ఆడపిల్ల మన ఆశ, మన భవిష్యత్తు

“భారతదేశంలోని నేటి అత్యుత్తమ దృశ్యాల్లో ఒకటి ఏమంటే ఆడపిల్ల తన స్కూలు బ్యాగు వీపుపై పెట్టుకుని ఉదయం బడికి బయలుదేరడం”. ఏ విద్యాభిమానో భావోద్వేగంతో  చెప్పిన మాటలు కావివి. న్యాయశాస్త్రాన్ని కాచి వడపోసిన ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పులోని వాక్యమిది!

ఈ స్పృహ మనలో ఎంత మందికి వుంది?  మన విద్యారంగ పాలసీల నిర్ణేతలకు, ప్రభుత్వాలకు, సామాజిక ఉద్యమకారులకు, మేధావులకు మాత్రం ఏ మేరకుంది? ఇలా మనలందర్నీ గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నట్టుంది గదూ జస్టిస్ సుధాంశు దులియా గారి ఈ వ్యాఖ్యల్ని చూస్తుంటే! 

హిజాబ్ ధారణను తప్పనిసరి చేసిన కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వుల్ని, దాన్ని సమర్ధించిన హైకోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ తన అసమ్మతి తీర్పులో ఆయన  చేసిన ఈ వ్యాఖ్యలు అపురూపమైనవి. ఈ సందర్భంగా మన దేశంలోని ఆడపిల్లలు నాలుగంటే నాలుగు ముక్కలు నేర్చుకోవడానికి పడుతున్న సవాలక్ష తంటాల్ని ఏమీ పట్టించుకోకుండా సంకుచిత మతభేషజాల చుట్టూ, రాజకీయాల చుట్టూ పిల్లల చదువుల్ని తిప్పితిప్పి వాళ్ళ బంగారు భవిష్యత్తును సర్వనాశం చేస్తున్న మన ప్రస్తుత సామాజిక రాజకీయధోరణుల్ని ఆయన మందలించిన తీరు ఎంతో విలువైంది. పిల్లలు, వారి ఆకాంక్షలు, అవసరాలు, హక్కులు కేంద్రంగా లేని విద్య పట్ల ఆయన చేసిన ఈ  ధిక్కారం ఇటీవల కాలంలో ఈ స్థాయి ఏ అత్యున్నత వ్యక్తీ చేయనిది.

అక్టోబర్ 2022లో ఆయన వెలువరించిన తీర్పు సారాంశం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

“మా ముందు ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ ఆడపిల్లలు!  తమ గుర్తింపు కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, ఆర్టికల్ 25 కింద వారు రక్షణ కోరుతున్నారు. ఇస్లాంలో హిజాబ్ ధరించటం తప్పనిసరైన మతపరమైన నియమమా? కాదా? అనే వివాద నిర్ధారణ ఇప్పుడు అవసరం లేదు. నమ్మకం అనేది నిజాయితీతో కూడినదిగా వుండి, అది మరెవరికి హాని చేయని పక్షంలో తరగతి గదిలో హిజాబ్ నిషేధాన్ని సమర్థించడానికి కారణాలు లేవు.

“ప్రస్తుత సందర్భంలో పాఠశాలవిద్యా పరిపాలనాధికారులు ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. వారికి ఏది ముఖ్యం? ఆడపిల్లలు చదువుకోవడమా? విద్యాశాఖో, పాఠశాల యాజమాన్యమో నిర్ణయించినట్లు యూనిఫారం ధరించడమా? కర్ణాటకలోని పాఠశాలల్లో హిజాబ్ నిషేధం అమలు వల్ల  దురదృష్టవశాత్తు కొంతమంది బాలికలు తమ బోర్డు పరీక్షలకు హాజరుకాలేకపోయారని పిటిషనర్ల తరఫున హాజరవుతున్న సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. మరికొందరు విద్యార్థినులు ఈ నిబంధన కారణంగా తాము చదువుతున్న పాఠశాలను వదిలేసి మదర్సాల్లో చేరాల్సి వస్తోంది. వాటిలోని  విద్యా ప్రమాణాలు ఆశించినంత స్థాయిలో లేకపోవచ్చు.

 “మన సమాజంలో బాలికలు చదువుకోవడానికి తరగతి గది తలుపులు తెరుచుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఈరోజు ఒక ఆడపిల్ల తన స్కూలు బ్యాగు వీపుపై పెట్టుకొని ఉదయం తన పాఠశాలకు బయలుదేరడం భారతదేశంలోని అత్యుత్తమ దృశ్యాల్లో ఒకటి. ఆమె మన ఆశ, ఆమె మన భవిష్యత్తు. అయినా  ఒక ఆడపిల్లకు తన సోదరుడితో పోలిస్తే చదువుకోడం చాలా కష్టం . ఇదొక నిష్టుర వాస్తవం. మన  గ్రామాల్లో, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఒక ఆడపిల్ల తన స్కూల్ బ్యాగ్ పట్టుకునే ముందు ఇంటిని శుభ్రం చేయాల్సి వుంటుంది . రోజువారీ పనుల్లో తన తల్లికి సహాయం చేయటం మన ఆడపిల్లలకు సర్వసాధారణం. ఆడపిల్లకు చదువులో ఎదురయ్యే అవంతరాలు, కష్టాలు మగపిల్లల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. కాబట్టి ‘ఒక ఆడపిల్ల తన పాఠశాలకు చేరుకోవడంలో ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి’ అనే  కోణం నుంచి మనం చూడాలి.

“అందువల్ల ఈ న్యాయస్థానం తనకు తాను వేసుకుంటున్న ప్రశ్న ఏమంటే ఆడపిల్లను చదువుల నుంచి తిరస్కరించడం ద్వారా మనం ఆమె జీవితాన్ని కుదింపజేస్తున్నామా అనేది. పిటీషనర్లు కోరుకునే హిజాబ్ ధరించడం ప్రజాస్వామ్యంలో ఏమీ అడగరానిదా?  మరీ అత్యాశా? ఇది పబ్లిక్ ఆర్డర్ కో, నైతికతకో, లేదా ఆరోగ్యానికో ఎలా విరుద్ధం? మర్యాదకో, రాజ్యాంగంలోని ఇతర నిబంధనలకో ఎలా వ్యతిరేకం. తరగతి గదిలో హిజాబ్ ధరించిన ఆడపిల్ల శాంతి భద్రతల సమస్యగా, చట్టానికి సంబంధించిన సమస్యగా ఎలా మారుతుందో  ఎంతగా ఆలోచించినా నా తర్కానికి అందని సమస్యగానే మిగిలిపోయింది.

దీనికంటే భిన్నత్వంతో కూడిన మనలాంటి సమాజంలో చిన్నపాటి సర్దుబాట్లతో సహజీవనానికి వీలుగా మనల్ని మనం మలుచుకోవడం పరిణతి చెందిన సమాజానికి సంకేతంగా నిలుస్తుంది. ఒక ఆడపిల్ల తన ఇంట్లో లేదా బయట హిజాబ్ ధరించే హక్కును కలిగి వుంటుంది. అంతమాత్రాన ఆమె పాఠశాల గేటు వద్ద ఆగిపోకూడదు. ఆమె పాఠశాలలో,తరగతిలో వున్నప్పుడు కూడా తన గౌరవాన్ని, గోప్యతను కాపాడుకోవల్సి వుంటుంది. ఆమె ప్రాథమిక హక్కులు ఆమెకుంటాయి. తరగతిగదిలో వున్నప్పుడు ఈ హక్కులు వుండవనడం పూర్తిగా తప్పు.

మనం ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన పాలనలో జీవిస్తున్నాం. మనల్ని నియంత్రించే చట్టాలు భారత రాజ్యాంగానికి లోబడి వుండాలి. మన రాజ్యాంగం మనకు అందిస్తున్న అనేక అంశాల్లో ఒకటి విశ్వాసం. మన రాజ్యాంగం కూడా ఒక విశ్వాస పత్రమే. ఇది మెజారిటీపై మైనారిటీలు పెట్టుకున్న విశ్వాసం.

“మైనారిటీల సలహా కమిటీ నివేదికపై వ్యాఖ్యానిస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 24 మే 1949న రాజ్యాంగ సభ ముందు చేసిన ఒక ప్రకటనలో ఏం చెప్పాడో చూడండి.” మైనార్టీలను హడావిడిగా ఒక నిర్దిష్ట పరిస్థితులకు పరిమితం చేయటం మా ఉద్దేశం కాదు. ఈ దేశంలో మారిన పరిస్థితులలో లౌకిక రాజ్యానికి నిజమైన పునాదులు వేయడమే అందరికీ ప్రయోజనం అనే నిర్ణయానికి మైనారిటీ వారు నిజాయితీగా రావల్సి వుంటుంది. మంచిని విశ్వసించాలి. మెజారిటీ ప్రజల నిజాయితీని విశ్వసించాలి. ఇంత కంటే మైనారిటీలకు మరొక మార్గం లేదు. అలాగే మెజారిటీ జనాభా కూడా మన దేశంలోని మైనార్టీల మనోభావాలు ఎలా వున్నాయో అర్థం చేసుకోడం ముఖ్యం. తాము మైనారిటీలుగా వుండి, అలాంటి పరిస్థితులు తమకెదురైతే ఎలా వుంటామో ఆలోచించుకోవడం అవసరం”. ఇవీ ఆయన వ్యాఖ్యలు.

“కర్ణాటక హైకోర్టు పిటిషనర్లు  లేవనెత్తిన వైవిధ్యం ప్రశ్నను పరిగణలోనికి తీసుకోలేదు. తరగతి గది కూడా సమాజంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలని వారి ఆకాంక్ష. ….. వైవిధ్యం, మన  సాంస్కృతిక బహుళత్వం ఈ సందర్భంలో చాలా ముఖ్యమైనవి.

“మన పాఠశాలలు – ప్రత్యేకించి మన ప్రీయూనివర్సిటీ కళాశాలలు పరిపూర్ణమైన సంస్థలు. వీటిలోని పిల్లలు మన దేశపు గొప్ప వైవిధ్యాన్ని గురించి జాగృతమవుతూ, ఎదుగుతున్న వయసులోని వారు. ఇలాంటి పిల్లలకు సలహాలనిచ్చి, మార్గనిర్దేశం చేసే కేంద్రాలుగా ఇవి పని చేయాలి. అప్పుడే మన రాజ్యాంగ విలువలైన సహనం, సర్దుబాటు వారికి వొంటబడతాయి. ఇతర భాషలు మాట్లాడే వారి పట్ల, భిన్నమైన ఆహారపు అలవాట్లున్న వారి పట్ల, వేర్వేరు బట్టలు ధరించే వారి పట్ల సహనంతో, సర్దుబాటుతో ఉండాలని మన రాజ్యాంగం చెపుతున్న విలువలు వీరి అనుభవంలోకి వస్తాయి. మన వైవిధ్యాన్ని చూసి ఆందోళన చెందకుండా, దానికి ఆనందించాలని మన పిల్లలు నేర్చుకోవలసిన  సమయమిది. భిన్నత్వంలోనే మన బలమున్నదని  వారు గ్రహించాల్సిన సందర్భమిది.

“మన రాజ్యాంగం ప్రకారం హిజాబ్  ధరించడమనేది ఎంపికకు సంబంధించిన, స్వేచ్ఛకు సంబంధించిన విషయం. ఇది ముఖ్యమైన, మతపరమైన ఆచారానికి సంబంధించిన విషయం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఇది ఆ ఆడపిల్ల మనస్సాక్షికీ, నమ్మకానికీ, వాటి వ్యక్తీకరణకూ సంబంధించించిన విషయం. ఆమె తన తరగతి గదిలో కూడా హిజాబు ధరించాలని కోరుకుంటే ఆమెను మనం ఆపలేము. ఎందుకంటే ఆమె సంప్రదాయవాద కుటుంబం ఆమెను పాఠశాలకు పంపడానికి అనుమతించే ఏకైక మార్గం అదే కావచ్చు. 

“హిజాబ్ ను నిరాకరించడం వల్ల కలిగే దురదృష్టకర పరిణామం ఏమంటే ఆడపిల్లలకు విద్యను నిరాకరించటం! బడికెళ్ళడం ఇప్పటికీ మన ఆడపిల్లలకు అంత తేలికగా లేదన్న వాస్తవం మనం విస్మరించ లేము. అందువల్ల ఒక ఆడపిల్ల తన పాఠశాలకు చేరుకోవడంలో ఎదుర్కొన్న సవాళ్ల కోణంలోనే ఈ కేసును కూడా చూడాలి.

“కేవలం హిజాబ్ ధరించినందుకు ఆడపిల్లలకు చదువును నిరాకరించడం ద్వారా మనం ఆమె జీవితాన్ని మెరుగుపరుస్తున్నామా అనేది కూడా కోర్టు ముందున్న ప్రశ్న. అమ్మాయిలు స్కూల్ గేట్ లోకి వెళ్ళే లోపు హిజాబ్ తీసేయమని చెప్పటం వారి వ్యక్తిగత ఎంపిక మీద దాడి చేయడం. తర్వాత వారి గౌరవం పై దాడి చేయడం. ఆ తర్వాత వారికి లౌకిక విద్యను నిరాకరించటం. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ), ఆర్టికల్ 21,  ఆర్టికల్ 25(1) లను స్పష్టంగా ఉల్లంఘించడమే!”

One thought on “ఆడపిల్ల మన ఆశ, మన భవిష్యత్తు

  1. మహిళల విద్య,వారు ఎదుర్కొంటున్న సమస్యలు వాటిలో కూడా మైనార్టీ మహిళల విద్య తదితరుల గురించి బాగా వివరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *