సైన్సు సమాజము పుస్తక సమీక్ష

సైన్సు సమాజం అనేవి రెండు విడి విడి అంశాలు కావు. ఈ విషయం చాలామందికి అవగాహన ఉండవచ్చు. కానీ సైన్సు సమాజం మధ్య సంబంధం లోతైనదనీ ఆ రెండూ చాలా సూక్ష్మ అంశాల వల్ల పరస్పరం ప్రభావితం చేయబడతాయని ప్రత్యేకమైన అంశాన్ని ఈ పుస్తకంలో లోతుగానే విశ్లేషించారు రచయిత సుందర రామన్.

ఈ పుస్తకం కేవలం సైన్సు సాంస్కృతిక కార్యకర్తల కోసం మాత్రమే ఉద్దేశించింది కాదు. సైన్సు ప్రభావితం చేయబడే అనేకానేక సామాజిక అంశాలను అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పుస్తకం ఒక దిక్సూచి, కరదీపిక. విద్య, ఆరోగ్యం, సంస్కృతి, నైతికత, పౌర సమాజం లాంటి అనేక సామాజిక అంశాలని సైన్స్ కూడా తన పద్ధతిలో మంచి పరిష్కారాలు ఎలా చూపగలదో సుందర రామన్ అనేక వివరణలు, ఉదాహరణలతో కూడా చూపించారు. ఇదే నిత్యజీవితంలో శాస్త్రీయ అవగాహనకు అర్థం.

సైన్సు అంటే కొన్ని నియమాలు, సాంకేతిక విజ్ఞానం మాత్రమే కాదు. దానిని ప్రభావితం చేసే సామాజిక సిద్ధాంతాలు, తాత్వికత కూడా ఉంటాయి. అవి సాంస్కృతిక రూపంలో సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. అవి ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ ప్రజల జీవితాన్ని ఎలా ప్రభావితం చేయగలవో వివరించిన చాలామంది సామాజిక తత్వవేత్తల సిద్ధాంతాలను సంక్షిప్తంగా ఈ పుస్తకంలో వివరించారు రామన్. రాజ్యానికి, పౌర సమాజానికి, సంస్కృతికి మధ్య ఉన్న సంబంధాలను లోతుగా విశ్లేషించిన గ్రాంసీ సిద్ధాంతాలను ఈ పుస్తకంలో రచయిత ప్రస్తావించడం చాలా బావుంది. అలాగే జ్ఞాన- విజ్ఞాన సంబంధాలు అధికారానికి ఎలా సహకరిస్తాయో వివరించారు. సైన్స్, చట్టం, వైద్యశాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం లాంటి శాస్త్రాలను అధికార సంబంధాలుగా పాలక-ధనిక వర్గం ఎలా మలచుకుంటుందో ఫ్రెంచ్ తత్వవేత్త మైఖేల్ ఫౌకల్ద్ పరిశోధనలను కూడా ప్రస్తావించారు రచయిత. మన నిత్య జీవితంలో వాడుతున్న ప్రసార సాధనాలు మనుషుల ఆలోచనలనూ, మెదళ్లను ఎలా మెలితిప్పగలవో అమెరికన్ భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్ కి పరిశీలనలను కూడా ఈ పుస్తకంలో సుందర రామన్ ప్రస్తావించడం మనకు సైన్సు-సామాజిక అంశాల సంబంధం పట్ల లోతైన అవగాహన కలిగిస్తుంది. సైన్సు తనంతట తాను స్వయం ప్రతిపత్తి గల విషయం కాదని ఈ సిద్ధాంతాలు మనకు చెబుతాయి. సైన్సు ఎన్నెన్ని విషయాల వల్ల ప్రభావితం చేయబడుతుందో, దుర్వినియోగం చేయబడుతుందో, మార్పుకి గురి అవుతుందో ఒక సిద్ధాంత జ్ఞానంగా అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పుస్తకం ఒక మంచి సంక్షిప్త పరిచయం అందిస్తుంది.

ఈ పుస్తకం విడివిడిగా కనిపించే అనేక సామాజిక అంశాల మధ్య సంబంధాన్ని చక్కగా వివరించింది. విద్యకి సంబంధించి డ్రాపౌట్స్ కి కారణాలు వివరించడం ఇందుకు చక్కని ఉదాహరణ. అందరికీ అవకాశం ఇవ్వని ఈ రుగ్మతలకు మూల కారణాలు ఈ అసమాన సమాజంలోనే ఉన్నాయని ఈ పుస్తకం ప్రస్తావించింది. మన సమాజంలో అవకాశాలు అందుకోలేని పేద-మధ్యతరగతి పిల్లల అల్పత్వాన్ని స్కూళ్లు ముందే నిర్ణయించి పెడతాయి. ఆ విధంగా వారు క్రింది సామాజిక శ్రేణిలోకి వెళ్లిపోయే పరిస్థితిని సమాజమే కల్పిస్తుంది. దీనినే “నిర్ణయాత్మక ప్రభావం” అంటారనే గ్రాంసీ సూత్రాన్ని దీనికి వివరణాత్మక ఉదాహరణగా ప్రస్తావించారు రచయిత. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు, 60 వేలమంది ఉపాధ్యాయుల మీద నిర్వహించిన కోల్మన్ రిపోర్టు శాస్త్రీయ అధ్యయనాన్ని ఈ అంశాన్ని నిర్ధారించడం కూడా ఇందుకు ఉదాహరణగా రచయిత ప్రస్తావించడం చాలా సందర్భోచితం.

అలాగే ఆరోగ్య రంగంలో సైన్స్ పేరుతో జరుగుతున్న మోసం గురించి కూడా విపులంగా ప్రస్తావించింది ఈ పుస్తకం. పౌష్టికాహార వ్యాధులు, జీవన శైలి వల్ల వచ్చే వ్యాధుల చుట్టూ సైన్సు ముసుగులో లక్షల కోట్ల రూపాయల బహుళజాతి కంపెనీల వ్యాపారాన్ని ఈ పుస్తకంలో ప్రశ్నిస్తారు సుందర రామన్. ఆరోగ్య సేవలు,దానాలు లాంటి పథకాల పేరుతో ప్రజలు ఎలా మోసపోతున్నారో, ఆరోగ్యం తమ హక్కుగా ఎలా కోల్పోతున్నారో చాలా ఉదాహరణలతో చక్కగా వివరించారు. విద్యలో, వైద్యంలో, పౌర సమాజంలో జరిగే మోసాలకు సైన్సు ఒక్క సాంస్కృతిక పనిముట్టుగా వాడబడుతుందనే హెచ్చరిక కూడా చేస్తారు మనల్ని రచయిత. అయోడైజ్డ్ ఉప్పు, అందాల పోటీలు, రుచులు-అభిరుచులు, టీవీ, వాషింగ్ మెషిన్ లాంటి వినియోగ వస్తువులు ఈ మాయల వలలో ఒక భాగమేననీ, దీనికి సైన్స్ ఒక సాంస్కృతిక ఎరగా ఎలా వాడబడుతుందో ఉదాహరణలతో వివరించారు సుందర రామన్.

సైన్స్ చుట్టూ ఉండే రాజకీయాల గురించి ఈ పుస్తకం విపులంగానే చర్చించింది. సైన్స్ పరిశోధన-సిద్ధాంత నిర్మాణంలో సామాజిక-రాజకీయ-సాంస్కృతిక అంశాల ప్రభావాన్ని చాలా విపులంగానే చర్చించారు రచయిత. ప్రభుత్వ, వాణిజ్య సంస్థల ఆర్థిక సహాయంతో నడిచే సైన్స్ సంస్థల నిర్వహణ మీద వాటి రాజకీయ జోక్యాన్ని గమనించాలని చెబుతుంది పుస్తకం. అంతేకాకుండా సైన్సు అభిమానులు, కార్యకర్తలు ఈ సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడే బాధ్యతను కూడా గుర్తెరగాలనీ మనకు గుర్తు చేస్తారు రచయిత. మత చాందసత్వం తలెత్తిన ప్రతి దేశంలోనూ మొట్టమొదట బలయ్యేది, దుర్వినియోగం చెయ్యబడేది కూడా సైన్సేనని హెచ్చరిస్తారు. ప్రజల మీద జరిగే దోపిడీ కంటికి కనబడకుండా అణచివేత కొనసాగించేందుకు మతం సైన్సు-సాంకేతిక శాస్త్రాల ముసుగుని కప్పుకుంటుందనీ, మనం ఈ విధమైన అప్రమత్తత కూడా ప్రజలకి నేర్పించాలని గుర్తు చేస్తారు సుందర రామన్.

సైన్స్ కి, మతానికి మధ్య లౌకిక తత్వం ఒక మధ్యే మార్గం. శాస్త్రీయ దృక్పథం గల సమాజం కోసం చేసే ప్రయాణంలో లౌకిక తత్వం ఒక మజిలీ. లౌకిక తత్వానికి రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి, మతసామరస్యం. రెండవది, మత రహిత వైజ్ఞానిక మార్గం. సైన్సు సమాజ నిర్మాణంలో ప్రజలను భాగం చేసేవాళ్లు మొదటిది వారికి పరిచయం చేసి, రెండో దాన్ని ఒక దృక్పథంగా ప్రజలకు అలవాటు చెయ్యాలని సుందర రామన్ మనకు దిశా నిర్దేశం చేస్తారు.శాస్త్రీయ దృక్పథం ప్రజల జీవన విధానం కావాలి. అది లోపించమే అన్ని అనర్ధాకూ మూలం. చివరికి శాస్త్రజ్ఞులు కూడా వ్యక్తిగత, సామాజిక పరమైన అంశాలను కూడా శాస్త్రీయ పద్ధతులతో ఆకలింపు చేసుకోలేకపోవడం వల్లే అహేతుకత కలిగి ఉంటున్నారనే వివరణతో ఒక సంక్లిష్టమైన ప్రశ్నకు మనకు సులువుగా సమాధానం అందించారు సుందర రామన్. సామాజిక ఆచరణలో శాస్త్రీయదృక్పథాన్ని మేళవిండమే దీనికి విరుగుడు.

ఈనాడు సైన్సు ఇంత అభివృద్ధి చెందినా నమ్మకాలు, మత విశ్వాసాలు,మత సాంస్కృతిక మేళాలు కూడా పెరుగుతున్నాయి. ఈ తిరోగమన సామాజిక వాతావరణానికి కారణాలను కూడా ప్రస్తావిస్తూనే, ఇది సైన్సు మరియు శాస్త్రీయ సమాజ అభివృద్ధికి ఎంత అవరోధము ఆలోచన ఆలోచించాలని బాధ్యతను కూడా గుర్తు చేస్తారు రచయిత. సైన్స్ ని ప్రచారం చేసేవారు విన్నూత్నమైన,శక్తివంతమైన ప్రత్యామ్నాయాలు రూపొందించాలి. ఇది మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సైన్సు అనే ప్రచారం కన్నా భిన్నమైనది అని స్పష్టంగా మనం గుర్తించగలగాలి.  సైన్సు మూలాల గురించి చెప్పే మన వివరణలు ప్రజామోదం పొందాలి. సాధారణ ప్రజలు అర్థం చేసుకునే విధంగా సైన్స్ ని మానవీకరణ చేయాలి. సైన్స్ ని ఒక సిద్ధాంతంగా, భావజాలంగా అన్ని రంగాలకు తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యాలి. మతం /నమ్మకాల వ్యవస్థ స్థానంలో నిత్య జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకి సైన్సు వివరిస్తుంది,పరిష్కరిస్తుంది అనే సంగతి మనకు తెలుసు. అదే నమ్మకాన్ని మనం ప్రజలకి కూడా కలిగించగలగాలి. అందుకు తగిన ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలు రూపొందించాలనే దిశా నిర్దేశం కూడా చేస్తారు సుందర రామన్.

ఒక సైన్సు కార్యకర్తగా, ఉద్యమకారుడిగా సుందర రామన్ పరిశీలన, విస్తారమైన అనుభవం ఈ పుస్తకం ప్రతిబింబిస్తుంది. సైన్స్ గురించి మరింత లోతైన అవగాహన పెంపొందించుకునాలని కోరుకునేవారు ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. ఎందుకంటే సైన్స్ చుట్టూ అల్లుకున్న అనేక సామాజిక సిద్ధాంతాల ప్రస్తావన,లోతైన అవగాహన ఈ పుస్తకం మీకు క్షుణ్ణంగా అందిస్తుంది.

One thought on “సైన్సు సమాజము పుస్తక సమీక్ష

  1. మొదటగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజా సైన్సు ఉద్యమ పుత్రిక జనవిజ్ఞాన పత్రిక ఆవిష్కరించిన సందర్భంగా అందరికీ విజ్ఞానాభినందనలు.
    జ వి వే రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డా.సి.హెచ్.రవికుమార్ గారు ప్రజా సైన్సు ఉద్యమ నాయకునిగా బాధ్యతగా లోతైన సమీక్ష చేసారు. దీన్ని చదివే ప్రతి ప్రజా సైన్సు ఉద్యమ కార్యకర్త స్ఫూర్తిని పొందే దిగా వుంది. డాక్టర్ రావిగార్కి హృదయపూర్వక ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *