“చారిత్రక విభాత సంధ్యల
మానవ కథా వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించినదే పరమార్ధం ?”
అంటూ శ్రీశ్రీ అంతిమంగా “ఏ వెలుగులకీ ప్రస్థానం” అని ప్రశ్నిస్తాడు. నిజంగానే మానవ సమాజం వెలుగుల వైపే ప్రయాణం సాగిస్తోందా? మొత్తంగా ప్రస్తుత కాలపు మానవజాతి ఆలోచనలు ఎలా వున్నాయి? ఏ దేశాల మానవుల భావ స్రవంతి ఎటువైపు ప్రవహిస్తోంది ? మళ్లీ పొరలు పొరలుగా విడదీస్తే ఒకే దేశంలోని భిన్న సామాజిక వర్గాలు వేటికవిగా ఏ ధోరణిలో వ్యవహరిస్తున్నాయి? అసలు నేటి సమాజం ఏం కోరుకుంటోంది? మానవుల ఆలోచనా ధోరణులను శాసిస్తున్న అంశాలేవి? ఇదంతా పెద్ద పెద్ద పండితులకు సైతం ఎంత తల పగలగొట్టుకున్నా అంతుపట్టని వ్యవహారం. దీని చుట్టూ ఎన్ని చర్చోపచర్చలు జరుగుతున్నాయో చెప్పలేం. ఈ పండిత చర్చలేమైనా ప్రజానాడిని పసిగట్టాయా అనేది కూడా చెప్పలేం.
అయినా మనిషి ఔత్సాహికుడు కదా! తనను గురించి తాను నిత్యం శోధించుకుంటూనే వుంటాడు. తన నడకను తానే పరామర్శించుకుంటూ వుంటాడు. తనపై తాను ఒక అంచనాకు వచ్చేందుకు విశ్వప్రయత్నం చేస్తూనే వుంటాడు. అతడు పట్టువదలని విక్రమార్కుడు మరి!
ఇలాంటి ప్రయత్నమే ఇటీవల అమెరికాలోని “ప్యూ పరిశోధనా కేంద్రం” ( PEW Research Centre) చేసింది. 2024 జనవరి – మే మాసాల మధ్య 35 దేశాల్లో అదొక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం భారతదేశంలోని 81 శాతం ప్రజలు తమ దేశ ప్రధాని తమ స్వంత మత విశ్వాసాలను దృఢంగా కాపాడే వాడుగా వుండాలని భావిస్తున్నారట! ఈ ధోరణి కొంచెం అటూ ఇటూ దక్షిణాసియా, ఆగ్నేయసియా, ఆఫ్రికా దేశాల్లోనూ ఇలానే ఉందట. ఇండోనేషియా, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో అయితే ఇది మరింత తీవ్రంగా కనిపిస్తోందట. ఆశ్చర్యంగా అమెరికాలోనూ ఇంతగా గాకున్నా 64% ప్రజానీకం ఇదే అభిప్రాయంతో వున్నారట. యూరప్ దేశాల్లో, స్కాండనేవియన్ దేశాల్లో మాత్రం తమ నాయకుడి మత విశ్వాసాల పట్ల ప్రజలకు పెద్దగా పట్టింపు లేదట. జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలలో కూడా స్కాండినేవియన్ ధోరణే కనిపిస్తోందట!
దీన్నెలా మనం అర్థం చేసుకోవాలి? ఒకవైపు శాస్త్రజ్ఞానం, దాంతోపాటు భౌతికవాదం ఈ శతాబ్దంలో వూహాతీతంగా విస్తరించింది. మానవుడి లౌకిక అవసరాలన్నిటిని దాదాపుగా నేడు సైన్సు తీర్చగలుగుతోంది. ప్రపంచం పట్ల, ప్రకృతి పట్ల మనకున్న ప్రశ్నలన్నిటికీ అది సమాధానాలు చెప్పగలుగుతోంది. గతం కంటే ఎప్పటికన్నా విద్యావకాశాలు సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి కూడా ఇప్పుడందుబాటులో వున్నాయి. సామాజిక మాధ్యమాల విశ్వరూపం, సమాచార విస్ఫోటనం ఇక సరే సరి! ఇవన్నీ మనిషిని మతమార్మిక భావబంధాలనుంచి ఎంతో కొంత విముక్తి చేయాలి కదా! వ్యక్తిగత విశ్వాలనటుంచి కనీసం రాజ్యాన్ని మతాన్ని దూర దూరంగా పెట్టాలన్న ఆధునిక ప్రజాస్వామిక దృక్పథాన్నయినా వొంట పట్టించుకొని వుండాలి కదా! దీనికి భిన్నంగా సగటు పౌరుడు మరింత ముడుచుకుపోతున్నాడెందుకని?
ఇలా చూస్తే మెజారిటీ మానవ సమాజం ఇంకా నాగరికతా తొలి సంధ్య లోనే వుందనిపిస్తుంది. కేవలం సైన్సూ, సంపదలు పెరిగినంత మాత్రాన ఆధునిక భావజాలం విస్తరిస్తున్న పూచీ ఏమీ లేదనిపిస్తుంది. ఇదే నిజమైతే అమెరికా, ఫ్రాన్స్ తో పోలిస్తే అంత సంకుచితంగా వుండేది కాదు. బ్రిటన్, స్వీడన్తో పోలిస్తే మితవాదిగా మిగిలిపోవలసి వచ్చేదీ కాదు.
సామాజిక ఉద్యమకారులకు, సంస్థలకు ఇదో పెద్ద సవాలు. సైన్సు ఫలాలను అనుభవిస్తున్నంత మాత్రాన జనానికి శాస్త్రీయ దృక్పథం ఏమీ జీవధర్మంగా మారిపోదు. సైన్సును నిత్య జీవితానికి అన్వయించుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. సైన్సు శాస్త్రంగా అభివృద్ధి చెందితే చాలదు. అది జీవితంలోని అన్ని పార్శ్వాలకు విస్తరించినపుడే భావజాలం తీవ్రంగా ప్రభావితమవుతుంది. సమానత్వం, సామాజిక న్యాయం జమిలిగా నిలదొక్కుకున్నాకే మానవ ఆలోచనలు అటూ, ఇటూ వొరిగి పోకుండా నిటారుగా నిలబడగల్గుతాయి. ఒక్కోసారి బండి వెనక్కు తిరగనూ వచ్చు. దీన్ని మనం ఓపిగ్గా అర్థం చేసుకోవాల్సి వుంటుంది. దీర్ఘకాలిక లక్ష్యంతో, పట్టుదలతో పని చెయ్యాల్సి వుంటుంది, పోరాడాల్సి వుంటుంది!
Read more: ఏ వెలుగులకీ ప్రస్థానం?
It is very useful to all. Valuable information was given we must promote all schools and collehes