– ప్రొ. యన్. వేణుగోపాల రావు

ఐక్యరాజ్యసమితి “కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్” 28వ చర్చా వేదిక దుబాయ్ నగరంలో 2023 నవంబరు 30 నుండి డిసెంబరు 13 దాకా జరిగింది.

ఇలాంటి’ గెట్ టుగెదర్లు’ గత మూడు దశాబ్దాల్లో వివిధ నగరాల్లో జరుగుతూనే వున్నాయి. తీర్మానాలు చేస్తూనే వున్నారు. గతంలో జరిగిన క్యోటో ( 1997), పారిస్( 2017) ఒప్పందాలు మనల్ని చాలా ఊరించాయి. కానీ ధనిక దేశాలు మాత్రం తమ దురాశను గానీ, దుష్ట తాత్వికతను గానీ ఏమాత్రం మార్చుకోలేదు. మరోవైపు పర్యావరణ ఉద్యమకారులు అలుపెరుగని పోరాటాలు చేస్తూనే వున్నారు. అయినా పై దేశాల వరవడి మాత్రం ఏమీ మారలేదు. కనీసం గ్లాస్కో నగర(26), షర్మ్ ఎల్ షేక్ నగర(27) తీర్మానాలకు కూడా ఏమాత్రం విలువ లేకుండా చేశారు.

ఇప్పుడు వాతావరణ సంక్షోభం తుఫాన్లు, భూకంపాలు, భూతాపాల రూపంలో ధనిక దేశాలను కూడా చుట్టుముట్టడం ప్రారంభమైంది. 2022-23 సంవత్సరంలో ఈ శతాబ్దపు అత్యంత ఉష్ణోగ్రతలు ఐరోపా ప్రజల అనుభవంలోకి వచ్చాయి. సముద్ర తీర ప్రజలు తుఫాన్ల వల్ల పడరాని పాట్లు పడుతున్నారు. మనదేశంలోనూ ఈ ప్రమాదం కొట్టొచ్చినట్టు కనబడుతూనే వుంది. అయినా మన పాలకులు “అమృతకాలం” కోసం ఎదురు చూడండని ప్రజల్ని మభ్యపెట్టి పథకాలతో నెట్టుకొస్తున్నారు!

ఇంతకూ ఈ చర్చావేదిక ఏం సాధించిందో ఒకసారి పరిశీలిద్దాం.

అనుకూలాంశాలు

ఆలోచనాపరులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యమకారులు దాదాపు 130 దేశాల నుంచి ఇందులో పాల్గొనడం విశేషం ,ఆశాజనకం కూడా. 1995లో వాతావరణ తీవ్రతల గురించి చర్చకు వచ్చినప్పుడు ఈ పరిస్థితి లేదు. ఏ దేశమూ ఆనాడు అంతగా పట్టించుకున్న దాఖలా లేదు. ఆనాడు అందరూ ఐక్యరాజ్యసమితి సమర్పించిన నివేదికలని, ఆర్ గోరె (అమెరికా ఉపాధ్యక్షుడు) క్రోడీకరణల్ని తేలిగ్గా తీసేసారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కారణం మంచుకొండలు కరగడం, సముద్రాలు ఉప్పొంగడం, ఎడారి ప్రాంతాలు విస్తరించడం, తుఫాన్లు భూకంపాలు పెరగడం! దీనికి తోడు హరిత గృహ విషవాయువుల ప్రభావంతో జబ్బులు పెరగడం, మిథేన్ బొగ్గు పులుసు వాయువుల ప్రభావంతో మరిన్ని తీవ్ర పరిణామాలకు దారి తీయడం. ఆహార ఉత్పత్తిపై, పంటలపై, మొత్తంగా వ్యవసాయంపై వాతావరణ ప్రభావం మరీ కలవర పరుస్తూ వుంది. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడడంతో పాటు, సామాజిక దృక్పథం కూడా శాస్త్ర జ్ఞానానికి లక్ష్యంగా వుండాలన్న సత్యాన్ని ఈ సమావేశాలు గుర్తించక తప్పలేదు.

మారుతున్న పరిస్థితులకనుగుణంగా సమాజంలో మార్పులు రావాలనీ, పేద దేశాల సమస్యల్ని పరిష్కరించడానికి ధనిక దేశాలు ఆర్థిక సహాయం చేయాలనీ, పర్యావరణ భద్రతను పెంచే ఆవిష్కరణలపై పేటెంట్ హక్కులు తీసివేయాలనీ చర్చలు జరగడం, తీర్మానాలు చేయడం సంతోషదాయకం.

అలాగే శిలాజ ఇంధనాల (పెట్రోలియం) వాడకం వల్ల హరిత వాయువులు 75శాతం ఎక్కువవుతున్నాయనీ, బొగ్గు పులుసు వాయువులు వీటివల్లే 90శాతం పెరుగుతున్నాయనీ కూడా చర్చలు కేంద్రీకృతం కావడం మంచి విషయం. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా శిలాజ ఇంధనాల ఉత్పత్తీ, వ్యాపారం జరుగుతున్న అరబ్బు దేశాల మధ్యలో ఈ చర్చలు జరగడం మరీ విశేషం!

పారిశ్రామిక విప్లవం నాటి ఉష్ణోగ్రత కంటే 1.5 డిగ్రీలు పెరక్కుండా ఉండేటట్లు గట్టి ప్రయత్నం చేయడంపై ఇందులో మళ్ళీ హెచ్చరికలు చేశారు.  2035 నాటికి 43%, 2045 నాటికి 60 శాతం (2019 నాటితో పోల్చితే) తగ్గించ గలిగితే గానీ 2050 నాటికి అనుకున్న లక్ష్యం నెరవేరదు. సముద్రపు అంచుల్లో వున్న దీవులు దీనిపై గట్టిగా పట్టుబట్టడం వల్ల తీర్మానాన్ని పకడ్బందీగా మార్చవలసి వచ్చింది.

అలాగే ఆఫ్రికా దేశాలకు అభివృద్ధి చెందిన ఐరోపాఖండ ధనిక దేశాలు చేయవలసిన ఆర్థిక సహాయంపై కూడా చర్చలు సుదీర్ఘంగా నడిచాయి. అంతే గాక వచ్చే కాలమంతా శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా విషవాయువులు వదలని సాంకేతికతా పురోగమన దశగా వర్ణించబడాలనే చర్చ కూడా నడిచింది.

గతంలో అనుకున్నట్టు సంవత్సరానికి 100 బిలియన్ల డాలర్ల సహాయనిధి చాలదు గాబట్టి నష్టపరిహార నిధిగా అభివృద్ధి చెందిన దేశాలు 4.31 ట్రిలియన్ల డాలర్లు 2030 నాటికి సమకూర్చాలని కూడా తీర్మానించడం విశేషం. పర్యవసానంగా అప్పటికప్పుడే 750 మిలియన్ డాలర్లు  జమ కావడం మరీ విశేషం.

భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగాల పనితీరు ఈ లక్ష్యాలకు అనుకూలంగా నడిస్తేనే ఇదంతాసాధ్యపడుతుందని తేల్చడం కూడా హర్షించదగ్గ విషయం. అంటే సమాజ సమతుల్యత దిశగా అభివృద్ధి జరిగితేనే ఇది సాధ్యపడుతుందని అంగీకరించినట్లే అనుకోవల్సి వస్తోంది . నిజమైతే ఇంతకన్నా కావల్సింది లేదు.

ప్రతికూలాంశాలు

 మానవ మనుగడ జీవ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ అనేవి న్యాయమైన సమాజాభివృద్ధిపై ఆధారపడి వుంటాయని పూర్వకాలంలో గ్రీకు తత్వవేత్తల నుంచి, మన బుద్ధుడు మహావీరుడు దాకా ఎంతో మంది జ్ఞానులు అనేక రూపాల్లో ప్రచారం చేశారు. కానీ ఆధునిక మానవుల చేష్టల్ని చూస్తుంటే వారిని “హోమో సేపియన్స్” అనడమే తప్పనిపిస్తోంది .యంత్ర యుగం మొదలై పారిశ్రామిక విప్లవం పలు మలుపులు తిరిగింది. మతమౌఢ్యం, గుత్త వ్యాపారం జమిలిగా పెనవేసుకొని అభివృద్ధి చెందిన దేశాలను వలసరాజ్యాలుగా మార్చాయి. ధనస్వామ్యం సామ్రాజ్య వాదంగా పెచ్చటిల్లి యుద్ధాలకు, మారణ హోమానికి, ఆయుధాలు విస్తరణకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే 19 శతాబ్దంలో కారల్ మార్క్స్, ఫెడరిక్ ఎంగిల్స్ పర్యావరణ పరిరక్షణ సమాజ సమతుల్యత పై ఆధారపడి వుందని శాస్త్రీయంగా విశ్లేషించారు. ఈ క్రమంలో ఫ్రాన్స్, రష్యా దేశాలు తర్వాత చైనా వంటి దేశాలు దాన్ని కొంత ఆచరణలో పెట్టాయి. ఉత్తర అమెరికాతో సహా ప్రపంచంలో సమాజ సమతుల్యత ప్రాతిపదికన అనేక మార్పులు వచ్చాయి.

అయితే తర్వాత ఒక్క క్యూబాలో తప్ప మిగిలిన దేశాల్లో మళ్ళీ ధనస్వామ్యం పైకి లేచింది. బడా బడా ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ విధ్వంసాన్ని అనివార్యమైందిగా ప్రవచించడం మొదలు పెట్టాయి. ఈ మలుపులోనే పర్యావరణ పరిరక్షకులు 20వ శతాబ్దం ప్రారంభం నుండి వాతావరణ మార్పులకు మూలాలను వెతికసాగారు. అయితే అంతులేని దోపిడీలో ప్రపంచ ఛాంపియన్ అనిపించుకుంనటున్న అమెరికా వీరి వాదనల్ని, ఆందోళనల్ని ఏ మాత్రం లెక్క చేయడం లేదు. మొన్నటి బుష్, నిన్నటి ట్రంప్ ప్రభుత్వాలు దీనికి ఉదాహరణలు. శిలాజ ఇంధనాల వ్యాపారంలో బలిసిపోయిన అరబ్బు దేశాలను కూడా ఈ దేశాల వారు తమ గుప్పిట్లో పెట్టుకోగలిగారు. ఐక్యరాజ్యసమితి ఆదేశాలకు, సూచనలకు ఏ మాత్రం విలువ లేకుండానూ మార్చేసారు. వీరు ఏ కట్టుబాట్లకు లొంగరు. ఇప్పుడు భారత్, దక్షిణ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి దేశాల్ని కూడా తమ కౌగిట్లోకి ఇముడ్చుకోగలిగారు. పైకి మాత్రం పర్యావరణ సూక్తులు వల్లిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గత మూడు దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి, దాని ఉపాంగాలు వాతావరణ సంక్షోభ పరిష్కారాలపై చర్చలు జరుపుతున్నాయి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ -28 వీటిలో ఇటీవలిది. గత శతాబ్ద కాలంలో శిలాజ ఇంధనాలను అడ్డు అదుపు లేకుండా వ్యాపార వనరుగా మార్చుకొని అభివృద్ధి చెందిన దేశాల్ని కూడా తమపై ఆధారపడేలా చేసుకొన్నన “ఐక్య సౌదీ ఎమిరేట్స్( అయిదు రాచరిక వ్యవస్థల కలయిక) నీడలో ఈ సమావేశాలు జరగడం వింతల్లో కెల్లా వింత!  ఈ గుంపుకు అధ్యక్షుడిగా ఆ దేశ పారిశ్రామిక మంత్రి “సుల్తాన్ అహ్మద్ ఆల్ జజర్” ను గుర్తించడం మరీ వింత! ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద శిలాజ ఇంధనాల అబుదా బై ఆయిల్ కంపెనీకి యజమాని ! ఇక ఈ స్థానంలో కూర్చోవడానికి ఆయనకున్న ఏకైక క్వాలిఫికేషన్ఏమంటే ” టెక్నాలజిస్ట్ గా” తన సొంత నగరమైన మదసార్ ను బొగ్గు పులుసు వాయువు లేని ప్రాంతంగా మార్చడం! ఈయన బడుగు దేశాల నష్టపరిహార నిధికి భూరి వసూళ్లు చెయ్యగలడట! తన లాంటి అనేకమంది శిలాజ ఇంధన దొరల్ని ఇందులో భాగస్వాముల్ని చెయ్యగలడట!

కానీ ఆయన మాత్రం మనసులో వున్నది దాచుకోకుండా “వెంటనే శిలాజ ఇంధనాల్ని తగ్గించలేమనీ, మనిషి మళ్ళీ కొండ గుహల నాగరికత లోకి వెళ్ళలేడని” కుండబద్దలు గొట్టి చెప్పాడు! తానైతే ఉప్పూనిప్పుగా వున్న అమెరికా చైనాలని కలపగలనని చెప్పుకొచ్చాడు ! దాన్ని గుర్తించి తనను అధ్యక్షుడిగా పెట్టుకొన్నందుకు 194 దేశాలకు కృతజ్ఞతలు తెలిపాడు. తన నాయకత్వ ప్రయోజనం భవిష్యత్ సి ఓ పి ల్లో తెలిసి వస్తుందని బడాయికి కూడా పోయాడు. ఈయన ఏం చేస్తాడో 2025 దాకా వేచి చూద్దాం ! ఇప్పుడు జరగాల్సిదేమంటే 2025 నాటికి ప్రతి దేశం వాతావరణ పరిరక్షణకనుకూలంగా నిర్దిష్ట పథకాలను రూపొందించుకోవాలి. అన్ని దేశాలు ఈ లక్ష్యానికి కట్టుబడి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా విషవాయువులని విస్తరింపజేసే బొగ్గువాడకాన్ని, తర్వాత పెట్రోలియం వాడకాల్నీ నెమ్మదిగా తగ్గిస్తూ పోవాలి. తమ ప్రాంతానికి తగిన ప్రణాళికల్ని – ముఖ్యంగా ఆహార భద్రత, బెట్టకు ముంపుకు తట్టుకునే పంటల ఆవిష్కరణ వ్యాప్తి జరగాలి. ప్రభుత్వ విధానాలన్నీ పర్యావరణ హితంగా వుండాలి. అప్పుడే ఆశయాలకు ఆచరణకు కుదురుతుంది. ఒక్క అడుగయినా ముందుకు వెయ్యగల్గుతాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *