జవహర్ లాల్ నెహ్రూ

జీవిత సమస్యలను పరిశీలించడంలో నాదెప్పుడూ శాస్త్రీయదృక్పథమే. 19, 20 శతాబ్దాల శాస్త్రజ్ఞానంలో నా కంతటి విశ్వాసము. పేచీపూచీలు లేని సుఖజీవనంవల్లనూ, దారుఢ్యం, శక్తి, ఆత్మవిశ్వాసం ఉండడంచేతనూ శాస్త్రజ్ఞానమందు నా కలాంటి నమ్మకం. ఏదో లీలగామాత్రం ‘మానవత్వం” నాకు నచ్చింది. నేడు సర్వే సర్వత్రా బుద్ధికౌశల్యంగలవారంతా అంగీకరించి అమలుపరుస్తున్న మతం – హిందూమతం కానివ్వండి, క్రైస్తవమతం, ఇస్లాము,బౌద్ధమతం కానివ్వండి – నన్నెప్పుడూ ఆకర్షించలేదు. ఏవో కొన్ని ఆచార వ్యవహారాలవల్ల మూఢనమ్మకాలు వగైరాలతో మతం నిండిపోయిందని నా నమ్మకం. అందుచే అది శాస్త్రీయమైన దృక్పథం మాత్రం కాదు.

అందులో ఒకవిధమైన మాంత్రికశక్తి కూడా ఉంది. హేతువాదంతో నిమిత్తం లేకుండా మూఢవిశ్వాసాలకు దారితీస్తుంది. మంత్రతంత్రాలమీద ఆధారపడేటట్లు చేస్తుంది. అయినప్పటికిన్నీ మానవ స్వభావం గాఢంగా కాంక్షించే ఒక లోపాన్ని మతం పూర్తిచేస్తుంది. అందుచేతనే ప్రపంచంలో అశేషజనమున్నూ ఏదో ఒకమతానికి దాసులు కాక తప్పడంలేదు.

ఆ మతం పేరిటనే చాలామంది ధర్మాత్ములైన స్త్రీ-పురుషులు వెలిశారు. దాని పేరిటనే అల్పమనస్కులు, మూర్ఖవిశ్వాసముగలవారు, దుర్మార్గులైన నిరంకుశులు కూడా బయలుదేరినారు. మతమే మానవజీవితానికి కొన్ని మూల్యముల నేర్పాటు చేసింది. వాటిలో కొన్ని నేడు అమలులో లేకపోవచ్చును. కొన్ని నష్టదాయకం కావచ్చును. మరికొన్ని నేటికిన్నీ మానవుని నైతిక, ధార్మికజీవితానికి పునాదులైనాయి.

స్థూలంగా చెప్పాల్సొస్తే మతం మానవునికి అందుబాటులోనున్న శాస్త్రజ్ఞానానికి అతీతమైన అనుభవమని చెప్పాలి. ఒకవిధంగా చూస్తే ఎరుకలోనున్న శాస్త్రవిజ్ఞానం యొక్క విస్తరణయే మతం, భౌతికశాస్త్రజ్ఞానానికి మతానికి ఎక్కడా పోలిక లేకపోయినా సైన్సు పరిణామమే మతం. మనచుట్టూ మనకు అగోచరమైన నిషయాలెన్నో ఉన్నాయనేమాట నిస్సందేహం.

సైన్సు ఎన్నో అమోఘమైన విషయాలు కనిపెట్టిన, ఈ విషయాన్ని ఇంకా గ్రహించలేకుండా ఉంది. కాని ప్రయత్నం మాత్రం మానలేదు… సాధారణంగా సైన్సు ఈ పరిశోధన కవలంబించే సాధనాలు భౌతిక, ఆలంకారిక, ఆధ్యాత్మికమైన అగోచరవిషయాలను తెలుసుకోవడానికి చాలకపోవచ్చును. జీవితమంటే కేవలం మనం చూచేది, వినేది, అనుభవించేది మాత్రమే కాదు. అది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. నిరంతరం కంటి కగోచరమైన ఒక ప్రపంచంతో జీవితం సన్నిహితంగానే ఉంటుంది. జీవితపరమావధిని గురించి భౌతికశాస్త్రం మనకేమీ బోధించేది లేదు. శాస్త్రజ్ఞానం పలువిధాలుగా వ్యాప్తిచెందుతోంది. ఆజ్ఞానం అచిరకాలంలో మనకగోచర మనుకుంటున్న ప్రపంచంలోకి కూడా పాకి, జీవితపరమావధిని తెలుసుకోవడానికి ఉపయోగపడవచ్చును. అధవా మానవజీవితం యొక్క రహస్యాలను

శోధించడానికైనా వెలుగు చూపిస్తుంది. ప్రత్యక్షప్రమాణములనిచ్చే శాస్త్రజ్ఞానానికీ, మతానికీ చిరకాలంగా ఉన్న “పేచీ మరొక నూతన పరిణామాన్ని పొందవచ్చును. మతసంబంధమైన అనుభవాలను శాస్త్రజ్ఞానముతో అన్వయించుకొనవచ్చును. మతం మంత్రతంత్రాల్లోను, ఆధ్యాత్మిక చర్చలలోను, వేదాంతంలోను లీనమయిపోతుంది. మహాపురుషులైన మంత్ర తంత్రవేత్తలు, ఈ దేశంలో ఉండేవారు. అందులో కొందరు జనాకర్షణపొందిన మహనీయులు. వారిని ఆత్మవంచనచేసుకునే మూర్ఖులని కొట్టిపారేయడానికి వీలులేదు. కాని సంకుచితమైన మంత్రతంత్రాలు నాకు చిరాకు కలిగిస్తాయి. అవేవో తలాతోకా లేని వ్యవహారంలా కనుపిస్తుంది.

మనస్సును ఖచ్చితమైన కట్టుబాట్లలో ఉంచకుండా స్వకీయమైన మానసికశక్తిని పరిత్యజించి, ఏదో ఆవేశమహాసముద్రంలో ఈదులాడడంలాంటిది. ఈ అనుభూతి ఒక్కొక్కప్పుడు అంతర్గర్భితమైయున్న వెలుగును చూపవచ్చును. కాని మరొకప్పుడు ఆత్మవంచనకుకూడా దారితీయవచ్చును. ఈ ప్రపంచాన్ని లోతుగా పరిశీలించి చూస్తే, జీవితం తెలుసుకోవడానికి అగాధమైన వింతగా తోస్తుంది. దాన్ని అవగాహన చేసుకోవాలనీ దానికనుగుణ్యంగా జీవించాలనే ఆశ కలుగుతూ ఉంటుంది. కానీ దాని అవగాహాన చేసుకోడానికి శాస్త్రజ్ఞానమే నాకు సాధనం. హేతువాదమునకు ఓక పరిపూర్ణత, అంతమూ లేదని తెలిసినా దానిపై ఆధారపడి ఉన్న భౌతికశాస్త్రజ్ఞానమే నాకు ధ్యేయం.

(‘భారతదర్శనము’ (Discovery of India) నుంచి సేకరించిన వ్యాసం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *