సంపాదకీయం
మానవులకు తమ మూలాలు శోధించుకోడమంటే మహా ముచ్చట. తమ పురావైభవాన్ని తవ్వితీసి కథలు కథలుగా చెప్పుకోడమంటే చెప్పలేని వ్యామోహం. ఇందుకోసం ఎవరి పురాణాల్ని వాళ్ళు సృష్టించుకుంటారు. ఎవరి మూల పురుషుల్ని వాళ్లు వెతుక్కొంటారు. ఇక్కడితో ఆగక తమ గతం అనన్యసాధ్యమన్న గొప్పలకు పోతుంటారు. తమది స్వచ్ఛమైన, సర్వోన్నతమైన జాతిగా భ్రమపడుతుంటారు. దీనికోసం గొడవలు పడుతుంటారు. గొంతులు కూడా కోసుకుంటారు. ఇది జాత్యహంకారం. ఫాసిజానికి పూర్వరూపం.
వాస్తవానికి జాతిని నిర్ధారించేందుకు ఒక ప్రత్యేక జన్యువంటూ మనలో ఏదీ లేదు. అంటే ఒక్కో జాతికి ఒక్కొక్క జన్యు ప్రత్యేకత అంటూ ఏదీ లేదు. మానవులకు తెగలుగా తప్ప కనీసం స్థానికత ప్రాతిపదికన కూడా గతంలో ఎప్పుడూ గుర్తింపు లేదు. మనలో సంకరం చెందని జాతి, కులం అంటూ ఏవీ లేవు. మనమందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళం. ఎక్కడెక్కడో కలిసిన వాళ్ళం. ఎన్నెన్ని సార్లో విడిపోయిన వాళ్ళం. ఎవరెవరితోనో సంకరం చెందిన వాళ్లం. నియాండర్తల్ మానవుల జన్యువులు కూడా 1.43 శాతం మనందరిలో వున్నాయంటే, వాటివల్లే మనలో ఇంత రోగనిరోధకతా, ఇంత జీర్ణశక్తీ మిగిలి వున్నాయంటే మనకెంత విశాల దృక్పథం వుండాలి?
కానీ సమస్యేమంటే మనుషులు అలా వుండరు. వాళ్ళు వుండాలనుకున్నా కొన్ని శక్తులు వుండనియ్యవు.
ఆర్థికంగా, శాస్త్ర సాంకేతిక పరంగా ముందున్న వారు తమ జాతి, భాష, సంస్కృతి ప్రపంచాన్ని ఏలడానికి తమకు దైవదత్తంగా లభించిన అర్హతలన్నట్టు విర్రవీగుతుంటారు. వీటిని ఇతరులపై రుద్దుతుంటారు. సరిగ్గా చాలా దేశాల్లో అంతర్గతంగానూ ఇదే జరుగుతోంది. భాషాసంస్కృతుల పరంగానే గాదు, రంగూ, జాతి పరంగా కూడా ఎంతో వైవిధ్యం గల మన లాంటి దేశాల్లో దీన్నిప్పుడు స్పష్టంగా చూస్తున్నాం.
మనలో ఉత్తర దక్షిణాదుల విభజన చరిత్ర తెలిసినప్పటినుంచీ మనకు తెలిసిందే. భౌగోళికంగానే కాకుండా వీటి మధ్య జాతిపరంగా కూడా ఎంతో తేడావుంది. చారిత్రకంగా సరేసరి. ఇక భాషాసంస్కృతుల గురించీ, ఆర్థిక రాజకీయాల గురించీ చెప్పనక్కర లేదు. అయినా ఈ వైవిధ్యాన్నే అసలైన భారతీయతగా నమ్ముతూ “భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు” అని గర్వంగా రోజూ ప్రతిజ్ఞ చేసుకుంటూ వస్తున్నాం.
కానీ ఈ మధ్య దక్షిణాది వారు (ద్రవిడులు) గతంలో ఎన్నడూ లేనంతగా తమ అస్తిత్వానికేదో ప్రమాదం ముంచుకొస్తోందని శంకిస్తున్నారు. దీంతో వారు తమ మూలాల్ని వెతుక్కోడం మొదలుపెట్టారు. అసలు తామే మూలభారతీయులమనీ, ఎక్కడెక్కడి వారూ వచ్చి తమని ఒక మూలకు నెట్టేసారని ఆవేదనపడుతున్నారు. ఎంత ఘనమైన చరిత్రా, వారసత్వం తమకున్నా తాము రెండో తరగతి పౌరులుగానే వుండిపోవాల్సి వస్తోందని ఆందోళన పడుతున్నారు. రగిలి రగిలి ఇప్పుడిది కొత్త మలుపుకు తిరుగుతున్నట్టనిపిస్తోంది.
ఈ సందర్భంలో అనూహ్యమూ, ఆశ్చర్యమూ ఏమంటే విజ్ఞానశాస్త్రం ద్రవిడులకు తోడుగా నిలబడ్డం! దాన్ని వారు వొడుపుగా వాడుకోడం!
ద్రవిడులకు మొదట తోడొచ్చింది భాషా శాస్త్రం. ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ (1816) భాషా పరంగా ద్రావిడ సమాజాలు ప్రత్యేకమైనవనే చర్చను బలంగా లేవదీయడంతో ఈ కథ మొదలైంది. తెలుగు, తమిళం, కన్నడం భాషలతో సంస్కృత్వానికి పోలికే లేదంటూ ద్రవిడ భాషాకుటుంబానికాయన బీజం వేశాడు. బిషప్ కాల్డ్వెల్ (1856) దీన్ని మరింత ప్రమాణీకరిస్తూ ద్రవిడ భాషల తులనాత్మక వ్యాకరణాన్ని రూపొందించి, చరిత్రపరంగా చూస్తే ఇవి సంస్కృతానికన్నా ముందటివని నిర్ధారణ చేశాడు. సంస్కృతానికీ ద్రవిడభాషలకూ మధ్య ఏ జన్యుసంబంధం లేదు పొమ్మన్నాడు. ఇది ఆర్యద్రావిడ జాతిచర్చకు సైతం దారితీసింది. ద్రవిడులు స్థానికులని, ఆర్యులు బయటివారనీ వాదాలు మొదలయ్యాయి. “తల్లి సంస్కృతంబు సకల భాషలకు” అంటూ ఇంత కాలం దబాయించిన పండితులు మొదట ఎంత ఎదురుదాడి చేసినా చివరకు మౌనాంగీకారానికైనా రాక తప్పలేదు
ఇప్పుడు ద్రవిడభాషల మూలాలు ప్రాచీన సుమేరియన్ ఈలమైట్ భాషలో వున్నాయంటూ కొత్త రుజువులు దొరికాయి. ఈలమైట్లంటే ఇరాన్‌లోని జగ్రోస్ పర్వతాల నుంచి ఖుజిస్తాన్ ప్రాంతాలూ, పర్షియన్ గల్ఫ్ వెంబడి బలమైన రాజ్యాలన్నిటినీ ఏలినవారు. పదివేల ఏళ్లనాటి వారు. బెలూచిస్తాన్ లోని బ్రాహుయీ భాషకు ఈలమైట్ మూలాలుండడం, అదీ ద్రవిడ భాషల్లో ఒకటిగా లెక్కకు రావడంతో ఈ పశ్చిమాసియా జన్యు చుట్టరికం హరప్పా నాగరికత కంటే ముందరదని తేలింది. ఈలమైట్లూ, స్థానిక భారతీయ మూలాల వారూ కలిసి హరప్పా నాగరికతను నిర్మించారన్న సిద్ధాంతం బలపడ్డంతో ద్రవిడుల అస్తిత్వం అందనంత ఎత్తుకు ఎదిగిపొయ్యింది.
రెండోది జన్యుశాస్త్రం. జెనెటిక్ పాపులేషన్. ఇది 2000లలో రంగంలోకి వచ్చాక భారతీయుల జన్యుమూలాలపై తిరుగులేని సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. వర్ఘీస్ నరసింహన్ నాయకత్వాన 117 మంది సహరచయితలతో 2018లో వెలువడ్డ పత్రం భారతీయుల్ని నాలుగు ప్రధాన సమూహాలుగా విభజిస్తూ అండమాన్‌లోని వేటగాళ్ళని (Andamanese Hunter Garherers- AHG) మొదటి భారతీయులుగా గుర్తించింది. వీరు 65 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికానుంచి వచ్చిన వారు. వీరు దక్షిణ భారతం నుంచి ఆగ్నేయ, తూర్పు దేశాలకు విస్తరించారు. ఈ క్రమంలో ఇరాన్ నుంచి వచ్చిన వేటగాళ్ళతో కలిసారు. ఇలా ఒక మిశ్రమజాతి (Ancestral South Indians -ASI) ఏర్పడింది. ఇదే దక్షిణ భారత జాతి. అంటే ద్రవిడులు! వీళ్ళే మొదటి భారతీయులు. వీళ్ళే వ్యవసాయాన్ని అభివృద్ధి చేసారు. వీళ్ళే హరప్పానాగరికతను నిర్మించారు. దీంతో “భారతదేశం మాకొక్కరికే మాతృభూమి” అనగల్గే ధీమా ద్రవిడులకు దక్కింది.
ఇక మూడోది పురావస్తుశాస్త్రం. తమిళనాడులోని కీళడిలో – ఆడిచ్చనలూరు, శివగలై తదితర ప్రాంతాల్లో వైగై నదీ తీరాన సాశ పూర్వం 2953 -3345 నాటికే (5300 ఏళ్ల క్రితమే) ఇనుప పరికరాలు పరిశ్రమ స్థాయిలో భారీగా ఉత్పత్తి అయినట్లు ఇటీవల పురావస్తు శాఖ తేల్చి చెప్పింది. ఇనుమును భారీ ఎత్తున వాడడం అంటే మానవేతిహాసంలో అది నిప్పును స్వాధీనం చేసుకున్నంత గొప్ప సంఘటన! ఇనుప కర్రు నాగలికి చేరాకే; కొడవలి, గొడ్డలి లాంటివి చేతికి చిక్కాకే వ్యవసాయం ఊహాతీతంగా విస్తరించింది. విశాల సామ్రాజ్యాలు వెలిసాయి. మతవిప్లవాలు పుట్టుకొచ్చాయి. ఇనుముకు ముందు తర్వాత అన్నట్లు చరిత్ర విడిపోయింది. ఇప్పటిదాకా మనం హరప్పా నాగరికతనే మొదటి పట్టణనాగరికతగా భావిస్తున్నాం. దానికి వెయ్యేళ్ల తర్వాత మాత్రమే (సాశ పూర్వం 700-300) ఇనుముయుగం మొదలై ప్రాదేశిక రాజ్యాలు భారీ నగరాలు ఏర్పడి పట్టణనాగరికత వెలిసిందనుకుంటున్నాం. మౌర్య సామ్రాజ్యాన్ని దీనికి ఆనవాలుగా చూపుతున్నాం. కీళడి ఆనవాళ్ళతో ఇదంతా తల్లకిందులైంది. “చరిత్ర సింధూతీరం నుంచి వైగై, కావేరీ తీరాలకు తరలి రావా”లని తమిళులు డిమాండు చెయ్యడం మొదలుపెట్టారు!
ద్రవిడుల్లో ఈ అస్తిత్వపు ఆరాటం ఇప్పుడే ఎందుకింత తీవ్రంగా మొదలైంది?
వాళ్లనేదో కొత్త అభద్రతాభావమిప్పుడు వెంటాడుతోంది. తమ ఆత్మగౌరవానికి ఎప్పుడూ ఎరగని ప్రమాదమేదో ముంచుకొస్తోందన్న భయం వారిని వేధిస్తోంది. ముఖ్యంగా గత దశాబ్దంలో వేగంగా మారిన రాజకీయాలతో ఉత్తరాది ఆధిపత్యం తమ ఉనికినే సవాలు చేస్తోందని, తామెన్నడూ ఎరగని వివక్షకు గురవుతున్నామనీ వారిలో కొత్త భయమేదో పట్టుకుంది. దీన్నుంచే వారు తమ మూలాన్వేషణకు తప్పనిసరై పూనుకుంటున్నారు. ఎదురు దాడి చెయ్యడమూ నేర్చుకుంటున్నారు.
అవును- ఎంతకాలం గంగాసింధూ నాగరికతలేనా, మా వైగై కావేరీ తీరాల సంగతేమిటి? ఎప్పుడూ మౌర్య గుప్త రాజ్యాల ప్రాభవాలేనా, మా చోళ, పాండ్య రాజ్యాలకు చోటెక్కడ? వైదికసాహిత్యం సనాతనమైతే కావచ్చు మరి మా సంగమ సాహిత్యం దానికెలా తీసిపోతుంది? రాముడూ కృష్ణుడేనా దేవుళ్ళు, మా మురుగన్ మాటేమిటి? ఇంజనీరింగ్ అద్భుతాల్లో మాతో సరితూగ గలిగే వాళ్ళెవరు? మా శైవంలోని సామాజిక న్యాయం, వైష్ణవంలోని మానవీయతా హైందవంలో ఎక్కడున్నాయి? ఇలాంటి ప్రశ్నల్ని ద్రవిడులు శరపరంపరగా సంధించడం ప్రారంభించారు.
ఈ తిరుగుబాటులో సైన్సు ద్రవిడులకు తోడొచ్చి సరికొత్త ఆయుధాలందిస్తోంది. కొత్త సాహసాన్నిస్తోంది. అంటే భౌతిక యుద్ధాల్లోనే గాదు సాంస్కృతిక సమరాల్లోనూ సైన్సు నిర్ణయాత్మకమవుతోందన్నమాట! కాలం సైన్సుకంత అనుకూలంగా మారింది మరి!




వివరణాత్మక సమాచారం.
శ్రమే సైన్స్ కు మూలం