సంపాదకీయం
“గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్” అంటాడు తిక్కన భారతంలో. మరి తిక్కనకు అంతకు ముందటి కాలమంతా అంత గొప్పగా ,తన కాలం దానికి తీసికట్టుగా ఎందుకు కనిపించిందో మరి! వర్తమానం మీదా, భవిష్యత్తు మీదా ఆయనకెందుకు ఆశాభావం లేదో మరి !
కానీ గురజాడ “మంచి గతమున కొంచెమేనోయ్” అంటాడు. శ్రీశ్రీ మరో అడుగు ముందుకేసి “గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో” అన్నాడు. వీళ్ళిద్దరికీ ముందటి కాలం ఎందుకు ముదనష్టంగా కనిపించిందో, భవిష్యత్తు ఎందుకు బంగారమనిచిందో మనకు తెలియదు.
ప్రస్తుత వర్తమానం కూడా రేపు గతం అవుతుంది. అప్పటి వాళ్ళు మన వర్తమానాన్ని – అంటే వారి గతాన్ని ఏమంటారు? ఏమనుకుంటే బాగుంటుంది? ఏమంటే మరీ బాగుంటుంది ? ఈ ప్రశ్నలిప్పుడు మనం వేసుకుంటే గుండె గుభేలుమంటుంది. నీరసం నిలువెత్తునా ఆవహిస్తుంది.
ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నదేమిటి? తిరుపతి లడ్డు గొడవ వదిలేసి, తేరిపార పాలస్తీనా వైపు చూస్తే ఏం కనిపిస్తుంది? రావణకాష్టంలా మండుతున్న మారణ హోమంలో బలవుతున్న వారిలో మూడో వంతు మంది ముక్కు పచ్చలారని పసి పిల్లలు. తమ పెద్దవాళ్లు ఎందుకు తన్నుకు చస్తున్నారో వారికే మాత్రం తెలియదు. చివరికిది ఎక్కడికి దారితీస్తుందో? వర్తమాన చరిత్రలో ఒక జాతి, ఒక దేశం మొత్తం హరించుపోవడం ఇదే మొదటిదవుతుందో ఏమో?
ఇక ఉక్రెయిన్ లో సాగుతున్నదేమిటి? అటు ఇటు మాటిమాటికీ చేతులు మారుతున్న ప్రతి గ్రామం, ప్రతి నగరం నేలమట్టమయ్యాకే వీరికైనా, వారికైనా స్వాధీనం అవుతోంది. సగానికి సగం దేశం ఖాళీ అయింది. అక్కడా పిల్లలూ మహిళలే సమిధలు. అదీ మొత్తం మట్టి పాలవుతుందో ఏమో?
సైన్సు సృష్టించిన మారణాయుధాలు ఎంత విధ్వంసం సృష్టించ గలవో, ఎంత కనికరం లేనివో మనం కళ్ళారా చూస్తున్నాం. వాటి బేహారులు ఎంత నీచంగా నిప్పు చల్లారకుండా ఎగదోస్తారో కూడా గమనిస్తూనే వున్నాం. వీరి నైచ్యానికి పాఠశాలలు, వైద్యశాలలు, గ్రంథాలయాల నుంచి పచ్చటి పొలాలు, నదులు, విద్యుత్ కేంద్రాలు, భారీ పరిశ్రమల దాకా సర్వం నేలమట్టం అవుతున్నాయి. పైశాచికత్వం విలయతాండవం చేస్తోంది. మరి సుదీర్ఘ నాగరికతలో మనం నమ్ముకున్న మతాలన్నీ ఏమయ్యాయి? తాత్విక చర్చోపచర్చలన్నీ ఏం సాధించాయి? శాస్త్ర సాంకేతిక విజ్ఞానమంతా ఎక్కడికి దారి తీసింది ? “హోమో సేపియన్లు ” అన్న పేరునే మనం భ్రష్టు పట్టించామా?
చివరికి ఇదెక్కడికి దారితీస్తుంది? మానవజాతి మొత్తాన్ని ఈ నేల నుంచి తుడిచి పెట్టేస్తుందా? బతకడానికే పనికిరానిదిగా ఈ భూమండలం రూపురేఖల్ని మార్చేస్తుందా? స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్టు కుబేరులంతా కలిసి పచ్చటి భూమిని చెత్తకుండీగా మార్చేసి, గ్రాహాంతరాలకు ఉడాయించేస్తారా?
సరికొత్త మానవజాతి అవతరిస్తే తప్ప భవిష్యత్తు వుండదు కాబోలు! ఆ అంచుకు హోమోసేపియన్లు చేరుకుంటున్నారు కాబోలు! ఇవన్నీ కృష్ణశాస్త్రి గారి “శోక భీకర తిమిర లోకైక పతుల” నిస్పృహాత్మక ప్రశ్నలన్పించవచ్చు గానీ ఇదంతా నిజం కాదనడానికి మాత్రం ప్రస్తుతానికి మన వద్ద నికరమైన సమాధానాలు లేవు. కొండ గుహలు వదిలేసి భూమండలమంతా వొట్టి కాళ్ళతో చుట్టేసిన సాహసి, సముద్రాల్ని జయించి అంతిరిక్షపుటంచుల్లో విహరిస్తున్న మొనగాడు నేడు తిరిగి తిరిగి తన మనుగడకే ముప్పు తెచ్చుకునే మలుపులోకొచ్చి చేరుకున్నాడన్నమాట! ఇదంతా చూసి “మంచి గతమున కొంచెమూ లేదోయ్” అంటారేమో రేపటి కొత్త మానవ జాతి కవికులాగ్రేసరులు!
మార్పు రావాలి ఆలోచించి పిల్లలు చదువుకోవాలి
Very nice. Heart touching. 👌👌👌
ఈ వ్యాసం ఎంత మంది చదువుతారో తెలియదు కానీ.. ఈ వ్యాసం లో ప్రశ్నలు మనల్ని ఖచ్చితంగా మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి… ఈ భూమ్మీద ఏ జీవి శాశ్వతం కాదు.. ఉన్న కొద్ది కాలం పగలు కార్పణ్యాలతో ఒక దేశం మీద మరొక దేశం చేసుకుంటున్న ఈ మారణకాండ రాబోవు తరం మీద చేస్తున్న దమన కాండ. క్షమించదు మిమ్మల్ని ఈ నవతరం.
Really good story it’s useful to all readers
Nice
I am happy to share my thoughts on this Science Magazine.
It will a Strong Road map to all walk of life. Thanks 🙏 to all Our Supporting Team.