రాధాన్యతగా ఉండాలనీ, అలా కాకుంటే దేశంలో పరిశోధనలు దెబ్బతింటాయని ఆయన హెచ్చరించేవాడు. సైన్సులో, మౌలిక పరిశోధనల రంగంలో ఈరోజు భారతదేశం వెనకబడి వుండడం చూస్తే ఆ రోజు ఆయన చెప్పిన మాట ఎంత విలువైందో అర్ధమవుతుంది. నెహ్రూ ఆయనకు వ్యక్తిగతంగా ఎంతగౌరవాన్నిచ్చినా అణుశక్తి రంగ నిర్ణయాల నుంచి సాహాను తప్పించి హోమీబాబానును ముందుకు తెచ్చాడని అంటారు.
ఒక ప్రజా మేధావిగా ఆయన అనేక బాధ్యతలు తన భుజాల మీద వేసుకున్నాడు. బెంగాల్ విభజన. శరణార్థుల పునరావసంపై పని చేశాడు. దేశమంతా దాదాపు పది రకాల క్యాలెండర్లు ఆ రోజుల్లో వుండేవి. వాటన్నిటినీ సాహానే శాస్త్రీయంగా ఏకీకృతం చేశాడు. ఇప్పుడు అధికారికంగా వాడుతున్న ‘శక’ క్యాలెండర్ ఆయన రూపకల్పన చేసిందే! ప్రజా జీవితంలో ఒక జీవితానికి సరిపడా పనులన్నీ ఆయన చేశాడు.
అంతకంటే ఎక్కువగా ఒక భౌతిక శాస్త్రవేత్తగా ఆయన భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టాడు. విజ్ఞానపుటంచుల్ని ముందుకు తోసి చిరస్మరణీయుడయ్యాడు. ఖగోళ శాస్త్రంలో మేఘనాథ్ సాహా పేరు నక్షత్రాలు వున్నంతవరకు నిలిచి ఉంటుంది. నక్షత్రాల నుండి వచ్చే కాంతిని లెక్కించి అక్కడి ఉష్ణోగ్రతను బట్టి మూలకాలను అంచనా వేయడానికి ఈరోజుకూ శాస్త్రవేత్తలు ఉపయోగించే సమీకరణాన్ని సాహా ఈక్వేషన్ అంటారు. సాహా ఈక్వేషన్ను ఉపయోగించే నక్షత్రాలు హైడ్రోజన్ హీలియంలతో నిండి ఉంటాయని కనుగొన్నారు. అంతదాకా భూమి లాగే సూర్యుడు కూడా వుంటాడని అనుకునేవారు. నక్షత్రాల గురించిన తన సమీకరణాలను సాహా ప్రకటించినప్పుడు అది యూరప్ కు తెలుసిన విజ్ఞానం కంటే ఎక్కువే. భారత దేశంలో ఉండే ఆయన ఈ ప్రతిపాదనలు చేశాడు. కానీ భారతదేశంలో అప్పుడున్న పరికరాల స్థాయి చాలా తక్కువ అని మనం గమనించాలి.
సాహా మరో పరిశోధన ప్లాస్మా గురించి. పదార్థానికి మామూలుగా ఉండే వాయు ద్రవ ఘన స్థితులు కాకుండా నాలుగో స్థితి ప్లాస్మా అనేది. దీని వైపు ప్రపంచ శాస్త్రజ్ఞుల దృష్టిని మళ్లించినవాడు సాహానే. ఆధునిక ఆస్ట్రానమీలో సాహా కున్న స్థాయిని అర్థం చేసుకోవాలంటే ఆయనని ఏమని వర్ణించారో తెలుసుకోవాలి. ఆయనను “డార్విన్ ఆఫ్ ఆస్ట్రానమీ” అన్నారు ! 20వ శతాబ్దంలో భారత దేశంలో జరిగిన అతి ముఖ్యమైన పది పరిశోధనల్లో ఆయనది ఒకటిగా వుండి పోతుందని జయంతి నార్లేకర్ గుర్తు చేసుకుంటాడు. నోబెల్ బహుమతికి కూడా ఆయన పేరు ప్రతిపాదించబడింది.
సైన్సు ప్రచారం ఆయనకు ఇష్టమైన మరో అంశం. ఆయన ప్రజల్లో శాస్త్ర విజ్ఞానాన్ని ప్రచారం చేయాలని ఇందుకోసం 1930-40లలో అనేక సంఘాలు, పత్రికలు స్థాపించాడు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఫిజిక్స్ సొసైటీలను ప్రారంభించాడు. ద జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చర్ ను ప్రారంభించి దానికి సంపాదకుడుగా జీవితాంతం వున్నాడు. భారతదేశపు ముద్దుబిడ్డ సాహా ప్రజా జీవితంలో తలమునకలుగా వుంటూ 16 ఫిబ్రవరి 1956న రక్త పీడనం ఎక్కువై గుండెపోటు వచ్చి రాష్ట్రపతి భవన్ కు వెళుతూ హఠాత్తుగా మరణించాడు.
నిజానికి మేఘనాథ్ సాహా లాంటి ప్రతిభావంతుడికి, ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తకు, జాతీయవాదికి, సోషలిస్టుకు, పలు సంస్థల నిర్మాతకు, అధికారాన్ని ప్రశ్నించడానికి భయపడని వాడికి, లోతైన ఆలోచనాపరుడికి, ప్రజా మేధావికి మన సమాజం ఇవ్వాల్సినంత స్థానం ఇచ్చిందా? ఏమో చెప్పలేము. ప్రజాసైన్సు ఉద్యమం ఈ ప్రజా శాస్త్రవేత్తను సొంతం చేసుకోవాలి!
Jana Vignanam is a good book with all Scientific information, Science, Astronomy and Environment protection and society related topics. Worth reading for all students, parents and teachers.