వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 15

డా. నాగసూరి వేణుగోపాల్

అణుశక్తి సామర్థ్యన్ని పెంచి భారతదేశాన్ని ప్రపంచపటంలో సమున్నతంగా నిలిపిన ఎమ్.ఆర్. శ్రీనివాసన్. మహామహులైన హోమి జహంగీర్ భాభా, విక్రమ్ సారాభాయ్, హెచ్. ఎన్. సేత్నా, రాజా రామన్న తర్వాత భారతదేశపు అణుశక్తి పరిశోధనలకు బాధ్యత వహించిన శ్రీనివాసన్ మనదేశంలో అణుశక్తి వాడకం సురక్షితమైనదని పబ్లిక్ డిబేట్ ప్రారంభించిన తొలి శాస్త్రవేత్త. 

ఎమ్. ఆర్. ఎస్. గా ప్రఖ్యాతులైన మాలూరు రామసామి శ్రీనివాసన్ 1930 జనవరి 5న బెంగళూరులో ఎనిమిది మంది సంతానంలో మూడవ బిడ్డగా జన్మించారు. హైస్కూలు, ఇంటర్మీడియట్ చదువులు మైసూరులో కొనసాగించిన శ్రీనివాసన్ సంస్కృతం, ఇంగ్లీషు అధ్యయనానికి ఎంచుకున్నారు. ఫిజిక్స్ తనకు బాగా ఇష్టమైనా, కొత్తగా ప్రారంభించిన యూనివర్సిటీ విశ్వేశ్వరాయ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి 1950 లో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. 1952 లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కెనడాలోని మ్యాగ్గిల్ యూనివర్సిటీలో ‘కంబషన్ ప్రాబ్లమ్స్ ఇన్ గ్యాస్ టర్బెన్స్’ గురించి 1954లో పీహెచ్డీ పట్టా పొందారు. భారతదేశం వచ్చిన తర్వాత 1955 సెప్టెంబరులో పాతికేళ్ల వయసులో డాక్టర్ హోమీ జహంగీర్ భాభా నేతృత్వంలో నడిచే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో శాస్త్రవేత్తగా చేరారు. 

శ్రీనివాసన్ వచ్చి రాగానే నిర్మాణంలో ఉన్న భారతదేశపు తొలి అణురియాక్టర్ ‘అప్సర’ ( APSARA) సంబంధించిన పనిలో చురుగ్గా దిగిపోయారు. అప్సర 1956 ఆగస్టులో కీలకదశకు చేరుకుంది. అణుశక్తి రంగంలో అంతవరకు జరిగిన నేపథ్య కృషి నిర్మాణాలుగా పుష్పించడం శ్రీనివాసన్ చేరిన తర్వాతనే జరగడం కాకతాళీయం. 1959లో తొలి అటామిక్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ ఇంజనీర్ గా నియమించబడ్డారు. తారాపూర్ లో ఆసియా ఖండంలో రష్యా తర్వాత మొదలైన అటామిక్ పవర్ స్టేషన్ విజయవంతంగా ప్రారంభం కావడానికి శ్రీనివాసన్ చేసిన కృషి గణనీయమైంది. ఈ రకమైన నేతృత్వం 1967 లో మద్రాసు అటామిక్ పవర్ స్టేషన్ చీఫ్ ప్రాజెక్ట్ ఇంజినీర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించే దాకా సాగింది. 1974 లో పవర్ ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ డివిజన్ డైరెక్టర్ గానూ, 1984లో న్యూక్లియర్ పవర్ బోర్డ్ చైర్మన్ గాను బాధ్యతలు స్వీకరించారు. 1987లో భారతదేశపు అటామిక్ ఎనర్జీ కమిషన్ ఐదవ చైర్మన్ ఇంకా అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెక్రటరీగా పదవులనధిరోహించారు. అదే సంవత్సరం కొత్తగా ఏర్పరిచిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మెన్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో తలపెట్టిన 18 న్యూక్లియర్ పవర్ యూనిట్స్ లో ఏడు పని ప్రారంభించగా, మరో ఏడు నిర్మాణంలోనూ మిగిలిన నాలుగూ ప్రణాళిక స్థాయిలోనూ ఉన్నాయి. 

1990 లో అటమిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా పదవీ విరమణ చేసిన తర్వాత రెండేళ్ల పాటు వియన్నాలోని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకు సీనియర్ అడ్వైజర్ గా కొనసాగారు. ఎనర్జీ, సైన్స్ & టెక్నాలజీ విభాగాలకు సంబంధించి 1996-98 మధ్యకాలంలో ప్రణాళిక సంఘం సభ్యులుగా సేవలందించారు. 2002-2004 కాలంలోనూ, మళ్ళీ 2006-2008 లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ సభ్యులుగాను ఉన్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రపు హయ్యర్ ఎడ్యుకేషన్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా ఓ రెండేళ్లపాటు సేవలందించారు. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఆపరేటర్స్ వ్యవస్థాపక సభ్యులైన వీరికి భారతదేశ ప్రభుత్వం నుంచి 1984లో పద్మశ్రీ,, 2015లో పద్మవిభూషణ్ లభించాయి. పదవీ విరమణ చేసిన తర్వాత ఊటీ లో స్థిరపడిన ఎమ్. ఆర్. శ్రీనివాసన్ మొత్తం మూడు పుస్తకాలు రచించారు, వాటిలో ‘ఫిషన్ టు ఫ్యూషన్: ది స్టోరీ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీ ప్రోగ్రామ్’ అనేది ఒకటి. శ్రీనివాసన్ భార్య గీత ఇంటాక్ సంస్థ నీలగిరి చాప్టర్ కార్యకలాపాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారు. శారద, రఘువీర్ ఈ దంపతుల పిల్లలు. ఇండియా, అమెరికా దేశాల మధ్య అణు ఒప్పందం జరిగినప్పుడు ఎదురైన విమర్శలకు మద్రాసులో ఆయన జవాబులు చెప్పిన తీరు నేటికీ ఎంతోమందికి గుర్తుండే ఉంటుంది. భారతదేశపు సంస్కృతి సంప్రదాయాల మూలాలు తెలిసిన కర్మయోగి లాంటి శాస్త్రవేత్త ఎమ్. ఆర్. శ్రీనివాసన్.

అణుశక్తి సామర్థ్యన్ని పెంచి భారతదేశాన్ని ప్రపంచపటంలో సమున్నతంగా నిలిపిన ఎమ్.ఆర్. శ్రీనివాసన్ 2025 లోనే కనుమూయడంతో ఇద్దరు పెద్ద అణువిజ్ఞానవేత్తలను కోల్పోయినట్లయ్యింది. పదహారేళ్ల పాటు భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గా సేవలందించిన డా. ఆర్ చిదంబరం అదే సం. జనవరి 4 న బొంబాయిలో కన్నుమూశారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ కు చిదంబరం ఏడవ చైర్మన్ కాగా, ఎమ్. ఆర్. శ్రీనివాసన్ ఐదవ వారు. ప్రచారానికి బాగా దూరంగా ఉన్న కర్మయోగి శ్రీనివాసన్ మే 20న ఊటిలో గతించారు. ముందు రోజు కొంత ఇబ్బంది పడి ఆసుపత్రిలో చేరిన వీరు మరుసటి రోజు గుండెపోటుతో కుటుంబ సభ్యుల చెంత 95 ఏళ్ల వయసులో తన జీవితాన్ని ముగించారు.

రచయిత : డా. నాగసూరి వేణుగోపాల్, ప్రముఖ సైన్స్ రచయిత & ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు మొబైల్: 9440732392

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *