సంపాదకీయం
విజ్ఞాన మొక్కటె నిలిచి వెలుగును
సమాజపు అవసరాలే విజ్ఞాన శాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించాయా లేక వైజ్ఞానిక ఆవిష్కరణలే సమాజానికి కొత్త అవసరాల్ని సృష్టించాయా? ఏ చారిత్రక సంధ్యలో ఏ ఆవిష్కరణలు ఏ అవసరాల కోసం వెలుగు చూసాయి? ఏ వైజ్ఞానిక కాంతిరేఖల ఫలితంగా చరిత్ర ఏ మలుపులు తిరిగింది? ఎలాంటి అవసరాలు, ఎవరి అవసరాలు అంతి మంగా ఈ కథ నడిపిస్తున్నాయి? ఈ ప్రక్రియలో సామాన్యుడి పాత్ర ఎంత? అతనికి దక్కిన ఫలమెంత? చరిత్రలో అసలు సైన్సుకు సామాన్యుడికి మధ్య వున్న సహృద్భావ సామరస్యాలెంత? వైముఖ్య వైమనస్యాలెంత?
విజ్ఞానశాస్త్రం ప్రపంచపు రూపురేఖల్ని మార్చేస్తున్న కొద్దీ జేడి బెర్నాల్ నుంచి కోశాంబి దాకా ఈ ప్రశ్నల్ని చాలా సూటిగా లేవనెత్తుతూ వచ్చారు. కోశాంబి దృష్టిలో “ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరవడినందు వల్లే, మేధావులు మత వేదాంత చర్చల్లో కూరుకుపోయి శాస్త్ర జ్ఞానానికి దోహదం చేయనందు వల్లే భారత్ లాంటి దేశాలు ప్రగతి పథం ఎక్కలేకపోయాయి”. మరోవైపు బెర్నాల్ కథనం ప్రకారం “ఒకరోజు మనిషి కరువు కాటకాలకు బలి అయ్యాడు. నేడు సైన్సు తెచ్చే యుద్ధాలకు, వైపరీత్యానికి, నిరుద్యోగానికి బలవుతున్నాడు. సైన్సు క్రమంగా ప్రజలకు దూరమై తన పాపులర్ స్వభావాన్ని కోల్పోతోంది. అలాగే జనబాహుళ్యానికి సైన్సు స్పృహ లేకపోవడం మరో పెద్ధ సమస్య. దీనివల్ల అటు సైన్సుకూ, ఇటు మానవుడికీ ఇద్దరికీ తీవ్ర నష్టం జరుగుతోంది. వైజ్ఞానిక స్పృహ కొరవడినందువల్లే మనిషి కొత్త భ్రమల్లోకి, భయాల్లోకి, ఊహల్లోకి జారిపోతున్నాడు. మధ్యయుగంలోని మూఢనమ్మకాల్ని సంతరించుకుంటున్నాడు. రుజువు ఆధారిత సత్యానికి దూరంగా జరిగే కొద్దీ, ఏదో ఒక దాన్ని విశ్వసించి రావడంతో అది చివరకు మత దురహంకారానికి, ఫాసిజానికీ దారి తీస్తోంది”.
ఇప్పుడు మనం ఇలాంటి సందిగ్ధ సందర్భంలోనే నిలబడి ఉన్నాం. ఒకవైపు ఆధునిక శాస్త్ర ప్రగతి పట్టికలో మనస్థానమేదో దుర్భిణీతో చూసినా దొరకడం లేదు. చెప్పుకోదగ్గ ఏ గొప్ప ఆవిష్కరణా గత వంద ఏళ్లలో భారత దేశంలో జరగలేదు. ప్రపంచానికి మనం ఇచ్చిన వైజ్ఞానిక వెలుగుగా చూపుకోదగ్గది ఏ ఒక్కటీ మన దగ్గర లేదు. స్వాతంత్ర్యం తర్వాత ఈ రంగం పట్ల అలనాటి ప్రభుత్వాధినేతలకున్న స్పృహ, వారు నిర్మించిన పునాదులు సైతం క్రమంగా బీటలు బారుతున్నాయి. అన్నీ మన వేదాల్లో, పురాణాల్లోనే ఉన్నాయనీ, ఆ ఘనమైన వారసత్వాన్ని కాపాడుకోడమే మన పవిత్రాతిపవిత్ర కర్తవ్యమని చెప్పుకొంటూ మనల్ని మనం వంచించుకుంటున్నాం. మరో ప్రక్క ముచ్చటపడి రాజ్యాంగంలో రాసుకున్న శాస్త్రీయ దృక్పథానికి ఆధికారికంగానే వీడ్కోలు చెబుతున్నాం. “అసలు భారతదేశం పందొమ్మిదో శతాబ్దాన్నే దాటలేదు” అనిపించుకుంటున్నాం! ఆధునిక దృక్పథాన్ని అంటరానిదిగా చూసే దశకొస్తున్నాం. ఇక సైన్సు ఫలాలు సామాన్యులకు గగనకుసుమాలుగా మారి, విజ్ఞానశాస్త్రం వ్యాపారసరుకుగా అవతారమెత్తడంతో సగటు మనిషికి సైన్సు పట్ల నమ్మకం సడలమే గాదు, వ్యతిరేకతా పెరుగుతోంది. ఫలితంగా సైన్సు పునాదినే ఎద్దేవా చేసే వికారవాదాలు పుట్టుకొస్తున్నాయి.
“జనవిజ్ఞానం” ఈ సందర్భంలో వెలువడుతోంది. శాస్త్ర ప్రచారంతో సరిపెట్టక శాస్త్రీయ దృక్పథాన్ని సైతం అసిధారావృతంగా విస్తరింపజేయాలని మా ప్రయత్నం. సైన్సును గాఢాతిగాఢంగా ప్రేమిస్తూనే దాని సామాజిక కోణాన్ని లోతుగా చర్చకు పెట్టాలని మా ఆకాంక్ష. మానవ జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆధునిక దృక్పథం అల్లుకున్నప్పుడే ప్రగతి, ప్రజాస్వామ్యం దృఢంగా నిలదొక్కుంటాయని మా నమ్మకం. సముద్రానికి ఏతమెత్తుతున్నట్టన్పించినా, ఎదురీదడం మానవ సహజాతమనే విశ్వాసమే మమ్మల్నిలా నాలగు దశాబ్దాల నుంచి నడిపిస్తోంది. ఇప్పుడీ రూపంలో మీ ముందు నిలబెడుతోంది.
మా ప్రయత్నానికి స్నేహహస్తం అందించాలని శాస్త్ర, సామాజికరంగాల మిత్రులులందరినీ చేతులుచాచి ఆహ్వానిస్తున్నాము!
సంపాదకీయం సైన్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, మతం వల్ల ఏర్పడుతున్న సమస్యల నుంచి బయటపడితేనే సైన్స్ పురోగతి సాధ్యమని వివరించడం బాగుంది
“చెప్పుకోదగ్గ ఏ గొప్ప ఆవిష్కరణా గత వంద ఏళ్లలో భారత దేశంలో జరగలేదు. ప్రపంచానికి మనం ఇచ్చిన వైజ్ఞానిక వెలుగుగా చూపుకోదగ్గది ఏ ఒక్కటీ మన దగ్గర లేదు. స్వాతంత్ర్యం తర్వాత ఈ రంగం పట్ల అలనాటి ప్రభుత్వాధినేతలకున్న స్పృహ, వారు నిర్మించిన పునాదులు సైతం క్రమంగా బీటలు బారుతున్నాయి. అన్నీ మన వేదాల్లో, పురాణాల్లోనే ఉన్నాయనీ, ఆ ఘనమైన వారసత్వాన్ని కాపాడుకోడమే మన పవిత్రాతిపవిత్ర కర్తవ్యమని చెప్పుకొంటూ మనల్ని మనం వంచించుకుంటున్నాం.”
చక్కగా చెప్పారు. విదేశీ దిగుమతుల మీద ఆధారం తగ్గించుకుని, ఆత్మ నిర్భర భారత్ గా మన దేశం ఎదగాలంటే పరిశోధనాత్మక చదువులు, మనవైన ఆవిష్కరణలు ఎంతో అవసరం. ఈ దిశలో అడుగులు పడటానికి మీ ఈ “జన విజ్ఞానం” అనే ప్రయత్నం దోహదపడుతుందనీ, ఈ కృషి సఫలీకృతమవ్వాలనీ ఆశిస్తూ, మీ ఆలోచనకు అభినందనలు తెలుపుతున్నాను. జైహింద్.
chala chala chakkaga chepparu vyasamlo. enthasepu memu goppa madi goppa ani cheppukovataame saripotundi. vignana dishaga meeru chestunna krushi chala mechchukodaggadi. abhinandanalu