మూడవ సార్వత్రిక నియమము 
– ఎ. రామచంద్రయ్య

ఈ విశ్వంలో ఏదీ స్థిరంగా లేదు. ప్రతిదీ చలనంలో ఉంది. ఏ వస్తువూ శాశ్వతం కాదు. చిన్నదైనా, పెద్దదైనా ప్రతిదీ మార్పు చెందవలసిందే. మారనిదేదీ విశ్వంలో లేదు. కేవలం మార్పు మాత్రమే శాశ్వతం. గతిలో లేని దానికి విశ్వంలో స్థితి లేదు. 
(Nothing in the Universe is Eternal; Nothing is Static; Everything, Small or Big, Has to Change. No Object is Permanent. Only Change is Permanent). 

ఈ విశ్వంలో మనకెన్నో వస్తువులు (objects) కనిపిస్తాయి. చిన్న సైజులో ఉన్న దోమలు, పెద్ద సైజులో ఉన్న నక్షత్రాలు, రాళ్లు రప్పలు, గ్రహాలు, నెబ్యులాలు, కణాలు, అణువులు, సమాజం, ధర్మం, ఇలా ఏ వస్తువు అయినా లేదా వ్యవస్థ అయినా మారక తప్పదు. 

గాలిలో కదలిక ఉంది. నీటిలో కదలిక ఉంది. ఇనుము ఘనాకృతిలో ఉన్నా దాని పరమాణువుల్లో కదలిక ఉంది. పరమాణువుల్లోని ప్రాథమిక కణాల్లో కదలిక ఉంది. రాళ్లలో కదలిక ఉంది. కొండలు, భూఖండాల్లో కదలికలు ఉన్నాయి. భూమి ఉన్న సౌర మండలం (మిల్కీవే/పాలపుంత) గెలాక్సీలో కదలిక ఉంది. పాలపుంత మొత్తం గిరగిరా తిరుగుతూ ఉంది. విశ్వం మొత్తమే గమనంలో ఉంది. విశ్వం విస్తరిస్తూ ఉంది. 

మనిషి శరీరంలో కణాలు ఉన్నాయి. కణాల్లో కదలిక ఉంది. మనిషి పుట్టినపుడు బిడ్డ, ఆ తర్వాత యువకుడు, ఆతర్వాత తండ్రి, తాత, ముత్తాత. ఆ పిమ్మట గానీ లేదా ముందేగానీ మరణం. మరణం తర్వాత శరీరంలోని అణువులు, కణాలు గాలిలో, నీటిలో, భూమి పదార్థాల్లో కలవడం ఈ కదలికలలో భాగమే. 

వస్తువులోని పదార్థ బిందువుల అమరికలో మారే సంఘటనల మధ్య అంతరమే కాలం (Time is the recurring gap between events of rearrangement of material particles). కాబట్టి కాలం కదులుతున్నదంటే పదార్థంలో మార్పులు జరుగుతున్నాయన్నమాటే. కొన్ని మార్పులు త్వరితంగానూ, మరి కొన్ని మార్పులు నెమ్మదిగానూ జరుగుతాయి. అంతేగానీ మార్పులేనిదంటూ ఏదీ లేదు.

అయితే మార్పు ఎందుకు జరుగుతోంది? మార్పుకు చోదక శక్తి ఏమిటి? ఇలాంటి సందేహాలు రావడం సహజం. పదార్థం ఏర్పడ్డాక ఆ పదార్థంలోని అంశాలు పరస్పరం నియంత్రించుకుంటూ ఉంటాయి. ఒక ప్రాథమిక కణమైన ప్రోటాను, అందులో ఉన్న క్వార్కులు పరస్పరం నియంత్రించుకుంటూంటాయి. ఒక పరమాణువులో వున్న ప్రోటాను, న్యూట్రాను కూడా పరస్పరం నియంత్రించుకుంటాయి. ఒక అణువులో వున్న పరమాణువులు పరస్పరం నియంత్రించుకుంటాయి.

బృహత్పదార్థాన్ని (మనం చూసే పరిమాణంలో ఉన్న పదార్థం) నిర్మించే పరమాణువులు (మూలకం) లేదా అణువులు (సంయోగ పదార్థం) కూడా పరస్పర నియంత్రణతో, పరస్పరాధారితాలుగా ఉంటాయి. ఒక వస్తుసముదాయం ఉన్న వ్యవస్థలో ఉన్న వస్తువులు కూడా పరస్పరం నియంత్రించుకొంటూ ఉంటాయి. 

అయితే పదార్థాలన్నింటిలోనూ ధృవత్వం ఉంటుంది. ఇవి ధన, ఋణ, విద్యుదావేశితాలు. అలాగే పరమాణువులో ధనావేశిత ప్రోటాను, ఋణావేశిత ఎలక్ట్రాను ఉంటాయి. న్యూట్రానులో కూడా ధృవత్వం ఉంది. అది రెండు – 1/3 కార్కులు, ఒక +2/3e క్వార్కులమయం. వెరసి మనకు తటస్థం అనిపించవచ్చును. కానీ అందులో కూడా ధృవాలు (Poles) ఉన్నాయి. క్వాంటం యంత్ర శాస్త్ర ప్రకారం చూసినా న్యూట్రానుకు ధృవత్వం ఉంది. పదార్థాలనేర్పరచే ప్రాథమిక కణాల్లోనే ధృవత్వం ఉండడం వల్ల పదార్థంలో కూడా అంతోయింతో ధృవత్వం ఉంటుంది. అయితే పదార్థంలో వున్న దృవత్వంలో వ్యతిరేక ధర్మాలతో ఉన్న అంతర్భాగాలు తమను తాము ప్రభావితం చేసుకోకుండా ఉండలేవు. ఆ ధృవాల మధ్య ఎల్లప్పుడూ ఘర్షణ (conflict) ఉంటుంది. అదే సమయంలో అవి ఒకదానినొకటి ఘర్షించుకొంటూనే ఐక్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాయి. 

కాబట్టి పదార్థాలలో పరస్పరాధారితలుగా ఉన్న అంతర్నిర్మాణాల్లోని పరస్పర విరుద్ధ లక్షణాలమధ్య ఉన్న ఘర్షణ, ఐక్యతల సమన్వయ (synchronous) వ్యక్తీకరణే పదార్థాలలో మార్పుల్ని కల్గిస్తుంది. అయితే ఈ మార్పు క్రమేపీ క్రమేపీ జరుగుతూ జరుగుతూ ఒక్కసారిగా పెనుమార్పులకు గురవుతాయి. అంటే పదార్థాల చలనంలో పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పులకు దారితీస్తుందన్నమాట (Quantitative cumulative changes lead to a paradigm qualitative change). తిరిగి క్రొత్త రూపంలో నూతన తరహా ఘర్షణలు తలెత్తి గత మార్పుల్లో ఉన్న అపసవ్య ప్రకటనల్ని (negative manifestations) తిరిగి వ్యతిరేకించేందుకు నూతన మార్పులు జరుగుతాయి. కాబట్టి పరస్పరాధారితాలుగా ఉన్న అంతరంగిక అంశాల (components)లో సహజ సిద్ధంగా ఉన్న వ్యతిరేక ధృవములమధ్య పోరు, ఐక్యతల మధ్య ప్రోద్భలంతో పదార్థంలో మార్పులు జరుగుతాయి. మార్పు పదార్ధస్వతః లక్షణం. మారేదాన్నే పదార్థం అంటారు.  గణిత, భౌతిక రసాయనిక శాస్త్రాలు, జీవశాస్త్ర గ్రంథాలు అన్నీ మారుతూ ఉంటాయి. కొత్త విషయాలు గ్రహించి పాత వాటిని, పనికిరాని వాటిని త్యజిస్తుంటాయి. కొత్త ఎడిషన్లు ప్రచురిస్తుంటారు. ఈరోజు సైన్సువేరు, రేపటి సైన్సువేరు. నిన్నటి సైన్సు మరో విధం.

One thought on “పద్దెనిమిది ప్రకృతి సూత్రాలు

  1. 18 ప్రకృతి సూత్రాలు చదివినాను .బాగున్నాయి. పదార్థం ఎన్ని రూపాలుగా ఉంటాదనేది నాకు సందేహం గా ఉన్నది. మీకు వీలు కుదిరినప్పుడు వివరించగలరని ఆశిస్తున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *