గబ్బిలం అరిష్టమా?
– యుగంధర్ బాబు
అదేదో సీరియల్ లో పాము మనిషిగా మారిపోతుంది. మనిషి పాముగా అయిపోతాడు. నాగమ్మ .. శ్వేతనాగు… ఇలా రకరకాల పేర్లతో రకరకాల సినిమాలూ, సీరియళ్ళూ! అసలు మనిషిగా పుట్టిన వాళ్లు కనీసం మనిషిగా మారడానికే ప్రయత్నం చేయడం లేదు కానీ జంతువుల్ని మాత్రం మనుషులుగా మార్చేస్తున్నారు!
ఇలా జంతువులు మనుషులుగా మారే కథల్లో ముందంజలో వుంటుంది ఒక జీవి. అదే అమాయక ప్రాణి గబ్బిలం !అన్ని దేశాల జానపద కథల్లో గబ్బిలం మనిషిగా మారిపోవడం, రక్తపిశాచి (డ్రాకులా) గావడం షరా మామూలన్నట్టు జరుగుతుటుంది. సినిమాల్లో గబ్బిలం మనుషిగా (బాట్ మ్యాన్) అవతారమవుతుంటుంది. రకరకాల కథల్లో కార్టూన్లలో, సినిమాల్లో గబ్బిలాన్ని విలన్ గా చేయడంలో మన వాళ్ళు రాటుదేలి పోయారు. మన జానపదుల ప్రకారం గబ్బిలం మనిషిగా మారే ప్రయత్నం చేస్తూ మధ్యలో ఆగిపోయిందట! అందు వల్ల అది చాలా అసంతృప్తిగా వుంటుందట. కసి పెంచుకొని ఎప్పుడూ మనుషులకు కీడుచేస్తూ వుంటుందట!

అలాంటి గబ్బిలం మన ఇంట్లో ప్రవేశిస్తే ఏమవుతుంది? ‘ఏమవుతుంది ఎత్తి పడేస్తే రెండు చెక్కలవుతుంది’ అంటాడు రమణారెడ్డి గుండమ్మ కథలో! వస్తే ఏమీ కాదు. కానీ ఏదో, అదేదో అయిపోతుందని రకరకాల కథనాలు, భయాలు మనల్ని చుట్టుముడుతున్నాయి.ఈ వైజ్ఞానిక యుగంలో సైతం దోషాలనీ, శాంతులనీ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.
అది పగలు గానీ, రాత్రి గానీ గబ్బిలం ఇంట్లోకి వస్తే పరమ అరిష్టం! ఈ బక్క పిట్ట మహా ప్రమాదహేతువు. మృత్యుహేతువు. అది అశుభం. వైవాహిక జీవితంలో ఇబ్బందులు కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. గబ్బిలం దూరితే ఇల్లు ఖాళీ చేసి, తాళం వేసి పోవడం ఉత్తమం! గృహాన్ని చీకటి చేసి పాడు పెట్టడం మంచిది. దోష పరిహారార్థం శాంతులు చేయాలి. ఇత్తడి బిందెలు దానాలివ్వాలి. (బతికి పొయ్యాం బంగారపు బిందెలన లేదు!) ఉదకశాంతి చేయాలి. ఇలా రకరకాల నమ్మకాలు గబ్బిలం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి.
ఇందులో మళ్లీ ఇంకో మినహాయింపులు! ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి అలా చుట్టపు చూపుగా గబ్బిలం వచ్చి పోతేపర్వాలేదు. అల్లుడి లాగా మళ్లీ మళ్లీ వస్తే (ఒకే నెలలో 4-5 సార్లు వస్తే!) ఏదో చెడు మూడబోతున్నట్టే. అంటే గబ్బిలాలకు భవిష్యత్తును తెలుసుకొనే దివ్య శక్తి కూడా వుందన్న మాట. అలాంటి జ్ఞానమే వుంటే అది బ్రహ్మజ్ఞాని కదా! మరి అది వస్తే దోషం ఎలా అవుతుంది?ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు మనం అడగ్గూడదు.అసలు గబ్బిలం ఇంట్లోకి వస్తే దేనికి కీడు? అది ఇంట్లోకి వస్తే వేటాడి వెంటాడి చంపేస్తున్నాము కదా దానికే కీడు!
ఇన్ని భయాలు గబ్బిలం చుట్టూ ఎందుకంటే అది నల్లగా వుంటుంది. రెక్కలు అంటుకుపోయి విచిత్రంగా కనిపిస్తుంది. దానివి చిన్న చెవులు చిన్న కళ్ళు. తలకిందులుగా చూరు పట్టుకొని వేలాడుతుంటుంది. చీకటితో గబ్బిలానికి అనుబంధం. అది రాత్రి పూటే సంచరిస్తుంది అదేమీ అంత అందంగా ఉండదు. ఉడత లాగా దాని పైన ముచ్చటైన గీతలుండవు. కుందేలు లాగా పెద్ద పెద్ద కళ్ళుండవు, రామచిలుక లాగా రెక్కలు లేవు. కనీసం టీవీలో ఏ తారనో ఏ ప్రకటనలోనో చూసైనా ముఖాన్ని ఫెయిర్ గా, లవ్లీగా మార్చుకోవాలన్న బుద్ధి గబ్బిలానికి లేదు.
మరి గబ్బిలం గురించి ఏ మంచీ చెప్పుకొనే వాళ్లు కూడా లేరంటారా? గబ్బిలాలు సహజంగా దేవాలయాల్లో, పెద్ద పెద్ద మసీదుల్లో నివసిస్తాయి (వాటికీ భక్తి తక్కువేమీ కాదు మరి) గాబట్టి అదృష్టాన్ని తెస్తాయని కొంతమంది భావిస్తారు. అవి వస్తే సంపద వస్తుందని భావించే వాళ్ళు కూడా వున్నారు నిజానికి గబ్బిలాలు అమాయక జీవులు. అవి క్షీరదాలు. బిడ్డలను కని, పాలిచ్చి, పెంచే జంతువులు. పక్షులు కావు. (జాషువా భాషలో గబ్బిలం “బిడ్డల గని, పాలిచ్చెడి పుల్గు దొరసాని!”) వాటి కాళ్లు చాలా బలహీనంగా వుంటాయి. కాబట్టి భూమిని గట్టిగా నెట్టి పైకి ఎగిరే శక్తి లేక, సరిగా నిలబడడం చేతకాక అలా చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ వుంటాయి. వేలాడుతూ, వేలాడుతూ గాలిలోకి జారిపోవడం దానికి చాలా సులభంగా వుంటుంది. పగటిపూట తనని తినడానికి పెద్ద పక్షులు వస్తాయని భయప రాత్రుళ్ళు వేట ప్రారంభిస్తాయి. చీకటి లోకి శబ్ద తరంగాలు పంపించి, ఎదుటి వస్తువుల్ని అంచనా (ఎకో లొకేషన్) వేసుకొని వేటాడుతాయి. ఈ లక్షణాలు అడవిలో వాటి మనుగడ కోసం చేసే కేవలం అనుసరణలు.
అలా ప్రయాణం చేసేటప్పుడు దారితప్పి పొరపాటున మన ఇంట్లోకి వస్తే వాటిపై జాలి చూపండి. వాటితో అనుబంధం తెలుసుకోండి. అంతేగాని గాబరా పడి చంపేయాలని ప్రయత్నించకండి. వాటిని అర్థం చేసుకోండి.
“నాదు కన్నీటి కథ సమన్వయము సేయ; ఆర్ద్ర హృదయంబు కూడ కొంత అవసరంబు” అంటాడు గబ్బిలం కావ్యం రాసిన గుర్రం జాషువా. ఆయన తన సందేశాన్ని శివుడికి వినిపించేందుకు కైలాసం పంపడానికి గబ్బిలాన్ని ఎంచుకున్నాడు. “జీర్ణకుటీరములలో నిరంతరము దర్శనమిచ్చు గబ్బిలమునతనికి సందేశ హారిగా పరిగ్రహించితిని” అంటాడు.
గబ్బిలాలు పర్యావరణపోషణలో అద్భుతమైన జీవులు. మొక్కల పరాగ సంపర్కం చేయడం, విత్తనాలు వ్యాప్తి చేయడం, కీటకాల జనాభాను నియంత్రించడం ద్వారా ప్రకృతిలో గబ్బిలాలు కీలక పాత్ర పోషిస్తాయి. చాలామంది రైతులు, తోటమాలులు గబ్బిలాల ఉనికికి సంతోషిస్తారు. ఎందుకంటే అవి పురుగుమందుల అవసరాలను తగ్గించడంలో సహాయపడతాయి. మామిడి, కొకువా, అరటి లాంటి మూడు వందల రకాల వృక్షాలుతమ విత్తనాల వ్యాప్తికి గబ్బిలాలపై ఆధారపడతాయి. గబ్బిలం లేకపోతే ఈ చెట్లు ఉనికి అనుమానమే. అన్నట్టు ఒక గబ్బిలం రోజుకు రెండు వేల దోమలు తింటుందట! కొందరైతే ఈ మధ్య గబ్బిలాల పెంపకం కూడా మొదలుపెట్టారట! గబ్బిలాలు మనకంటే ముందు నుంచే ఈ భూమి మీద నివసిస్తున్నాయని పరిశోధకులు చెపుతున్నారు. ఇంతటి సహాయకారులైన గబ్బిలాలను ప్రేమిద్దాం. కాపాడుకుందాం. ఈ పర్యావరణ రక్షకురాల్ని అభినందిద్దాం !మన చుట్టూ వున్న సహజ ప్రపంచంలోని అద్భుతాలను ఆస్వాదిద్దాం!
చాలా బాగుంది సార్
Superb kanna .saili chamathkaaramgaa aalochinche vidham gaa undi.
యుగంధర్ సర్ చాలా చక్కగా వివరించారు.